ఆదివారం

ఆదివారం

రచయిత :: పద్మావతి తల్లోజు

అన్ని వారాల్లాగే ఆదివారమూ వస్తుంది!
కాకపోతే, అందని ఆశలెన్నో
కాలం కాగితంలో మడిచి,
పొట్లం కట్టి తీసుకొస్తుంది!!
అలిగిన పిల్లాడిని ఊరించే తీపి తాయిలంలా..,
ప్రియుని గుప్పిట్లో మూసిన ప్రేయసి కానుకలా..,
చేతికి అందినట్టే అంది,
చెక్కిలి మీటి, పక్కున నవ్వి పారిపోతుంది!
సెలవన్న తలపులోనేమో.,
భానున్ని కాసేపు బుజ్జగించొచ్చనుకుంటాను
కమ్మని కలని మరో అరగంట పొడిగించాలనుకుంటాను
కానీ,
భళ్లున తెల్లారి, బ్రహ్మాండం బద్దలవుతుంది!
పనిమనిషి కాలింగ్ బెల్ మోతకి
అన్నీ నోర్లు తోడవుతాయి!
తిట్లదారాన్ని నా కాళ్ళకు కట్టి,కిందికి లాగి,
కంటిమీది కునుకును దూరం చేస్తాయి!!
టిఫిన్ డబ్బాలో తిండికి అలవాటుపడిన జిహ్వలు,
కొత్త రుచుల కోసం అర్రులు చాస్తాయి!
అలసిన చేతులకు, మరో ఆరు చేతులు తోడవుతాయనుకుంటే,
అవి అంతర్జాలాన్నే ఆశ్రయిస్తాయి!
కబుర్లకు మొహం వాచిన చెవులకు,
విహారానికి ఎదురుచూసి అలసిన మనసుకి,
ఆదివారం ఆటవిడుపుగా వచ్చి
అలసటను వాయినంగా ఇచ్చి
మళ్ళీ వస్తానంటూ.,
కన్నుగప్పి కనుమరుగవుతుంది!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!