నా ప్రేమకథ

నా ప్రేమకథ

రచన: శ్రీదేవి విన్నకోట

ముల్లు నీ ముల్లుతోనే తీయాలి అని ఎవరు చెప్పారో తెలియదుకానీ నా విషయంలో అచ్చంగా అలాగే జరిగింది. అతిగా ఆశపడి మోసపోయాను. నా కథ మీకు నా మాటల్లో నేనే చెప్తా వినండి మరి. నా కథ చదివాక ఇలా కూడా ప్రేమిస్తారా అని మీరు ఆశ్చర్య పోయి నన్ను వేళాకోళం చేయొద్దు చెప్తున్నా మరి.

నా పేరు వసంత్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని, మంచిగా సెటిల్ అయ్యాను. అందుకే ఇక నా ధ్యాస పెళ్లి మీదకు మళ్ళింది. అందమైన అమ్మాయి కోసం వెదుకుతూ ఉంటే చైత్ర దొరికేసింది. చూడగానే తెగ నచ్చేసింది, చైత్ర మా పక్కింటి అందమైన అమ్మాయి .

ఆకాశం అమ్మాయైతే తనలా ఉంటుంది.
ఆనందం అల్లరి చేస్తే చైత్రలా ఉంటుంది.
నేనేమో తనకోసం తానేమో నాకోసం పుట్టింది.
అంటూ నేను నిమిషానీకోసారి తనని చూస్తూ పాడుకుంటూ ఉంటాను.తనని తలుచుకుంటే చాలు ఆనందం వెల్లి విరుస్తుంది చిరునవ్వు, నా మొహమంతా వెల్లువలా వ్యాపిస్తుంది. నా తనువంతా పరవశంతో పులకరించిపోతుంది. నేను ఎంతగానో ఆరోజు ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. నా చైత్ర నా ముందుకు వచ్చింది.

తనతో పాటు అందమైన చిరునవ్వు మోసుకొచ్చింది.
వసంత్ మీరు నాకు ఒక సహాయం చేయాలి, అంటూ ముద్దుగా అడుగుతూ తన మనసు విప్పింది. అంతే నా మనసు  ఆకాశ విహారం చేసింది.
మీరు మా పక్కింటి  అందమైన అమ్మాయి. మీ కోసం సహాయం ఏంటి. మీరడిగితే ఏమైనా చేస్తాను. అన్నాను నామాటల్లో కాస్త  ఎక్కువ ఆత్రుత ద్వనించిందేమో  అనిపించింది నాకే.
మీరు నా కోసం ఏమైనా చేయొద్దు. ఓ చిన్న సహాయం చేయండి చాలు అంది ముద్దు ముద్దు గా కనురెప్పలు అల్లల్లడిస్తూ.
చెప్పండి అన్నాను నేను, ఆనందం నా మనసు నుంచి ఉవ్వెత్తున ఉప్పొంగగా నా సంతోషానికి హద్దుల్లేవు. నా చైత్ర నన్ను సహాయం అడిగింది. నా కాళ్ళు భూమి మీద అనడం మానేశాయి. నా మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోయింది.
మా పక్కింటి అమ్మాయి, మా ఇంటి అమ్మాయి కాబోతుందా అనే ఆనందం నన్ను భూమ్మీద నిలువనీయడం లేదు. నేను ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పాలి అన్నాను.
అప్పుడే వద్దు వసంత్ అంతా అయిపోయాక చెప్పొచ్చు లే  అంది గారాబంగా హొయలు పోతూ అసలు ఆడవాళ్లు ఇంత అందంగా ఎందుకు పుడతారా అనిపించింది నాకు ఒక్క క్షణం తనని చూస్తుంటే,
సరే నీ ఇష్టమే నా ఇష్టం చైత్ర అన్నాను కాస్త నాటకీయంగా.

అయితే రేపు పొద్దున్నే 10 గంటలకి రెడీ అయ్యి  ఉండండి మాష్టారు.మనం పొద్దున్నే ఒక  చోటికి వెళుతున్నాం.మీరు కాదని మాత్రం అసలు చెప్పనే చెప్పకూడదు ఆంది.
సరే వెళదాం  బంగారం నువ్వురమ్మంటే ఎక్కడికైనా రానన్నానా.నీ ముద్దు ముచ్చట ఎనాడైనా కాదన్నానా.అని మనసులోనే పాడుకో సాగాను.
నా చైత్ర చిరునవ్వులు చిందిస్తూ ఆ నవ్వుల వాన నాపై కురిపిస్తూ వాళ్ళ ఇంటికివెళ్ళిపోయింది.
నాకిక రాత్రంతా నిద్ర కరువైంది.
జాగారమే నా కంటికి నెలవు అయ్యింది.
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
అని పాడుకుంటూ హాయిగా నిద్ర లోకి జారిపోయాను.అలా కలత నిద్ర పోతూనే ఉదయాన్నే నిద్ర లేచాను.

ఎక్కడో దూరం నుంచి శ్రీ సూర్య  నారాయణ మేలుకో అనే భానుమతి గారు పాడుతున్న పాట శ్రావ్యంగా వినిపిస్తోంది. అ పాట నాకు  శుభ సూచికం గా అనిపించింది.
చలికాలపు బద్ధకం వదిలించు కుంటూ నిద్ర లేచి త్వరత్వరగా రెడీ అయ్యాను.
నా ప్రియ బాంధవి చైత్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
10 గంటలకి నా నిరీక్షణ ఫలించింది.
తెల్లని మల్లె పువ్వు లాంటి దుస్తుల్లో నా చైత్ర నా కన్నులముందు కి  వచ్చింది. వెళ్దామా వసంత్ అంటూ. తను నాకు ముందేచెప్పింది ఎక్కడికి అని మాత్రం అడగొద్దు అని .
వసంత్ నేనా రోడ్డు చివర ఉంటాను. నువ్వు వచ్చేసేయ్ ఇక్కడి నుంచే మనిద్దరం కలిసి వెళ్లడం ఎవరైనా చూస్తే బావుండదు అని చెప్పి, పాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఒక రెండు నిమిషాలు ఆగి బండి మీద తనని ఫాలో అయ్యాను.
ఒక రెండు నిమిషాలు తర్వాత తను నా బండి వెనుక  కూర్చుని ఉంది. నా ఆనందానికి అవధులు లేవు.
మేఘాలలో తేలిపొమ్మన్నది. తుఫానులా రేగి పొమ్మన్నది, అమ్మాయితో ఇలాఅని హుషారుగా పాడుకుంటూ బండి తాను ఎటువైపు పోనివ్వమంటే అటు వైపు పోనిస్తు ఉన్నాను.
అలా పోనిస్తూ  తను ఆపమన్న చోట ఆపాను. ఎదురుగా పెద్ద పెద్ద ఇంగ్లీష్ అక్షరాల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు అని ఉంది,అది చూడగానే నా నోట మాట రాలేదు.

మరి అంత తొందరైతే ఎలా  ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా చైత్ర అన్నాను.

చెప్పాను వసంత్  కానీ వాళ్లు ఒప్పుకోవడం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏం పర్వాలేదు లే పెళ్లి చేసుకొని.
ఇంటికి వెళ్తే వాళ్ళే ఒప్పుకుంటారు అనే నమ్మకం నాకుంది. అంది ధైర్యంగా.

ఒక్క క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు. సరే ఏమైతే అది అయింది లే అనుకుంటూ చైత్రతో లోపలికి నడిచాను. లోపలికి వెళ్ళాక అక్కడ వున్న  రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తో నేను నెల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను .మీరు ఈరోజు  మమ్మల్ని రమ్మన్నారు అంది.

అతను చైత్ర దగ్గర ఉన్న అన్ని పేపర్స్ చూసి.. ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవుగా అని అడిగాడు.

అబ్బే అసలు ఏమీ లేవుసార్ అంది చైత్ర.
సరే ఓ అరగంట వెయిట్  చేయండి అయిపోతుంది సాక్షి సంతకాలు పెట్టడానికి మీ వాళ్ళు ఇద్దరు కావాలి అన్నాడు అతను.

వెనుక వస్తున్నారు అంది చైత్ర.

మేము ఇద్దరం అక్కడ ఉన్న కుర్చీల్లో కూర్చున్నాము. అసలు ఇదంతా ఎలా చైత్ర కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పలేదు అన్నాను.

అదేం లేదు వసంత్ నేను టు ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నా. నాకెందుకో కులాలు వేరు కావడం వల్ల పెద్దవాళ్ళు ఒప్పుకోరు అనిపించింది. అందుకే ఇలా చేశాను సారీ వసంత్ ఏమీ అనుకోకు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అందుకే నీకు ఆఖరి సమయంలో ఈ విషయం చెప్పాను. ప్లీజ్ ఏమి అనుకోకు ఐ యాం వెరీ వెరీ సారీ అంటూ బ్రతిమాలింది.

సరేలే పర్వాలేదు. పెళ్లి ఇలా సింపుల్ గా అయినా రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉండాలి. దీనికి మాత్రం  నువ్వు ఒప్పుకోవాల్సిందే అన్నాను గట్టిగా.
సరే సరే స్వామి ఒప్పు కుంటున్నాను అంది నవ్వుతూ.

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే… ఈ పాట ఆసందర్భంగా నా మనసుకి ఎందుకు గుర్తొచ్చిందో  అర్థం కాలేదు కానీ నాలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇంతలో చైత్ర ఎవరికో ఫోన్ చేస్తూ కనిపించింది. అప్పుడే  రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపలికి ఓ అర డజను మంది అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు బిలబిల్లలాడుతూ వచ్చి చైత్రని చుట్టుముట్టేసారు.

అందరితో కలిసి చైత్ర నా దగ్గరికి వచ్చింది వీళ్ళంతా నా ఫ్రెండ్స్ వసంత్. ఇదిగో ఇతని పేరు శిశిర్.  నేను ఈప్పుడు పెళ్లి చేసుకోబోయేది ఇతన్నే అని చెప్పి శిశిర్ ఇతను మా పక్కింట్లో ఉంటాడు నాకు మంచి ఫ్రెండ్.  తను మన పెళ్ళికి సాక్షి సంతకం పెడతాడని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను ఇతని పేరు వసంత్ అని చెప్పింది శిశిర్ తో.

శిశిర్ హాయ్ వసంత్ గారు మీ గురించి చైత్ర అస్తమానం చెబుతూ ఉంటుంది అన్నాడు నవ్వూతూ షేక్ హ్యాండ్ కోసం చేయి చాపుతూ. నేను ఏమీ అర్థం కాక తెల్లమొహం వేసాను.

నేను శిశిర్ మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. మాఇంట్లో చెప్పినా అమ్మ నాన్న ఒప్పుకోలేదు. నాకు వేరే సంబంధం ఖాయం చేశారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తొందరపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. మా ఇంట్లో వాళ్లకి నిజంగా నీమీద చాలా మంచి అభిప్రాయం ఉంది, మాట్లాడితే వసంత్ చాలా మంచి కుర్రాడు అంటూ ఉంటారు, అందుకే కొంచెం నా గురించి శిశిర్ గురించిమాఇంట్లో వాళ్లకి నువ్వే నచ్చచెప్పాలి నేను ఎంతైనా మీ పక్కింటి అమ్మాయి ని కదా. నువ్వు నాకు హెల్ప్ తప్పనిసరిగా చేయాలి ప్లీజ్ ప్లీజ్ వసంత్ బ్రతిమాలింది చైత్ర.

నేను ఏం మాట్లాడాలో  తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. చైత్ర ఇంకా నాకు ఇంకా ఏదో చెప్తూనే ఉంది కానీ నా మైండ్ పనిచేయటం ఎప్పుడో ఆగిపోయింది.నా మనసేమో ఎన్నెన్ని కలలు కన్నాయి కళ్ళు అన్ని కల్లలై మిగిలాయి నేడు. కల చెదిరింది కథ మిగిలింది. అని బాధగా పాడుతూ స్తబ్దుగా ఉండిపోయింది. నేను పిచ్చివాడిలా వాళ్ళ వంకే చూస్తూ అక్కడే ఓ కుర్చీలో కూలబడి పోయాను.
అవతలి వారి అభిప్రాయం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా మనం అతిగా ఆశ పడడం ఇలా నా ఇష్టానికి నేను ప్రేమించడం ఎంత తప్పో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా నయం నా ప్రేమ సంగతి చెప్పలేదు, ఇంకా వెధవని ఉండేవాడిని, అనుకుంటూ
కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న లాభం లేదు గా అందుకేఏమీ చేయలేక అలా చూస్తూ మనసులోనే ఏడుస్తూ  అలా రాయిలా ఉండిపోయాను.

ఏది ఏమైనా నిజం నిప్పులాంటిది నమ్మక తప్పదు కదా చైత్ర కరెక్ట్ గానే చేసింది.ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్టు నాలాంటి  తన మీద అతిగా ఆశపడే అబ్బాయికి తను  బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని నాకు తగిన బుద్ది చెప్పింది.
హామ్మో ఈ అమ్మాయిలు తెలివితేటల ముందు మేము ఏ పాటి, మనసులోనే  ఏడ్చుకుంటూ గుండెను దిటవు చేసుకుంటూ తెల్లముఖం వేసుకుని  నా బ్రతుకు ఇలా ఎలా తెల్లారి పోయేనే, నా గుండె పగిలింది కథ మారింది కల మిగిలింది అనే విషాదగీతం విషాదంగా పాడుకుంటూ మా ఇంటి దారి పట్టాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!