ధైర్యపు వస్త్రం

ధైర్యపు వస్త్రం

రచన : మీసాల చినగౌరీ నాయుడు

శాంతి కణాలన్నీ ఒక జీవకణమై
అహింసా దేహంతో అలంకరింపబడి
వంటినిండా త్యాగరక్తంతో తడిసిన
ఓ అర్ధనగ్న విశ్వతేజుడతడు…

భయం గుప్పిట్లో వణికిపోతున్న
తల్లి భారతమ్మకు స్వదేశీ ధైర్యపు వస్త్రంకప్పి, ఓదార్పునిచ్చిన
నిస్సాయుధ
పోరాటయోధుడతడు….

తెగిపడుతున్న రెక్కలకు
నిబ్బరపు కట్లుకట్టి
శిథిలమౌతున్న స్వేచ్ఛాసౌధానికి
ఉద్యమ పునాదులు నాటిన
ఉక్కుసంకల్ప దీక్షాదక్షుడతడు…

పదునెక్కిన తెల్లకోరలను
పంచనామా చేసి
విర్రవీగిన వైరిమూకలను
సత్రాగ్రహ చెరలో బంధించి
శాంతియాగంతో జయభేరి
మ్రోగించిన
సత్యాగ్రహాసమరభూషణుడు….

ఉద్యమాలను చెక్కుతూ
దిద్దిన స్వేచ్ఛాశిల్పానికి
పీఠమై నిలిచి,
కట్టిన అస్పృశ్యతాతెర తెంచిన
మానవీయ మహాత్ముడు….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!