పరోపకారం

 పరోపకారం

రచయిత: నాగ మయూరి

నాన్న ఎంత చెప్పినా మా మాట వినరేంటి. కనీసం నువ్వు అయినా నాన్న గారికి చెప్పచ్చు కదా అమ్మ. కొడుకులు ఇద్దరం ఉద్యోగస్థులమై పెద్ద హోదాలో ఉన్నాం. దేనికీ లోటు లేదు కదా హయిగా కూర్చుని తినకుండా నాన్న ఇంకా కష్టపడతానంటారేంటి. అంటూ పెద్దవాడు….

పైగా ఆ చిల్లరకొట్టు నడపడం మానరు. మా స్నేహితులు అందరిలో మా పరువు తీయడానికా అంటూ చిన్నాడు….

రాజయ్య, చిట్టెమ్మ దంపతులను నిలదీస్తున్నారు.

రాజయ్య మాత్రం తమ చిల్లరకొట్టు మూసే ప్రసక్తే లేదని కొడుకులకి తేల్చి చెప్పి, కొట్టు దగ్గరకి వెళ్ళిపోయాడు.

కొడుకులు ఇద్దరూ తల్లి దగ్గర చేరి, ఎందుకు అమ్మా ఈవయసులో కొట్టులో కష్టపడటం అంటూ నచ్చజెప్పబోయారు.

వారి మాటలకి చిట్టెమ్మ “చూడండి బాబు చెట్టు ఎంత ఎదిగినా దాని మూలాలను విడవదు. అలాగే మనం కూడా ఉండాలి” అని మీనాన్న అభిప్రాయం.ఊర్లో బ్రతుకు తెరువు లేక పసివాళ్ళయిన మీ ఇద్దరినీ తీసుకొని ఇక్కడికి వచ్చాం.అప్పటికి ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది.అక్కడ అక్కడ విసిరేసినట్టుగా కొన్ని ఇళ్ళు మాత్రమే ఉండేవి.మిగిలినవన్నీ ఖాళీ స్థలాలే. ఎవరికి ఏం కావాలన్నా ఐదు మైళ్ళ దూరం వెళ్ళాల్సిందే.ఇక్కడ ఇళ్ళలో నేను, మీ నాన్న పనులు చేస్తుండే వాళ్ళం. నాన్న తీరిక వేళల్లో ఇక్కడ ఉండే కొంతమంది పెద్దవారికి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చి పెట్టేవారు.
వారిలో సుందరయ్య గారి దంపతులు మేము పడుతున్న కష్టాన్ని, అక్కడి వారికి సహయపడుతున్న తీరుని చూసి మమ్మల్ని ఇలా చిల్లరకొట్టు పెట్టుకోమని సలహా ఇచ్చారు.
దానికి కావల్సిన పెట్టుబడి కూడా సుందరయ్య గారే పెట్టారు.ఆ నాటి నుంచి మా జీవితాలకి ఒక దారి దొరికింది. మిమ్మల్ని ఇద్దరినీ చక్కగా చదివించుకోగలిగాం. అలాంటిది ఇప్పుడు ఎలా వదిలేయగలం” అంటూ వివరించింది.
దానికి పిల్లలు చూడమ్మా అప్పటి పరిస్థితి అది కానీ ఇప్పుడు అలా లేదు కదా. పారిశ్రామికీకరణ పేరుతో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది బహుళ అంతస్థుల భవంతులు వెలిసాయి. ఇంకా ఇక్కడికి దగ్గరలో చాలా షాపింగ్ మాల్స్ వచ్చాయి.ఇప్పుడు మన దగ్గర కొనేవారు లేరుకదా…అలాంటప్పుడు ఈ చిల్లరకొట్టు తీసేస్తే నష్టం లేదులే అన్నారు.

ఆ మాటలకి చిట్టెమ్మ నొచ్చుకుంటూ ఏమో ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చి మా దుకాణానికి వస్తారో… ఆ రోజున మాకు లాభం రాకపోయినా వాళ్ళ అవసరం తీర్చమాన్న తృప్తి అయినా మిగులుతుంది కదా అంటూ పెరట్లో పనులు చూసుకోడానికి వెళ్ళింది.

ఇంక చేసేదేమి లేక కొడుకులు ఊరుకున్నారు….

కాలక్రమంలో ఎవరు ఊహించని మాయదారి రోగంతో ప్రజలు విలవిలాడి పోతున్నారు. బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. ప్రభుత్వం అన్ని సంస్థలకు సెలవులు ప్రకటించి, లాక్ డౌన్ విధించింది. షాపింగ్ మాల్స్ అన్నీ మూతపడ్డాయి.
ఇప్పుడు ఆ ప్రాంతవాసులకు రాజయ్య చిల్లరకొట్టే శరణ్యమయ్యింది.

జనాలతో కళకళలాడుతున్న దుకాణాన్ని చూసి కొడుకులు ఆశ్చర్యపోతుంటే, రాజయ్య.చిట్టెమ్మ దంపతుల కళ్ళలో పరోపకారం చేస్తున్నామన్న తృప్తి కనిపిస్తోంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!