భరణం అడగను

భరణం అడగను

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు పత్రిక – మనోహరి)

రచన : మోటూరి శాంతకుమారి

“ఎట్టా వుంది సావిత్రమ్మ నీకు ” అంటూ పలకరించింది పక్కింటి పార్వతమ్మ.
“రా కూచో!””ఏమి చెప్పమంటావక్కా! మా తిప్పలు! మందులు మింగందే తెల్లారదు. మందులు కొందామంటే డబ్బుకి కట కట. ఏమి చెబుతావులే మా తిప్పలు.
ఒక వైపు అప్పులోళ్ల గోల మరోవైపు రోగాల బాధ. ఏదన్నా తిని చావాలనిపిస్తుందక్కా.” పార్వతమ్మతో గోడు వెళ్ళబోసుకుంది.
“అటువంటి పిచ్చి పని చెయ్యకు. ధైర్యంగా వుండు. కొడుకు లేడా నీకు”
“ఉండి ఏమి ప్రయోజనం! అమ్మ, బాబూ గోడు పట్టదాయే! పెళ్ళాం పిల్లలు బాగుంటే చాలట. మళ్ళా కొత్త ఆలోచనవచ్చింది వాడికి. ఇల్లమ్మి డబ్బు ఇస్తే వాడు బస్తిలో కొనుక్కుంటాడట. మేమిద్దరం చెట్టు కింద ఉండాలా!” ఆవేదన వెలిబుచ్చింది. “వీరయ్య కనబడలేదు. ఎక్కడికెళ్లాడు ఇంత ప్రొద్దున్నే!”
“ఊరెల్లాడు! మామేనల్లుడి బండి మీద. వాడైతే జాగ్రత్తగా తీసుకొస్తాడని వాడితో వెళ్ళాడు.”
“కాఫీ ఎమన్నా పెట్టియ్య మంటావా?”
“నీకెందుకు కస్టమ్మక్క”
“ఇందులో కష్టమేముందిలే.. ఒకళ్ళ కొకళ్ళు సాయం చేసుకోపోతే ఎట్లా!” అంటూ కాఫీ పెట్టి రెండు గ్లాస్సుల్లో పోసుకొచ్చింది.
“సార్! మీకోసం చలపతి సార్ వచ్చారండి.”
కాఫీ తాగుతున్న నాయుడు గారితో పని పిల్లాడు చెప్పాడు.
“అలాగా ” అని కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి లేచారు
నాయుడు గారు. జడ్జి గాని భేషజాలేమీవుండవు. మంచి వారిగా పేరుంది. చలపతి గారంటే ప్రత్యేక అభిమానం. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఉండేది పక్క ఊళ్ళే. సాధారణంగా ఆదివారాలు ఎవరినీ కలవరు. చలపతి గారు. అందుకే ముందు రూంలోకి వచ్చారు. చలపతి అప్పటికే అక్కడ నిలబడి వున్నారు. చలపతి న్యాయవాది.
“అదేం చలపతీ! కూర్చోలేదు. నిలబడే వున్నావు!”
“నాతో ఇంకొకతను వచ్చాడు సార్! తీసుకు రమ్మంటారా! “ఎవరు ” “వీరయ్యని. మా ఊరి వాడు. నమ్మకమైన మనిషి. పొలాలు చేస్తుంటాడు. అతనికీ కొద్దీ పాటి పొలంవుంది. “చెబుతూనే వీరయ్యని తీసుకొచ్చారు. నాయుడు గారికి వంగి నమస్కరించాడు. కూర్చోమన్నట్టు సైగ చేసారు నాయుడు గారు.
బాధ చెప్పుకో మన్నట్టు తలుపారు చలపతి గారు
“నేను కష్టపడి చదివిస్తే నా కొడుకు పెద్ద ఉద్యోగస్తు డయ్యాడండి. గర్వంతో పొంగిపోయాను. చేసిన అప్పులు, పడ్డ కష్టం అన్ని మరిచి పోయనండి. నేను నా భార్య ఎంతో సుఖపడోచ్చని మురిసి పోయామండి.”
“ఇప్పుడేమైంది?”
“అంతా తలకిందులైందండీ! “చదువు కోసం చేసిన అప్పులుకీ వాడికి సంబంధం లేదంటాడు. ఇల్లు పొలంకూడా అమ్మేసి ఇస్తే తను ఇల్లు కొంటాడట. మా కిద్దరికీ జబ్బులే. మందులకి బోల్డు ఖర్చండి. వాటిక్కూడా ఇవ్వనంటాడు. ఎట్లా బ్రతికేది. ఇవన్నీ పడలేక చచ్చి పోదామంటుంది మా ఆవిడ. దానికి ధైర్యం చెప్పి ఏదన్నా దారి చూపించక పోతారా అని వచ్చానండి. మా మీద దయుంచాలండి “అన్నాడు వీరయ్య.
“ఏమి చేద్దామంటావ్ చలపతీ! సాలోచనగా అడిగారు. “సార్! ఇతను అందరిలా కొడుకు నుంచి భరణం అడగటంలేదు. తను ఖర్చు పెట్టింది వాపస్ చెయ్యమంటున్నాడు. దానితో భార్యభర్తలు వాళ్ళతిప్పలేవో వాళ్ళు పడతారట. వింటుంటే బాధగానే వుంది మరి.”పెట్టిన ఖర్చులన్నీ రాయించి తీసుకొచ్చాడు.
“నేను రేపే ఫైల్ చేస్తాను. చేసేముందు మీదృష్టిలో ఉంటే మంచిదికదాని ” “అలాగే చెయ్యండి ”
“వాడిచ్చే భరణం నాకు వద్దు. నాకు రావాల్సింది ఇప్పించండి చాలు” అన్నాడు వీరయ్య అభిమానంగా.
వీరయ్య కేసు ఫైల్ చేసాడు. సంవత్సరం గడిచాక తీర్పువచ్చింది. వీరయ్య కేసు గెలిచాడు. పెట్టిన ఖర్చులు తిరిగివ్వాలనే తీర్పు. కళ్ళు తుడుచుకుంటూ చలపతి కాళ్ళమీద పట్టాడు వీరయ్య. “నా ఆత్మాభిమానం నిలబెట్టారు.
మేమిద్దరమూ గౌరవంగా బ్రతుకుతాం సార్” అన్నాడు మరోసారి నమస్కరిస్తూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!