మరో రామాయణం

మరో రామాయణం

రచన :: రామ్ ప్రకాష్

తేదీ : 17 జనవరి 2020
సమయం : ఉదయం 10 గంటలు…

రోజు మా ఇంట్లో త్వరగా పనికి వచ్చే లక్ష్మి ఈరోజు సమయం దాటి గంట అయినా సరే ఇంకా రాలేదు. ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి.. ఎప్పుడొస్తుందా అని నా శ్రీమతి ఎదురుచూస్తు ఉండగా…
ఇంతలో ఏడ్చుకుంటూ తను వచ్చింది…

రాధ : ” ఏమైంది లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావ్? ”
లక్ష్మి : ” ఇంకేం కావాలి అమ్మగారు.. ఈరోజుతో నా జీవితం మొత్తం బుగ్గిపాలు అయ్యింది.. ”
కృష్ణ : “ఏమైందో సరిగ్గా చెప్పు…”

లక్ష్మి : ” మా మావ నన్ను ఒగ్గెస్తా అంటున్నాడు… విడాకులు కావాలంట… ”
రాధ : ” విడికేం పోయే రోగం వచ్చింది. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు..”
లక్ష్మి : ” ఏమోనమ్మ.. నాకైతే ఇంక చావే దిక్కు అనిపిస్తుంది. ”
రాధ : ” ఊరుకో అలా మాట్లాడకు.. ఏవండీ మీరేళ్లి వాడితో ఒకసారి మాట్లాడండి.”
సరే అంటూ బయల్దేరాను. లక్ష్మి భర్త ఆటో డ్రైవర్.. నేను టీచర్ గా పని చేస్తున్నాను.. అప్పుడప్పుడు తన ఆటోలోనే స్కూల్ కి వెళ్ళేవాడిని. ఎప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడుతాడు. వెళ్లి తలుపు కొట్టాను. తనే వచ్చి తీసాడు.
“అదేంటి సారు. మీరు ఇలా వచ్చారు.. అదేదో కబురు చెస్తే నేనే వచ్చే వాడిని కదా…”
కృష్ణ : “పర్లేదులే.. అవును లక్ష్మితో ఏదో విడాకులు కావాలి అని అన్నావంట. ఏమైంది..”
“అవును సారు. కావాలి. తనకు నాతో పెళ్ళికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ విషయం దాచి నన్ను పెళ్లిచేసుకుంది. మొన్ననే మా పక్కింట్లోకి నా స్నేహితుడు ఒకడు వచ్చాడు. వాడు చెప్పాడు తన బాగోతం అంతా…”
కృష్ణ : ” అలా ఎవరు ఎం చెప్పినా నమ్మేస్తావా.. అయినా ఈ కాలంలో ఎన్ని ప్రేమలు పెళ్లి దాక వెళ్తున్నాయి. అలా అని విఫలమైన వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారా.”
“అదంతా నాకు తెలీదు సారు..అది చెడిపోయింది. చెడిపోయినది నాకు అవసరం లేదు…”
కృష్ణ : ” ఎవడి మాటో విని భార్యని ఇంత నీచంగా ఎలా అనుమానిస్తున్నావ్ ..”
” సరే సార్.. మీరు బడి పంతులు కదా.. మీకోసం ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పండి…
ఇదే ఎవడి మాటో విని రాములు వారు సీత అమ్మగారిని అడవులకు పంపితే దేవుడు అన్నారు.. నేను విడాకులు అడుగుతుంటే మాత్రం నీచుణ్ని అంటున్నారేంటి సారు… ”

ఒక్క క్షణం వాడి మాటలకు నేను కొయ్యబారి పోయాను. అది ప్రజలని సరిగా పాలించడం కోసం తన కుటుంబాన్ని కూడా దూరం చేసుకోని క్షోభ పడ్డాడు అని చెప్పినా వీడికి అర్థం కాదు. ఏమి సమాధానం ఇవ్వలేక మౌనంగా అక్కడినుంచి వచ్చేసాను.
ఇంటికి వచ్చాక రాదకు జరిగింది మొత్తం చెప్పాను. తను కూడా చాలా బాధపడింది. కళ్ళ ముందే ఒక నిండు జీవితం కాలిపోతుంటే ఆపలేకపోయా అనే ఆలోచన మనసుని చంపుతుంది…
ఇలా ఆలోచిస్తూ ఉండగా… నా బామ్మర్ది నుంచి ఫోన్ వచ్చింది..
” బావ… నేను కనిపెట్టాను… ” అంటూ గట్టిగా అరుస్తున్నాడు.
కృష్ణ : ” ఏమి కనిపెట్టావురా… ”
“అంతా నీకు వివరంగా చెప్పాలి. అర్జెంటుగా నువ్వు ఇక్కడికి వచ్చేయ్ చెప్తా…”
నా బామ్మర్ది పెద్ద సైంటిస్ట్.. ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఈసారి ఎం చేసాడో అనుకుంటూ వాడి దగ్గరకు వెళ్ళాను..
వాడి కళ్ళలో ఏదో గొప్పది సాధించాను అనే గర్వం కనిపించింది. నన్ను చూడగానే గట్టిగా కౌగిలించున్నాడు..
” బావ… ఇప్పటిదాకా మానవ జాతిలో ఎవ్వరు కనిపెట్టనిది నేను ఆవిష్కరించాను.. మానవ చరిత్రలోనే నా పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది….”
కృష్ణ : ” ఏంటది? ”
” టైం మెషిన్….. ” వాడు నాకు ఎదురుగా ఉన్న కర్టన్ పక్కకి తోసాడు. అక్కడ ఒక పెద్ద బంతి లాగా ఆదిత్య 369 సినిమాలో ఉన్నట్టు ఉంది. కాసేపు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను…
“అవును బావ నువ్వు విన్నది నిజమే.. టైం మెషిన్. నిన్న రాత్రే ఇది కనిపెట్టా. కొన్ని టెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడే అన్ని పాస్ అయిపోయింది. ఇప్పుడు ఈ మెషిన్ తో మనం చరిత్రలోని ఏ కాలానికి అయినా వెళ్ళచ్చు…”
కృష్ణ : ” నువ్వు చెప్పేదంతా నిజమా…. ”
” నిజం బావ… నమ్మడంలేదు కదా. కావాలంటే నువ్వే ప్రయత్నించు. కానీ ఒక చిక్కు ఉంది బావ. మనం వేరే కాలంలోకి వెళ్లి 5 నిముషాలు మాత్రమే ఉండగలం. తరువాత ఆటోమేటిక్ గా ఈరోజు మొదటికి వచ్చేస్తాం  ”

కృష్ణ : ” అవునా… నాకు ఒక కాలానికి వెళ్లాలని ఉంది రా.. ”

” ఏ కాలం ఏ రోజు బావ…. ”

కృష్ణ : “రామాయణ కాలంలోకి..”

“సరే బావ.. నువ్వెళ్ళి ఈ మెషిన్ లో కూర్చో…” నేను వెళ్లి కూర్చున్నాను. వాడు వచ్చి నా ముందు టైం అండ్ డేట్ సెట్ చేశాడు..

” సరే బావ… కాలం rewind అయ్యే లాగా సెట్ చేశాను. నీకు సరిగ్గా ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చెయ్.. నువ్వు అక్కడ ప్రత్యక్షమవుతావు… కానీ గుర్తుంచుకో.. 5 నిమిషాలకు మించి అక్కడ ఉండలేవు.. ”

వాడు మెషిన్ నుంచి బయటకి వచ్చి.. రిమోట్ తో ఆన్ నొక్కాడు.. అంతే నేను ఉన్న మెషిన్ గిర్రున తిరుగుతూ కాలం దాటి గతానికి పరుగులు పెట్టింది…

ముందుగా కలియుగం దాటి ద్వాపర యుగానికి వెళ్ళాం….
అక్కడ కృష్ణుని లీలలు, గోపికలతో ఆటపాటలు, కంసుడి సంహారం, కురుక్షేత్ర యుద్ధం అన్ని చూస్తూ వెళ్ళాను… ఇప్పటిదాకా సినిమాలో చూసిన నేను ఇలా కళ్ళ ముందు చూస్తుంటే నమ్మలేకపోయాను.. ఆశ్చర్యంగా నిలబడిపోయాను..

తరువాత ద్వాపరయుగం నుంచి త్రేతయుగానికి వెళ్ళింది.. రామజన్మం, సీతదేవితో స్వయంవరం, తండ్రి మాట కోసం అడవులకు వెళ్లడం, రావణుడు సీతమ్మవారిని అపహారించడం, రావణ సంహారం, సీతమ్మవారి అగ్ని పరీక్ష, రామ పట్టాభిషేకం….. అన్ని చూసాను..

సరిగ్గా అయోధ్య విధుల్లో చాకలివాడు భార్యతో గోడవపడే రోజుకు వచ్చాను. వెంటనే మెషిన్ ఆపేసాను.
చాకలివాడు తన భార్యని కొడుతున్నాడు. అందరూ చుట్టూ మూగి చూస్తున్నారు. ఈ గొడవ ఈ తరాన్నే కాక భవిష్యత్తు తరాలని కూడా ఎంత ప్రభావితం చేయబోతుందో నాకు మాత్రమే తెలుసు…..

నేను అక్కడ ప్రత్యేక్షమవగానే అందరూ నా వేష భాషలు చూస్తూ వింతగా చూస్తున్నారు. నేను నేరుగా ఆ చాకలివాడి దగ్గరకు వెళ్ళాను..
కృష్ణ : ” ఎందుకు ఆవిడని కొడుతున్నావు.. ”

“ఇంతకీ మీరెవరు…”
కృష్ణ : ” నేనెవరు అనేది నీకు చెప్పినా అర్థం కాదు కానీ ముందు అసలు గొడవ ఏంటి? ”
“ఇది నా భార్య…మొన్న వెళ్లి ఈరోజు వచ్చింది. అడిగితే అయ్య ఇంటికి పోయినా అంటుంది. నమ్మడానికి నేనేమైనా పిచోన్నా. ఇదెక్కడుందో, ఎవడితో ఉందో. దీన్ని నేను ఏలుకోను..”
కృష్ణ : ” తను నిజంగా వాళ్ళ నాన్న ఇంటికే వెళ్ళింది. నేను చూసాను. వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగా లేకపోతే తను రోజంతా సపర్యలు చేస్తూ కూర్చుంది. ”
“అబ్బ.. మీరెవరో వచ్చి తను శీలవతి అని చెప్తే ఎలా నమ్మమంటారు..”
కృష్ణ : ” కావాలంటే ఇది చూడు… ” అంటూ ముందు రోజు వాడి భార్య ఎక్కడ ఏమి చేసిందో ఇందాక మెషిన్లో చూసినప్పుడు సెల్ ఫోన్ లో రికార్డు చేశాను. అది వాడి  ముందు ప్లే చేశాను..
ముందు ఆ పరికరం చూసి ఆశ్చర్యపోయినా, తరువాత వాడి భార్య ఎక్కడుందో చూసి వాడి కళ్ళలో కొంచెం అపరాధ భావం కనిపించింది.
“క్షమించవే.. ఏదో కోపంలో ఏవేవో అనేశాను. అనవసరంగా అనుమానించాను. ఇంకెప్పుడు ఇలా చేయను ” అంటూ తన భార్యని దగ్గరకు తీసుకున్నాడు.

హమ్మయ్య.. వీడు ఇంక నోరు జారడు.   మన రాముల వారు, సీతమ్మ గారిని అడువులకు పంపడు. ఒక గొప్ప పని చేశాను అనే సంతృప్తి మిగిలింది. నేను వచ్చి అప్పటికే ఐదు నిమిషాలు అయిపోవడంతో నేను అక్కడ నుంచి మాయమైపోయాను..
కళ్ళు తెరిచి చూస్తే….
మా ఇంట్లో, మా బెడఁరూమ్ లో పడుకొని ఉన్నా..
మొబైల్ లో టైం, డేట్ చూసాను…

తేది – 17 జనవరి 2020
సమయం – 12 :01 AM

అంటే నేను గతానికి వెళ్లి మళ్ళీ ఈరోజుకు వచ్చేసాను..
ఇప్పటికీ మనసు నమ్మలేకపోతుంది వెంటనే నా పక్కన పడుకొని ఉన్న రాధని నిద్రలేపాను..
రాధ : ” ఏంటండీ ఈ సమయంలో నిద్ర లేపారు..”

కృష్ణ : ” రామాయణం ఎండింగ్ ఎం జరిగిందో చెప్పవా…. ”

రాధ : ” అర్ధరాత్రి నిద్రలేపి ఇలా అడుగుతున్నారేంటి. ఏముంది రాములు వారు సీతమ్మ వారిని అడువులకు పంపించారు. తరువాత లవకుశలు వాళ్లిద్దర్ని కలిపారు.. ”

కృష్ణ : ” అంటే ఇంత చెప్పినా సరే చాకలివాడు సీతమ్మ గురించి తప్పుగా మాట్లాడాడా? ”

రాధ : ” చాకలివాడు ఏంటి… కుమ్మరి వ్యక్తి కదా.. తను అయోధ్య వీధుల్లో వాడి భార్యని వదిలేస్తు సీతమ్మ గారిని తప్పుగా మాట్లాడాడు. అది విని రాములు వారు సీతమ్మని అడువులకు పంపించాడు.. ”

ఒక్క క్షణం తను చెప్పింది విని షాక్ అయ్యాను. అంటే చాకలి వాడు మారిపోయాడు. కానీ ఇంకొకడు అదే మాట అన్నాడు. రామాయణమే మార్చేసాను అనుకున్నా కానీ ఒకడు మారితే ఏంటి ఎవడో ఒకడు అలా మాట్లాడుతూనే ఉంటాడు. మళ్ళీ అలాగే జరిగింది. నా ఆనందం ఆవిరి అయిపోయింది.
నిజమే కదా… అయోధ్య రాజ్యంలో ఎంతమంది భార్యభర్తలు ఉంటారు. అంతమందిని ఎలా మార్చగలను..
ఒక ఆలోచన వచ్చింది..

కృష్ణ : ” రాధా నువ్వు పడుకో.. నాకు కొంచెం పనుంది. ఇప్పుడే బయటకి వెల్లేసివొస్తా ” అని చెప్పి బయటకువచ్చాను..

నేరుగా నా బామ్మర్ది ల్యాబ్ కి వెళ్ళాను. నాకు తెలిసిన సీక్రెట్ కీ తో లోపలకి వెళ్ళాను. చుట్టూ చూసా ఎవరు లేరు.. నేరుగా ఆ మెషిన్ లోపలకి వెళ్ళాను. ఇందాక వాడు సెట్ చేస్తున్నప్పుడు చూసా కదా.. సరిగ్గా అలాగే చేశాను. రిమోట్ తో ఆన్ చేశాను. వెంటనే మెషిన్ గిర్రున తిరగడం మొదలుపెట్టింది.

కాసేపటికి త్రేత యుగానికి వెళ్ళాను. సరిగ్గా కుమ్మరివాడు సీతమ్మవారిని నడిరోడ్డులో అన్న రోజు రాత్రికి కాలాన్ని ఆపేసాను.. రాములువారు అంతపురంలో దేని గురించో తీక్షణంగా ఆలోచిస్తున్నారు. ఆయన ముగ్ద మనోహర రూపాన్ని చూసి దండం పెట్టకుండా ఆపుకోలేకపోయాను.

కృష్ణ : ” ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? ”

నన్ను అక్కడ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. కాసేపటికి తేరుకొని…

రాముడు : ” ఎవరు నువ్వు.. నా ఏకాంత మందిరానికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ”

కృష్ణ : ” నేను మీ గురించి పూర్తిగా తెలుసుకున్న, మిమ్మల్ని పూజించే అంతరాత్మ లాంటి వాడిని స్వామి. ఆ కుమ్మరి వ్యక్తి అన్న దాని గురించి ఆలోచిస్తున్నారా? ”

రాముడు : ” అవును.. మీకెలా తెలుసు ”

కృష్ణ : ” చెప్పాను కదా స్వామి.. నాకు మొత్తం తెలుసు. ఇంతకీ మీరు ఎం చేద్దామనీ అనుకుంటున్నారు ”

రాముడు : ” ప్రజల కోసం రేపే నా ప్రాణ సమానురాలైన నా సీతని దూరంగా పంపిద్దాం అనుకుంటున్నాను.”

కృష్ణ : ” మంచి నిర్ణయమే స్వామి..
అలా చేసే ముందు ఒక్కసారి సీతమ్మ గారి గురించి ఆలోచించారా.. తన ఇష్టాష్టాల తో సంబంధం లేకుండా స్వయంవరంలో ఎవరు విల్లు విరిస్తే వాళ్లే తన భర్త అన్నారు.
పెళ్లయ్యాక మీతో పాటు అడువులకు తీసుకెళ్లారు. తరువాత రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. అక్కడ మిమ్మల్ని ప్రతి రోజు ప్రతి క్షణం తలుచుకుంటూ నరకం అనుభవించారు..

చివరకి యుద్ధం చేసి గెలిచాక ఆనందంగా మిమ్మల్ని చేరితే అగ్ని పరీక్ష పెట్టారు. తను పవిత్రంగా ఉందని నిరూపితమై మిమ్మల్ని చేరుకుంటే ఇప్పుడు మీ నుంచి దూరంగా అడువులకు పంపబోతున్నారు. ఇది న్యాయమా ప్రభు… ”

స్వామి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పటిదాకా తన కూడా ఉన్న సీతమ్మ కష్టాలు చూసి రాముల వారే చలించిపోయారు…

రాముడు : ” మీరన్నది నిజమే కానీ ఇప్పుడు తనని దూరంగా పంపడం కంటే వేరే పరిష్కారం కనిపించడం లేదు..”

కృష్ణ : ” పోనీ అదే చేద్దాం అనుకుందాం. అలా చేస్తే వాడు దేవతలాంటి సీతమ్మగారి మీద వేసిన నింద నిజమని మీరు ఒప్పుకున్నట్టే కదా స్వామి.. ఎవరో ఏదో అన్నారని మీకోసం తన సర్వస్వాన్ని వదిలి వచ్చిన భార్యని అడవుల పాలు చేయడం సమంజసమా?..
తప్పు చేసిన వారికీ శిక్ష వేయాలి.. ప్రభువు అయ్యి ఉండి ఏ తప్పు చేయని నిర్దోషికి శిక్ష వేస్తూ భావితరాలకు ఏమని చెప్పబోతున్నారు?
పైగా సీతమ్మ వారు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు…”

రాముడు : ” ఏమిటి మీరు అనేది… ”

కృష్ణ : ” అవును స్వామి. ఇప్పుడు సీతమ్మ వారు కడుపుతో ఉన్నారు. మీ వారసులను మోస్తున్నారు… ”

నా మాటలకు రాములవారు ఆశ్చర్యపోయారు. స్వామి కళ్ళలో ఆనందం చూస్తుంటే తెలీకుండానే నా మనసు సంతోషంతో నిండిపోయింది…

కృష్ణ : ” ఒక నిండు చూలాలుని అడువులకు పంపడం… అది కూడా తనని తను తప్పుచేయలేదని నిరూపించుకున్నాక కూడా శిక్ష వేయడం ధర్మమో కాదో మీకే వదిలేస్తున్నాను…”

ఇంతలో నేను వచ్చి అప్పటికే 5 నిముషాలు అవ్వడంతో మాయమైపోయాను.
కళ్ళు తెరిచి చూస్తే నా బెడఁరూమ్ లో ఉన్నాను. టైం అండ్ డేట్ చూసాను.

తేది – 17 జనవరి 2020
సమయం – 12 :01 AM

అంటే నేను మళ్ళీ నేటి కాలానికి వచ్చాను. అసలు అక్కడ ఎం జరిగిందో తెలుసుకోవాలని ఉంది. వెంటనే రాధని నిద్రలేపాను.

రాధ : ” ఏంటండీ ఈ సమయంలో నిద్ర లేపారు..”

కృష్ణ : ” రామాయణం ముగింపు గురించి చెప్పవా…. ”

రాధ : ” అర్ధరాత్రి నిద్రలేపి ఇలా అడుగుతున్నారేంటి. ఏముంది రాములవారు రావణాసురిడిని వధించి అయోధ్యకు వచ్చాక మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. తరువాత వాళ్లకు లవ కుశ అనే ఇద్దరు సంతానం కలిగారు. వాళ్ళు తండ్రిని మించి రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలను కన్న బిడ్డల లాగా చూసుకున్నారు…. ”

కృష్ణ : ” అంటే సీతమ్మ వారు అడువులకు వెళ్లలేదా? ”

రాధ : “సీతమ్మ అడువులకు వెళ్లడం ఏంటి మీ మొహం…”

కృష్ణ : ” అదే కుమ్మరివాడు.. ఏదో అన్నాడని రాములవారు బాధపడ్డారు… ”

రాధ : ” ఓ అదా… ఒక కుమ్మరివాడు తన భార్యతో గొడవపడుతూ చెడిపోయిన దాన్ని ఎలుకోడానికి నేనేమైనా రాముడిని అనుకుంటున్నావా అని నోరుజారాడు.
అది విని రామయ్య చాలా బాధపడి మరుసటి రోజు రాజ్య ప్రజలందరిని సమావేశ పరిచాడు…

నా సీత ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. తన లోకం, తన సర్వస్వం నేనే.. అలాంటి నేను నమ్ముతుండగా ఇంకెవరో ఎదో అన్నారని తనని బాధ పెట్టను. అయినా శీలం అంటే శరీరానికి కాదు మనసుకు సంబంధించింది. తన ఇష్టం లేకుండా తన కాలి చిటికెన వేలును తాకచ్చేమో కానీ తన మనసులో నాకు మాత్రమే ఉన్న స్థానాన్ని అనువంతైనా ఎవరు కదపలేరు. మనసా వాచా కర్మణా అంటూ తననీ నా అర్దాంగి చేసుకున్న రోజే తనకు మాట ఇచ్చాను. తన కష్టంలో, సుఖంలో, బాధలో, బాధ్యతలో ఎప్పటికి తనని విడువను అని…. భార్య భర్తల బంధం అంటే అలా ఉండాలి.

అని అందరి ముందు సీతమ్మ వారి గురించి, పెళ్లి గురించి, బంధం విలువ గురించి అందరికి అర్థమయ్యేలా చెప్పారు. అది విని ఆ కుమ్మరివాడు రాములవారి పాదాల మీద పడి క్షమించమని కోరుకున్నాడు… ”

రాధ చెప్పిన మాటలు విని నా మనసు గాల్లో తేలిపోయింది. ఒక గొప్ప పురాణం లో నా పాత్ర కూడా ఉంది అని తెలిసాక మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఇంత గొప్ప పని నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. బహుశా ముందు కూడా చేయలేనేమో….

రేపు ఉదయం మా పనిమనిషి లక్ష్మి తన భర్త తో గొడవపడి మా దగ్గరకు వస్తే, వాడికి నచ్చజెప్పడానికి వెళ్తే… వాడు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది అనే గర్వంతో నిద్రకు ఉపక్రమించాను….
మనసులో రామస్మరణ చేస్తూ, ఆ అడిపురుషుడి రూపం తలుచుకుంటూ ఆనందంగా పడుకున్నాను…

=========సమాప్తం=========

రామాయణం లాంటి గొప్ప పురాణాన్ని మార్చి రాసే లేదా తప్పులు వెతికే అంత గొప్ప వ్యక్తిని కాదు. ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో రాసాను..
ఇది కేవలం కల్పితం మాత్రమే.. ఎవరి మనోభావాలు కించపరచడానికి కాదు..దయచేసి అర్థం చేసుకోగలరు..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!