బదిలీ

బదిలీ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : ఆకుమళ్ల కృష్ణదాస్

అమాయకమైన నా హృదయంలో
ఆనందంగా ఆడుకొని
అణువంతైనా చెప్పకుండా ఎక్కడికెళ్ళాయో బండెడు బంధాలు!
పాలిచ్చిన గుండెల్లో పోటుగా ఉందని
ఎక్కడికో వెళ్ళింది అమ్మ
బహుశా నాన్న దగ్గరికేమో
ఆయన వెళ్లి చాన్నాళ్ళైంది మరి
మా మనవడి పుస్తకం చూడగానే
మా టీచరే గుర్తొచ్చింది!
సరిగా చదవకుంటే చెవులను
ఎంతబాగా సానబెట్టిందో!
అక్కున జేర్చుకున్న మా పెద్దక్క
ఎన్నిసార్లు ముస్తాబు చేసిందో!
జనం మెచ్చే జానపద రాకుమారుడిలా!
వేలుపట్టి ఎన్ని సార్లు లాక్కెళ్లాడో మా చిన్నన్న
నే బడికి పోనని మారాం చేస్తే!
ముక్కు పచ్చలారని వేళ నుండే
ముద్దు ముద్దు మాటలతో
నేతిబువ్వ తినిపిస్తూ నీతి కథలు చెప్పిన
మా నానమ్మ నన్ను ముద్దుల్తో ముంచిన
నా కథానాయిక!
బాల్యం నుండి ఆడుతూ పాడుతూ చదువుతూ తిరిగిన నా మిత్ర పారిజాతాలు కొందరు
ఈమధ్య కనిపించడం మానేశారు!
బహుశా జీవన బదిలీ జరిగిందో.
మజిలీ మారిందో!
అలసి సొలసిన నా అర్ధాంగి కూడా అదృశ్యమైంది
సురుల సేవకు విరులల్లటానికేమో
నాకైతే తెలియదు!
ఇలా నా అనుకున్న బంధాలన్నీ
గుండె గుప్పిట్లోంచి జారి పడిపోతే
కన్నీటితో కడిగి చూద్దామని బయలు దేరా
వారి మమతల రూపాలు కనిపిస్తాయని!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!