అమ్మ కోసం

అమ్మ కోసం

రచన:: నామని సుజనాదేవి

‘కౌసల్య సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తీష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమామ్హికమ్…’టేప్ లో వస్తున్న సుప్రభాతమ్ తో పాటూ తానూ గొంతు కలిపి పాడుతున్న మాలతి అప్పుడే లేచి హాల్లో కోస్తున్న అన్నయ్యను చూస్తూ … ‘అన్నయ్యా …లేచావా… ఫ్రెషప్ అయి వస్తే కాఫీ ఇస్తానన్నయ్య ..’అంది పాలబ్బాయి తెచ్చిన పాలని లోనికి తీసుకెళుతూ…
‘ఎన్నాళ్ళ య్యిందిరా నీ గొంతు విని ….అప్పుడే పనయి పోయి స్నానం కూడా చేసేశావా.. మనింట్లో అయితే మంచం పై నుండి దిగేదానివే కాదు..’ అన్నాడు ఆరు గంటలకే బయట నీళ్ళు చల్లి ముగ్గు పెట్టిన వాకిలిని చూస్తూ ఆశ్చర్యంగా .
‘పెళ్ళయి ఇరవై సంవత్సరాలయింది …ఇంకా పెళ్లికాని మాలతేనా…నువ్వు నా పెళ్ళయిన దగ్గర్నుండి ఎప్పుడు మా ఇంటిలో ఉండలేదు కాబట్టి నీ కు ఆశ్చర్యంగానే ఉంటుంది…పొద్దుటే 5 గంటలకన్నా లేవక పోతే పిల్లలకి ఆయనకు అన్నీ అందించటం కష్టమవదూ..’అన్నయ్య సుధాకర్ కి లోనుండి కొత్త బ్రష్ ,టవల్ అందించి వంటింట్లోకి వెళుతూ అంది.
‘ఏమోయ్ …ఉన్నావా…ఎన్నిసార్లు పిలవాలి..పలకవెం…’భర్త కేశవ్ అరుపుకు ‘ఏంటండీ’ అంది చపాతీపిండి కలిపే చేయితోనే గభాలున వంటింటినుండి బెడ్ రూమ్ లో ఉన్న భర్త దగ్గరకొచ్చి.
‘నీకేన్ని సార్లు చెప్పాను…ఈ షర్ట్ గుండీ వూడిపోయింది కుట్టమని…వెళ్ళే టైమ్ కి తీరా చూస్తే ఇదీ సంగతి. అసలు రోజంతా ఇంట్లో ఏం చేస్తావ్…ఆ మాత్రం చెయ్యవెం..’ కోపంగా ఆఫీస్ కి టైము అవుతున్నందుకు చిరాకుగా ఎగురుతున్న భర్త మాటలకు కళ్ళెం వేస్తూ ‘గుర్తుండటం లేదండీ…ఒక్క క్షణం …ఇప్పుడే కుట్టి ఇచ్చేస్తా..’ నొచ్చుకుంటూ గబగబా వంటింటిలోకొచ్చి కొంచెం పిండి తో చేయిలోని చపాతీ పిండిని పూర్తిగా ముద్దలోకి పెట్టేసి చేయి కడిగి నాప్కీన్ కి తుడుచుకుంటూ కాలెండర్ కి ఉన్న సూది తీసుకుని, సరిపోయే దారం తీసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ఆ షర్ట్ గుండి దాచిన డబ్బా వెదికి తెచ్చి రెండు నిమిషాల్లో కుట్టి ఇచ్చి వంటింట్లో కొచ్చింది.
‘ అమ్మా…ఇంకెంత సేపు నాకు అయిదే నిమిషాలుంది టైము..’ కూతురి బెదిరింపు.
‘వస్తున్నా తల్లి…అదిగో కుక్కర్ లో పప్పు ఉంది. ఇదిగో పెనం పై చపాతీ వేశాను. నీకు పెట్టిన టిఫిన్ తినేలోగా బాక్స్ పెట్టేస్తా..’
‘అమ్మా… నా కస్సలు టైము లేదు..ముందు చపాతీ నాకేయ్యమంటే అక్కకేసావు..నాకు టిఫినే వద్దు..వెళ్తున్నా..’భుజాన బాగ్ వేసుకుని అలిగి వెళుతున్నాడు కార్తీక్.
‘చిన్నూ..నా బంగారం కదు.. ఒక్క క్షణం ..ఇదిగో నీ టిఫిన్ రెడీ ..ఆకలవుతే పాఠా లేం తలకెక్కుతాయి..’
‘నాకేమ్మొద్దన్నానా..’
‘ఇంకోసారలా చేయను గాని ఇప్పటికీ తిను..’
‘నాకు టైమ్ లేదన్నానా..’
‘నువ్వు బుక్స్ సర్దుకుని షూ వేసుకునే లోగానే తినిపిస్తా సరేనా..పట్టు పట్టు ఈ మాటల్లో 5 నిమిషాలు అయిపోయింది…’ కార్తీక్ నోటిలోకర్రీ తో కలిపిన చపాతీ ముక్క పెడుతూ అంది , అది నమిలేలోగా అప్పటికే రెడీ చేసిన కారియర్స్ అన్నీ మూతలు పెట్టి ఎవరివి వారికి ఇచ్చేస్తూ. మిగతాది తినిపించి అందర్నీ పంపించింది.
భర్త పిల్లలు అంతా వెళ్లిపోయేసరికి వర్షం కురిసి వెలిసినట్లయింది. రాత్రి కూడా ఉపవాసమని ఏమీ తిననందుకేమో పొద్దట్నుంచి కనీసం టీ నీళ్ళు తాగే తీరిక లేనందుకోగాని కడుపులో ఎలకలు పరుగెత్తుతున్నాయి. ఇంతసేపు పరుగెత్తుతూ చేయడానికి వోపిక ఎలా వచ్చిందో, కడుపులో అలారం ఎందుకు మోగలేదో తెలీదుకాని అంతా వెళ్ళేసరికి ఒక్కసారిగా ఎక్కడ లేని నీరసం ముంచుకొచ్చింది.
‘ఇంతసేపూ వీళ్ళను పంపే హడావుడిలో మీ కిన్ని కాఫీనీళ్లు తప్పితే ఏమీ ఇచ్చింది లేదు ..క్షణం లో టిఫిన్ తెస్తానన్నయ్యా..మీకు టైమ్ అవుతున్నట్లుంది కదూ…’ హడావుడిగా వంటింట్లోకి పరుగెడుతూ అంది పేపర్ చదువుతున్న అన్నయ్యతో.
‘ ఫర్లేదురా..ఆఫీస్ లో చిన్న పనే …మా పెద్దాఫీసులో ఒక అప్లికేషన్ ఇచ్చి రావడమే..నాకేం తొందర లేదుగాని ..ఇంతవరకూ నువ్వేం తిన్నట్లులేదు..రాత్రీ తినలేదు…కనీసం కాఫీ అయినా తాగావా…’
కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి మాలతికి ..ఎంతయినా పుట్టింటివాళ్లు …పుట్టింటివాళ్లే…
అందుకే ఆడపిల్లలకు వాళ్ళంటే అంత మక్కువ…’ఇదిగో …ఇక మరేం హడావుడి లేదు కదన్నయ్యా…ఇక నింపాదిగా టీ తాగాకే మిగతా పని ‘ అంటూ చక చక రెండు చపాతీ బిళ్ళలు చేసి కర్రీ పెట్టి అన్నయ్యకు తీసుకొచ్చి తాను లోనికెళ్లి టీ తెచ్చుకుని పుట్టింటి సంగతులు ఆరా తీస్తూనే ఇల్లు సర్దడం మొదలు పెట్టింది. ఇల్లంతా రణరంగం లా ఉంది. ఎప్పుడూ వాళ్ళు వెళ్ళేంత వరకూ టైమ్ కె ప్రాధాన్యత నిచ్చి హడావుడిగా ఎక్కడివక్కడే పడేస్తారు. కూతురికి చున్నీ దొరకలేదేమో షెల్ఫ్ నుండి బట్టలన్నీ పీకి కింద పడేసింది. ఇక కొడుక్కు ఏ రికార్డు దొరకలేదో రాత్రే సర్దుకుని పెట్టుకొవాలనుకోడు కాబట్టి తీరా టైమ్ దగ్గర కొచ్చాక ఏ బుక్ దొరకలేదో గానీ అన్నీ కుప్పపోసాడు. భర్త వారికి నేనేమీ తీసిపోనన్నట్లు సాక్స్ లన్నీ వెదజల్లాడు. దరిదాపు రోజూ ఇదంతా మామూలే . ఒక రోజు ఒక రికార్డ్ కనబడకపోతే ,పుత్రరత్నానికి మరోరోజు మరో రికార్డ్ కనబడదు. అన్నీ కనబడితే పెన్నో,పెన్సీలో, టై నో ఏదో ఒకటి కనబడదు. ఫలితం ఇల్లంతా హనుమంతుడు పీకి పాకం పెట్టిన అశోకవనంలా ఉంటుంది, వాళ్ళు వెళ్ళేసరికి. కూతురికి పైది దొరికితే, ఇన్నర్ దొరకదు అన్నీ దొరికితే ఏదో స్పెషల్ గా జుట్టు వేయమంటుంది. తినిపిస్తుంటే కూడా సెల్ పట్టుకుని ఏదో కొడుతూనే ఉంటుంది. ‘అమ్మా ఇదిగో నువ్వేసిన ఎల్లిపాయల జాడ వాట్సప్ లో పెడితే ఎన్ని లైకులొచ్చాయో చూడు..క్రెడిట్ గోస్ టు యు ‘ అంటూ కూతురు, జీన్స్ కి జిప్ పోయిందనో బెల్ట్ కనబడలేదనో ..కూతురికే ఎక్కువ టైము కేటాయిస్తావు..నన్ను పట్టించుకోవనో .. కొడుకు..
’ఎంతయినా అసలుకన్నా కోసరేముద్దు..నువ్వు నన్నస్సలే పట్టించుకోవట్లేదు…’ సెల్లో, కళ్ళద్దాలో మర్చిపోయినపుడు వెళ్ళే భర్తకి గుర్తు చేస్తుంటే అలిగే పతిదేవుడు..
గుర్తొచ్చి నవ్వుకుంది.
వాళ్ళకి తినిపించిన ఎంగిలి పల్లాలు, పతిదేవుడు సగం తిని ప్రసాదంగా మిగిల్చిన టేబల్ పైని ప్లేట్ సాంబార్ గిన్నెలు చట్నీ గిన్నెలు అన్నీ ముందు సింక్ లో వేసి మూతలు తీసి ఉన్న పసుపు జీలకర డబ్బాల మూతలు పెట్టి యధాస్థా నం లో ఉంచి పిండి చేత్తో ముట్టుకున్న వాటిని సింక్ లో పడేసి మళ్ళోసారి ఇల్లు వూడ్చి ముందర మొహం కడుక్కుని, తులసి చెట్టుకు నీళ్ళు పోసి ,దేవుడి పూజచేసింది. కడుపు నక నక లాడుతుంటే మిగిలిన ఒక చపాతీ ఉంటే మళ్ళీ చేసుకునే ఓపిక లెక ఆదే తిన్నది.
మాసిన బట్టలు మిషన్ లో వేసి పిల్లలు తుడుచుకుని వదిలేసిన టవల్స్ అన్నింటిని దండెమ్ పై ఆరేసి ఎక్కడివక్కడ సర్దుతుంటే ఎప్పటిలాగే మూలకు పెట్టిన మూగబోయిన శృతి బాక్స్ ,వీణలను ఒకసారి భారంగా చూస్తూ ఎప్పటిలాగే ప్రేమగా నిమురుతూ తుడిచి పక్కకు పెట్టింది చిన్నగా పాట హామ్ చేస్తూ.
‘ఎమ్మా..సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నావా…నీకు చాలా ఇష్టం కదా..’బయటికి వెళుతూ అన్న అన్నయ్య మాటలకు
‘ ఆ..అదొక్కటే తక్కువ…అంత తీరికెక్కడిదన్నయ్యా…అయినా చేసి మాత్రం చేసేదేముంది…రొటీన్ జీవితం…’ నిట్టూరుస్తూ అంది.
చెట్లకు నీళ్ళు పోసి ఏ మొక్క ఎంత పెరిగిందీ పరామర్శిస్తూ…కువ కువ లాడుతున్న పిచ్చుకలకు బదులిస్తూ కొన్ని గింజలు చల్లి, సింక్ లో ఉన్నవి తోమి వాషింగ్ మిషన్ లోనివి పిండి ఆరేసేసరికి, నిన్న ఆరేసి ఎండిన బట్టలు మడతపెట్టడానికి ఎదురుచూస్తూ ఉన్నాయి. అవన్నీ మడత పెట్టి ఎక్కడి వక్కడ సర్దుతుంటే సుధాకర్ రానే వచ్చాడు. మాట్లాడుతూ పేపర్ తిరగేసిందో లేదో ,లంచ్ కి భర్త రానే వచ్చాడు. ముగ్గురు కల్సీ భోజనం చేశారు . భర్త వెళ్ళగానే అవన్నీ సర్ది గుండీలు పోయినవి, కుట్లుపోయినవి కుట్టి, ఎండబెట్టాల్సినవి, పురుగు పట్టినవి బాగుచెయ్యాల్సినవి చేసి పాప టాప్ కి కుట్టే డిజైన్ ఒక గంట కుట్టి తెల్లవారి టిఫిన్ కి నాన బెట్టడమో రుబ్బడమో చేసేసరికే పిల్లలోచ్చే వేళయింది .
ఆకలి పై వచ్చే వారందరికి వేడి వేడి గా ఏదైనా తయారుచేయడం , సాయంత్రం సందెపని తీర్చుకుని రాత్రి వంట చేసే సరికి నడుం టింగుమంటుంది. అంతా ఆ రోజు విశేషాలు చెబుతూ టి‌వి చూస్తుంటే వింటూ తెల్లవారికి చిక్కుడుకాయ వలిచి పెట్టుకోవడమో, దొండకాయ తరిగి పెట్టుకోవడమో పల్లీలు వేయించి పెట్టుకోవడమో , చట్నీ లోకి కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకోవడమో చేస్తుంది. ఇక అంతా కల్సీ భోజనాలు చేశాక అన్నీ సర్ధాలంటే ఏడుపు వచ్చినంత పనవుతుంది. పాలువేడి చేయడం, తోడుపెట్టడం చేసేసరికి అలసిన శరీరం మొరాయిస్తుంది. కళ్ళు స్ట్రైక్ చేస్తూ మూసుకు పోతాయి. సుధాకర్ ఉన్న ఒక్క రోజు ఇదంతా చూశాడు.
తెల్లవారి ఆదివారం కావడం తో టిఫిన్ కాగానే , ‘అమ్మ కు సంగీతం అంటే ప్రాణం . ఎన్నో బహుమతులు అందుకుంది. ఇంట్లో యంత్రం లా పని చేయడం తప్పితే తనకంటూ సమయం అస్సలు కేటాయించుకోవడం లేదనిపించింది. ఎంతటి కష్టమైనా తనకు నచ్చిన పనిలో మరిచిపోవచ్చు. అమ్మ మీ అందరి ఆనందాన్నే చూసుకుంటుంది కానీ తన కోసం, తన ఆరోగ్యం కోసం, తన సంతోషం కోసం ఏమీ చేసుకోవట్లేదు. భూమి పై తిరిగే దైవం అమ్మంటారు. అమ్మ కనీసం ఒక గంటయినా తన కోసం కేటాయించుకుంటే తన ఆరోగ్యం బావుంటుంది. జీవితం నిరాసక్తంగా కాకుండా చైతన్యవంతంగా ఉంటుంది. అమ్మ పెళ్లి కి ముందు యోగా కూడా చేసేది. మీరంతా సహకరించి సాయంత్రం వచ్చాక తెల్లవారి హడావుడి కాకుండా రాత్రే సర్ధి పెట్టుకుంటే అమ్మకు కొంచెం టైమ్ మిగులుతుంది. గంట ముందు పడుకుని ముందు లేచి ఒకగంట యోగా , సంగీత సాధన చేస్తుంది. మీరు అమ్మతో పాటు యోగా చేయండి. రాత్రి వరకు శ్రమ తెలియకుండా పని చేయొచ్చు , ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకే ఇవ్వాళ జరిగే సంగీతం పోటీలో అమ్మ పేరు ఇచ్చి వచ్చాను. ఆదివారం కనుక అమ్మకు సెలవిచ్చి మీరు కొంచం సహాయపడితే అమ్మ సాధన చేసుకుంటుంది, మీకు అమ్మ కష్టం అర్ధమవుతుంది… మనం కొంచెం ప్రేరణ ఇచ్చి సహకరిస్తే విజయం ఎలా సాధ్యమవుతుందో మీరే చూడండి…‘ అంటూ సుధాకర్ అంటుంటే హర్షిస్తూ అంతా చప్పట్లు కొట్టారు. కేశవ్ కూడా తాను ఇదంతా ఆలోచించనందుకు సిగ్గుపడ్డాడు.
రక్త సంబందం అని ఇందుకే అంటారేమో అన్నట్లు మాలతి కళ్ల నిండా నీళ్ళు నిండాయి. ‘నాకుప్రాక్టీస్ లేదు కదన్నయ్య’ అంటుంటేకూతురు శృతి బాక్స్ కొడుకు వీణా తెచ్చారు , అడిగిందే తడవుగా పాట అందుకుంది, పరిసరాలు మైమరచి పోయింది.
సాయంత్రం ఆడిటోరియమ్ లో పాట ముగియగానే అందరి కరతాళ ద్వనులు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని , చైతన్యాన్ని నూతనోత్సాహాన్ని నింపాయి.
వారిని ఆశ్చర్యానందాలలో నింపుతూ , కచేరీ తర్వాత పోటీలో బహుమతులు గెల్చుకున్న వారిలో మాలతి పేరు చదువుతుంటే ఆపకుండా చప్పట్లు కొట్టారంతా….
‘కొంచెం ప్రేరణ ద్వారా విజయం నిజంగా తధ్యమే మామయ్యా…’ పిల్లల మాటలకు వారి తల నిమురుతూ నవ్వాడు సుధాకర్.

*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!