కాంతమ్మా మజాకా

అంశం : హాస్య కథలు

కాంతమ్మా మజాకా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి

             హడావిడి పడిపోతూ చేతిలో గిన్నెతో వస్తున్న పొరుగింటి కాంతమ్మను చూడగానే నా గుండెల్లో తెలీని గుబులు మొదలైంది. మళ్ళీ ఏ కొత్త పెంటకాన్ని అదే అదే వంటకాన్ని మోసుకొస్తోందో అనే భయంతో వళ్ళంతా చెమట పడుతోంది. మరి మొన్న ఎదుర్కొన్న అనుభవం అలాంటిది మరి. అన్నయ్య గారికి ఇష్టం కదా ఒదిన అంటూ వంకాయ కూర తెచ్చింది. రుచిచూసి బాలేకపోతే వొదిలేసే వాళ్ళమేమో. కానీ తిన్నదాకా వొదిలితేనా. పాపం మావారు మొహమాటానికి కూర చాలా బాగుంది చెల్లెమ్మా మీ ఒదిన ఇలా చెయ్యదెందుకో అన్నారంతే పరాచికానికి.ఇంట్లో వున్న కూరంతా తెచ్చి తినిపించి వెళ్ళింది. మూడురోజులు వాంతులు విరోచనాలు. నన్ను అన్న పాపం ఊరికే పోతుందా అనిపించినా ఆయన్ను చూస్తే జాలేసింది. నేను వంకాయ తినకూడదని చెప్పి తప్పించుకున్నా కాబట్టి సరిపోయింది లేకపోతే మాకున్నదసలే ఒకటే బాత్రూం. ఇంకోసారి తెప్పాలచెక్కలని  తెచ్చింది. రాళ్ళకంటే గట్టిగా ఉన్నాయి. మా వారికి అవంటే వున్న ఇష్టం తో ఆత్రంగా తినబోయారు. సారీ తినడానికి ప్రయత్నం చేశారు. కొత్త సినిమా రివ్యూ కోసం ఎదురుచూసే ప్రొడ్యూసర్ లా కాంతమ్మ మా వారి అభిప్రాయం కోసం షరా మాములుగా ఎదురు చూస్తోంది. నమలలేక, మింగలేక ఆయన అవస్థ వర్ణనాతితం. నేనే దొరికిపోతానేంటో ఈ కాంతమ్మకి అనుకుంటూ గొణుక్కుంటున్న ఆయన్ను చూస్తే చెప్పొద్దూ నాకు నవ్వొచ్చింది. అందుకే పక్కింటి వంటల్ని ఓ పొగడకూడదు. సమయం దొరికింది కదా అని మెల్లగా అంటించాను. ఇక ప్రస్తుతనికొస్తే ఏం తీసుకొస్తుందో అని మావారితో అని వెనక్కి తిరిగాను. అప్పటిదాకా అక్కడే వున్న మావారు బయట బైక్ స్టార్ట్ చేస్తూ కనిపించారు. కాంతమ్మ అన్నయ్యగారు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన తరువాత కాల్ చెయ్యమంటూ మెసేజ్ చేశారు. పట్టువదలని కాంతమ్మ ఒదినా అంటూ నా దగ్గరకొచ్చింది. గబ్బట్లు సారీ బొబ్బట్లు పట్టుకుని పశుపాతస్త్రం సంధించిన అర్జునుడిలా నావైపు దూసుకొస్తోంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన నేను ఈ రోజు నేను ఉపవాసం ఒదినా. మీ అన్నయ్య గారు వచ్చిన తరువాత తింటారు అంటూ తప్పించుకున్నా. కాదు కాదు తప్పించుకున్నా అనుకున్నాను. ఉపవాసమా మరి చెప్పవే ఒదినా ఏదైనా అల్పాహారం చేసి తెస్తా వుండు అంటూ నా అనుమతితో సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. ఇంటికి తాళం వేసి మా వారిని వెతుక్కుంటూ నేను బయల్దేరాను.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!