ఇలా జరిగింది

ఇలా జరిగింది

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నిర్మల బొడ్డేపల్లి

పేరున్న ఒక పెద్ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో, పనిచేస్తున్న, దీప, జానకి ఇద్దరూ స్నేహితులు. ఒకే రోజు నర్స్ డ్యూటీలో చేరినందు వల్ల ఒకరి ఆంతరంగిక విషయాలు పూసగుచ్చినట్లు, మరొకరితో పంచుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ల్యాబ్ డ్యూటీలో ఉన్న జానకి దగ్గరకి వచ్చి ఒక పది నిమిషాల్లో బయటకు రమ్మని పిలిచింది దీప. తను చేస్తున్న పని పక్కనున్న సిస్టర్ కి అప్పజెప్పి దీప కోసం రూమ్ బయటకు వచ్చింది జానకి. “చెప్పు రూపా ఏం జరిగింది? నిన్న సడన్ గా ఎందుకు లీవ్ పెట్టావు?” అడిగింది జానకి.”చెప్తాను” అంటూ జనసంచారం ఎక్కువగా లేని వైపుకి వెళ్లి ఒక బెంచ్ మీద కూర్చొని దీప చెప్పడం మొదలుపెట్టింది. “ఒక ఆడపిల్లకు నా వల్ల తీరని అన్యాయం జరిగింది. ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో కూడా తెలియడం లేదు” కన్నీళ్లు తుడుచుకుంది. దీప “ఊరుకో దీపా ఏమైంది చెప్పు” అనునయించింది జానకి. “ఉదయాన్నే మల్లమ్మ కూతుర్ని కూడా తీసుకొని వచ్చి రాణికి, రాతిరి నుంచీ బాగలేదు. హాస్పిటల్ కి పోదామంటే, పక్కనే ఉన్న డిస్పెన్సరీకి వెళ్లి, టెస్ట్ లు  చేయిస్తే మూడో నెలని డాక్టర్ చెప్పారు. మల్లమ్మ నేను నిర్ఘాంత పోయాం. పెళ్లవకుండా నెలతప్పిన  కూతుర్ని తిడుతూ లబోదిబోమని మొత్తుకుంటున్న మల్లమ్మ వాళ్లను ఇంటికి తీసుకొచ్చి రాణిని గద్దించి అడిగితే మనోహర్ ని చూపించింది. అతన్ని నిలదీస్తే మౌనంగా ఇంటి నుండి నిష్క్రమించాడు”.
దీప భర్త, మనోహర్ ప్రైవేటు కంపెనీలో నైటుషిఫ్టు ఉద్యోగం. దీపకు డే డ్యూటీ. పగలు మనోహర్ ఇంట్లో ఉండడం వల్ల మల్లమ్మ తనకు వీలైనపుడు పని  చేసుకుని పోయేది. ఆమె రానప్పుడు తన బిడ్డ రాణిని పనికి పంపేది. ఎవరో ఒకరు పని చేస్తున్నారనుకున్నదే కానీ పెద్దగా పట్టించుకోలేదు. జరిగిన అనర్ధానికి పరోక్షంగా తను కూడా కారణమే. మల్లమ్మను సముదాయిస్తూ “రాణి వివాహ  విషయం కుటుంబ సభ్యుల్తో చర్చించి నిర్ణయిద్దాం. తను ప్రసవించాక, తల్లీ-బిడ్డల బాధ్యత మాదే మల్లమ్మకు ఎంత నచ్చ చెప్పినా ససేమిరా ఒప్పు కోలేదు. తన మేనల్లుడితో రాణి పెళ్ళి నిశ్చయ మైందని, రాణికి గర్భస్రావం చేయించి, కుటుంబం పరువు కాపాడమని, కాళ్ళ- వేళ్ళాపడి బ్రతిమాలింది. చేసేదిలేక ఆమె చెప్పినట్టే చేసాను.  నాకు ఇంటికి పోబుద్ధి కాక, అమ్మ దగ్గరకు వెళ్లిపోయాను. నైతిక విలువల్లేని మనుషుల్ని చూస్తే అసహ్యమేస్తోంది జానకి. ” దీప చెప్పిన విషయం విని అవాక్కయ్యిందామె. “సరే.. దీపా.. మనసు కుదుట పడ్డాక ఇంటికి వెళ్దువులే ఎక్కువ ఆలోచించకు ” అని చెప్పి పంపిందే కానీ పరి-పరి విధాల ఆలోచిస్తోందామె మనసు. పైకి ఎంతో మంచి వాళ్లలా కనిపిస్తూ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించ గలరా? ప్రతివారూ అనుక్షణం అప్రమత్తంగా వుండాలి. కొన్ని అనుభవాలు కొత్త జీవిత పాఠాలు నేర్పిస్తాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!