నీ స్నేహాం (సంక్రాంతి కథల పోటీ)

నీ స్నేహాం
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన: అలేఖ్య రవి కాంతి

“ప్రయాణికులకు విజ్ఞప్తి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరు విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ఒకటవ నెంబర్ ప్లాట్ ఫారం మీదకు వస్తుంది” అనే అనౌన్స్మెంట్ వినిపించేసరికి గతకాలపు జ్ణాపకాల కన్నీటి సుడులను తుడుచుకుంటు తిరిగి ఈ లోకంలోకి వచ్చి నెమ్మదిగా రైలు వైపుగా నడుస్తుంది శివలీల.

హ.. హ.. హ… ఇదిగో చూడరా కొజ్జా వచ్చింది…! దీని మొఖం చూస్తేనే దరిద్రం అంటు కళ్ళు మూసుకుంటున్నారు అక్కడి జనం. ఇంకొందరు తన రాకని గమనించి ఎక్కడ తమని డబ్బులు అడుగుతుందో అని వేరే దిక్కుగా పరుగెడుతున్నారు.

వీరందరి చీత్కారపు మాటలు,చూపులతో తన మనసంతా కకలావికలమైంది.
మానవత్వం లేని మనుషులు అంటు…, నెమ్మదిగా రైలు ఎక్కి తన సీటులో కూర్చుంది. తోటి ప్రయాణికులు తన పక్కన కూర్చోడానికి ఇష్టపడట్లేదు.ఆఖరికి టీ, తినుబండారాలు అమ్మే కార్మికులు కూడా తనని చూసి ఆ బోగిలోకి రావడం లేదు.

అసలు నేనేం పాపం చేసాను.. ?అందరిలాగే నేను ఓ మనిషినేగా.హిజ్రాగా మారడం నా తప్పా? అందరికి తమ జీవితం స్వేచ్ఛగా బతికే హక్కుంటుంది. నా బతుకు ఏదో నేను గౌరవంగా బతుకుదామనుకుంటే కాకుల్లాంటి ఈ జనాల సూటిపోటి మాటలు విని కొత్త జీవితం మొదలెడదామన్న ఆశ ఆదిలోనే అణిగిపోయింది అంటు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది.

అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న హరి….
“ఏవండి, లోకులు కాకులు, పక్కపక్కనే అన్నాచెల్లెలు నడుచుకుంటు వెళ్తున్నా సరే తప్పుడు కూతలు కూస్తారు.అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం.ఇలాంటి వారి ప్రవర్తన గురించి బాధపడడం సుద్దదండగ” అన్నాడు తన అలసిన మనసుకు ఊరటగా…

మీ మాటలు విన్నాక నాకు కాస్త ధైర్యం వచ్చిందండి అంటు కన్నీటిని పైట కొంగుతో తుడుచుకుంది..

మీకు అభ్యంతరం లేదంటే మీ గురించి తెలుసుకోవలనుకుంటున్నాను అన్నాడు హరి…

శివలీల తన కన్నీటిని తుడుచుకుంటూ నా అసలు పేరు రవి. మాది విశాఖపట్నం. అమ్మానాన్నలిద్దరు ఉద్యోగస్తులు.ఇద్దరు అక్కల తర్వాత నేను.నాకు పదిహేను సంవత్సరాల అప్పుడు తెలియకుండానే నాలో ఆడవారిలా తయారవ్వాలనే కోరికలు మొదలయ్యాయి. అలాగే తయారయ్యేవాడిని. ఇంట్లో వాళ్ళు డాక్టర్ ని సంప్రదించి నాలోని ఆడతనపు లక్షణాలు జన్మలో మారవని అర్థం చేసుకుని ఈ సమాజానికి భయపడి నన్ను ఓ అనాథాశ్రమంలో చేర్పించి నెలకింత డబ్బులు పంపేవారు.అప్పుడప్పుడు చూడ్డానికి వచ్చేవారు కొద్ది కాలానికి నేనొక్కడిని ఉన్నాననే విషయమే మరిచిపోయారు.ఆ తర్వాత ఏదోలా ఆశ్రమం నుంచి భయటపడి ఒక హిజ్రాని కలిసి ఇలా మారాను. నా పేరును శివలీలగా మార్చుకున్నాను. నిజాయితీగా, కష్టపడి పనిచేసి బతుకుదాం అనుకుంటే ప్రతి చోట చీత్కారాలే. అందరూ మమ్మల్ని అంటరాని వారిలా చూస్తూ పని ఇవ్వకుంటే ఇంక మేమేం చేస్తాం చివరికి చప్పట్లు కొడుతూ బతుకును వెళ్ళదీయడం తప్ప. నాలాంటి వారు హైదరాబాదులో చాలా మంది ఉన్నారని తెలిసింది. అక్కడికి వెళ్లి వాళ్ళని కలిసి బతకడానికి ఏదైనా మార్గాన్ని చూపించమంటా అంది బాధగా.

శివలీల గారు అందరిలా నేను అయ్యో… పాపం అనను. ఎందుకంటే నేను కూడా జీవితంలో చాలా ఒడిదుడుకులును ఎదురుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు మీరు రండి. నేను ఒక వాలెంటీర్ను. మీరు నాతో కలిసి పనిచేస్తూ నా ఇంట్లోనే ఉండండి.
నా విషయానికి వస్తే నేను ఒక అనాథని. ఎవరికి పుట్టానో తెలియదు. ముప్పైఏళ్ల క్రితం ఓ మనసున్న అమ్మ నన్ను చెత్తకుండి దగ్గర చూసి చెలించిపోయి చేరదీసి పెద్దవాడ్ని చేసి చదివించింది.ఆమె పేరు మణియమ్మ. తను కూడా హిజ్రా.తనలాంటి వారి గుర్తింపు కోసం తుది శ్వాస విడిచే వరకు చాలా కృషి చేసి కన్నుమూసింది. అమ్మ వల్లే ఈ రోజు నేను మంచి స్థాయిలో ఉన్నాను. మీకు సహాయం చేస్తే అమ్మ రుణం తీర్చుకునట్టే కొంత అన్నాడు.

చాలా సంతోషమండి. మానవత్వం ఇంకా బతికే ఉందని మిమ్మల్ని కలిసాకే అర్థమయ్యిందండి. మీతో సంతోషంగా వస్తాను.తప్పకుండా నా వంతు సహాయ సహకారాలను మీకు అందిస్తాను అని హరితో పాటే బయలుదేరింది శివలీల.

కొద్ది రోజుల్లోనే ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు. వారిద్దరు కలిసి ఓ ఎన్. జి. ఓ స్థాపించి పేదవారికి సహాయం చేసేవారు.అసహాయక హిజ్రాలను కలిసి స్వయం ఉపాధిని కల్పించారు. మణియమ్మ అడుగుజాడల్లో నడుస్తూ హిజ్రాల గుర్తింపు కొరకు పోరాడుతున్నారు హరి, శివలీల..

కాలం ఓకేలా ఉండదుగా. దురదృష్టవశాత్తు హరి రెండు కిడ్నీలు పాడైనాయి. కిడ్నీ మార్పిడికి సరిపోయే డోనార్ దొరికితేనే హరి ప్రాణాలు కాపాడగలం అని చెప్పారు డాక్టర్లు . ఎంత వెతికినా దాత దొరకలేదు. అనుకోకుండా ఒకరోజు హాస్పిటల్ వారు ఫోన్ చేసి ఒకరు తన కిడ్నీని స్వచ్ఛందగా ఇచ్చేందుకు ముందుకొచ్చారని కానీ తన వివరాలు గోప్యంగా ఉంచాలని దాత కోరారని చెప్పడంతో హరి చాలా సంతోషపడి ఆ మనసున్న దాతకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

మరుసటి వారంలో హరికి ఆపరేషన్ జరగడం త్వరలోనే కోలుకోవడం జరిగింది.తన ప్రాణదాత గురించి వివరాలు ఎంత ప్రయత్నించిన దొరకలేదని తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని హరి శివలీలతో చెప్పి తన గురించి వివరాలు తెలియరానందుకు బాధపడ్డాడు.

సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ ప్రాణ దాతను కలుస్తావు హరి. ఎక్కువగా తన గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అంటు ఓదారుస్తూ “నీ రుణం నేను ఎన్ని జన్మలెత్తిన తీర్చుకోలేనిది నేస్తం”. నా ఒక కిడ్నీ నీలాంటి మంచి వ్యక్తి ప్రాణాలను కాపాడిందంటే ఎంతటి అద్రుష్టం నాది. నీ స్నేహం అమూల్యమైనది నేస్తం అని మనసులో అనుకుంటు ఆత్మీయంగా హరిని ఓదార్చింది శివలీల.

“స్వచ్చమైన మనసుకు స్వచ్చమైన స్నేహపు చిరుకానుక దొరకడం అమూల్యం”…

సమాప్తం

You May Also Like

4 thoughts on “నీ స్నేహాం (సంక్రాంతి కథల పోటీ)

  1. Chala baga rasaru alekya garu… Nen mi anni postlu chadhuvthanu… Chala ante chala nachuthay… I hope this new year u write even more interesting stuffs. Adv happy new year.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!