మాష్టారి మాట బంగారు బాట

మాష్టారి మాట బంగారు బాట

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యం. వి. ధర్మారావు

రామయ్య, సోమయ్య ఇద్దరూ బాల్యంనుండే మంచి స్నేహితులని ఊరు ఊరంతా చెప్పుకునేవారు. చదువుల్లో వెనుకబడినా గాని, ఇద్దరికీ తెలివితేటలు అమోఘం. రామయ్య ఏ వస్తువునైనా ఏ పార్టులకి ఆ పార్టులు విప్పేసి మరలా యధావిధిగా తయారు చేయగల సామర్ధ్యం తన సొత్తు. సోమయ్య అయితే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, కరాటేలో గొప్పగా రాణించాడు ఇలా ఇద్దరూ తమతమ నైపుణ్యాలతో అందరి మనసులు దోచుకోగలిగారు గాని ఎవరెన్ని చెప్పినా చదువులో మాత్రం కాస్త అయినా శ్రద్ధపెట్టేవారు కాదు. వాళ్ళిండ్లలోనూ కూడా చెప్పి చెప్పి ఇక వాళ్ళు వినకపోయేసరికి విసుగుచెంది ఊరకున్నారు. ఒకసారి పాఠశాలలో గోపాల్ అనే సైన్స్ మాష్టారు వీళ్ళల్లో ఉన్న నైపుణ్యాలను తెలుసుకుని, ఇద్దరిలో మార్పు తీసుకువద్దామని చెప్పి రామయ్యని, సోమయ్యని పిలిపించి ఇలా చెప్పసాగాడు.
చూడండి పిల్లలు మీరిద్దరూ ఒకరు మెకానిక్ గాను, మరొకరు కరాటేలోను నైపుణ్యం సాధించారని అందరూ అనుకుంటుంటే విన్నాను శభాష్ అయితే మీకుండే తెలివితేటలకు కాస్త విద్యనేది తోడైతే మీకు సాటెవరూ రారు. రామయ్య నిన్ను పెద్ద పెద్ద సంస్ధలు పిలిచి మరీ జాబు ఇస్తారు. ఇకపోతే సోమయ్య నువ్వు కరాటేలో ఇప్పటికే బ్లాక్ బెల్ట్ సాధించావని తెలిసింది, అయితే ఇక నువ్వు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్ధాయి పోటీల్లో కూడా పాల్గొనాలి. అలాంటప్పుడు నీకు అక్కడ భాష కూడా రావాలి. పైగా చదువు కూడా వుంటేనే ఏ దేశంలో పోటి జరిగినా నిస్సందేహంగా వెళ్ళవచ్చు. కాబట్టి ఇప్పటినుండే చక్కగా చదువుపై శ్రద్ధపెడితే నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. అయితే మీరు మీ జీవితంలో మీరిష్టపడిన రంగంలో ఎదగాలనుకుంటున్నారో లేక ఇంతటితోనే మీరు ఆగిపోదామనుకుంటున్నారో మీ ఇష్టం మరి అని గోపాల్ మాష్టారు అనేసరికి ఆలోచనలో పడ్డారిద్దరూ. ఇద్దరూ ఒకేసారి ఇకనుంచి చదువు పై కూడా శ్రద్ధపెడతాం మాష్టారు. మీరు చెప్పినట్లే వింటామని అనేసరికి గోపాల్ మాష్టారు సంతోషించారు. ఆరోజునుండి రామయ్య, సోమయ్యలు చదువుపై శ్రద్ధపెట్టి చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరిలో ఈ మార్పుని చూసి మిగతా ఉపాధ్యాయులు, వీళ్ళ తల్లిదండ్రులు ముందు ఆశ్చర్యపోయారు, వాళ్ళల్లో మార్పుకి కారణం గోపాల్ మాష్టారని తెలుసుకొని అభినందించారు. రామయ్య, సోమయ్యలు వాళ్ళనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుని, చక్కగా జీవితంలో స్ధిరపడ్డారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!