ఏ ప్రేమ గెలిచింది

ఏ ప్రేమ గెలిచింది

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

వాగ్దేవి, ఆనంద్ లు ఒకటే కాలేజీలో చదువుతున్నారు. మంచి స్నేహితులు. చిన్నప్పటినుంచి ఒకరి కుటుంబాలు ఒకరికి తెలుసు.

వాగ్దేవి పేరుకు తగ్గట్టే మంచి చదువరి, నెమ్మదస్తురాలు. ఎప్పుడైనా ఆనంద్ చదువులో సందేహాలు వస్తే వాళ్ళింటికి వెళ్ళి తీర్చుకునే వాడు. ఆనంద్ విషయానికి వస్తే, అవతలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని, భావాలను గౌరవించే వాడు తన వ్యక్తిత్వం దెబ్బ తినకుండా. వాగ్దేవి తల్లిదండ్రులకు కూడా ఆనంద్ అంటే చాలా ఇష్టం.

ఆనంద్, వాగ్దేవిల మధ్య ఎప్పుడూ ప్రేమ విషయం చర్చకు రాలేదు కానీ ఆనంద్ మాత్రం మనస్సులో వాగ్దేవిని ప్రేమిస్తున్నాడు. అలా అని తను ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించ లేదు.

ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి, క్యాంపస్ లో మంచి కంపెనీలో సెలెక్ట్ అవడం, వారి వారి వుద్యోగాల్లో ప్రవేశించి సంవత్సరం దాటడం కూడా జరిగిపోయింది.
…..‌
వాగ్దేవి అంటే వాళ్ళ నాన్నగారు జానకిరామ్ కి ఎంతో యిష్టం. ఒకరోజు జానకిరామ్ తన భార్య లక్ష్మిని, వాగ్దేవిని పిలిచి, ‘వాగ్దేవికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, మనకు చిన్నప్పటినుంచి తెలిసిన ఆనంద్ తో, ఏమంటావు లక్ష్మీ’.

‘చాలా మంచి వాడు, మంచి కుటుంబం, పైగా యిద్దరూ కలిసి చదువుకున్నారు కూడా. చాలా బాగుంటుందండి’ – లక్ష్మి

కూతురు వైపు తిరిగి ‘నీ ఇష్టం చెప్పు తల్లీ’ – జానకిరామ్.

వాగ్దేవి తడబడి కొంచెం సమయం తీసుకున్నా, ‘మీ ఇష్టం నాన్నా’ అని చెప్పింది.

‘అయితే రేపు ఆనంద్ ఇంటికి వెళ్ళి, వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాం అమ్మా నేను’ – జానకిరామ్.

‘అలాగే నాన్న’ అని చెప్పేసి, తన రూముకి వెళ్ళి, ఆనంద్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది.

‘అబ్బ అదృష్టం తన్నుకు రావడమంటే ఇదే. నేను ఎప్పటినుంచో నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నీకు చెప్పలేదు. నువ్వు ఏమి చెప్పావు’ – ఆనంద్.

‘మీ ముగ్గురు ఇష్టపడ్డారు, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి మీ అమ్మానాన్నలు ఇష్టపడుతారు. యిక నా యిష్టాయిష్టాలతో పని యేముందిలే’ – వాగ్దేవి చురక

ఎక్కడో మనస్సు చివుక్కుమంది ఆనంద్ కు. ‘రేపు మా ఇంటికి వచ్చినప్పుడు నా అభిప్రాయం చెపుతా’ – ఆనంద్.

‘అదేమిటి, నన్ను ప్రేమిస్తున్నానని చెపుతూ, అభిప్రాయం చెప్పడమేమిటి’ – అంది వాగ్దేవి నవ్వుతూ.

ఆ నవ్వులో ఎందుకో జీవం వినిపించ లేదు.

కొంచెం సేపు మామూలు విషయాలు మాట్లాడుకుని సంభాషణ ముగించారు.
……

జానకిరామ్ దంపతులు ఆనంద్ ఇంటికి వచ్చారు. ఆనంద్ తండ్రి రావుగారు వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకుని వెళ్లి కూర్చోపెట్టి, కాఫీ ఇచ్చారు. విషయం చెప్పారు జానకిరామ్.

‘మీ మహాలక్ష్మిని మా యింటికి పంపుతామంటే, అంతకంటే సంతోషం ఏముంటుందండి’ అని రావుగారు చెపుతూ ఆనంద్ వైపు చూసారు.

‘వాగ్దేవితో మాట్లాడతాను అంకుల్’ అని ఆనంద్ జానకిరామ్ గారికి చెప్పాడు.

‘అదేమిటిరా వాగ్దేవి ఒప్పుకున్న తర్వాతే కదా నిన్ను అడుగుతున్నారు’ – రావుగారు

‘మాట్లాడుకోనీండి రావుగారు, యిద్దరూ స్నేహితులే కదా, మనకు అర్జంట్ ఏముంది’ – జానకిరామ్

అందరూ కొంచెం సేపు మాట్లాడుకుని, జానకిరామ్ దంపతులు వెళ్లి పోయారు.
……
ఆనంద్, వాగ్దేవిలు పార్కులో అనుకున్నట్టు కలుసుకున్నారు.
‘హాయ్ వాగ్దేవి’- ఆనంద్
‘ఎంతసేపయ్యింది వచ్చి’ – వాగ్దేవి
‘పది నిమిషాలు అయ్యింది. ఉద్యోగాలు వచ్చాకా మనం కలుసుకోవడం తగ్గిపోయింది కదూ’ – ఆనంద్
‘అవును’ – వాగ్దేవి. అన్నిటికీ ముక్తసరి జవాబు.
‘ఎలా వుంటారు మీ ఆఫీసు కొలీగ్స్’ – ఆనంద్
‘బాగుంటారు’ – వాగ్దేవి
‘నీకు మంచి స్నేహితులు వున్నారా ఆఫీసులో’ – ఆనంద్
‘హర్షవర్దన్ మంచి కొలీగ్ వున్నాడు. అతనితో ఆఫీసు, స్వవిషయాలు కలుగుజేసుకునేంత చనువు, స్నేహం వుంది. ఒకసారి వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు. అబ్బ ఇంద్రభవనం అనుకో. వాళ్ళ తల్లిదండ్రులు అయితే అమ్మాయీ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తారు. ఏమీ కొత్త అనిపించదు. మా యింటికి వెళ్ళాలనే ధ్యాస వుండదనుకో’ – వాగ్దేవి ఏకధాటిగా చెప్పేసింది.

హర్షవర్ధన్ గురించి చెపుతూ వుంటే వాగ్దేవి కళ్ళలో మెరుపు, అతని మీద వున్న ప్రేమ కనిపిస్తోంది.

మన ప్రేమలో స్వచ్ఛత వుంటే, అవతల వారి ప్రేమ సాంద్రత తెలుస్తుంది. ప్రేమ అంటే ఇద్దరిలో కలిగే పారదర్శకమైన స్పందన. ఆనంద్ అటువంటి వాడు కాబట్టి వాగ్దేవి, హర్షవర్ధన్ మధ్య ప్రేమను గుర్తించాడు హర్షవర్ధన్ ను చూడకపోయినా.

‘నాకు కూడా ఆఫీసులో వ్యక్తిగత విషయాలను కూడా కలుగజేసుకునేంత మంచి స్నేహితుడు వున్నాడు’ – ఆనంద్

‘అవును ఆనంద్ అటువంటి స్నేహితులు జీవితంలో వుంటే ఎంతో ధైర్యము, సంతోషము వుంటుంది కదా’ – వాగ్దేవి

‘అన్నట్టు మీ ఆఫీసుకు రేపు ఒక ప్రాజెక్టు పనిమీద వస్తున్నా. మీ హర్షవర్ధన్ ను పరిచయం చేస్తావా’ – ఆనంద్

‘ఓ తప్పకుండా’ నిండుగా నవ్వుతూ చెప్పింది వాగ్దేవి.

‘చీకటిపడుతోంది, ఇక యిళ్ళకు వెళదాం’ అని ఆనంద్ అనగానే ఇద్దరూ ఇళ్ళకు చేరుకున్నారు.
……
ఆనంద్ వాగ్దేవి ఆఫీసుకు వెళితే, హర్షవర్ధన్ ను పరిచయం చేసింది. వాళ్ళిద్దరి మాటల్లో, చూపుల్లో చిలిపి తనం, ప్రేమ వుందని నిర్దారణ చేసుకున్నాడు. కాసేపు హర్షవర్ధన్ తో మాట్లాడి, అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.

వాగ్దేవి హర్షవర్ధన్ యిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే విషయం తల్లిదండ్రులకు కాని తనకు కానీ చెప్పే ధైర్యం లేదనే విషయాన్ని ఆనంద్ గ్రహించి, ఆలోచించాడు.
…..‌
ఆనంద్ కు అనుకోకుండా ఆఫీసుకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో అమెరికా వెళ్ళమని ఆదేశాలు వచ్చాయి.

‘నాన్నగారు నాకు పదిరోజుల్లో అమెరికా వెళ్ళమని ఆదేశాలు వచ్చాయి. ఎంత కాలం అక్కడ వుండాలో తెలియదు’ – ఆనంద్

‘అదేమిటి, నీ పెళ్లి విషయం ఏమి చేసావు’ – రావుగారు.

‘నేను వాగ్దేవితో మాట్లాడతానండి’ – ఆనంద్
…‌‌..
వాగ్దేవికి ఫోన్ చేసి ‘వాగ్దేవీ నేను పది రోజుల్లో ప్రాజెక్టు పని మీద అమెరికా వెళ్ళవలసి వస్తోంది. నీతో ఒక అబద్ధం చెప్పాను. నేరుగా చెప్పలేక పోయాను. నేను మా ఆఫీసు కొలీగ్ ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను. పేరు ‘మేథ. నన్ను క్షమించు. నువ్వే మీ నాన్నగారికి ఎలాగోలా చెప్పు. మా నాన్నగారికి నేను ఇంకా చెప్పలేదు. అమెరికా ప్రోగ్రామ్ ను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.

‘అలాగే ఆనంద్ బెస్టాఫ్ లక్’ అంటూ నవ్వుతూ సంతోషంగా చెప్పి, హమయ్య అని మనసులో ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారంటే యిదేనేమో’ అనుకుంది.

‘నీకు కోపం వచ్చిందా’ – ఆనంద్

‘కోపం ఎందుకు. ఏదీ మన చేతిలో వుండదు ఆనంద్, జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది’ – వాగ్దేవి
……
ఆనంద్ చెప్పిన విషయం అంతా, బాధను నటిస్తూ, నాన్నగారికి చెప్పింది.

‘ఓ అలాగా. నువ్వే బాధపడకు తల్లీ, వాళ్ళింటి దగ్గర మాటల్లో కుడా నాకు అనిపించింది. అంతా మన మంచికే. నిన్ననే మా ఫ్రెండ్ పెళ్లి సంబంధం చెపితే, కుదిరింది అని చెప్పాను. ఆ వివరాలు కనుక్కొని చూద్దాం. ఆనంద్ గురించి బెంగ పెట్టుకోకు’ – జానకిరామ్

‘అవును ఒక విధంగా నా మంచికే’ మనసులో సంతోషపడింది వాగ్దేవి.
……
‘లక్ష్మీ వాగ్దేవిని రెడీ చెయ్యి, పెళ్లి వారు వచ్చే వేళయింది’ – జానకిరామ్ భార్యను తొందరపెట్టాడు.

పెళ్లి వారు వచ్చారు. కాసేపు ఆ కబుర్లు, ఈ కబుర్లు మాట్లాడుకుని, అమ్మాయిని అబ్బాయికి ఎదురు కూర్చో పెట్టారు. ఈ సంబంధం ఎలా తప్పించాలిరా భగవంతుడా, నాకు హర్షవర్ధన్ తో పెళ్ళి జరిగేలా చేయి స్వామీ, నీ గుడికి వస్తాను అని మనసులో వేంకటేశుని ప్రార్థించింది వాగ్దేవి.

అమ్మాయికి, అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చూపులు. పరాకుగా కూర్చున్నారు. మధ్యవర్తి అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు చూసుకోండి అనేసరికి, ఇద్దరూ ఒక్కసారి చూసుకొని, వారికి ఒక్కసారిగా అరవాలని అనిపించింది. వెదుకుతున్న తీగ కాలికి తగిలింది అంటే యిదేనేమో. ఇద్దరికీ తగిలింది. మరి ఎదురుగా కూర్చున్నది వాగ్దేవి, హర్షవర్ధన్ లాయె.

ఇంకేముంది, తొందరగా ముహూర్తాలు పెట్టుకోవడం, పెళ్లి జరగడాలు అన్నీ చకచకా జరిగిపోయాయి.
……
పరోక్షంగా హర్షవర్ధన్ తో పెళ్ళి చూపులు ఏర్పాటు, ‘మేథ’ అనే ప్రియురాలు రెండు సంఘటనలు ఆనంద్ సృష్టే అని ఎప్పటికైనా వాగ్దేవికి తెలుస్తుందా?

ఇలా కూడా ప్రేమిస్తారు తన ప్రియురాలి ప్రేమను గెలిపించడానికి. ఇంతకీ ఆనంద్ తన స్వచ్ఛమైన ప్రేమతో తన ప్రేమను గెలిపించుకున్నాడా లేక భగవంతుని ప్రార్థన మేరకు వాగ్దేవి ప్రేమ గెలిచిందా. ఎప్పటికీ ప్రేమ ప్రేమనే గెలిపిస్తుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!