అసలైన సంక్రాంతి.. (సంక్రాంతి కథల పోటీ)

అసలైన సంక్రాంతి..
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన : ఎస్.ఎల్. రాజేష్

“పండక్కి అమ్మాయిని తీసుకురా అల్లుడూ” అని మామ గారు చేసిన కాల్ కి అలాగే తప్పకుండా వస్తామని హామీ ఇచ్చాడు అభిలాష్. పుట్టి పెరిగింది పూర్తి పట్నం వాతావరణం లోనే. అయితే అనుకోకుండా ఓ పల్లెటూరి అమ్మాయి రవళి ని పెళ్ళి చేసుకున్నాడు. అతడు ఓ సాఫ్టు వేర్ ఇంజనీర్ గా నెలకు అక్షరాల లక్షన్నర సంపాదిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రభాకర్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్నాడు. తల్లి స్త్రీ జనొద్దరణ పేరుతో అలా టైంపాస్ చేస్తుంది. మూడు అపార్ట్మెంట్లు , ఓ ఇరవై ఎకరాల పొలం ఉంది. ఐనా వాళ్లకు సరిపోవు. కరోనా రాక ముందు రవళిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరి వాతారణం నచ్చలేదు అభినయ్ కి. కానీ అమ్మాయి రవళి చక్కని తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో అందంగా కనిపించింది. కానీ అక్కడి వాతావరణం అతనికి ఎంతో ఇబ్బంది అనిపించింది. అయినా అంతే పెళ్లికి ఒప్పుకోవడం, తాంబూలాలు మార్చుకోవడం కూడా అయిపోయాయి. ఇక పెళ్లి ముహూర్తం పెట్టే వేళకి కరోనా మహమ్మారి కళ్లెం వేసింది. లాక్ డౌన్ తో పోస్ట్ పోన్ అయింది.
ఇక సంవత్సరం దాటాక ఓ ముహూర్తము చూసి ఇద్దరికీ బంధం వేశారు. రవళి పదవ తరగతి చదువుకున్నా చాలా తెలివైనది. అత్తా మామలు లతో ఎంతో గౌరవంగా మసలుకునేది. అభిలాష్ కి ఆమె సహనం,ఓర్పు చూసి ఆశ్చర్యం వేసేది. పెళ్లయి రెండు నెలలు అయ్యాయి.
పండక్కి ఊరు వెళ్ళడానికి ఐదు రోజులు సెలవు పెట్టాడు. ఆ రోజు రానే వచ్చింది. ఇద్దరు పెద్ద వాళ్ళకి చెప్పి బయలుదేరారు.
ట్రైన్ ఎక్కాక భార్యామణి తో కొన్ని హెచ్చరికలు చేశాడు. అక్కడికి వెళ్ళాక నన్నో వింత పశువు ను చూసినట్లు చూడొద్దని. అందరూ మీద పడినట్లు వెటకారంగా మాట్లాడొద్దు అని చెప్పాడు. రవళి ఏం మాట్లాడలేదు. జర్నీ అంతా ఇలా ఉండొద్దు. అలా ఉండొద్దు అనడంతోనే సరిపోయింది.

…….

తెల్లారింది. స్టేషన్ వచ్చింది. బయటకు వచ్చేసరికి మామ గారు , బావ మరిది కారు దగ్గర నుండి వీళ్ల దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు.. “ప్రయాణం బాగా జరిగిందా అల్లుడూ” అడిగాడు మామ పరంధామయ్య.
” హా. బాగానే జరిగింది అండి ” ముక్తసరిగా చెప్పాడు. వాళ్ళమ్మ ముందే చెప్పింది “మనం మెత్తగా ఉంటే మొట్టుతారు జాగర్త” అని.
స్టేషన్ నుండి ఓ ఇరవై కిలో మీటర్లు ఉంటుంది ఊరు.. కొంత దూరం వెళ్ళాక అభిలాష్ కి ఏదో అనుమానం వచ్చింది.
“మావయ్య గారు మనం ఎటు వెళ్తున్నాం” అడిగాడు.”మన ఇంటికి బాబూ..” అదేంటి. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు ఈ దారి అంతా పచ్చని పొలాలు, చెట్లతో ఉండేది కదా,” అడిగాడు. “అవును బాబు పట్నం విషం ఇక్కడ కూడా పాకింది. పచ్చని పొలాలను అమ్మి అపార్ట్ మెంట్లు కట్టేస్తున్నారు.మొన్నటి వరకు రొయ్యల చెరువులు అని సగం భూమిని విష తుల్యం చేశారు.ఇప్పుడు మిగిలిన కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తున్నారు.” అన్నాడు బాధగా. అభిలాష్ మనసు చివుక్కుమంది.
ఇంటికి చేరుకున్నారు. అత్త గారు సుభద్రమ్మ తలుపు చాటున నిలబడి “అమ్మ గారు, నాన్న గారు బాగున్నారా బాబూ” అడిగింది. ” హా. బాగున్నారు అండి” సమాధానమిస్తూ భార్య వంక చూస్తూ “మీ అమ్మ గారు బయటకు రారా “అని అడిగాడు భార్యని.
మా పల్లెటూళ్ళో అల్లుళ్ల కు ఎంతో గౌరవం ఇస్తారు. అందుకే ఎదురుగా నిల బడి మాట్లాడరు” అంది.ఆశ్చర్యపోయాడు అభిలాష్. రోజల్లా నైటీలు వేసుకుని తిరిగే తల్లి, తమ కాలనీ లోని ఆంటీలు గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు.
ఫ్రెష్ అయి కూర్చున్నాక అరగంట కు ఓ సారి అత్త గారు ఏదో ఒక పిండి వంట కూతురు చేతికిచ్చి అల్లుడిని తినమనడం. నా వల్ల కాదని చేతులు ఎత్తేశాడు. కొత్త అల్లుడు వచ్చాడు అని తెలియగానే ఊరంతా కదిలి వచ్చారు. బంగారం లాంటి అబ్బాయి దొరికాడు మా రవళికి. మా దిష్టే తగిలేట్టు ఉంది. అంటూ మురిసిపోయారు. అతనికి ఇదంతా చిరాగ్గా ఉంది. అది గమనించిన రవళి లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకోండి అంది. హమ్మయ్యా అనుకుంటూ లోపలికి జారుకున్నాడు.
తెల్లారితే భోగి. బావ మరిది కిషోర్ దుంగలు, కర్రలు, ఇంట్లో పాడైపోయిన చెక్క వస్తువులు గుట్టగా వేసున్నాడు. ఎందుకివన్నీ అని అడిగాడు భార్యని. “సంవత్సరమంతా ఇంట్లో వృధాగా ఉన్న వాటిని కాల్చివెస్తే పురుగు పుట్రా రాకుండా ఉంటాయి .ఇల్లు శుభ్రం అవుతుంది.” అంది. “ఓహో..మరి ఆ డర్టీ పిడకల్ని ఎందుకు దాంట్లో వేస్తున్నారు. రవళి చిన్నగా నవ్వి ” అవి ఆవు పిడకలు. వాటిని కాల్చితే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ చలి కాలం లో చలి కాగడమే కాకుండా, కావాల్సినంత ఆక్సిజన్ కూడా లభిస్తుంది.”. ” మేడమ్ గారికి చాలా విషయాలు తెలిసే..” అన్నాడు వెటకారంగా. రవళి అమ్మ పిలవడంతో అక్కడ నుండి వెళ్లి పోయింది. హరి లో రంగ హరి అంటూ హరిదాసు కీర్తనలు, ముత్యాల ముగ్గులు చుట్టూ తిరుగుతూ గొబ్బిళ్లో గొబ్బిల్లూ అంటూ ముచ్చట గొలిపే పడతులు అంతా కొత్తగా సంతోషంగా ఉంది అభినాష్ కి.
మర్నాడు ఉదయాన్నే పిల్లాపెద్దలు అందరూ కలసి భోగి మంట దగ్గర చేరి భోగి దండలు వేసి చుట్టూ పాటలు తిరుగుతూ సందడి చేశారు. రవళి చిన్నాన్న గారి మనవరాలి తల పై భోగి పళ్ళు వేశారు..”ఇది కూడా పండుగ లో భాగమేనా” మళ్లీ అడిగాడు. “అవును. ఈ శీతాకాలంలో ఊపిరి తిత్తులలో కఫం చేరుకుంటుంది. రాగి పళ్ళు తింటే ఆ కఫం పోయి ఆరోగ్యంగా ఉంటారు.” ” ఏంటి.. ఇంత సైన్స్ ఉందా ఇందులో ” ఆశ్చర్యం గా నోరెళ్ళబెట్టాడు. ” మీకో నిజం చెప్పనా! అసలు పండుగ అంటేనే సైన్స్ అండి. తెల్లవారుఝామున లేచి ఇంటి ముందు వేసే రంగవల్లికలో ఎంతో అర్థం ఉంది. పొలం పండించిన రైతు పుడమి తల్లికి, తనకు అండగా నిలిచిన పశువులకు కృతజ్ఞత తెలుపుకుకుంటాడు. ధాన్య లక్ష్మి నీ పూజించి మన అందరి కోసం ప్రార్థిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూడు రోజులు అందరి సంతోషాల వెలుగులు.”
ఎప్పుడు పిజ్జా, బర్గర్లు వంటి చెత్త అంతా తిని రోగాలని కొని తెచ్చుకుంటున్నారు నాలాంటి సిటీ జనం.
అత్తయ్య గారు పెట్టిన సున్నుండలు, జంతికలు, అరిసెలు ఒక్కొక్కటి రుచి చూస్తూ మైమరచిపోయాడు.
“బావగారు కోడి పందేలు చూద్దాం రండి”. అని బావమరిది పిలవడంతో ఈ లోకం లోకి వచ్చాడు. “కోడి పందాలా.. అంటే..”అడిగాడు. బావ బావమరిది నవ్వుతూ చెప్తా పదండీ. అంటూ ముందుకు నడిచాడు. “సంక్రాంతి పండగకి కోడి పందేలు ప్రత్యేకం బావ గారు. ఒక్కో కోడికి వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి తిండి పెడతారు. రెండు కోళ్లు కొట్లాడి ఒకటి ఓడిపోతే దాన్ని వండుకు తినేస్తారు. కోట్ల రూపాయల పందాలు జరుగుతాయి. మీ సిటీ వాళ్లు కూడా దీని కోసం పని గట్టుకు వస్తారు.” చెప్పుకుంటూ పోతున్నాడు. అభిలాష్ తాను చిన్నప్పటి నుండీ ఏం కోల్పోయానా అని ఆలోచిస్తున్నాడు. అంతలో తన జేబులో నుండి ఫోన్ రింగ్ వినబడింది. అమ్మ ..లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. “ఏరా.ఆ పల్లెటూరి వాళ్లతో కలసి పోయావా. నీ పెళ్లికి వెండి చెంబు, వెండి కంచం ఇస్తామన్నారు. నీ పెళ్లాన్ని అడిగి తీసుకోమని చెప్పు.. అలాగే పండగకి బంగారం చైన్ అడుగు. ఇదిగో మీ నాన్న మాట్లాడతారు. అని ఆయనకి ఇచ్చేసింది. “ఒరే పెళ్లికి మీ మాంగారు 5ఎకరాలు పొలం ఇస్తామని ఇప్పటి వరకు రిజిష్టర్ చేయించలేదు. అసలే రోడ్డు పక్కదేమో. అపార్ట్మెంట్లు వేస్తే బోల్డు డబ్బులు వస్తాయి.మర్చిపోకు”. అభిలాష్ మనసు కకావికలం అయింది. అక్కడి మనుషులకు, ఇక్కడి మనసులకు ఎంత తేడా.? . తరతరాల తిన్నా తరగని ఆస్తులు ఉన్నా ఇంకా ఏదో కావాలన్న కాంక్ష.
పందాలు చూసి ఇంటికి వచ్చిన అల్లుడికి షడ్రుచుల భోజనం వడ్డించారు. ఇంకాస్త వేసుకోమని ప్రేమగా అడుగుతున్నారు. రవళి భర్త మొహంలో ఏదో తేడా కని పెట్టింది.
భోజనాలు అయ్యాక మామ గారు “అల్లుడూ అలా పొలం వరకూ వెళ్ళి వద్దాం పద.” అంటూ తీసుకెళ్ళాడు. పట్నవాసనలు పల్లెలకీ సోకినట్టు ఉన్నాయి. అక్కడక్కడ భవంతులు కనబడుతున్నాయి.
కొంత దూరం నడిచాక వాళ్ల పొలం దగ్గరకు వచ్చారు. రోడ్డు పక్కనే ఉంది పొలం. కోతలు అయిపోయాయి ఏమో బోసిగా కనబడుతుంది.
“ఇదే బాబునీ కిద్దామనుకున్న పొలం.” అదేంటి మావయ్య గారు ఇంతకు ముందు చూసినప్పుడు కనుచూపు మేర అంతా పొలాలు ఉండేవి కదా. ఇప్పుడు బిల్డింగులు కనబడుతున్నాయి.” ఆశ్చర్యంగా అడిగాడు.
“కలి కాలం బాబు. డబ్బుకు ఆశ పడి కన్న తల్లి లాంటి పంట భూముల్ని అమ్ముకుంటున్నారు. పోనీలే పంటలు కోసం అనుకుంటే కాదు ప్లాట్లు వేసుకోడానికి. ఇలా పొలాలను చెడగొట్టుకుంటూ పొతే ఇక భావి తరాలకు అన్నం ముద్ద కూడా దొరకదని నా బాధ “చెమ్మ గిల్లిన కళ్ళతో చెప్పాడు. అభిలాష్ కు కూడా తండ్రి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అప్పటికప్పడే ఓ నిర్ణయం తీసుకున్నాడు. “మావయ్య. మీకు ఓ విషయం చెప్పాలి. నేను ఇక్కడే ఉండి పోవాలని అనుకుంటున్నా” ఒక్కసారి గా ఉలిక్కి పడ్డాడు పరంధామయ్య. “అదేంటి బాబు.. పట్నవాసానికి అలవాటు పడ్డ నీకు పల్లెటూరు లో ఉండాల్సిన ఖర్మ ఎందుకు?”అన్నాడు. “అది ఖర్మ కాదు మావయ్య.నా అదృష్టం. ఈ పొలాన్ని చూసుకుంటూ మీతోనే ఉంటాను. నేను కోల్పోయిన ఆనందాలు, సంతోషాలు తిరిగి పొందుతాను. మీ సలహాలతో దేశీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాను.” ఖచ్చితంగా చెప్పేశాడు. “మరి నాన్న గారు ” అనబోతుండగా “అవన్నీ నాకు వదిలేయండి. ఇకనుండి ఈ పొలం అమ్మం. మరి కొన్ని పోలాల్ని కొందాం” తన నిర్ణయం చెప్పేశాడు. ఆనందం తో ఇంటికొచ్చి భార్య, కూతురు కి అల్లుడి నిర్ణయం చెప్పాడు. రవళి కి తన భర్త పై మరింత ప్రేమ పెరిగింది. సంక్రాంతి పండుగ తమకు నిజమైన సంతోషాన్ని ఇచ్చిందని సంబరపడింది.

You May Also Like

One thought on “అసలైన సంక్రాంతి.. (సంక్రాంతి కథల పోటీ)

  1. కథ చాలా బాగుంది రాజేష్ గారు…కనుల పండువగా ఉంది. 👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!