హరితానందం
రచన :: అయిత అనిత
ఏకంగా…
ఏరువాకను ముద్దాడిన ధరాతలం
మురిసి మైమరిచి
పచ్చని పసరికను ప్రసవించింది!
హఠాత్తుగా….
వర్షించినమేఘపు హర్షమును గాంచి
అంబర ఎద హరివిల్లును చిత్రించుకుంది!!
పచ్చపచ్చగా నవ్వుతూ గరికభామలన్నీ
పిల్లగాలిఊయల్లో వయ్యారంగా ఊగుతున్నాయి!
ఆకుపచ్చని భూరుహాలతో ధరణికోక చుట్టుకున్నది!!
సస్యశ్యామలతకు గుర్తుగా
త్రివర్ణపతాకం పచ్చరంగుకు చోటిచ్చింది!
ప్రశాంతతకు నెలవుగా
ఆసుపత్రులు పచ్చపరదాను కప్పుకున్నాయి!!
ఋతుగమనపు దారిలో
హరితానందం పరుచుకొని ప్రకృతి పులకించిపోయింది!
కాలపుకన్య చిగురుటాకుల్లో ఒదిగిపోయింది!!
అవనంతా హరితానందమైతే
బతుకంతా పరమానందమే!
పచ్చని మొక్కలు వసుధపై నాటితే
స్వచ్ఛని ఆరోగ్యం ఇక మనసొంతమే!!
***
