డాక్టర్ కానూరు లక్ష్మణ రావు (కె. యెల్. రావు )

డాక్టర్ కానూరు లక్ష్మణ రావు (కె. యెల్. రావు )
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: టి. వి. యెల్. గాయత్రి.

ఈ తరం వాళ్లకు తెలియదు కానీ విజయవాడలో ఒక తరం ముందు వాళ్లకు ‘కె. యెల్. రావు ‘ అనే పేరు సుపరిచితము. ఎంతో నిరాడంబరుడైన కానూరు లక్ష్మణరావు గారు భారతదేశము గర్వించదగ్గ మేధావి. ఇంజనీరు, మన దేశంలోని జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో వీరి కృషి మరువలేనిది. వీరు కృష్ణాజిల్లా కంకిపాడు గ్రామంలో 1902 జూలై 15 న జన్మించారు. తండ్రి ప్లీడరు గుమస్తా. తొమ్మిదేళ్ల వయసులో వీరి తండ్రి మరణించారు. పేదరికము వున్నా కూడా వీరు పట్టుదలగా విద్యాభ్యాసము చేశారు. చిన్న వయస్సులో ఆటలాడుతూవుంటే దెబ్బతగిలి ఒక కంటి చూపు కూడా పోయింది. అయినా వీరు కష్టపడి విజయవాడలో మెట్రిక్యులేషన్ పాసై మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఎఫ్. ఎ. ఆ తర్వాత మద్రాసు యూనివర్సిటీలో బి. ఇ. డిగ్రీ తీసికొన్న మొదటి వ్యక్తి కె. యెల్. రావు గారు. ఆ తర్వాత లండన్లో బర్మింగ్హామ్ యూనివర్సిటీ నుండి 1939 లో పిహెచ్ డి చేశారు. విదేశాలనుండి తిరిగి వచ్చి మద్రాసు ప్రభుత్వంలో డిజైన్ ఇంజనీరుగా పనిచేశారు. సిమెంట్ కాంక్రీటు విషయంలో ఆయన చేసిన పరిశోధనలు విశ్వవ్యాప్తంగా కీర్తి గడించాయి. 1960 లో కేంద్రప్రభుత్వం కేంద్ర విద్యుత్ కమీషన్ డిజైన్ డైరెక్టర్ గా నియమించిది. 1958-59, 1950-60 లలో ఆల్ ఇండియా ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సేవలందించారు. 1957-61, 1961-65 లలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సాయిల్ మెకానిక్స్ అండ్ జియో టెక్నీకల్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. 1963 లో కేంద్రప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్ ‘తో సత్కరించింది. 1960 లో ఆంధ్రాయూనివర్సిటీ,1963 లో రూర్కీ యూనివర్సిటి వీరికి డాక్టరేటునందించాయి. కె. యెల్. రావు గారు వ్రాసిన పుస్తకము ‘స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ రీ ఇన్ ఫోర్స్డ్ కాంక్రీటు ‘ ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. ప్రఖ్యాతి చెందిన నాగార్జున సాగర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు కె. యెల్. రావు గారు. వీరు 1961 లో విజయవాడ నుండి కాంగ్రేస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. 1977 వరకూ వరుసగా పార్లమెంటు సభ్యునిగా కొనసాగారు. జలవనరులు, విద్యుత్ శాఖల కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, 1977 లో స్వచ్ఛందంగా రాజకీయాలను వదిలి వేసి ప్రశాంతంగా జీవితాన్ని గడిపి 1986 మే 18 న స్వర్గస్తులయ్యారు. మన దేశము గర్వించదగ్గ ప్రతిభావంతులైన ఇంజనీర్లలో కానూరు లక్ష్మణరావు గారు అగ్రగణ్యులు. మా ఊరు విజయవాడ.
నాకు స్ఫూర్తి ప్రదాతలు, చిరస్మరణీయులు డాక్టర్ కె. యెల్. రావుగారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!