దోసెల పెనం 

అంశం: కొసమెరుపు కథలు

దోసెల పెనం 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : జీడిగుంట నరసింహ మూర్తి

విశ్వానికి ఎప్పటినుండో అణువణువూ ఒక కోరిక తొలిచేస్తూ ఉండేది. బయట స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలోనూ, హోటళ్ళ లోనూ  మందపాటి పెనం మీద వేసే ఎర్రగా కాలే దోసెలు అతన్ని ఒక పట్టాన నిలకడగా ఉండనిచ్చేవి కావు. అదే పనిగా యూ ట్యూబులలో చూపించే రోడ్డు పక్కన బళ్ళ మీద వేసే టిఫిన్లు లొట్ట లేసుకుంటూ చూస్తూండే వాడు. ఎప్పటికైనా వాళ్ళు వేసే మందపాటి పెనం కొని ఇంట్లో వాళ్ళతో ప్రసక్తి లేకుండా తనే దానిమీద దోసెలు ఎర్రగా కాల్చుకుని తినాలి. అదీ అతని కోరిక. ఇంట్లో రెండు మూడు నాన్ స్టిక్ పెనాలు  వాళ్ళూ  వీళ్లూ పండగలూ, పబ్బాలలో చదివించినవి ఉన్నా ఏనాడూ వాటి మీద రుచిగా దోసెలు వేసుకుని  నోరారా ఆస్వాదించినది లేదు.
విశ్వం లాగానే చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆఫీసులో  పని అయిపోయాక రాత్రి పది గంటలవరకు సొల్లు కబుర్లు వేసుకునే అతని మిత్రగళం ఏమీ తోచక వూరు మీద పడి తిరగడం ఒక అలవాటుగా పెట్టుకుంది. ఆ క్రమంలోనే  వాళ్ళ వూళ్ళో గౌరీ శంకర్ టాకీసు దగ్గర ఉన్న  బండిమీద వేసే దోసెలు, పచ్చిమిరప కాయ బజ్జీలు వాళ్ళ జీర్ణ శక్తికి ఒక పరీక్ష పెట్టేవి. రోజూ క్రమం తప్పకుండా టంచన్ గా బండి దగ్గర ప్రత్యక్షమయ్యే విశ్వం ఇప్పుడు ఆ బండి యజమానికి బాగానే పరిచయం అయ్యాడు. విశ్వానికి సినిమా పిచ్చి కూడా బాగా ఉండటంతో గౌరీ శంకర్ టాకీసులో కొత్తగా వచ్చే సినిమాలు, వాటి కలెక్షన్ వివరాలు, అట్టర్ ఫ్లాప్ల మూవీల  గురించి పిచ్చా పాటిగా వాళ్ళ మధ్య సంభాషణలు సాగుతూ ఉండేవి. విశ్వానికి ఆ బండి వాడు పచ్చడి అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో చేసే పల్లీలఎంత కుస్తీ పట్టినా ఎందుకో కానీ  కనీసం రోడ్డు మీద బళ్ళల్లో లాగా చట్నీలు చాలా మందికి ఇళ్ళల్లో  కుదరవు. మెల్లిగా ఒకరోజు ఆ బండి వాడినుండి ఆ కిటుకు కనుక్కున్నాడు.  మైసూర్ బజ్జీలు అంత గుండ్రంగా ఎలా వేస్తున్నాడో చూసి తన సెల్ ఫోనులో వీడియో తీసుకున్నాడు. ఇది ఇలా వుంటే అతన్ని బాగా ఆకర్షించినది దోసెల పెనం. ఒక చిప్పడు పిండిని మొత్తం పెనం అంచుల వరకు  రాసేస్తూ ఉండటం చూశాక విశ్వానికి మతి పోయింది.  ఇంట్లో తల్లీ, పెళ్ళాం ఉన్నారన్న మాటే కానీ ఏ నాడూ దోసె చిరగకుండా పళ్ళెంలో వేయలేదు. తినేటప్పుడు ముక్కలు చేసుకుని తింటారుగా. ఆ ముక్కలేవో పెనమ్మీదే చేసేశాను అంటూ ఒక కుళ్ళు జోకొకటి విసిరేవాళ్లు. బయట హోటళ్లలో దోసెల మీద వేసే ఉల్లిపాయ ముక్కలు సన్నగా రజను లాగా ఎలా తరుగుతారో విశ్వానికి ఇప్పటికీ సరిగ్గా అర్ధం కాదు. మన వాళ్ళు సాంకేతికంగా ఎంతో ఎదిగారు కానీ, ఇంట్లో ఉల్లిపాయలు సమంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే పరికరాలను మాత్రం కనుక్కోలేక పోతున్నారు . ఇలాంటి ఎన్నో ఆలోచనలనుండి  పరిస్తితులు అన్నీ కలిసొస్తే ఒక టిఫిన్ సెంటర్ కూడా పెట్టాలని కోరిక విశ్వం మనసులో మెదులుతూ ఉండేది. టిఫిన్లు చెయ్యడంలో కిటుకులు ఎంతో కొంతో తెలుసుకున్నా, అతని చూపులన్నీ వాళ్ళు వేసే దోసెల పెనమ్మీదే ఉండేవి. ఆఖరికి ఉండబట్టలేక  “బాబూ ఇటువంటి పెనాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా. నేనేమీ వ్యాపారం పెట్టి నీకు పోటీకు వస్తానని భయపడకు. ఇంట్లో అట్లు సరిగ్గా వచ్చి చావడం లేదు ” అంటూ మొహమాటం లేకుండా అడిగేశాడు ఒకరోజు.
“పెనాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కానీ మాలా దోసెలు కాల్చడం అందరి వల్లా కాదండీ బాబూ. దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. పైగా ఆ పెనాలను ఎలా పడితే అలా క్లీన్ చెయ్యడానికి వీల్లేదు. ఏ కొద్దిగా తేడా వచ్చినా అట్లు నల్లగా మాడిపోతాయి. అయినా మీకుందుకు సార్ శ్రమ హాయిగా సాయంత్రాలు నాబండి దగ్గరకు వచ్చేయ్యండి మీరు తిన్నన్న అట్లు తినేయండి. . ఉదయం పూట పార్సిల్ సర్విస్ కూడా ఉంది ” అన్నాడు వాడు తన పని తను చేసుకుంటూ. ఈ బండి వాడే కాదు బహుశా ఏ బండి వాడు కూడా ఈ పెనాల రహస్యం చెపుతాడన్న  నమ్మకం విశ్వానికి లేదు. విశ్వం పడే ఆరాటం గ్రహించిన అతని సహ కస్టమర్ ఒకతను విశ్వాన్ని పక్కకు పిలిచి ” ఏ ఇనప కొట్టులో అడిగినా మనకు కావాల్సిన సైజులో షీటును కోసి ఇస్తారు.  అంత దానికి వీళ్ళను అడిగి అనవసరంగా భంగపడటం ఎందుకు సార్ ?’ అంటూ ఒక ఉచిత సలహా పారేశాడు. విశ్వం  నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ మనసులో టిఫిన్ బళ్లే మెదులుతున్నాయి. ఏదో పేరుకు ఉద్యోగం చేస్తున్నా గొర్రె తోకలాంటి ఎదుగూ బొదుగూ లేని జీతం. కట్నం వస్తుందని ఆశపడి పెళ్లి చేసుకున్నాడే కానీ  సంసారం పెరిగిందే తప్ప  తన ఆర్ధిక పరిస్తితిలో ఎటువంటి మార్పు లేదు. ఎవరెంత ఇస్తున్నారో కూడా లెక్క పెట్టుకోవడానికి చూసుకోలేనంత సంపాదన గడిస్తున్న సినిమా టాకీసు దగ్గర ఉన్న టిఫిన్ బండి వాడిని చూస్తున్నాక తన తక్షణ తదుపరి కర్తవ్యం చిన్న టిఫిన్ సెంటర్ పెట్టడమే అని ఖాయం చేసుకున్నాడు. అదిగో ఆ రోజు నుండి అతని అన్వేషణ ప్రారంభమయ్యింది. అనుకున్నట్టుగానే ఇనప సామాను కొట్టు వాడికి చెప్పి ఒక పెనం కోయించి తెచ్చాడు. దానికి ఒక రోజంతా ఆయిల్ పట్టించి నానబెట్టాడు. ఆ రాత్రంతా దోసెల గురించి  కలాలు కన్నాడు. ఇంట్లో ఎవ్వరినీ పొయ్యి దగ్గ్రకు రావద్దని హుకూం జారీ చేశాడు. ఆ క్షణాలు రానే వచ్చాయి.” ఓ పక్కన కూర్చోండి. ఎర్రగా కాలిన దోసెలు వేసి తీసుకు వస్తాను. మెల్ల మెల్లగా మీక్కూడా ట్రైనింగ్ ఇస్తాను. నాకు నమ్మకం బాగా కుదిరాక మన ఇంటి పక్కనే టిఫిన్ సెంటర్ కు ఏర్పాట్లు చేస్తాను” అంటూ ఇంట్లో తల్లికి, పెళ్ళానికి ఆశలు కలిపించాడు. ఎవరో చెప్పారు మొదట పెసర పిండితో మొదలుపెట్టు అట్టు చిరక్కుండా బాగా వస్తుందని. ఒకసారి దేవుడికి దణ్ణం పెట్టుకుని ఒక చిప్పడు పిండి వేడి వేడి పెనం మీద వేశాడు. అది పెనమ్మీద గుండ్రంగా రాయడానికి ఏ మాత్రం వీల్లేకుండా వేసిన చోటే ఒక పెద్ద ఉండలా ఉండిపోయింది. అటూ ఇటూ చూసి ఆ ముద్దను తీసి డస్ట్ బిన్ లో పడేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు అట్లు చెడిపోయాయి. రానూ రానూ పెనం బాగా కాలి అవే వస్తాయి అని సరిపెట్టుకున్నాడు. ఒక పక్క పిల్లలు, తల్లీ, పెళ్ళాం విశ్వం వేస్తున్న దోసెల కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు. వాళ్ళను నిరాశ పరచడం ఇష్టం లేక పక్కనే వున్న నాన్ స్టిక్ పెనం తీసుకుని దానిమీదే గుట్టు చప్పుడు కాకుండా దోసెలు వేసేసి వాళ్ళ ఆకలి తీర్చేశాడు. కానీ అతని మొహం మాత్రం మాడి పోయిన పెసరట్టు లాగా తయారయ్యింది. అనువణువునా నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నాయి. “అట్లు బాగానే వచ్చి నట్టున్నాయి కదరా. ఇక నువ్వు వచ్చి కూర్చో. నీకు వేసి తెస్తాను “అంది  తల్లి.  ఎప్పుడు వచ్చిందో వెనక నుండి కొడుకు ఇనప పెనం పక్కన పడేసి ఇంట్లో పెనమ్మీదే తంటాలు పడటం చూసింది తల్లి.
రోజులు గడుస్తున్నాయి. అక్షరాలా నాలుగొందలు పెట్టి కొన్న పెనం కాస్తా మాడి బొగ్గులా అవుతోంది తప్ప ఒక్క అట్టు కూడా సవ్యంగా వచ్చిన పాపాన పోలేదు. నెల రోజులు వచ్చే గ్యాస్ బండ ఇరవై రోజుల లోపే అయిపోయింది. ఏదో టిఫిన్ సెంటర్లో ఆ పెనాన్ని  చూపిస్తే  వరసగా నాలుగు రోజులు ఇటుక రాయితో తోమితే అట్లు బాగా వస్తాయి అని సలహా ఇవ్వడంతో ఆఫీసుకు సెలవు పెట్టి అయినా సరే ముందు పెనం పని పట్టాలని అనుకున్నాడు  విశ్వం. వంటింట్లో ఎక్కడ వెతికినా పెనం కనపడలేదు. ఇంట్లో ఎవరూ దాని గురించి చెప్పక నోరు నొక్కుకుని కూర్చున్నారు. కోపం వచ్చి అందరినీ బూతులు తిట్టడంతో ” బామ్మ ఆ పెనాన్ని ఇనప సామాన్ల వాడికి అమ్మేసింది ” అంటూ భయం భయంగా చెప్పాడు చిన్న కొడుకు . మొదట్లో విపరీతంగా వాళ్ళ మీద కోపం వచ్చి వీరంగం వేసినా ఆ రోజు రాత్రి నుండి విశ్వానికి ఇంటికి తెచ్చుకున్న  పీడ విరగడైనట్టయ్యి ఒళ్ళు ఎరగకుండా హాయిగా నిద్ర పడుతోంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!