క్యాక్టస్

క్యాక్టస్

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జీడిగుంట సీతారామా రావు.

“నీకేం శారదా నోట్లో వెండి చెంచాతో పుట్టావు. మీ వారిది మంచి సక్సెస్ఫుల్ వ్యాపారం, విలాసవంతమైన లైఫ్, ఇంకేం కావాలి జీవితానికి ? ఐ యాం రియల్లీ హ్యాపీ ఫర్ యూ!” “ఔను సావిత్రీ, గమ్మత్తేమిటంటే ఇంత ఆస్తీ, స్థోమతా వుండి నేను, ఇవేమీ పెద్దగా లేని నువ్వూ ఇద్దరం హ్యాపీగానే వున్నాం. సంతోషమంతా డబ్బులోనే ఉందనుకుని ఇంకా ఇంకా సంపాదించాలని ఆరాటపడతారు అందరూ దేనికో అర్థం కాదు”. హాల్లోంచి నా భార్య శారదా, తన ఫ్రెండు మాట్లాడుకుంటున్న మాటలు బెడ్రూంలో కూర్చుని ఫ్యాక్టరీ లెక్కలు చూసుకుంటున్న నా చెవిలో పడుతున్నాయి సన్నగా.’  రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మా ఫ్యాక్టరీ పనితీరుని దారుణంగా దెబ్బతీసింది. ప్రొడక్షన్ పెంచుదామని తీసుకున్న బ్యాంకు లోన్ పెను భారంగా మారింది. పరిస్థితి ఇలాగే ఇంకో నెల సాగితే అప్పులు, ఆస్తులన్నిటిని మింగెయ్యడం ఖాయం. అనుకున్నంతా అయ్యింది. నష్టాలు బాగా పెరగడంతో ఫ్యాక్టరీ, మిగిలిన ఆస్తుల్ని అమ్మేసి అప్పులు తీర్చాక కొద్దిపాటి డబ్బు మాత్రం మిగిలింది. నాదీ శారదదీ ఒకటే మనస్తత్వం. దేనికీ డీలాపడి కృంగి కృసించడం వుండదు. కాయితం తీసుకుని లెక్కలు వేశాం. లెక్కలు రూపం ధరించాయి. ఊళ్ళో కొత్తగా వచ్చిన కాలనీలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఒకటి కొని దాన్లోకి మారిపోయాము. పిల్లలు ఇద్దర్నీ స్కూల్ మార్చి కాలనీలో ఉన్న ఓ స్కూల్లో వేసాము. కారు స్థానంలో కొత్త బైక్ వచ్చింది. ఫ్యాక్టరీ స్థానంలో సెంటర్లో దుకాణం వచ్చింది. మా ప్రయాణం బ్రాడ్ గేజ్ నుంచి మీటర్ గేజ్ కి మారింది. కానీ గమ్యం మారలేదు. ప్రయాణంలో అదే ఆనందం, అదే తృప్తి. “శారద గారూ మీతో పరిచయం పెంచుకుని వీలైనప్పుడల్లా మీ ఇంటికొచ్చి ఎందుకు కూర్చుంటున్నానో తెలుసా? మిమ్మల్ని కబుర్లలో పెట్టి మీ హ్యాపీ ఫ్యామిలీ సక్సెస్ సీక్రెట్ తెలుసుకుందామని !” హాల్లో శారదతో పక్క ఫ్లాట్ ఆవిడ అంటున్న మాటలు బెడ్ రూంలో టీవి చూస్తున్న నా చెవిలో పడ్డాయి. బాల్కనీలో కుండీ లోని క్యాక్టస్ నిలువెల్లా పూలు పూసింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!