విశ్వనాథాభరణం

విశ్వనాథాభరణం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు పత్రిక – మనోహరి)

రచన: వింజరపు శిరీష

“అమ్మ..! నాన్నగారికి నువ్వైనా చెప్పమ్మా. ఈ వయసులో ఇవన్నీ అవసరమా అతనికి ఆఫీసులో, మా కాలనీలో తల ఎత్తుకోలేకపోతున్నాను. ఇన్ని ఏళ్ళు వచ్చాయి. కానీ, బుద్ధి ఇంకా రాలేదు” అంటూ ఇంకా ఏదో అనబోతున్న కొడుకును చెంప చెల్లుమనేలా కొట్టారు శ్యామలమ్మ గారు.
“నా భర్త గురించి ఇంకొక్క మాట కూడా మాట్లాడే అర్హత నీకు లేదు. ముఖ్యoగా అమ్మ, నాన్న అని ఆ నోరుతో పిలవకు. ఇప్పుడు గుర్తొచ్చిందా! పరువు. మా ఆయన వచ్చేలోపు ఇక్కడి నుండి వెళ్ళు”  అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని, తన భర్త ఇచ్చిన ధైర్యమో తెలియదు, కొడుకు, కోడలు చేసిన గాయమో తెలియదు. ఏనాడు కొడుకుని పల్లెత్తు మాట అనని శ్యామలమ్మ గారు ఈ రోజు చెట్టంత కొడుకుపై చేయి చేసుకున్నారు.
ఆ దెబ్బకు వంశీ పౌరుషంగా శ్యామలమ్మ గారి వైపు ఒక చూపు చూసి, చెంప తడుముకుంటూ వెళ్ళిపోయాడు.
“దేవుడా …! ఇటువంటి బిడ్డనా! నువ్వు మాకు ఇచ్చావు. లేక లేక కలిగిన బిడ్డడని ఎంతో ప్రేమగా పెంచుకున్నాము కదయ్య! అంటూ తడికన్నుల మాటున దాగిన గతాన్ని నెమరు వేసుకున్నారు.
అందమైన పూల పొదరిల్లుతో, ముంగిట ముగ్గులతో, సంపెంగ సువాసనాలతో ఉన్నంతలో అందంగా అలంకరించిన చిన్న పెంకుటిల్లు.
అదిగో..! వాసరాలో సరిగమల గమకాలతో మంచి గాత్రంతో ” ఏ తీరుగ నను దయ చూచెదవో” అంటూ విశ్వనాధ్ గారు రామదాసు కీర్తనను ముగించారు. పిల్లలందరూ ఎంతో శ్రద్ధతో నమస్కారం చేసి వెళ్ళిపోయారు.
నాన్న అంటూ వంశీ విశ్వనాధ్ గారిని హత్తుకున్నాడు. దశరధుడుకి రామపరిశ్వంగన ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, ఇప్పుడు విశ్వనాధ్ గారికి అనుభవపూర్వకమైంది. శ్యాము, శ్యాము ఇలా రా! మన వంశీ వచ్చాడు అని భర్త కేక విన్న శ్యామలగారు చేతిలోని హారతిపళ్ళెంతో సహా వచ్చి కొడుకుకి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్లారు.
“బాబు వంశీ బాగా చిక్కినట్టు ఉన్నావు. కొత్త ఉద్యోగ బాధ్యతలు ఎలా ఉన్నాయి. పని ఎక్కువగా ఉన్నదేమిటీ? సమయానికి నిద్రపోతున్నావా! అంటూ ప్రశ్నల వర్షంకురిపించారు విశ్వనాధ్ గారు”.
హా..! “చాల్లెండి బడాయి, అక్కడికి మీ కొడుకొక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు ఏమిటీ ప్రశ్నల మీద ప్రశ్నలు.. పిల్లాడ్ని కాస్తా ఊపిరి తీసుకొనిస్తారా! లేదా.. అంటూ కొడుకుని స్నానం చేసి రమ్మన్నారు” శ్యామలమ్మ.
కొడుకు వచ్చేలోపు పెరటిలోని అరిటాకు తీసి, చెట్టుకు కాసిన అరటిపళ్ళు తీసి, నవకాయ పిండి వంటలు వడ్డించడానికి అన్నీ సిద్ధం చేశారు శ్యామలమ్మ గారు. అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ భోజనం కానిచ్చారు ముగ్గురు.
రాత్రి కొడుకు కోసమని నులకమంచం, నవ్వారు సర్ది, తెల్లటి పూల బొంత దాని మీద వేసి, మంచం పక్క అరుగుమీద కూర్చుని ఆలోచిస్తున్నారు.
ఇంతలో వంశీ వచ్చి, “ఏమిటీ నాన్నగారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అన్నాడు.”
“ఏమీ లోదోయ్ నీ పెళ్లి గురించి..అదే ఇదివరకు నీకు చెప్పానే మన సత్యం గారి అమ్మాయిని నీకు అడిగారని, రేపు చాలా మంచిరోజు పెళ్లి చూపులకు వెల్దామా మరి అని కొడుకు సమాధానం కోసం చూస్తున్నారు”.
తండ్రి ఒడిలో తలపెట్టుకొని “మీరు ఎలా అంటే అలానే నాన్నగారు” అని చిన్నపిల్లాడిలా తండ్రి ఒడిలో ఒడిగిపోయాడు విశ్వం. నాకు తెలుసు నాన్న నీకు మేమన్నా, మా మాట అన్నా నీకు ఎంతో గౌరవం అని. కాకపోతే నిన్ను ఒకమాట అడిగి చూద్దాం అని అన్నారు.
“నాన్న చిన్నప్పుడు నుండి మిమ్మల్ని, అమ్మని చూస్తున్నాను. నేను ఈ రోజు ఇంత మంచి ఉద్యోగ్యంలో ఉండడానికి అమ్మ, మీరు ఎన్ని త్యాగాలు చేశారో, ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపారో అని కన్నీళ్లు పెట్టుకున్నాడు”.
అప్పుడే అక్కడికు వస్తున్న శ్యామలమ్మ గారు – “నా బిడ్డని ఎడిపించేశారా! ఎప్పుడు మన కష్టం వాడికి గురుతుచేయకండి, వాడిది అసలే పసి హృదయం” అంటూ కమ్మని గుమ్మపాలు విశ్వానికి అందించారు. తల్లి, తండ్రుల ప్రేమానురాగానికి కరిగిందేమో జాబిలి మబ్బులమాటున దాగింది.
మరుసటి దినం ముగ్గురు కలిసి సత్యం గారింటికి పిల్లను చూసుకోవడానికి వెళ్లారు. వారు అతిధిమర్యాదలు బాగానే చేశారు. పిల్లను తీసుకువచ్చారు. అమ్మాయి పేరు రేఖ, పేరుకు తగ్గట్టే రూపు రేఖలో కుందనపు బొమ్మలాగుంది. ఆ మంచి మర్యాద అంతా బాగుంది.
అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టి, పెళ్లి ఉన్నంతలో ఘనంగా చేశారు. కొత్త పెళ్లికూతురు ఇంటిలో అడుగుపెట్టిన విశేషమేమో వంశీకి ప్రమోషన్, ట్రాన్స్ఫర్ రెండు ఒకేసారి వచ్చాయి. అమ్మాయిని తీసుకొని వారం రోజుల్లో వంశీ డ్యూటీలో చేరాలి.
రేఖ కొత్త అమ్మాయిలా కాకుండా బాగానే కలిసిపోయింది. అత్తగారికి ఇంటిపనులలో సాయం చేస్తుంది. కానీ, శ్యామలమ్మ గారు అస్సలు చేయనివ్వడం లేదు. వంశీ వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. “కన్నా! అంత పెద్ద పట్నంలో ఎలా ఉంటారో, డ్యూటీలో పడి కోడలు పిల్లను అలసత్వం చేయకు, వేగంగా ఇంటికి రా, పాపం ఒక్కతే ఉండాలి అని కొడుకుకు చెప్పారు విశ్వనాధంగారు”.
రోజులు గడిచాయి శ్యామలమ్మ గారి ఆరోగ్యం బాగోలేదు. వెళ్లిన కొత్తలో రోజూ ఫోన్ చేసి మాట్లాడేవారు కొడుకు, కోడలు. వృద్దాప్యం మీదపడి విశ్వనాధ్ గారు సంగీత పాఠాలు చెప్పలేకపోతున్నారు..
శ్యామలమ్మ గారిని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదాయే, ఈ మధ్య కొడుకు డబ్బులు పంపించడం లేదు. ఫోన్ చేసిన ప్రతీసారీ కోడలు మాట్లాడి, ఆఫీస్ కి వెళ్లాడనో, తాను బయట ఉందనో, అర్ధం పర్థం లేని సాకులు చెపుతూ వస్తుంది. పట్నం కదా ఖర్చులు కూడా పెరిగాయని నోరు తెరిచి అడగను లేదు. కానీ, “శ్యామలమ్మ గారికి పచ్చకామెర్లు ముదరక ముందే హాస్పిటల్ కి తీసుకెళ్లమన్నారు వీధిలో కాంఫౌండర్”.
ఇక ఉండబట్టలేక భార్యను తీసుకొని హైదరాబాద్ కొడుకు ఇంటికి వెళ్ళారు. వెళ్లేసరికి ఇంటికి తాళం వేసివుంది. ఒక గంట తరువాత కొడుకు, కోడలు నవ్వుకుంటూ కారు దిగారు. వంశీ తల్లిదండ్రులను చూస్తూనే “మీరెందుకు ఇక్కడికి వచ్చారు” అని అన్నాడు.”సమాధానం చెప్పేలోపే “ఎప్పుడు వెళతారు అన్నాడు”. ముందు ఇంటిలోకి వెళ్లి మాట్లాడుకుందాము, అసలే అమ్మకు బాలేదు అని విశ్వనాధ్ గారు అన్నాక, ముందుకు కదిలారు. “బాగున్నావా! అమ్మ అని కోడలిని పలకరిస్తే, పలకకుండా వెళ్లిపోయింది.”
విశ్వనాధ్ గారు అవమాన భారంతో సాయం చేస్తారో లేదో అన్న మీమాంసతోనే – “వంశీ అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి ఒక పాతికవేలు ఉంటే సర్దగలవా అన్నారు. “నాన్న అమ్మ ముసల్ది అయ్యిపోయింది కదా! ఇప్పుడు ఈ హాస్పిటల్ ఖర్చు ఎందుకు, అయినా నా దగ్గర అంత డబ్బులేదు” అన్నాడు. విశ్వనాధ్ గారికి ఒక్కసారిగా కోపం పెల్లుబికింది.
“ఒరేయ్ వంశీ! నిను కన్న తల్లికి ఆరోగ్యం బాగోలేదంటే డబ్బులేదంటవా! నిన్ను నవమాసాలు కని, నీకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి, నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అమ్మ – నాన్నలు ముసలితనంచేత ఆరోగ్యం బాగోక డబ్బులు అడిగితే, ఉండి లేదని చెపుతావా! నిన్ను ఇంతవాన్ని చేసినందుకు మాకు భరణం కావాలి! నువ్వు ఏమిచేస్తావో తెలీదు. నా భార్య ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వల్సిందే అని అక్కడ ఒక్క నిముషం కూడా ఉండలేక భారమైన గుండెలతో ఊరికి బయలుదేరారు.
విశ్వనాధ్ దంపతులను చూసిన ఊరి పెద్దలు
“కొడుకుని డబ్బులు అడిగి ఆసుపత్రికి వెళ్ళకుండా దీనమైన వదనలతో వస్తున్నారని ఆరా తీశారు.
పట్నంలో కొడుకుకు, తమకు మధ్య జరిగిన వాగ్వివాదంను పెద్దమనుషులకు చెప్పారు. “మీరన్నది సరైనదే విశ్వనాధ్ గారు, మా  అల్లుడు దగ్గరే మీ అబ్బాయి పనిచేస్తున్నారు, రేపే మా అల్లుడు గారికి చెప్పి మీ అబ్బాయిని రప్పించి మీ అబ్బాయి నుండి మీకు భరణాన్ని రాబడుతాను.
ఇది మీ ఒక్కరి సమస్య కాదు. పిల్లలను పెంచి, పెద్దచేసి, వారిని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టే ప్రతి తండ్రి ఆవేదన”.
సర్పంచ్ గారు వాళ్ల అల్లుడుతో ఏమి మాట్లాడారో గానీ, మరుసటి దినం వంశీ విశ్వనాధ్ గారి దగ్గరికి వచ్చి “క్షమించండి నాన్నగారు మీ పట్ల, అమ్మ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. ఇదిగొండి మీకు నేను భరణంగా ఇస్తున్న ఒక ఇల్లు, ఇరవై లక్షలు అన్నాడు. విశ్వనాధంగారు మసకబారిన కళ్ళతో  “నువ్వు ప్రేమతో నీతోపాటు ఉండమంటే ఎంతో సంతోషించేవాడిని వంశీ, కానీ నువ్వంట్లు ముసలివారం కాటికి కాలు చాపుకున్నాము. మాకేందుకు నువ్విచ్చే ముష్టి, మాకు ఇల్లు, ఇరవై లక్షలు వద్దు. నా భార్యకు కావలసిన పాతికవేలు చాలు. మరొక్క మాట ఇంకెప్పుడు నువ్వు ఈ ఇంటికి రాకు. మేము చచ్చిన సరే, ఇక్కడ మాకు తలకొరివి పెట్టడానికి చాలా మంది కొడుకులు ఉన్నారు. అని పాతికలక్షలు తీసుకొని తన భార్యను బతికించుకోవాడానికి జారుతున్న తన కండువాను సరిచేసుకుంటూ, భార్యను పొదివిపట్టుకొని పయనమయ్యారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!