కొడుకు

కొడుకు

రచన:: పాండు రంగాచారి వడ్ల

తాత మంచంలకెల్లి సాపలకు ఒచ్చుడు ఇది రెండోసారి. తొలుత నాయనమ్మ పండి, పోయినపుడు, నాయనమ్మ పోయిందని గుండె పగిలి రోగం తెచ్చుకుండు. అప్పుడు నాయిన పట్నంల పెద్ద దవాఖానల చూపిచ్చిండు. నెలయినంక తగ్గుముఖం పడ్డది, మల్ల ఇంటికి తోల్కొచ్చిండు. అప్పటినుండి మాతాన కొన్ని దినాలు అత్తమ్మోలత కొన్ని దినాలు ఉండుకుంట ఒచ్చిండు.

ఏమైందో ఏమో మల్ల పద్దినాల సంది తింటలే, తాగుతలే. ఏం జేసినా గొంతుల నొప్పి అంటుండు, నొప్పితోని ఏం లోపల్కి పోయనిస్తలేడు, మా నాయిన దవాఖానకు తోల్కపోయిండు ఈ తాప కూడా. డాక్టరు ఏమన్నడో, నాయిన మాతోని జెప్పలే.
మందులు ఏస్తుండ్రు. రోగం తక్వైతలే గానీ జర నొప్పి తక్వైనట్టే ఉంది. అపుడపుడు జరన్ని చాయ్ నీళ్ళో, పాలో, ఏదో ఒకటి కొంచెం కొంచెం తాగుతుండు, బాగానే ఉండు గద అనుకున్నాం, ఎట్లైందో ఎనిమిదో నాడు రాత్రి పానమిడ్సిండు.

సుట్టాలు పక్కాలు అందరికీ కబురు పోయింది. తెల్లారికి ఒక్కొక్కళ్ళు వస్తుండ్రు, సూస్తుండ్రు, ఎట్లైంది అని అర్సుకుంటుండ్రు. కార్యం ఎప్పుడు ఐతదా.. ఎప్పుడు బైట పడదమా అని సూస్తుండ్రు.

నేను దుఃఖంతోనే ఉన్న రాత్రి నుండి, కండ్ల నీళ్ళు తూడ్సుకుంటనే ఉన్న, చేసే పన్లు చేస్తనే ఉన్న, ఇంట్లకి బైటకి ఊర్లోకి తిర్గుతనే ఉన్న. నా చెవుల పడ్డయి కొన్ని మాట్లు “ఒక్కడే కొడుకు, తండ్రిని సూస్కొనీకి శాతగాలే, బిడ్డ తాన పడేసి పోయిండ్రు.”
“లేదప్పా, టౌనుకి తీస్కపోయిండ్రంట కదా?”
“తీస్కపోతే తక్వగావాలే గదా..”
“అవ్ గదా.. “

నాకు మా నాయిన మీద శానా కోపమొచ్చింది, నిజంగానే నాయిన తాతని సక్కగా సూస్కోలేదా? అందుకే తాత పోయిండ అని.
మా నాయిన కంట్ల సుక్క నీరు లేదు, అంటే తాతంటే పేమ లేదా?

మధ్యాహ్నం 3 కల్లా అన్నీ అయిపోయినాయి, స్మశానం కెళ్ళి ఇంటికి ఒచ్చినం. అంతా అయిపోయినాక, మా నాయిన దోస్తు ఒచ్చిండు, ధైర్యం చెప్పనీకే.

“ఎట్లయింది రా? పోయిన్నెల వచ్చినపుడు బాగానే ఉండే కదా..”

దోస్తుని పట్కొని దమ్ము పట్టంగ ఏడ్సిండు నాయిన. దోస్తు ఊర్కోబెడ్తుండు, సముదాయిస్తుండు.

నాయిన చెప్పవట్టిండు “ఎప్పటినుండో బీడీలు తాగుతుండే, చెప్తే ఇనకపోతుండే, తాగి తాగి ఊపిరితిత్తుల్ల పైపులు కరాబయినయ్, దవాఖానకు తీస్కపోతే ఆపరేషను చేయాలే అన్నరు..”

“చేపియొద్ధారా మరీ.. పైసల్ తక్వ వడ్తే మేమంతా లేకుంటిమా?”

“పైసల కోసం కాదురా.. డాక్టరు అన్నడు, ఆపరేషను చేస్తే ఉంటే ఉంటడు పోతే పోతడు, ఒకవేళ బతికినా, బతికిందాకా నెలకోసారి పైపులు చెక్ చేపిస్తుండాలే, అవసరం ఐతే మార్పిస్తుండాలే, అదొక నరకం, అట్లా కాకుండా ఈ ఆపరేషను చేసేటపుడు కరోనా ఒచ్చిందనుకో, మళ్లీ అదో పరేషాను, ముసలి పాణం తట్టుకోలేదు అన్నారు.

మా నాయిన్ని నేనే సంపినానురా..”
అని మళ్ళా బోరున ఏడ్చాడు మా నాయిన.

“ఏడవకు ఏడవకు ఊరుకో”

“ఉన్న కొన్ని దినాలు అయినా, ఘోస పడకుండా పోతాడని, ఆపరేషను చేపియ్యలే రా…”

మా నాయిన, వాళ్ళ నాయిన కష్టపడకుండా పోయేలా చేశాడు. ప్రేమ లేక కాదు, ప్రేమ ఉండే.

కొడుకు అంటే పున్నామనరకం లేకుండ జేసేటోడే కాదు, బతికున్నప్పుడు బాధ లేకుండ, పోయేటపుడు నొప్పి పుట్టకుండా చేసేటోడు కూడా కొడుకే అనుకున్న, ఆళ్ళ మాటలు ఇన్నంక.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!