మురిసిన పుట్టిన రోజు

మురిసిన పుట్టిన రోజు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: గడ్డం దేవీప్రసాద్

ముంబాయిలో ఒక ఐ.టి. సంస్థలో పనిచేస్తున్న కిరీటీ శృతి దంపతులు ప్రాజెక్ట్ పనిమీద నెలరోజుల పాటు నెదర్లాండ్స్ కు వెళ్ళేముందు తమ పదేళ్ల కూతురు లాస్యను వేసవి సెలవులు కావడంతో తిరుపతిలో ఉంటున్న అమ్మానాన్నల వద్ద వదలి వెళ్ళారు. ఇరవై కాపురాలు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో వుంటున్నారు కిరీటి అమ్మానాన్నలు.
కిరీటి అమ్మగారు ఆయుర్వేద డాక్టరు. నాన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు. వచ్చిన కొద్దిరోజులకే లాస్య అక్కడి వారితో ముఖ్యంగా తన ఈడు పిల్లలతో కలిసిపోయింది. ఆరోజు లాస్య పదవ పుట్టినరోజు. వేకువనే లాస్యకు నువ్వులనూనె, కొబ్బరినూనెలకు కాస్త ఆముదం కలిపి తలకు పట్టించి మాడుపై బాగా మర్దనచేసింది వాళ్ళ నానమ్మ. కాసేపు నీరెండలో నించోబెట్టాక నలుగుపెట్టి కుంకుడుకాయలరసంతో తలస్నానం చేసింది. జుట్టు కొద్దిగా ఆరనిచ్చి సాంబ్రాణిపొగ వేసి పొడవుగా ఉన్న లాస్య జుట్టుచిక్కులు తీసి రెండు జళ్ళు వేసింది. ముగ్గురూ తయారై ముందే చేసుకొన్న ఏర్పాట్లతో ఇచ్చిన సమయానికి నేరుగా తిరుమల వెళ్ళి శ్రీవారిదర్శనం చేసుకొని త్వరగానే ఇల్లు చేరారు. సాయంత్రం ఇంట్లో జరిగే లాస్య పుట్టినరోజు వేడుక ఏర్పాట్లలో తీరికలేకుండా తలమునకలయ్యారు. సాయంసంధ్య వేళయింది.
లాస్య కొత్త పట్టుపరికిణీ, దానికితగ్గ రవిక ధరించింది. నానమ్మ రెండు జడలు విప్పదీసి పొడవుగా జడవేసి మల్లెపూలతో అలంకరించింది. కళ్ళకి కాటుక, నుదుట ఎర్రతిలకం పెట్టి కాళ్ళకు కొత్తగా కొన్న వెండిపట్టీలు వేసింది. ముద్దొస్తున్న మనవరాలికి బుగ్గపై చిన్నముద్దు పెట్టింది. పదిహేనుమంది పిల్లలతో బాటూ ఇద్దరుముగ్గురు పెద్దలు వచ్చారు. అందరికీ వడపప్పు, స్టీలు గ్లాసుల్లో పానకం ఇచ్చారు. హాలులో బల్లపై సరస్వతి మాత పటము, దానికి ఇరువైపులా రెండు దీప స్తంభాలు పూలతో అందంగా అలంకరించి వున్నాయి. “లాస్యకు శుభాకాంక్షలు” అని వ్రాసి వున్న రంగురంగుల బెలూన్లు దండిగా వ్రేలాడుతున్నాయి.
“లాస్యకు పదవజన్మదిన శుభాశీస్సులు” అని అందంగా ఉన్న అక్షరాలను దారంతో కూర్చి గోడకు అతికించి వున్నాయి. నానమ్మ లాస్యచేత పూజ చేయించి దీపాన్ని వెలిగింపచేసి, పిల్లలచేత ఒక్కొక్కదిపాన్నీ వెలిగింప చేసింది. బల్లపై ఉన్న ఇత్తడి గంగాళంపై లేసులతో అందంగా కుట్టిన బట్టను తొలగించింది. అందులో ఉన్న మైసూర్ పాకుపై సన్నగా కోసిన పళ్ళ ముక్కలతో “లాస్యకు 10వ జన్మదిన శుభాకాంక్షలు” అనే అక్షరాలు కనిపించాయి. లాస్య చేత దాన్ని కోయించి, ఒక చిన్న ముక్కను తీసి లాస్య నోటికి అందిస్తూ “లాస్య తల్లికి పుట్టినరోజు పండుగ నాడు అభినందనలు. ఆరోగ్యసంతోషాలతో నిండునూరేళ్ళు వర్ధిల్లమ్మా”  అని నానమ్మ తాతయ్య అంటుంటే కొత్తగా కళ్ళెదుట జరుగుతున్న బర్త్ డేపార్టీని ఆశ్చర్యంగా చూస్తున్న అక్కడున్న వారు కూడా అలవోకగా చప్పట్లు చరుస్తూ గొంతు కలిపారు. అందరూ స్వీట్ ముక్కలు తిన్నాక ఇంట్లో చేసిన చేగోడీలు, కారప్పూస పెట్టారు. వచ్చిన పిల్లలందరికీ తెలుగులో ఉన్న బొమ్మలకథల పుస్తకము, కలము, పెన్సిల్ లాస్య చేత ఇప్పించారు.
“నాకు తెలుగురాదు” అంటున్న ఓ కుర్రాడితో  “అదేంటి? మా బడిలో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరైనా నేను మా అమ్మానాన్నల వద్ద ఇంట్లో తెలుగు నేర్చుకున్నాను. నా దగ్గర బోలెడన్ని తెలుగు పుస్తకాలున్నాయి తెలుసా!” అని లాస్య అంటుంటే వచ్చినవారు తెల్లమొహంవేశారు. “చూడండి ఆ పిల్ల నాలుగు భాషలు నేర్చింది. మీరూవున్నారు ఎందుకు?” అని ఒకతను అంటుంటే “అలా అనకండి పెద్దలు మనం ఏది చెబితే పిల్లలు అలా నడుచుకుంటారు” అని నానమ్మ అంది. ఇంతలో లాస్య ఒక్కొక్కరి చేతిలోనూ వెదురుచెంచాతో చల్లగా వున్న మట్టి పిడతలను పెట్టింది. “తినండర్రా! ఉడికించిన చిలగడదుంపల తొక్క తీసి చిదిమి, బెల్లం, నెయ్యి కలిపి కాస్తా ఏలకులపొడి వేసి వాటిల్లో పెట్టాము. ఈ వేసవిలో తినడానికి బాగుంటుంది.” అనగానే అందరూ దాన్ని ఇష్టంగా తిన్నారు. “ఇలాంటి పార్టీ ఎక్కడా చూడలేదండీ. మేమూ ఈసారి ఇలాగే చేస్తాం” అంటూ అందరూ మరోసారి లాస్యకు హ్యాపీ బర్త్ డే చెప్పి వెళ్ళారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!