అర్థ శతాబ్దపు జీవితం

అర్థ శతాబ్దపు జీవితం

బాధ్యతలు తీరుతున్నాయని..
బరువు అవుతావేమోనని…
ఒకింత భరోసాగా.. ఒకింత భయంతో
బ్రతికే రోజులవి

ఒంటరి అవుతామా లేక..
ఓ జంట తోడు ఉంటామా అని..
ఒకింత బాధతో.. ఒకింత భరోసా ఇస్తూ
జీవించే కాలమది

ముందు ఉన్నది మరణమా.. లేక
మార్పు వచ్చే మంచిరోజులా అని..
ఒకింత విచక్షణతో.. ఒకింత వివేకంతో
అడుగు ముందుకు వేసే రోజులవి

ఆరోగ్యం.. ఆహారం మధ్య
ఒకింత జాగ్రత్తగా.. ఒకింత ఆరాటంగా
ఆశ నిరాశలతో ఆలోచించే కాలమది

అనుభవాలకు.. ఆచరణకు మధ్య
ఒకింత నేర్చుకుంటూ.. ఒకింత నేర్పుతూ
కొత్త.. పాత తరాల వారధిగా నిలిచే రోజులవి

రుచులకు.. అభిరుచులకు మధ్య
ఒకింత సర్దుకుపోతూ…ఒకింత సాధిస్తూ
కోరికల లెక్కలు చూసే రోజులవి

కోత్తొక వింత… పాతొక రోతల మధ్య..
ఒకింత నలుగుతూ… ఒకింత నవ్వుతూ
కాటేసే కాలానికి ఎదురీదే కాలమది

ముడుతలకు.. మమతలకు
తప్పక తలవంచే.. తరమది
అర్థ శతాబ్దపు.. జీవితమది.

                                                  రచన:: బుజ్జమ్మ

You May Also Like

One thought on “అర్థ శతాబ్దపు జీవితం

  1. చాలా బాగుంది బుజ్జమ్మ👌👌👏🏻👏🏻👏🏻🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!