సావిత్రీ బాయి ఫూలే

సావిత్రీ బాయి ఫూలే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

వ్యాసకర్త: కాటేగారు పాండురంగ విఠల్

ఆధునిక భారతీయ చరిత్రలో చిరస్థాయిగా గుర్తించుకోదగ్గ మహిళామణుల్లో అగ్రస్థానంలో నిలిచే పేరు సావిత్రీ బాయి ఫూలే. బాలిక-మహిళా విద్యకై తాపత్రయ పడి తన జీవితాన్ని ధారపోసిన ధీర వనిత సావిత్రీ బాయి. నాటి సాంఘీక దూరాచారాలైన సతీ సహగమనం, బాల్య వివాహాలు, కుల కట్టుబాట్లు, అణగారిన వర్గాల అణచివేత, అగ్ర వర్ణాల ఆగడాలు మొ”వి ఆమెను ఉద్యమాల వైపు లాగినవి. బాల్యంలోనే పెళ్లి జరగడం, నిరక్షరాస్యురాలవ్వడం వలన భర్త జ్యోతిబా ఫూలే సహకారంతో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. భర్త అడుగుజాడల్లో నడిచి బడుగు బహుజనులు, మహిళల అభ్యున్నతికి పాటుపడింది. సావిత్రి బాయి ఫూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయాగావ్ అనే గ్రామంలో, లక్ష్మి-ఖండోజి పాటిల్ నేవేషేలకు జన్మించినది. 9వ యేట జ్యోతిరావు ఫూలేతో వివాహమైనది. వారికి పిల్లలు కలుగనందున యశ్వంత రావును దత్తత తీసుకున్నారు. జ్యోతీ రావే గురువై ఆమెకు చదువు నేర్పించి, ఉపాధ్యాయురాలిగా చేసెను. తనతో పాటు సంఘసంస్కర్తగా తీర్చిదిద్దెను. సావిత్రి బాయి కవయిత్రిగా “కావ్య ఫూలే” అనే కవితా సంపుటిని ప్రచురించెను. మొక్కవోని ధైర్యంతో అనుకున్న లక్ష్యం సాధించడంలో సావిత్రి సఫలీకృతురాలైనది.
మహిళా సేవా మండల్ స్థాపించి స్త్రీల సాధికారికత, మహిళా హక్కులతో పాటు మానవ హక్కులకై ఉద్యమించినది. పితృస్వామ్య వ్యవస్థను అంతం చేయడంలో భాగంగా భర్త చితికి తానే నిప్పు అంటించినది. బ్రాహ్మణ వ్యవస్థ, శిరోముండనం, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా “సత్య శోధక్ సమాజ్” ఆధ్వర్యంలో ఆమె ఉద్యమాలను నడిపినది. వితంతు వివాహాలు జరిపించారు.
తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మొట్ట మొదటి పాఠశాలను స్థాపించినది. గ్రామీణ ప్రాంతాల్లో 52 పాఠశాలలు స్థాపించి దళిత, బహుజన, బాలికల విద్యకై అవిరళ కృషి చేసినది. ఆధిపత్య కులాలనుంచి దాడులు, అవమానాలు, ఎదుర్కొని చివరి శ్వాస వరకు పోరాటం చేసినది. కరువు కాటక పరిస్థితి ఒకవైపు, ప్లేగు వ్యాధి మరొకవైపు మహారాష్ట్ర జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో, ప్రజలను ఆదుకోవడానికి జోలె పట్టి విరాళాలు సేకరించి, దళిత, పేద, గ్రామీణ ప్రజలకు సహకారం అందించినది. పేగు వ్యాధిగ్రస్థుల కొరకు వైద్య శిబిరాలు నిర్వహించి, తాను దగ్గరుండి సపర్యలు చేసినది. తుదకు ఆమెకు అదే ప్లేగు వ్యాధి సోకడం వలన 1897 మార్చి 10 నాడు మరణించినది. విద్యారంగానికి సావిత్రి బాయి ఫూలే చేసిన సేవలకు గుర్తింపుగా ఆమె జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొను చున్నాము.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!