అత్తా…అమ్మ లాంటిదే

అత్తా…అమ్మ లాంటిదే

రచన: రమాదేవి బాల బోయిన

“శారదా! శారదా! ఉన్నావా” అంటూ హడావుడిగా ఇంట్లోకి వచ్చింది పక్కింటి కార్తీక

“ఇంట్లోనే ఉన్నా కార్తీకా! ఏంటి ఈ హడావుడి” అంది శారద.

“ఏం లేదు శారదా! మా అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది” సంబరంగా గుసగుసలాడుతూ అంది కార్తీక.

“అయ్యో!ఎంత పని జరిగింది కార్తీకా! వెంటనే వెతికించు నువ్వు.. పెద్దావిడ ఎక్కడికి వెళ్లారో ఏమిటో” అంది శారద కంగారుగా.

“అబ్బా! నువ్వు ఉండు శారదా!.. పెళ్ళైననాటి నుంచి ఈ వెధవ సంత కి చేయలేక చస్తున్నా. ఇప్పటికి పీడా విరగడయింది” సంతోషంగా అంది
అది కూడా గుసగుసగానే ఎవరూ వినకూడదనీ.

“అయ్యో!కార్తీకా! అలా అనకూడదు. ఏదో పెద్దవాళ్ళు మన మంచికే చెప్తారు. ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోవాలే తప్ప, ఇలా మనిషి దూరం అవ్వాలని కోరుకో కూడదు” అంది శారద నచ్చజెప్పే ధోరణిలో.

“నువ్వు కూడా అత్తతో బాధలు పడుతూనే ఉన్నావ్. మీ అత్తయ్యనీ నాలాగే వదిలించుకో…నాలాగా సంతోషంగా ఉండొచ్చు అని మొదటగా ఈ శుభవార్త నీకే చెప్తామని వస్తే నాకే నీతులు చెప్తున్నావు..నీ మూర్ఖత్వాన్ని మార్చలేం” అంటూవిసవిసా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కార్తీక.

‘అయ్యో! నేనిప్పుడు ఏమన్నానని’ అనుకుంటూ బుగ్గలు నొక్కుకుంది శారద.

వంట పని పూర్తయింది. మల్లోసారి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి సోఫాలో టీవీ చూస్తూ కూర్చుని ఆలోచనలో పడింది శారద.

*. *. *. *

“శారదా వంటయిందా?”
“శారద బాక్స్ ఎక్కడ పెట్టావు?”
“శారద షూ పాలిష్ చేయలేదేంటీ?”
“అమ్మ నాకీ టిఫిన్ వద్దు వేరే చేసి పెట్టు…”
“టైం..అవుతోందంటే వినిపించుకోవా?”
“అమ్మ నాకు జడలు వెయ్…”
“అమ్మ నా పెన్సిల్ దొరకడం లేదు…”

హడావిడి,అరుపులూ,ఆరోపణలూ,అలుగుళ్ళూ,సణుగుళ్ళూ,పరుగులూ
“హుష్ “శారదకి ఒక్కసారిగా షోషవచ్చినట్టు అయిపోయింది.

అత్తయ్య ఉన్నన్ని రోజులు తెలియలేదు తనకి. చాలా పనులలో చేదోడువాదోడుగా ఉంటూ, పెద్దదిక్కుగా ఇంట్లో అందరినీ కనిపెట్టి ఉండే అత్తయ్య దూరమైపోయింది.
పెద్దవాళ్లు ఇంట్లో ఉంటే ప్రశాంతత ఉండదనుకున్న తనకసలు ప్రశాంతతే లేకుండా పోయింది. తన నిర్లక్ష్యం వల్లే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.
దుఖం ముంచుకు వచ్చేసింది శారదకు…ఆ కార్తీక మాటలు విని తన కొట్టుకు చేటు తెచ్చుకుంది.

కన్నీళ్లతో మసకబారిన కళ్ళకి…
“అదేంటి అత్తయ్య కనిపిస్తున్నారు… అదేంటీ చెప్పులు వేసుకుంటున్నారు.
అలా బయటకు వెళ్లిపోతున్నారు… అత్తయ్యా! అత్తయ్యా! ఆగండత్తయ్యా! నన్ను క్షమించండి అత్తయ్యా”
కన్నీళ్ళతో ప్రాధేయ పడుతోంది శారద.

“ఓయ్ శారదా!ఏంటది, ఎందుకలా అరుస్తున్నావ్?”భర్త భుజం పట్టుకు కుదిపేసిన కుదుపులకు ఈ లోకం లోకి వచ్చింది శారద.

చుట్టూ చూసింది. తన చుట్టు పిల్లలు, అత్తయ్య, శ్రీవారు నవ్వుతూ కనిపిస్తున్నారు.

“ఏంటోయ్! పగటి కలలు కంటున్నావా?” చిలిపిగా అడిగారు శ్రీవారు.

“అమ్మో! ఇది కలా? ఎంత భయపడిపోయానో”

“కానీ ఇందాకా ఎవరో, నా కళ్ళముందు మసకమసకగా… పెద్దావిడ ఎవరో కనిపించారు” అంది.

“ఓ అదా, కార్తీక వాళ్ళ అత్తయ్య. చెప్పా పెట్టకుండా మన ఇంటికి వచ్చేసింది. అత్తాకోడళ్ళను పిలిచి అన్నీ సర్ది చెప్పి,అత్తా..అమ్మ లాంటిదే..మా శారద నన్ను అమ్మలాగే చూసుకుంటుందని చెప్పాము. కార్తీక తప్పు తెలుసుకుని క్షమించమని అడిగాకే పంపించాము” అంది అత్తయ్య కోడలితో సంతోషంగా.

“అత్తయ్యా!నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకండి” అంటూ అత్తను ప్రేమగా చుట్టేసుకుంటూ…

కానీ అంతలోనే సందేహంగా అడిగింది శారద.
“ఔనూ! అత్తయ్యా! కార్తీక వాళ్ళ అత్తయ్య మీ దగ్గరకు ఎందుకు వచ్చిందీ”

అత్తయ్యా నవ్వుతూ….”ఓ అదా!హహహ…తను నా చిన్ననాటి స్నేహితురాలు కదా! అందుకు” అంది.

నివ్వెరపోయింది శారద.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!