సినిమా పిచ్చి

అంశం : హాస్య కథలు

 సినిమా పిచ్చి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

పేరు: తిరుపతి కృష్ణవేణి

    పొద్దున్నేలేచి,  ఇల్లు, వాకిలి  వూడ్చింది  భాగ్యం. ఇంటి ముందు వున్న వేప చెట్టుకి ఓ  పుల్ల విరుచుకొని పళ్ళు తోముకుంటూ, పెరట్లో వున్నఅదో! పుల్లా! ఇదో! పుల్లా! ఏరుకొచ్చి ముందుగా పొయ్యి అంటు  పెట్టింది. కాసిన్ని టీ,  నీళ్ళు గొంతులో పడితే గానీ, ఏ పని అయినా, ముందుకు   సాగదు!  అనుకుంటూ  కట్టెల  పొయ్యి మీద  టీ,  పెట్టింది  బాగ్యం. ఇంతలో భర్త,  ఏమే! భాగ్యమా!
కాసిన్ని టీ,  నీళ్ళుకొట్టరాదే! నా మొఖానా?    ఇంతకీ ! పెట్టావా? లేదా? అనుకుంటూ!  అలా, పొద్దున్నే రోడ్డు మీద కనపడ్డ  వారితో  మాట్లాడుతూ! పచార్లు చేసి, వచ్చాడు భర్త  భద్రం. ఇదిగో! అయిపోయింది ఇస్తున్నాను !  అంటూ, టీ, తెచ్చి ఇచ్చింది భర్తకి. పొద్దున్నే గొంతులో టీ,నీళ్ళు పడితే  గానీ, చేతకాదాయే! అనుకుంటూ టీ, త్రాగాడు  భద్రం. భద్రం, భాగ్యమ్మలది మధ్యతరగతి కుటుంబం. భాగ్యానికి ఇద్దరూ, మగ పిల్లలే! భాగ్యం అంతగా చదువుకోలేదు, పిల్లలను బాగా చదివించాలి, మంచి ప్రయోజకులను చేయాలన్నదే ఆమె కోరిక.
భద్రం ఊర్లో ఏమైనా చిన్న, చిన్న గొడవలు,   కొట్లాటలు  జరిగి నప్పుడు ఓ పెద్ద మనిషిగా  వ్యవహరించి, ఆ పంచాయతీలను తీరుస్తూ, వాటి ద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకొని ఇల్లు  గడుపుకొస్తూ ఉండేవాడు. ఎంత కష్టమైనా సరే, పిల్లలకూ, భార్యకు ఏ లోటూ, లేకుండా,   చూసుకునేవాడు ఎప్పటికైనా! తానో! పెద్ద రాజకీయ నాయకుడ్ని కావాలని ఆయన కోరికగా ఉండేది. ఇకపొతే! భాగ్యానికి పెద్దగా  ఏ కోరికలూ ఉండేవి కావు. పాత సినిమాలు అన్నా!  పాత పాటలు అన్నా! భాగ్యం చెవి కోసుకుంటుంది.
భద్రం, ఉదయమే టిఫిన్ చేసి బజారుకు వెళతాడు.
కూరగాయలు, సరుకులు  ఇంట్లో ఇచ్చి మరలా ఊర్లోకి వెళతాడు. ఇక ఆయన ఇంటికి ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు. భాగ్యం పిల్లలకు అన్నం బాక్సులు  పెట్టి స్కూల్ కు పంపిస్తుంది.
పిల్లలు తిరిగి సాయంత్రం వస్తారు. అప్పటివరకూ భాగ్యం ఒక్కతే ఒంటరిగా ఇంట్లో ఉండాలిసి వస్తుంది. చాలా బోర్ గా ఉండటం వలన భర్తకు చెప్పి ఒక పోర్టబుల్ టీవీ కొనిపించుకోవాలని ఆలోచన ఉండేది. ఆ రోజుల్లో టీవి లు గ్రామాల్ల్లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు. కలర్ టీవీ లు, కేబుల్ కనెక్షన్స్, డిస్, కనెక్షన్స్ ఉండేవి కావు.
బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీ.వీలు మార్కెట్ లోకి అప్పుడే రావటం మొదలైనవి. గ్రామాల్లో కొందరు తీసుకు రావటం మొదలు పెట్టారు. సిగ్నెల్స్ కొరకు ఇంటి బయట పెద్ద యాంటినా, పెట్టేవారు. అలా చేస్తేనే టీవీలు వచ్చేవి. ఎలాగైతేనేం భర్తను ఒప్పించి ఒక టీవీ కొనిపించింది. టీవీ చూచి భాగ్యం చాలా సంతోష పడింది. బయటకు వెళ్లకుండా ఎంతసేపైనా ఎంచక్కా! సినిమాలు చూడవచ్చు, మంచిమంచి పాటలు వినవచ్చుఅని సంబర పడింది. సినిమా  చూడటం మొదలు పెడితే ఎంత  సేపు   అయినా, ఆమెకు బోరు కొట్టదు. అలాగే చూస్తూ ఉంటుంది.
ఆ సినిమా అయ్యే వరకూ భర్త ఇంటికి రాకపోనా ! పర్వాలేదు అనుకునేది. భాగ్యం కొంత అమాయకంగా ఉండేది. ఎవరైనా బాధ పడితే తట్టుకోలేక పోయేది. సినిమా చూస్తున్నంత  సేపూ, అందులో లీనమై పోయి, వాళ్ళు ఏడిస్తే  తను ఏడుస్తుంది, నవ్వితే  తాను నవ్వుతుంది!    తనకు  నచ్చని  విషయం అయితే అదే పనిగా వాళ్ళని తిడుతూనే వుంటుంది.ప్రక్కవాళ్ళు ఏమనుకుంటారో! అని కూడా చూడదు!ముఖంలో అమె, హావభావాలన్ని మారిపోతాయి.
అప్పుడప్పుడూ  తన పిల్లలే !  ఆట పట్టిస్తూ   ఉండేవారు. అబ్బా! ఏంటమ్మా! మేము సినిమా చూడాలా!  వద్దా! అది సినిమా! అమ్మా! వాళ్ళతో పాటు, నువ్వు ఏడిస్తే ఎలా? అని నవ్వేవారు ఆమేనవ్వి ఊరుకునేది. ఇంట్లో ఏపని చేస్తున్నా, సినిమా మీదనే, ఓకన్నూ, ఓ చెవ్వు , వేసి   వుంచేది. భర్త భోజనానికి వచ్చే సమయానికి హడావిడిగా భోజనం వడ్డించేది. దీని సినిమా పిచ్చి పాడుగాను అని భర్త నవ్వుకొనేవాడు. ఒక రోజు భద్రం ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. ఎండ తీవ్రంగా ఉంది. దూరం నుండి చూస్తే ఇంటిపై భాగంలో ఇద్దరు పిల్లలు ఎక్కి తిరుగుతున్నారు. ఇంటి వెనుక కొందరు ఏదో సర్దుతున్నారు. ఎవరబ్బా అనుకుంటూ ఇంటి ముందువరకు వచ్చాడు.
వరండాపై పిల్లలు ఆడుకుంటున్నారు. అంతా ఏదో రద్దీగా ఉంది. ఏంటి ! ఈ హడావిడి అనుకుంటూ, ఇంట్లోకి అడుగు పెట్టాడు భద్రం. తనను ఎవరూ పట్టించుకోవటం లేదు. పెద్ద సౌండ్ తో సినిమా రసవత్తరంగా సాగుతుంది. బయట పిల్లలు పట్టుకున్న చిన్న చిన్న గిన్నెల్లో అన్నం కనపడుతూంది. వరండాలో పరుగులు పెడుతూ అన్నంమెతుకులు జల్లుతున్నారు. ఆరుబయట  అంతా చెప్పులతో నిండిపోయింది. ఇంట్లో అన్ని ఫ్యాన్స్ తిరుగుతున్నాయి. ఎవరో పిల్లలు మంచినీరు అందరికి ఇస్తున్నారు. అంతా సినిమా ధ్యాసలో ఉన్నారు. కొందరు నిట్టూర్పులు విడుస్తున్నారు. అయ్యో! అని కొందరు బాధపడుతున్నారు. అందరికంటే ముందువరసలో కూర్చున్న భాగ్యం కన్నీరు, మున్నీరు అవుతూంది. కళ్ళు, ముక్కు తుడుచుకుంటూంది. చాలా విచారకరమైన సన్నివేశంలో సినిమా నడుస్తుంది. బయటఉన్న పిల్లలు, గాలికి సిగ్నల్ పోకుండా యాంటినా  రాడ్ ను గట్టిగా పట్టుకుని ఉన్నారు. సినిమా చివరి దశలో ఉన్నట్టుండి. తనను భాగ్యం కూడ పట్టించుకోవటం లేదు. భాగ్యం ఏడ్పును చూసి అంత ఆకలిలోనూ నవ్వు ఆపుకోలేక పోయాడు భద్రం.! ఎంత అమాయకురాలివి భాగ్యం ! అని మనసులోనే అనుకున్నాడు.! .నేరుగా వంట గదిలోకి వెళ్ళి భాగ్యం అని గట్టిగా పిలిచాడు.
భాగ్యం ఉలిక్కిపడి భర్త వచ్చినట్లు ఉందని లోపలకుపరుగు పరుగున వెళ్ళింది.
అయ్యో! ఎంతసేపు అయిందండి! భోజనానికి చాలా లేట్ అయింది, అని గబగబా భోజనం వడ్డించింది.
చివరలో పెరుగుకు కాస్త అన్నం వెయ్యి, అన్నాడు భద్రం. అయ్యో! అన్నం లేదండి. అంది, కాంతమ్మ పిన్నికి షుగర్ కదండీ, అందుకే అని నసుగుతూ!
వాళ్ల మనుమరాళ్లకు, ఆకలిగా ఉందంటే కాస్త పెట్టానండి. మీకు సరిపోలేదనుకుంటా! అని బాధ పడసాగింది.ఓహో ! ఈ సౌకర్యాలు కూడ ఉన్నాయన్నమాట మన మినీ ధియేటర్లో, భద్రం నవ్వుతూ, పర్వాలేదులే! పిల్లలకే కదా పెట్టావు, అని
చేయి కడుక్కొని లేచాడు. ఇంతలో సినిమా అయిపోయింది. అందరూ నెమ్మదిగా బయటకు వెళ్తున్నారు. నా చెప్పులు ఎవరో వేసుకెళ్తున్నారని కొందరు, నా చెప్పులు మారాయి అని మరికొందరు, పెద్దగా అరుచుకుంటున్నారు. భాగ్యం వారికి చెప్పులు వెతికిచ్చే పనిలోపడిపోయింది. కొంత సేపటికి ఇల్లు నిశ్శబ్దంగా మారింది.భర్త భద్రం నవ్వుతూ, ఏంటి భాగ్యం ఇల్లును,  సినిమా హాల్ గా మార్చావు? నీకు చాలా సందడిగా ఉన్నట్లుంది.
ఇంటినిండా ఈ జనం ఏంటి? ఈ  ఏర్పాట్లు ఏమిటీ? అని నవ్వుతూ అన్నాడు. అందరూ వస్తూంటే వద్దనలేక పోయానండి. సినిమా ధ్యాసలో పడి మీరు వచ్చినట్లుకూడ గుర్తించలేక పోయాను.
క్షమించండి అన్నది. భార్య సినిమా పిచ్చిని ఆసరా చేసుకొని అందరూ ఇలా వాడుకుంటున్నారని గ్రహించిన భద్రం, కొద్దిరోజుల్లోనే ఏదో రిపేరు పేరుతో నెమ్మదిగా టీ.వి ని షాప్ కు తీసుకు వెళ్ళాడు. రెండు రోజుల తర్వాత భాగ్యం అడిగింది.”టీ.వి ని ఎప్పుడు తెస్తారండీ” అని, పెద్ద టీవీ ఆర్డర్ చేసాను. త్వరలోవస్తుందని, భాగ్యం కు నచ్చచెప్పాడు భర్త.
అవునాండి? అంది భాగ్యం, ఆశ్చర్యంగా ఆరోజు నుండి భాగ్యం టీవీ గురించి ఎదురు చూస్తూనే ఉంది.

***

You May Also Like

One thought on “ సినిమా పిచ్చి

  1. అనుకోకుండా ఈరోజుఈ బ్లాగు లో మీ కధ సినిమా పిచ్చి కథ చూసాను చదివాను. అమాయక మైన బార్య టివి పిచ్చి గురించి స్వచ్ఛ మైన వారి జీవన విధానం గురించి బాగా రాసారు కధలో అభినందనలు మేడం మరిన్ని కధలు మీరు రాయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!