మదిలోని భావాలు
రచయిత :: సురేఖ దేవళ్ళ
పసిమి ఛాయతో మిలమిల మెరిసే వదనం
వర్ణాంతరం చెందెను నునుసిగ్గుల మందారంలా
నీ తలపు మదిన మెదిలినంతనే
అధరాలపై మెదిలే దరహాసం
నయనాలలో ప్రత్యక్షమయ్యే
నీ రూపం నా కన్నుల వాకిలిలో
నిలిచినంతనే
సుమధుర పలుకులు పలికే పెదవంచులు
మాటలన్నీ మరుపున కలిసినంతగా
ఉచ్చరించెను నీ నామమే మరువకనే
తొలివేకువన తట్టిలేపేది నీ తలపే
మలిసంధ్య సమయాన జోల పాడేది
ఆనాడు నీవు చెప్పిన ఊసులే
లయబద్ధమైన నా హృదయపు సవ్వడి
శృతిలయలను ఆలపించెను
నీ సామీప్యమున
లిప్తపాటు సమయమైనా
యుగంలా మారదా
నీ తలపు దూరమైన వేళా
నా శ్వాస సడిచేయక నిలిచిపోవును
నీవు నా మదికి
దూరమైన క్షణాన.