చచ్చి బతికినోడు

చచ్చి బతికినోడు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి  

అందగాడు కాకపోయినా ఆరడుగులవాడు అతగాడు. గుబురు మీసాల వాడు.  ఓ గొప్ప యోధునిలా ఆత్మస్థైర్యం, గుండెనిబ్బరంతో ఠీవిగా బలిష్టంగా ఉంటాడు. అతను మా స్కూల్లో తోటమాలిగా పనిచేసేవాడు. మా అందర్నీ అరే, ఒరే ఏరా అని పిలిచేవాడు తప్ప ఏ ఒక్కరినీ పేరు తెలిసినా సరే పేరుతో పిలిచేవాడు కాదు. మా స్కూల్ ఉద్యానవనం, మైదానం చుట్టూ తుమ్మ చెట్లు ఉండేవి. అక్కడక్కడ పాములపుట్టలు కూడా ఉండేవి. ఒకనాడు ఉదయం విధినిర్వహణలో ఉండగా అతడి కుడికాలుపై ఒక నాగుపాము కాటేసి, క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎవ్వరి ఉపచారాలూ ఫలించలేదు. అంతా చాలా భయపడి, ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేశారు. శవాన్ని పాడెకెక్కించి, జాతీయ రహదారి గుండా శ్మశానానికి తీసుకెళ్తుండగా సుమారు అర కిలోమీటరు తర్వాత, శ్మశానానికి ఓ పావు కిలోమీటరు ముందు ఒక అద్భుతం జరిగింది. ఎదురుగా వస్తున్న ఒక కారులోని వ్యక్తికి భరించలేనంత తీవ్రంగా కుడికాలికి నొప్పి వచ్చిందని, కారు ఆపేసి, క్రిందికి దిగి, ఎదురుగా వస్తున్న శవాన్ని చూసి, కూడా ఉన్న గుంపుని ఆపి, “ఇక్కడ ఎవరికైనా పాము కుట్టిందా అని అడిగాడు”. వెంటనే వారు “ఔననీ”, ఈ శవం అదేనని చెప్పేరు.
“ఇతడు ఇంకా చనిపోలేదు, బ్రతుకుతాడు, కట్లువిప్పండి.” అనడంతో, అలాగే చేసేరు వాళ్ళు ఆశాజీవులై. అప్పుడు అతడు ఏవేవో మంత్రాలు శవం చెవిలో చెప్పి, నీళ్ళు తెప్పించి, మంత్రించి, శవంపై జల్లగా, కొద్దిగా కదలాడి కళ్ళువిప్పేడు ఆ శవంలోని మా తోటమాలి అందరూ గగుర్పాటుతో కళ్ళు తేలవేసేలాగ! అప్పుడు కాసిన్ని నీళ్ళు తాగించి, కూర్చోబెట్టి, ఆ తర్వాత ఇంటికి పంపేసి, తానూ తిరిగి వెళ్ళిపోయాడు తన కాలి నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని. ఈ హఠాత్పరిణామానికి చుట్టాలు, బంధువులు, స్కూలు వాళ్ళు, ఊరిలోని జనం అంతా ఆశ్చర్యపోయారు. భగవంతుడే అలా ఆ కారు వాని రూపంలో వచ్చి బ్రతికించేడని అందరూ అతనికి మొక్కేరు విశ్వాసంతో. ఆతర్వాత అతగాడు అదేనండి మా తోటమాలి యధావిధిగా మర్నాటి నుండి స్కూలుకి పనిలో చేరిపోయాడు. ఆ తర్వాత మామూలుగానే దసరా మామూళ్ళకి మా ఊళ్ళకి వచ్చి వెళ్ళేవాడు. అతడి పేరు చెప్పలేదు కదా! అతడి పేరు మీసాల కన్నయ్య. చచ్చి బతికినోడా అనీ, మళ్ళీ పుట్టిన కన్నయ్యా అనీ అతడ్ని సరదాగా అంటుండే వాళ్ళమి. అంతకు ముందు రోజుల్లో భీకరంగా కనిపించే అతను ఇలా చచ్చి బతికిన తర్వాత ఏమి అనినా, ఎలా పిలిచినా చిరునవ్వు నవ్వేసేవాడు తప్ప మమ్మల్నెపుడూ గదమాయించేవాడు కాదు. ఆ తర్వాత సుమారు ఓ దశాబ్దం పాటు చక్కగా దిట్టంగా బతికి, ఆ తర్వాత నిజంగానే సహజగానే మరణం పొందేడు. ఇది కథ కాదు, యదార్థ గాధ.

You May Also Like

One thought on “చచ్చి బతికినోడు

  1. అద్భుతమైన నమ్మలేని నిజం.
    సృష్టిలో ఇలాంటి కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతూ ఉంటాయి,
    అలాంటి ఓ సంఘటననే మీ కలం అద్భుతంగా, క్లుప్తమైన శైలిలో పొందుపరచిన తీరు చాలా చక్కగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!