కరోనా కోతి కల్లోలం

అంశం : హాస్య కథలు

కరోనా కోతి కల్లోలం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : కందర్ప మూర్తి

          నేను ఒక శుభకార్యానికి విశాఖపట్నం జిల్లా అగ్రహారం గ్రామంలో మా భావమరిది ఇంటికి వచ్చి కరోనా వైరస్ ఉధృతి పెరిగి లాక్ డౌన్ కారణంగా ఉండిపోవల్సి వచ్చింది. కరోనా వైరస్ ఆంక్షలతో ఊరంతా ఎటువంటి రాకపోకలు లేక భయం భయంగా ఉండేది. టీ.వీలు ప్రసార మాద్యమాల వార్తలతో ప్రజల్లో మరింత ఆందోళన ఉండేది. వీలైనంత వరకు ఇళ్లలోనే కాలక్షేపం చేసేవారు.
ప్రభుత్వం సరఫరా చేసే ఆహార సామగ్రి నిత్యావసర వస్తువులు మందులు గ్రామ వాలంటీర్లు ఇంటింటికీ ఇచ్చేవారు. మా భావమరిది ఇల్లు విశాలంగా చుట్టూ ప్రహరీ గోడతో మామిడి పనస జామ సపోటా అరటి సీతాఫలం నిమ్మ దబ్బ కరివేపాకు బాదం వంటి ఫలవృక్షాలు, మందార కనకాంబరం మల్లి చేమంతి చంద్ర కాంత గోరింటాకు మునగ అనేక ఫల పుష్ప మొక్కలతో పచ్చగా చల్లగా ఉంటుంది. కాకులు గోరింకలు రామచిలుకలు పిచికలు ఉడతలు తొండలు గూళ్లు కట్టుకుని సందడి చేస్తుంటాయి. సీజను ప్రకారం చెట్ల నిండా ఫల పుష్పాలు కనబడతాయి. దొడ్లో బోరు బావి ఎప్పుడూ పుష్కళంగా నీటితో ఉండటం వల్ల చెట్లు మొక్కలు పచ్చగా కళకళ లాడుతూంటాయి. పచ్చని పల్లె వాతావరణం అక్కడ కనబడేది. వేసంగిలో ఎండ వేడి కనిపించదు. మా భావమరిది ఇంట్లో రెండు పెంపుడు పెద్ద ఊర కుక్కలు కొత్త వారు గుమ్మం ముందు వస్తే అరుస్తూ సందడిగా ఉంటాయి. కరోనా వైరస్ ఉధృతి లాక్ డౌన్ కారణంగా నేను వేసంగికి అగ్రహారం గ్రామంలోనే ఉండవల్సి వచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఎర్రమూతి కోతి ఒకటి వారి దొడ్లోకి వచ్చింది.
దాని మెడలో ఒక ఎర్రని నైలానుబెల్టు ఇత్తడి మువ్వ కట్టి ఉన్నాయి. దాని వాలకం చూస్తే పెంపుడు కోతిలా అనిపిస్తోంది. మా భావమరిది భార్య కోతిని రామభక్తుడిగా తలిచి వారి పెంపుడు కుక్కలతో పాటు కొంచం అన్నం తినమని పల్లెంలో పెట్టింది. ఆకలి మీద ఉన్నట్టుంది గబగబా తినేసింది. తర్వాత అదే పోతుంది అనుకున్నాము. ఇంట్లోనే తిష్ట వేసింది. వాస్తవానికి అది గారడీ చేసే పెంపుడు కోతి. దాని యజమాని కరోనా కారణంగా జరుగుబాటు లేక దానికి తిండి పెట్టలేక ఊరు మీద వదిలేసాడు. ఊళ్లో మా భావమరిది ఇల్లు విశాలంగా ఫల వృక్షాలతో తినడానికి ఉండటానికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడే తిష్ట వేసింది. రామ భక్తుడని చేర తీసినందుకు ఇంట్లో వాళ్లకు చుక్కలు చూపించింది. దాన్ని అక్కడ నుంచి ఎలా వెళ్లగొట్టడమా అనే స్థితికి తెచ్చింది. వచ్చిన కొత్తలో వారి పెంపుడు కుక్కలతో సమానంగా అన్నం తిను బండారాలు పెట్టి ముద్దుగా ‘అంజిబాబు’ అని పిలవడం మొదలెట్టారు. ఇంట్లో ఉండే అరటి పళ్లు కొబ్బరి చెక్క పల్లి కాయలు తెచ్చి మేపేవారు. ఇంట్లో పిండి వంటలు చేస్తే పేరు పెట్టి పిలిచి తినిపించే వారు. పాపం , దాని భోగాలకు పెంపుడు కుక్కలు అమాయకంగా చూస్తుండేవి. యజమాని చేరదీసారని తలిచి అవి ఏమీ అనేవి కావు.’ అంజీ ‘అని పిలిస్తే చాలు ఎక్కడున్నా తననే పిలుస్తున్నారని ఎదురు పడేది. గారడీ కోతి అయినందున మనుషులతో చనువు బాగానే ఉండేది. దేనికీ భయపడేది కాదు. మనం ఏం చేసినా ముందే గ్రహించేది. క్రమేపి అంజిబాబు ఆగడాలు పెరిగిపోయాయి. దానికి అనుకూలంగా ఉంటే కుక్కలతో ఆడుకుంటూ చెవిలో శరీరం మీద పేలు తీసేది. అవి తిరగ బడితే తోకలు పట్టుకుని లాగడం కర్రతో కొట్టడం పడుకుంటే కరిచి పారిపోవడం చేసేది. అవి పడుకోవడం కోసం వేసిన గోనె పట్టాలు ఇతర వస్తువుల్ని టేంక్ నీళ్లలో పడవేసేది. అంజికోతి వచ్చినప్పటి నుంచి పెంపుడు కుక్కలకు మనశ్శాంతి లేకుండా పోయింది. రాను రాను అంజిబాబు అల్లరి ఎక్కువైంది. వాకిట్లో ఆరేసిన ఉతికిన బట్టలు తీసుకుని కొబ్బరి చెట్టెక్కి ముసుగులా వేసుకునేది. బనీన్లు బ్లౌజులు రంద్రాలు చేసి తల దూర్చి చింపి పడేసేది. చీరలు లంగాలు లాక్కెళ్లి ఆడి మట్టలకు కట్టి ఉయ్యాల ఊగేది. ఎవరైన భయపెడితే కరవడానికి తయారయేది. నీటి కొళాయిలు విప్పేసి నీళ్ల గొట్టంతో కుక్కల మీదికి నీళ్లు చిమ్మేది. ఇంట్లో వాళ్లవి కాని బయటి వాళ్లవి చెప్పులు మెట్ల దగ్గరుంటే గోడల మీదికి లాక్కుపోయి పాడు చేసేది. గట్టిగా బెదిరిస్తే మంచాల మీద మల మూత్రాలతో పాడుచేసేది.
అది ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంన్నందున ఎవరు ఏపని చేసినా చూసి దాన్ని అనుకరించేది. ఉదయం మేము పేస్టుతో బ్రష్ చేసుకోవడం చూసి బాత్రూం గోడకు ఉంచిన ప్లాస్టిక్ తొట్టె లోంచి బ్రష్ లు పేస్టు తీసి పళ్లు తోముకుని పాడు చేసేది. టూత్ పేస్టు మూత తీసి నోటితో చప్ఫరించేది. దాని బాధ పడలేక వాటిని ఇంట్లో దాచుకోవల్సి వచ్చేది. బాత్రూంలో స్నానం సబ్బులు బట్టల సబ్బులు బకెట్ నీళ్లలో ముంచి నురగతో ఆడేది. కరోనా సమయం కాబట్టి ఎక్ట్రా మాస్కులు ఉంచుకుని ఉతికి ఎండలో ఆరేస్తే వాటిని విప్పి గోడ మీద కూర్చుని మూతికి చుట్టుకునేది. కిటికీల వద్ద అందుబాటులో ఉంటుందని హేండ్ సానిటైజర్ బాటిల్సు పెడితే మూత తీసి చేతుల్లో పోసుకుని ఒంపేది. పొరపాటున అద్దం దువ్వెన బయట ఉంచితే దాన్ని ఏ గోడ మీదో చెట్టుమీదో ఎక్కి అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటుంది. దొడ్లో అరటిగెల వేసి పళ్లు పండితే ముగ్గిన పళ్లు తినేసేది.
వేసంగి అయినందున మామిడి సపోటా జామ పళ్లు బాగా పండేవి. ఇంట్లో వాళ్ల కన్న ముందే రుచి చూసేది. బాదం చెట్టు చెట్ల కొమ్మలతో ఆడుతూ విరిచి పారేసేది. నిమ్మ, దబ్బ కాయలు పచ్చివే తెంపి పడేసేది. చెట్టు ములం కాడలు కొమ్మలతో విరిచేసేది. లేత కొబ్బరి బోండాలు తీసి నీళ్లు తాగేది.
దానిమ్మకాయలు పెద్దవి కాకుండా తెంపి పడేసేది. గెంతులేస్తు దొడ్లో చెట్ల కొమ్మలు విరిచేసింది. మందార చెట్లు మల్లెతుప్పలు కనకాంబరం మొక్కలు పువ్వులతో విరబూస్తే తెంపి చింపిపోసేది. చామంతి మరువం దవనం గోలేల్లో పెంచుతుంటే వేళ్లతో పీకి పారేసేది. మొక్కలంటే ఎలర్జీ ఆ కోతికి.
కాకులు పిచికలు ఉడతలు చెట్ల మీద గూళ్లు పెట్టుకుంటే పీకి పడేసేది. అందువల్ల కాకులు గోరింకలు అంజిని చూస్తే చాలు అరుపులతో వెంట తరిమేవి. ఒక పిల్లి ఇదివరకు ఇంటికి వచ్చేది. అంజిబాబు వచ్చి నప్పట్నుంచి భయపడి రావడం మానేసింది. అందువల్ల ఎలకల బాధ ఎక్కువైంది.
ఏమీ కాలక్షేపం కాకపోతే గోడకి అందుబాటులో ఉన్న విధ్యుత్ మీటర్ ఆపేసేది. టీ.వీ. ఆగిపోతే కరెంటు స్టాఫ్ రిపైర్ కోసం ట్రాన్ఫారం దగ్గర స్విచ్ ఆపేరనుకునే వారు. ఫోన్ చేసి కనుక్కుంటే అసలు బండారం బయట పడేది. ఇంట్లోనే మైన్ ఆఫ్ చేసి కనబడేది. ఒక్కొక్కసారి బోర్ మోటరు స్విఛ్ ఆనయి కనబడేది. ఇంట్లో వాళ్ల నడిగితే మేము బోర్ మోటర్ వెయ్య లేదనే వారు.
ఒకసారి నేను మంచం మీద పిల్లో కింద నా మొబైల్ ఫోన్ టేబ్ ఉంచితే దాన్ని ఎత్తుకెళ్లి వేప చెట్టెక్కి నల్లటి స్క్రీన్ మీద బొమ్మ చూసుకుంటూ బయటి నుంచి ఫోన్ కాల్ వచ్చి నందున రింగ్ టోన్ కి భయపడి కింద పడేసింది. నేను మొబైల్ ఏమైందని అందర్నీ అడుగుతుంటే అంజిబాబు ఎవ్వారం బయట పడింది. ఇలా దినదిన గండంలా అంజి కోతి చేస్టలతో విసిగిపోయి దాన్ని ఎలా తగిలెయ్యడమా అని ఎన్నో ఆలోచనలు చేసి నప్పటికీ  తెలివిగా ముందే గ్రహించి బయట పడేది. కర్రతో కొట్టడానికి ప్రయత్నిస్తే డాబా మీదో గోడ మీదో లేదు అంటే కొబ్బరిచెట్టు మీదో ఎక్కి కూర్చుని తర్వాత మెల్లగా ఏ పక్క నుంచో వచ్చి ఏదో పాడు పని చేసేది. ఎవరో చెబితే చేపలవల తెప్పించి దానికి తినడానికి కావల్నిన తిండి పెడితే అది తినేసి తెలివిగా బయట పడేది. చెవుల పిల్లుల్ని పట్టే వేటగాళ్లను పిలిచి అంజిని పట్టుకుని తీసుకు పొమ్మని ప్రయత్నిస్తే దానికి ముందే తెలిసి ఊరి రామాలయం శిఖరం మీద తిస్ట వేసింది. హనుమంతుల వారే రాముల వారి గుడి మీదకు వచ్చి నారని నమ్మికతో గ్రామస్తులు అరటిపళ్లు కొబ్బరి చెక్కలు పళ్ళు తినుబండారాలు పెట్టడంతో అక్కడా తింటూ ఒళ్లు పెంచి మా బావమరిది ఆవరణ దొడ్లో విధ్వంశం మానేది కాదు. పెంపుడు కుక్కలు అంజి కోతిని చూస్తే చాలు భయంతో ఇంట్లో దాక్కునేవి.
చివరకు దాని ఆగడాలకు విసిగి ఎలకల మందు పెట్టి పీడ వదిలించుకుందామన్న స్థితికి వచ్చారు. ఆ విషయం తెలిసి ఊళ్లో జనం అలా చెయ్యొద్దని ప్రతిఘటించారు. చేసేది లేక అలాగే రోజులు వెళ్లదీస్తు వచ్చారు. ఏ దేవుడు కరుణించాడో తెలియదు కాని అంజి కోతి వచ్చిన ఆరు నెలల తర్వాత ఒక మధ్యాహ్నం మరో పెద్ద ఎర్ర కోతి దొడ్లో ప్రవేసించింది. ఇప్పటి వరకూ ఉన్న ఈ కోతి తోనే బాధలు పడుతున్నాం మరొకటి వచ్చి పడిందని గాబరా పడ్డారు కుటుంబ సబ్యులు.
ఐతే విచిత్రం జరిగింది. ఈ పెద్ద కోతిని చూసిన అంజికోతి ఊరు వదిలి ఎక్కడికి పోయిందో తెలియదు. తర్వాత దాని జాడలేదు. మేమంతా ఊపిరి పీల్చుకున్నాం కాని ఈ కొత్త కోతితో ఏలాంటి తిప్పలు పడాలో అనుకుంటుండగా దానిలా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా కొద్ది రోజుల తర్వాత అది కూడా ఊరు వదిలి ఎటో పోయింది.
కరోనా మహమ్మారితో మనుషులకే కాదు మూగ జీవాలకు ఆహారం దొరక్క ఊళ్లంట తిరగడం మొదలెట్టాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!