పుత్రుడే కావాలా?

పుత్రుడే కావాలా?
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు పత్రిక – మనోహరి)

 రచన : K. లక్ష్మీ శైలజ

‘పుత్రులు లేని వారు పున్నామ నరకం నుంచి తప్పించుకోలేరు’ అనే మాటలు బాగా వంటపట్టించుకున్న భగవంతం, భాగ్యమ్మలు తమకు ఇద్దర ఆడపిల్లలు కలిగిన తరువాత కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. మూడో కానుపులోనయినా మగ పిల్లవాడు కలుగుతాడనే ఆశతో. “మీ చిన్న బట్టల షాప్ లో వచ్చే ఆదాయంతో పాయసాలు పెట్టకున్నా, మజ్జిగనీళ్ళయినా పిల్లలందరికీ ఇవ్వాలి కదా? ఇద్దరు పిల్లలు చాలు” అని  స్నేహితుడు సోమశేఖరం చెప్పిన మాటలు వారికి రుచించలేదు.
వాళ్ళు ఎటువంటి నోములు నోచారో గానీ, వారికి భగవంతుడు మగపిల్లవాణ్ణి ప్రసాదించాడు. అప్పుడు వాళ్ళ ఆనందానికి అంతులేకుండా పోయింది. బారసాలను ఘనంగా జరిపించారు. “పోనీలే మీ కోరిక తీరింది. వీడు మీకు జీవితాంతం అండగావుండాలి” అని పిల్లవాడిని ఆశీర్వదించారు వచ్చినవారు.
అక్కల కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించి,  కొడుకు అనిరుధ్ ను గారాబంగా, ముచ్చటగా చూసుకుంటున్నారు. ఎంతగా అంటే పళ్ళు రుద్దటానికి పేస్ట్ బదులు చక్కెర ఇచ్చేంత. అలా ఆడింది ఆట, పాడింది పాటగా పెరుగుతున్నాడు అనిరుధ్.
తమకు భారమైనా  కొడుక్కు కాన్వెంట్ చదువే చదివించారు. ఆడపిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. వాళ్ళను కాలేజీ చదువులకు పంపలేదు. రానూ పోనూ బస్ చార్జీలకు డబ్బులు కట్టలేక.
బట్టల షాపులోఎక్కువ లాభం రావటం లేదు. అందుకని అప్పు చెయ్యడం కూడా అలవాటు చేసుకున్నాడు భగవంతం. అప్పుకు వడ్డీ పెరిగి, భాగ్యమ్మ వంటి మీద బంగారు పేరి శెట్టి ఇంటికి చేరింది. పిల్లవాణ్ణి కాలేజీ చదువులకోసం గుంటూరు లో చేర్పిస్తే, నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ పూర్తయ్యేటప్పటికి నాలుగెకరాల పొలం నడుచుకుంటూ నాగిరెడ్డిగారి పొలంలో కలిసింది.
అప్పటికీ తమ్ముని పరిస్థితి చూసి, ఆడపిల్లలిద్దరినీ భగవంతం అక్కలు ఇద్దరూ కట్నం ఆశించకుండా తమ ఇంటి కోడళ్ళుగా చేసుకున్నారు. ఇక అనిరుధ్… భాగ్యమ్మ అన్న కూతుర్ని కోడలిగా చేసుకోవాలని పెద్దలందరూ ఆలోచించే లోపల, ఉద్యోగంలో చేరిన నెలలోనే సహోద్యోగిని సుమతిని పెళ్ళిచేసుకుంటానన్నాడు. అయిన వారి పిల్లను చేసుకుంటే జీవితాంతం అండగా ఉంటుందని అందరూ చెప్పినా అనిరుధ్ ఆ మాటలు ఆలకించలేదు. ఇక తప్పదని సుమతిని కోడలిగా స్వాగతించారు తల్లితండ్రులు. వచ్చిన కోడలెవరైనా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని అత్తగారు పనిపాటలు నేర్పిస్తూ, కోడలి ముచ్చట్లు తీరుస్తూ తమలో కలుపు కోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. సుమతి అత్తగారి బలహీనతను కనిపెట్టింది. అమాయకంగా వున్నట్లు నటిస్తూ భాగ్యమ్మ చేత పనులన్నీ చేయించుకుంటూ, పైగా భర్త నడ్డు పెట్టుకొని తనకిష్టమైనట్లు ఇంట్లో ప్రవర్తించడం నేర్చుకుంది.
భాగ్యమ్మ సుమతి వచ్చిన తరువాత ఒక పండుగకు తన చేతికున్న ఉంగరం తీసి గిఫ్ట్ గా ఇచ్చింది మర్యాద కోసం. వద్దనకుండా తీసుకుంది సుమతి, అత్తగారి దగ్గర ఇంకేమీ బంగారం లేదని తెలిసినా కూడా. అలా పరాయి పిల్లైనా కోడలిని కూడా కూతురు లాగానే బేధం చూపించకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ మధ్యలో అసలే బి.పి, షుగర్ తో ఇబ్బంది పడ్తున్న భగవంతంకు ఆటోలో వెళ్తుంటే, ఆటో తిరగబడి కాలు విరిగింది. బట్టలు కొత్తవి తెచ్చి పెట్టక పోవడం వలన, బట్టల షాప్ సరిగా నడవడం లేదు. దాంతో అనిరుధ్ జీతం ఒక్కటే ఇంట్లో ఆధారమయ్యిది. ఇలా అత్తమామలను పోషించడం వృధా అనిపించింది సుమతికి. పనిమనుషులు ఎక్కువ అడుగుతున్నారని ‘ఇంటిపని మనమే చేసుకుందాం’ అని కోడలు చెప్తే మంచిదేలే అనుకుంది కానీ, మొత్తం పని తన మీదకు తోసేసి కోడలు పక్కిండ్లకు పెత్తనాలకు వెళ్తుందని అత్తగారు ఊహించలేదు.
అలా ఆమెను జీతంలేని పనిమనిషిని చేసింది కోడలు. ఇంకా భాగ్యమ్మ చేసే ప్రతీ పనికీ వంకలు పెట్టడం, ఆమెను విసుక్కోవడం చేస్తుండేది. ఆ మాటలకు తట్టుకోలేక పక్కింట్లో ఉండే స్నేహితురాలు వసుంధర దగ్గర భాగ్యమ్మ కన్నీళ్లు పెట్టుకునేది అప్పుడప్పుడూ. ఉదయం ఆఫీస్ కు వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చే అనిరుధ్ కు ఇవన్నీ ఏమీ తెలియనిచ్చేది కాదు సుమతి. తల్లితండ్రులు అసలు చెప్పరు. ఒక ఆదివారం రోజు భాగ్యమ్మ వంట చేసి, 12 గంటలకు అందరికీ భోజనాలు పెట్టింది. మునక్కాయ పులుసు నోట్లో పెట్టుకోలేనంత ఉప్పగా ఉంది.  “ఏంటమ్మా, ఇలా చేశావు?” అని కొడుకు విసుక్కుంటే, భాగ్యమ్మ బిక్కమొహం వేసింది. అందరూ పచ్చడన్నం తిన్నారారోజు. సాయంత్రం దాకా భాగ్యమ్మ ‘అయ్యో, అందరినీ అర్ధాకలితో వుంచానే’ అని మధనపడ్తూనే వుంది. సాయంత్రం వసుంధర వంటింటి గోడ దగ్గర్నుంచి ఉదయం భాగ్యమ్మ ఇచ్చిన మునక్కాయ పులుసు గిన్నెను కడిగి, తను చేసిన కారప్పూస పెట్టీస్తూ “పులుసు కమ్మగా బాగుంది భాగ్యం” అంది. అప్పుడు గుర్తొచ్చింది భాగ్యమ్మకు. వంటయిన తరువాత కొంచెం పులుసు వసుంధరకు ఇచ్చిన విషయం. అందుకే “పులుసులో ఉప్పు ఎక్కువయ్యింది కదా?” అన్నది భాగ్యమ్మ విచారంగా. వెంటనే వసుంధర “ఎవరా అన్నదీ? నా కంటే బాగా చేశావు నువ్వు” అంది వసుంధర. భాగ్యమ్మకు విషయం కొద్దికొద్దిగా అర్థమవుతోంది. “ఏం లేదులే నాకే అలా అనిపించింది” అని మాట మార్చింది. అంటే సుమతి కావాలనే తను చూడనప్పుడు పులుసు లో ఉప్పు ఎక్కువగా వేసింది. ఎందుకో తనను కోడలు తప్పుగా చూపిస్తోందని ఆమెకు అర్థమవుతోంది.
ప్రతి రోజూ ఇలాంటివే జరుగుతున్నాయి. ఇంట్లో లైట్స్ ఫ్యాన్స్ భాగ్యమ్మ వెయ్యకున్నా అత్తగారి మీదే విసుక్కునేది. రెండు పూటలా స్నానాలు చేసినా, నీళ్ళు ఎక్కువ ఖర్చు అవుతున్నాయనేది. పాలు చాలడం లేదని విసుక్కుంటే తను కాఫీ మానేసింది. ఈ విషయాలన్నీ ఎక్కువగా భగవంతంకు చెప్పేది కాదు.
ఆమె చెప్పకున్నా కొంచెం కొంచెం తెలుస్తూనే వున్నాయతనికి.
వీళ్ళు ఉన్న ఇల్లు చిన్నది. ‘ఇంత చిన్నఇంట్లో ఉండటమేంటి? ఇదమ్మేసి పెద్ద ఇల్లు తీసుకుందామ’ని కోడలు ఆలోచించింది. అంతే అనిరుధ్ చెవిలో వేసిందిందా విషయం. ఒక రోజు ఉదయం అనిరుధ్ “నాన్నా ఈ చిన్న ఇంట్లో అన్ని సౌకర్యాలు లేవు కదా!. ఈ ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్ తీసుకుందాం. నేను కొంచెం లోన్ కూడా తీసుకుంటాను. సేఫ్టీగా కూడా వుంటుంది” అన్నాడు.
“సరే. చూద్దాం లే” అన్నాడు ఆలోచిస్తూ భగవంతం. ఆ విషయం తెలిసి స్నేహితుడు సోమశేఖరం ఇల్లు అమ్మడానికి ఎంత మాత్రం వప్పుకొలేదు. “మీకంటూ ఏమీ లేకుండా చేసుకోవడం మంచిది కాదు. ఇప్పటికే నీ స్థోమతకు మించి వాడికోసం ఖర్చు చేశావు. నీ అక్కలు మంచివారు కనుక ఆడపిల్లల పెట్టుపోతలు నీకు ఇబ్బంది రాలేదు. ప్రపంచాన్ని చూడు. ధనం దగ్గర నీ, నా బేధాలుండవు. కొంతయినా మీరు దాచి ఉంచకోవడం అవసరం. మీ ఇద్దరి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలన్నా మీ కంటూ కొంత ఆస్తి అవసరం” అని ఎంతో నచ్చ చెప్పాడు. కానీ అనిరుధ్ను కాదనలేకపోయారు తల్లితండ్రులు.
దాదాపు నలభై కిలోమీటర్స్ దూరంగా డబుల్ బెడ్ రూం అపార్ట్మెంట్ కొనడం కోసం తాతల నాటి ఇల్లును అమ్మేశారు.  కానీ వీళ్ళ షాప్ కు అది దూరం కనుక వీళ్ళు పాతింటి దగ్గరే చిన్న బాడుగ ఇంట్లోకి మారిపోయారు, రోజూ వచ్చీ పొయ్యే దానికి చార్జీలు ఎక్కువ అవుతాయని. అలా కోడలు తల్లితండ్రుల నుండి కొడుకును దూరం చేసి, వేరింటి కాపురం పెట్టింది.
కొద్దిరోజులకు ఇంటి బాడుగ కట్టడానికి, వీళ్ళ భోజనం ఖర్చులకు కూడా షాప్ లో ఆదాయం రావడం తగ్గిపోయింది. ఎవరినీ చెయ్యి చాచి అడగలేని మొహమాటం.  ఉన్న బట్టలు కొంతలో కొంతకు అమ్మి కొద్దిరోజులు గడుపుకున్నారు. రోజు గడవడానికి ఇబ్బందిగా వుందని చూచాయగా కొడుకు, కోడలితో చెప్తే, అపార్ట్మెంట్ కు తీసుకున్న లోన్ ఇంకా తీరనందున చేతిలో ఎక్కువ డబ్బులు ఉండటం లేదని సుమతి అనిరుధ్ కు నేర్పిస్తే అవే మాటలు చెప్పాడు అనిరుధ్ తల్లితండ్రులకు.  కోడలి తల్లితండ్రులకు విషయం తెలిసి, కూతురిని చీవాట్లు పెట్టినా సుమతి ఖాతరు చేయలేదు. ‘వాళ్ళదగ్గర షాప్ లో బట్టలు తీసుకున్న వారు ఇవ్వాల్సిన డబ్బులున్నాయి, అవి తీసుకోవచ్చు కదా!’అని చెప్తోంది అందరితో.
ఇలాంటి పరిస్థితుల్లో ‘ఏం వండాలో’ అర్ధకాక కళ్ళనీళ్ళు పెట్టుకుందొకరోజు భాగ్యమ్మ. రోజూ నూకలతో కొంచెం గంజి కాచుకుంటున్నారు. ఆ రోజు అవి కూడా లేవు. భగవంతం అక్కలు, వీళ్ళ కూతుళ్ళూ అప్పుడప్పుడూ వచ్చి ఏదో ఒక సహాయం చేసేవాళ్ళు. కనా కష్టమైన ఇంటి పరిస్థితిని ఊర్లో వాళ్ళకు తెలియకుండా ఉండాలని వీళ్ళు చూసేవాళ్ళు. కానీ పూర్తిగా తెలియకుండా ఉండదు కదా!.
ఆ రోజు వాళ్ళను చూడటానికి వచ్చిన సోమశేఖర్ “ఏమిటి మీకీ ఖర్మ. ఉన్నదంతా కొడుకు చేతిలో పెట్టేసి, ఈ దరిద్రమేమిటి? కొడుకుకేమైనా కళ్ళు మూసుకుపొయ్యాయా? ఇన్ని సంవత్సరాలు తను ఈ ఇంట్లో మీ మధ్య పెరిగినది మరిచి పోయ్యాడా?” మీరు పోయిన తరువాత పున్నామ నరకం నుండి రక్షిస్తాడని అనుకుంటే, మీరు బతికుండగానే మీకు నరకం చూపిస్తున్నాడు. వీడు వుంటే ఎంత? లేకుంటే ఎంత?” అంటూ ఆవేదన చెందాడు.
తల్లి,తండ్రులిద్దరూ కళ్ళనీళ్ళు పెట్టుకోవడం తప్ప మాట్లాడలేకపోయ్యారు. “తక్కువ నోములు నోచి కన్నానా వీడిని? ఎంత ప్రాణం పెట్టి పెంచుకున్నాము. ఆడపిల్లలను నిర్లక్ష్యం చేసి, వాళ్ళకు పెద్ద చదువులు చెప్పించకుండా, మంచి బట్టలు కొనివ్వకుండా మగపిల్లవాడు దర్జాగా ఉండాలని, అప్పులు చేసి…ఇల్లు, పొలము, బంగారం అన్నీ అమ్మి వాడికోసమే ఖర్చు చేశాము. చివరికి మేమొక పిడికెడు అన్నం తిన్నామో లేదో వాడు చూడలేక పొతున్నాడు’  అని ఆలోచిస్తున్న ఆ తల్లితండ్రుల ఆవేదన అది.
ఎన్ని రోజులు వేరే వాళ్ళు దానం చేసేవి తీసుకోవాలి? ఒకరోజు భాగ్యమ్మ “మనం …మనం ఇంకా బ్రతికి ఉండాలా? ఏదో ఒకటి మింగేసి పోతే పోదా?” అంది వొణుకుతున్న గొంతుతో. ఆ మాటలకు ఉలిక్కి పడ్డాడు భగవంతం.
”చచ్చి పోవాలా? ఎందుకూ? మనమేం తప్పు చేశాము? శక్తి వున్నంతవరకూ వాడి అభివృద్ధికి  తోడ్పడ్డాము. ఈ రోజు వాడికి కళ్ళు మూసుకుపోయాయి. ఇలాటి చీడ పురుగులను ఏరి వెయ్యడానికి, శిక్షించడానికి న్యాయ స్థానాలు ఉన్నాయి. జీవిత చరమాంకంలో మన జరుగుబాటు కోసం భరణం కావాలని మనం న్యాయ మూర్తిని ఎందుకు అడగకూడదు? మనం ప్రేమను చంపుకోలేక ఏడుస్తున్నాము. కొంచెం గుండె దిటవు చేసుకుంటే మనకు న్యాయం జరుగుతుంది” బలవంతంగా భాగ్యమ్మను లేవదీసి న్యాయస్థానం మెట్లెక్కాడు భగవంతం.
ఆ రోజు వీళ్ళకేసు తీర్పు ఇచ్చేరోజు. ప్రజలతో, మీడియాతో కోర్టు హాల్ కిక్కిరిసి వుంది. ఈ మధ్య రోజూ నగరంలో ఎక్కడ చూసినా ఈ కేసు విషయమే చర్చ జరుగుతోంది. న్యాయమూర్తిగారు ప్రవేశించగానే అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
“పశుపక్ష్యాదులు ప్రతిఫలాపేక్ష లేకుండా పిల్లలను పెంచుతాయి. కానీ మానవులము అలా కాదు. పసి వయసులో పిల్లలను తల్లితండ్రులు పోషిస్తే, ముదిమి వయసులో తల్లితండ్రులను పిల్లలు పోషించాలి. ఇది ధర్మం. పిత్రార్జితమైనా, స్వార్జితమైనా వీళ్ళు కొడుకు కోసమే ఖర్చుపెట్టారు. ఆ కొడుకు స్వార్థంతో వీళ్ళను ఏకాకులను చేయడం క్షమార్హం కాదు” అంటూ అనిరుధ్, సుమతిల వైపు ఒకసారి చూశారాయన.
న్యాయమూర్తి చెప్పడం ఆగడంతో  హాల్ లో అందరూ ఊపిరి బిగబట్టారు. ‘తీర్పు ఏమని ఇస్తారా?’ అని.
“అందువల్ల ఈ అనిరుధ్, సుమతి వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ ను తల్లి తండ్రులకు వారు బ్రతికున్నంత వరకూ వాడుకునేట్లుగా వ్రాసి ఇచ్చి, ప్రతినెలా వారికి జీవితభత్యంగా 10,000 రూపాయలు ఇవ్వవలసినదిగా ఆదేశించడమైనది” అని చెప్తూ ఉండగా “అయ్యా మరి వాడికి ఇల్లెట్లా?” అన్నారు తల్లితండ్రులు.
“ఇంకా మీకు కొడుకు అనే మమకారం చావలేదు. వాళ్ళు వయసులో వున్నారు. మళ్ళీ కొనుక్కుంటారు” అని చెప్తూ,
“వారికిష్టమైతే కొడుకు, కోడలిని వారు ఇంట్లో ఉండ నివ్వవచ్చు. కానీ అలా చేయకుండా వుండటమే మంచిదని సలహా ఇస్తున్నాము.” “ఈ కొడుకు, కోడలి లాగా  ఇంకెవరు ప్రవర్తించినా ఇలాంటి తీర్పే ఇవ్వబడుతుందని కూడా తెలియజేయడమైనది”
న్యాయమూర్తి గారు తీర్పునిచ్చి లోపలికి వెళ్ళారు. కోర్టుహాల్ చప్పట్లతో మారు మ్రోగింది. ఆ తల్లి తండ్రులు కొడుకు, కోడళ్ళను ఇంట్లోకి రానిచ్చారా లేదా అనేది ఇలాంటి బాధలు అనుభవిస్తున్న తల్లితండ్రుల ఊహకు వదిలేద్దాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!