అనుమతి

అనుమతి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : జీడిగుంట నరసింహ మూర్తి

            ఫోను రింగవుతోంది. రాత్రి పన్నెండు గంటల వరకు అదేదో పత్రిక కి పోటీ కథ వ్రాసి మనస్సంతా ఆ కథ తాలూకా సంఘర్షణతో తల తలతో పాటు హృదయం బరువెక్కిపోయి ఏ తెల్లవారు గట్లో మాగన్నుగా నిద్ర పట్టింది. ఇంతలో మూడు నాలుగు సార్లు ఫోనులు. తూలి పడబోతూ వెళ్లి టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసాను. ” సుందర్ నాగ్ గారేనా మాట్లాడుతున్నది. నేను శివ పరభాషా రచయితను మాట్లాడుతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మీ అనుమతి కోసం నా ప్రయత్నం. నాకు కొద్దిగా సమయం కేటాయించగలరా దయచేసి ” అడిగాడు చాలా మృదువుగానే తెలుగులోనే. నా రచనల గురించి రోజూ కనీసం ఐదారుగురేనా ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ మరీ ఇలా పొద్దున్నే ఫోన్ చేసే వాళ్ళు లేరు. కళ్ళు నులుముకుంటూనే గోడ గడియారం వైపు చూసాను. ఓ మై గాడ్ నేనింకా ఏ ఆరో ఏడో అయ్యుంటుంది అనుకుంటున్నాను. తొమ్మిదయి పోయింది. ” విత్ ప్లెజర్. చెప్పండి శివ గారు “” అన్నాను. ” ఏమీ లేదు సుందర్ గారు వేరే రాష్ట్రంలో చాలా ఏళ్ల క్రితం స్థిరపడిన తెలుగు వాడినే. తెలుగు రచయితలు వ్రాసిన కథలు చాలా చదువుతూ ఉంటాను. ఈ మద్య మీ కథ ” హద్దులు ” ఏదో ఒక పత్రికలో చదివాను. చాలా అద్భుతంగా ఉండి నన్ను విపరీతంగా ఆకర్షించింది. మీరు నాకు అనుమతి నిస్తే ఆ కథను మా ప్రాంతీయ భాషలోకి అనువదించి ఒక ప్రముఖ పత్రికకు పంపాలని నా ప్రయత్నం. అలాగే ముందు ముందు కూడా మీ కథలు మా లోకల్ భాషలోకి అనువాదించాలని నా ప్రగాఢమైన కోరిక ” అన్నాడు అతను. అతని మాటలతో కొద్దిపాటి మత్తుతో తూగుతున్న నాలో ఒక అనిర్వచనీయమైన నూతన శక్తి ఆవరించేసింది. చాలా మంది రచయితలు తమ కథలు వేరే భాషలోకి అనువదింప బడ్డాయని ఒకటే ప్రచారం చేసుకుంటూంటే నా కధలు కూడా వేరే భాషలలో వస్తే చూసుకోవాలన్న కోరిక చాలా రోజులనుండి తొలిచేస్తూ ఉంటుంది. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరబోతోంది అన్న మాట. వచ్చిన అవకాశాన్ని మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చోక శివ గారిని మరిన్ని వివరాలు అడిగిన పిమ్మట వారి భాషలోకి అనువాదించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను. ఈ అనుమతి నిమిత్తం నేను ప్రత్యేకంగా లిఖితపూర్వకంగా ఏమీ ఇవ్వలేదు. శివ మా మధ్య జరిగిన సంభాషనను రికార్డ్ చేసుకుని ఉంటాడని కూడా ఆ సమయంలో నాకు తట్టలేదు. ఇది జరిగిన రెండు నెలలు తర్వాత అనుకుంటా. నాకు శివ నుండి కొంత పారితోషికంతో పాటు నా కథ అనువదింప బడిన కాపీ కూడా వచ్చింది. దానితో ద్విగుణీకృతం అయిన ఉత్సాహం తో నావి మరిన్ని కథలు శివకు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అంతకన్నా ముందు ఆ భాష తెలిసిన ఎవరితోనైనా నా కథ చదివించుకోవాలని ఆత్రుత పడి అటువంటి వ్యక్తుల కోసం అన్వేషణలో పడ్డాను. నా ప్రయత్నం ఫలించింది. అయితే నా కథ అవతలి వ్యక్తి చదివి వినిపిస్తూ ఉంటే నాకు ఊహించని షాక్ తగిలింది. నా కథ చాలా మారిపోవడమే కాకుండా ఎన్నో అశ్లీల సంఘటనలు చోటు చేసుకున్నాయి. నా జీవితంలో ఎప్పుడూ హాస్య కథలే తప్ప ఒక్క శృంగార పదం కానీ, అశ్లీల పదం కానీ పొరపాటున కూడా రానియ్యకుండా జాగ్రత్త పడిన నేను ఈ రోజు ఈ అనువదింప బడిన నా కథనిండా బూతుల మయం చేసిన ఆ మోసగాడు నన్ను నమ్మించి నా కథలో తన ఇష్టం వచ్చిన మార్పులు చేసుకుని నిట్టనిలువునా సొమ్ము చేసుకునే ప్రయత్నం చూసాక కథలను అనువదించే క్రమంలో ఇటువంటి భయంకరమైన మోసాలు కూడా జరిగుతాయాన్న నిజాలు మొట్ట మొదటిసారిగా తెలుసుకున్న నేను మళ్లీ జీవితంలో అటువంటి సాహసాలు చెయ్యక బుద్దిగా నామానాన తోచిన కథలు వ్రాసుకుంటూ ఉండిపోయాను.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!