ఓ సారి మన ఊరికి రండి

 ఓ సారి మన ఊరికి రండి

రచయిత:: రామకృష్ణ. డి

       మా ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్లో మా ఉష బాప్ప కనిపించింది. పది సంవత్సరాల తరువాత. చూడగానే నా కళ్ళు అమితానందంతో “ఏం బాప్పా బాగున్నారా..? ఎన్నాళ్ళకు కనిపించావు.!” అంటూ ఆశ్చర్యంతో పలకరించాను.
“హా..!! బాగున్నాను రా రవి. ఎంత పెద్దవాడివి ఐపోయావు. అమ్మా నాన్న బాగున్నారా..?” అంటూ ఆరాతీసింది.
“బాగున్నారు. ఇంతదూరం వచ్చి ఊరు రాకుండా వెళ్లిపోతున్నారు ఏంటి బాప్పా..?”
“బాగా దగ్గరి బంధువుల పెళ్లి ఉంటే మన పక్కూరు పెళ్లికి వచ్చాను, ఏమోరా మన ఊరు రావాలి అంటే ఏదో వెలితిగా ఉంటుంది నాకు.” బాధ పడుతూ చెప్పింది.
“సర్లే బాధ పడకు బాప్పా. మరి మావయ్య, మీ కూతురు రాలేదా..?”
“లేదు, వాళ్ళకి వ్యాపారం కాలేజీ ఉన్నాయి. అందుకే ఒక్కదాన్ని వచ్చాను” బదులిచ్చింది.
మరి నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నావు. మర్చిపోయావా..?” అంటూ నవ్వుతూ అడిగాను.
“నువ్వు ఇంకా మర్చిపోలేదా..?” నవ్వుతూ నా తలపై చెయ్యి వేసి నా జుట్టు నెరిపింది.
“లేదు బాప్పా…” సరదాగా నవ్వేసాను.
“ఉండు బాప్పా, నీకు హైద్రాబాద్ కి, నాకు వైజాగ్ కి టికెట్ తీసుకొని వస్తా” అని చెప్పి టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను.

* * * *

“కోడలా..! కోడలా..!” కొంచెం ఆయాసంతో పిలుస్తుంది. డబ్బై ఏళ్ల గౌరమ్మ.
అమ్మతో పాటు నేను కూడా ఇంటి నుండి బయటకి వచ్చాను.
నీ కోసమేరా పిలిచాను. “నాయన్నాయన… ఇలా కొట్టుకి వెళ్లి ఓ ఐదు రూపాయలు ఉల్లిపాయలు తీసుకురారా..!! చచ్చి నీ కడుపులో పడతాను.” అంటూ నా చేతిలో ఓ ఐదు రూపాయలు పెట్టింది. “నాన్నమ్మకి తెచ్చీరా… పాపం ఎండన పడి వచ్చింది” అంటూ అమ్మ కూడా ఆజ్ఞ జారీ చేసింది.
రయ్యిమంటూ పరిగెత్తుకు వెళ్ళాను.
ఊరి చివరన ఉన్న మా షావుకారి గారి కొట్టు ఉష బాప్ప కొట్టు. ఇంకో చివరన ఉన్న నాయనమ్మ అప్పుడప్పుడు మా ఇంటి దాకా వచ్చి కొంచెం ఆయాసంతో నన్ను బ్రతిమాలేది “కొట్టుకి వెళ్ళరా నాయనా” అంటూ…
పదేళ్ల వయసున్న నేను
ఒక్క నిముషంలో పారిగెత్తుకెల్లేవాణ్ణి అలాంటిది నాయనమ్మ కి ఐతే ఓ పది నిముషాలు నడకే.
ఓ సారి పోపులు ఒక రెండు రూపాయలవి తెమ్మంది.
మా షావుకారి బాప్ప ఉష కంగారులో సరిగ్గా పోపులు పొట్లాం కట్టలేదు. అది గమనించని నేను రయ్యి మంటూ వస్తుండగా పొట్లం ఒక పక్కగా పోపులు అన్నీ నేల పాలు ఐపోయాయి. పొట్లం పేపరు మాత్రమే నా చేతిలో ఉంది. నేల జారిన పోపుల్ని ఎలా ఏరాలో తెలియక ఇబ్బంది పడుతున్నా… ఎండలో చెమట్లు ఎక్కిపోతున్నా చూసే వారంతా ‘ఏంట్రా..? డబ్బులు గానీ పారేసుకున్నావా ఏంటి’ అంటున్నారు. సిగ్గుతో ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నా.
ఇదంతా దూరం నుండి గమనిస్తున్న మా అమ్మ, నాన్నమ్మ గౌరమ్మ నా వద్దకు వచ్చారు. ఏం జరిగిందో గ్రహించిన మా అమ్మ ఇక తిట్ల దండకం మొదలు పెట్టింది. దూరంగా వింటున్న ఉష బాప్ప కూడా వచ్చేసింది. కోపం కొంచెం కొంచెం ఎక్కువ అయ్యి మా అమ్మ “నీకు ఎంత అజాగ్రత్త రా..!” అంటూ చెయ్యి లేపింది. “అయ్యో! కోడలు పిల్లా, నాకు సహాయం చేస్తున్న నీ కొడుక్కి నా వల్ల కొట్టడానికి సిద్దం ఐపోయావా.! వాడ్ని ఏమి అనకు అని అడ్డుకుంది.
“ఉష నా ఖాతాలో మరలా పోపులు అత్తయ్యకు ఇచ్చేయ్.” అని చెప్పింది ఉష బాప్పకి.
“లేదు.. లేదు… నేను మరలా డబ్బులు ఇస్తాలే ఇవ్వు” అంది నాన్నమ్మ.
తప్పు నాది కూడా ఉంది నేను పొట్లాం సరిగ్గా కట్టలేదు, అందుకే అవి పోయాయి. కాబట్టి మీరు డబ్బులు ఇవ్వొద్దు, మీ ఖాతాలో కూడా రాయను. అలాగే రవి అల్లుడ్ని కూడా మరేమీ అనకండీ” అంటూ పోపులు ఇచ్చింది. తన ఔదార్యం చాటుతూ…

ఊరిలో ఉన్న ఒకే ఒక్క షాపు మా ఉష బాప్ప షాపు. ఇంకొంతమంది షాపు పెట్టినా ఎవ్వరూ నిలదొక్కుకోలేదు. బాప్ప అంటే నాకు దగ్గరి చట్టం కాదు. ఊరిలో అందరకీ బంధువు లెక్కే… ఆవిడ మాటలు, మర్యాదలు, పద్ధతులు అంత బాగుంటాయి. వాళ్ళమ్మకి ఒక్కగానొక్క కూతురు. తండ్రి లేడు. ఉన్న ఒక్క కొట్టు చూసుకుంటూ అమ్మని కూడా చూసుకుంటుంది. ఊరిలో అందరి యోగ క్షేమాలు తెలిసిన అమ్మాయి.
కొన్నాళ్ళకు ఉష బాప్పకి పెళ్లి అయ్యింది. ఉన్న ఊరు వ్యాపారం బాగుంది అని అల్లుడు ఇళ్ళరికం కూడా వచ్చాడు. వారికి ఒక పాప కూడా పుట్టింది. అంతా సంతోషం అనుకున్నారు.
కానీ..! అల్లుడు ఆ వ్యాపారం ఈ వ్యాపారం అంటూ అన్నింటిలో తల దూర్చి, ఒక స్థిరత్వం లేక ఊరి నిండా అప్పులు పాలు ఐపోయారు. ఊరిలో ఉష భర్త కోసం తెలిసినా ఉష ముఖం చూసి అప్పులు ఇచ్చేవారు.
ఓ సారి మా బంధువులు ఒకాయన మా ఇంటికి వచ్చారు. పనిలో పనిగా “అబ్బాయ్, కొట్టుకి వెళ్లి ఒక సిగరెట్ తీసుకురా!” అని చెప్పాడు.
అప్పుడే నూనూగు మీసాలు వస్తున్న నాకు ఉష బాప్పకి ఒక సిగరెట్ ఇమ్మన్నాను. “ఏరా.! రవి. నువ్వు కూడా అప్పుడే వ్యసనాలు నేర్చావురా అన్నాడు” కొట్టు దగ్గర ఉన్న పెద్దమనిషి.
“అదేం లేదు బాబాయ్. రవి చాలా మంచి వాడు. సిగరెట్ అడిగాడు అంటే అది తనకోసం కాదు. అది వేరే వారి కోసం.” అని ముక్తాయించి చెప్పింది.
ఊరిలో ఉన్న కుర్రవాళ్ళ అందరి బాగోగులు తెలిసిన ఉష బాప్ప వ్యసనం లేని మంచి వ్యక్తుల జాబితా ఓ పది మంది పేర్లు లో నా పేరు కూడా ఉంచింది. ఆ విషయం ఎప్పుడూ మా అమ్మతో చెప్తూ “వదినా..! నా కూతుర్ని ఎప్పటికైనా మీ రవి బాబుకి ఇచ్చేస్తా వదినా… కాదనకు మీ రవి అంటే నాకు చాలా ఇష్టం.” అని సరదాగా అంటే మా అమ్మ పొంగి పోయేది. నాతో కూడా అలా చెప్పేది.
కొన్నాళ్లకు ఉష బాప్ప కుటుంబానికి కష్టాలు ఎక్కువ అయ్యాయి. అప్పుల బాధలు కూడా చాలా పెరిగిపోయాయి. బాప్ప భర్త స్తిరత్వ లోపం ఒక ఎత్తైతే అతని వ్యసనాలు వారి కష్టాలకు ఇంకో కారణం. ఉష బాప్పకి ఏం చెయ్యాలో తెలియక ఉన్న ఇల్లు కొట్టూ మిగతా ఆస్తి మొత్తం అమ్మేసి అప్పులు తీర్చి, ఉన్న పళంగా బ్రతుకు తెరువు కోసం హైద్రాబాద్ వెళ్ళిపోయారు. ఊరిలో ఉన్న పెద్దా చిన్నా ఏమి చెయ్యలేక ఉష బాప్ప కోసం బాధ పడ్డారు.
* * * *
ట్రైన్ టికెట్ ఇచ్చాను. బదులుగా నాకు డబ్బులు ఇచ్చింది బాప్ప. “వద్దులే బాప్ప, నా దగ్గర డబ్బులు ఉన్నాయి” అని చెప్పాను.
“హైద్రాబాద్ లో మీరు క్షేమంగా ఉన్నారు కదా..!” బాప్పని అడిగాను.
“హా ఉన్నాం రవి. ఇప్పుడు మీ మావయ్య లేని పోని ఆలోచనలు వ్యాపారాలు ఆపి, ఒక పెద్ద కంపెనీ కి సంబందించిన క్వార్టర్స్ లో చివరన ఒక కొట్టు పెట్టి వచ్చిన దాంతో సంతోషంగా ఉన్నాం.” ఆనందంతో హుందాగా చెప్పింది.
అన్నట్టు మీకో ముఖ్య ఆహ్వాన విషయం “ఇంకో ఇరవై రోజుల్లో నా పెళ్లి. మీరు తప్పకుండా నా పెళ్ళికి రావాలి. మన ఊరు వారి అందరకీ మీరు ఒకసారి కనిపించి వెళ్ళండి. మీరు ఎక్కడ ఎలా ఉన్నారో అంటూ ఊరిలో అందరూ అనుకుంటున్నారు” అని చెప్పాను.
“అవునా..! రవి. తప్పకుండా వస్తాను. నీ పెళ్లి కారణంగా ఐనా వచ్చి మన ఊరి వారి అందర్నీ ఓ సారి పలకరించి వెళ్తాను” అంటూ నవ్వుతూ సెలవు తీసుకుంది ఉష బాప్ప. మాటల్లోనే వైజాగ్ వచ్చింది, బాప్పకు వీడ్కోలు చెప్పాను.
అనుకున్నట్టుగానే ఇరవై రోజుల తర్వాత నా పెళ్ళికి వచ్చింది. చిన్నప్పటి నుండి ఊరిలో అందరి మధ్య కలివిడిగా సంతోషంగా ఉన్న ఉష బాప్పను చూసి ఊరి జనాలు కూడా సంతోషించి మాట మంచి మాట్లాడారు. ఉష బాప్ప కూడా ఆనందించింది.

***

You May Also Like

2 thoughts on “ఓ సారి మన ఊరికి రండి

  1. థాంక్యూ భావన గారు.. మీ ఆత్మీయ అభిమాన సమీక్షకు ధన్యవాదాలు…👍👍🙏🙏

  2. ఇది కథే అయినా…ప్రతి వారికి ఇలాంటి జ్ఞాపకం ఒకటి ఖచ్చితంగా ఉంటుందనుకుంటా రామకృష్ణ గారు…. ఇప్పుడెన్ని సూపర్ మార్కెట్లు వచ్చేసినా, వీధి చివర ఉన్న చిల్లర కొట్టు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే……

    కథ బాగుందండీ చిన్నప్పటి జ్ఞాపకాన్ని నెంబర్ వేసుకున్నట్టుగా అనిపించింది నాకైతే..😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!