అంపకాలు

అంశం : హాస్య కథలు

అంపకాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: శింగరాజు శ్రీనివాసరావు

      “మొత్తానికి మీ అబ్బాయి పెళ్ళి మీరు కోరుకున్నట్లు పది లక్షల కట్నం గుంజి మరీ ఘనంగా చేశారు. ఇక అమ్మాయి మీ ఇంట గృహప్రవేశం చేస్తే ఆ తరువాత పెట్టుపోతలు, లాంఛనాలు గట్రా బాగా లాగించేటట్టున్నారు సుమీ” మధ్యాహ్నం పెళ్ళి భోజనాల అనంతరం పెళ్ళికొడుకు తండ్రి పానకాలుతో అన్నాడు అతని మిత్రుడు ఏకాంబరం.
“మరి పానకాలు కొడుకా మజాకానా. మావాడు సినిమా హీరోలా ఉంటాడు. పైగా చేస్తున్నది మున్సిపల్ ఆఫీసులు అధికారి పోస్టు. మునిసిపల్ ఆఫీసంటే పాడిగేదెలాంటిది కదా. పిండినంత పిండుకోవచ్చు. ఆ ఆశతోనే పిల్లను ఇచ్చారు ఏకాంబరం. కానీ వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకవు. మా వియ్యంకుడు తహసిల్దారుగా ఉండి సంపాదించనదంతా దూసిపారెయ్యను” తెల్ల మీసాలను తిప్పాడు పానకాలు. “నిజమే ఏకాంబరం. నీ కొడుకు హీరోనే. కాకపోతే కాకిలా కాస్త నల్లగా ఉంటాడు అంతే. అయినా ఏముందిలే. సినిమా హీరోల్లో ఎంతమంది నల్లటివాళ్ళు లేరు. అదిసరే ఇంతకూ అంపకాలు ఎన్నింటికట?”
“సాయంత్రం ఏడు గంటలకు. చీకటి పడాలట. సరేగానీ మన శంకరంగాడికి ఫోను చేసి రేపు గృహప్రవేశానికి ఏర్పాట్లు చూడమని చెప్పు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు చేయమను” “సరే వాడికి ఫోను చేసి, కొద్దిసేపు రూముకెళ్ళి పడుకుని సాయంత్రం వస్తాను” “సరే. తొందరగా రా” అని ఏకాంబరాన్ని పంపి లేచాడు పానకాలు. “అయ్యా బాగా చీకటి పడింది. ఇక అంపకాలు మొదలు పెడదామా” అంటూ వచ్చాడు పంతులు. “మేము సిద్ధమే. మరి పెళ్ళికూతురు తరఫు వాళ్ళు రెడీనా” అడిగింది పానకాలు భార్య సుందరి.”వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీదే ఆలస్యం. పెళ్ళికుమారుడిని తీసుకుని రండి మీరు” అని పోబోయాడు పంతులు. “పెళ్ళికొడుకు కూడ అవసరమా ఇప్పుడు” అడిగాడు పానకాలు.
“అయ్యా పెళ్ళికూతురు ఆయనను కూడ పిలుచుకు రమ్మన్నది. మరి అప్పగింతలు కదండీ” అని వెళ్ళిపోయాడు పంతులు. పెళ్ళికొడుకుకు కూడా అప్పగించడం  ఆనవాయితీ కాబోలని అందరూ బయలుదేరి మండపానికి చేరారు. కార్యక్రమం మొదలయింది. “అబ్బాయీ నువ్వొచ్చి పెళ్ళికూతురు ఎదురుగా కూర్చో” చెప్పాడు పంతులు. కూర్చున్నాడు పెళ్ళికొడుకు.
“ఇప్పుడు అబ్బాయిని, అమ్మాయికి అప్పగించే కార్యక్రమం. అందరూ వచ్చి ఆశీర్వదించండి” అన్నాడు పంతులు గారు. ఉలిక్కిపడ్డ పానకాలు లేచి గర్జించాడు. “అబ్బాయిని, అమ్మాయికి అప్పగించడమేమిటి. ఏం తిక్క తిక్కగా ఉందా”
“అంతేకదా బావగారూ” చిన్నగా అన్నాడు పెళ్ళికూతురు తండ్రి ఏడుకొండలు.”ఏంటి అంతే. మీ పిల్లను మా ఇంటికి పంపిస్తున్నారా. లేక మా అబ్బాయిని మీ ఇంటికి పంపిస్తున్నామా”
“ఆవేశపడకండి బావగారూ. మనం సంతలో పశువును కొంటే దాన్ని కొన్నవాడే కదా ఇంటికి తోలుకెళ్ళేది. అంతేగానీ అమ్మినవాడు కాదుగదా. ఇదీ అంతే” “సంతేంది..పశువేంది…ఏం మాట్లాడుతున్నారు” “ఇందులో అర్థంకానిది ఏముంది మామయ్య గారూ. మేము మీ అబ్బాయిని పదిలక్షలు పెట్టి కొనుక్కున్నాము. అంటే ఇక్కడ మీరు అమ్మినవారు, మేము కొన్నవారము, మీ అబ్బాయి కదా. అందుకని మీ అబ్బాయిని మాకు అప్పగించమనే ఈ అప్పగింతలు వచ్చి మీ అబ్బాయి చేతిని పాలలో ముంచి నా చేతిలో పెట్టండి” చాలా నెమ్మదిగా స్పష్టంగా చెప్పింది పెళ్ళకూతురు మాళవిక. నిశ్చేష్టుడయ్యాడు పానకాలు. “అంతేకదా బావగారూ. మీరు మీ అబ్బాయిని అమ్మేశారు కనుక అతని మీద సర్వహక్కులు మావేనని మీరు చేసే రిజిస్ట్రేషనే అంపకాలు. ఆలస్యమయిపోతుంది రండి” తొందరచేశాడు ఏడుకొండలు. “అయ్యా. చేతులుకాలాక ఆకులు పట్టుకోవడం దేనికి. మరల రాహుకాలం వస్తుంది. వచ్చి ఆ తంతు ముగించి, అమ్మాయి ఇంట్లో గృహప్రవేశం తంతుకు సిద్ధంకండి” అన్నాడు పంతులు”నో..నో..నేనురాను. నేనురాను” అంటూ అరవసాగాడు పానకాలు. “అబ్బబ్బా ఏమయిందండీ. ఏమిటా కేకలు” అంటూ అవకాశం దొరికింది కదాయని వీపుమీద నాలుగు చరిచింది సుందరి. వీపుమీద మోతలకు లేచి కళ్ళు నులుముకుని ‘ఇది కలా, నిజంకాదా’ అనుకుని కలమొత్తం చెప్పాడు భార్యకు. “అందుకే మొత్తుకున్నా. బంగారంలాంటి పిల్ల దొరికింది కట్నం వద్దని, విన్నారా, వాళ్ళు ఒప్పుకున్నదాకా పీడిస్తిరి. అది కల కాదు జరగబోయేది అంతే. వాళ్ళు కాదు. మీరువకట్నం తీసుకుంటే నేనే వాణ్ణి వాళ్ళకు అప్పగించి వస్తాను. ఆడపిల్ల ఉసురు పోసుకుని బాగుపడ్డ కాపురాలు లేవు” అవకాశాన్ని అందిపుచ్చుకుంది సుందరి. “అబ్బా తిట్టకే. ఇప్పుడే వాళ్ళకు ఫోను చేస్తాను. కట్నాలు గట్రా ఏమీ వద్దని, అమ్మాయిని మా ఇంటికి పంపితే చాలని” అని లేచి చేతిలోకి ఫోను తీసుకున్నాడు పానకాలు, ఎక్కడ కల నిజమవుతుందోననే భయంతో…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!