తరాల తరబడు ఙ్ఞాపకం

 తరాల తరబడు ఙ్ఞాపకం

రచయిత:సత్య కామఋషి ‘ రుద్ర ‘

అది సుమారుగా పాతిక ముప్పై ఏళ్ల క్రితం నాటి మాట. నా వయస్సు ఇంచుమించుగా ఐదు ఆరేళ్లు ఉంటుంది. వేసవి సెలవుల కోసం ఆశగా ఎదురుచూసే వాళ్ళం. నేను నా ఇద్దరి తమ్ముళ్ళు కలిసి. ఎప్పుడెప్పుడు ఇస్తారు అమ్మమ్మ వాళ్ల ఊరు ఎప్పుడెప్పుడు వెళదామా అంటూ కాచుకొని కూర్చుని వాళ్లం.

అక్కడకెళ్ళి అది చెయ్యాలి, ఇలా చెయ్యాలి..ఏవేవో ప్లాన్లు వేసుకునేవాళ్ళం. అలాగే అనుకున్న విధంగానే సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ ఇంటి దగ్గర రెక్కలు కట్టుకు వాలిపోయేవాళ్ళం కూడా.

ఛాలా సరదాగా ఆనందంగా ఉండేది. మామయ్య వాళ్ల పిల్లలు, ఇంకా మాలాగే వచ్చిన పిన్నమ్మ వాళ్ల పిల్లలు..ఇలా అందరం కలిసేవాళ్ళం. మేమే ఒక చిన్న వానర సైన్యం లాగా అమ్మమ్మ వాళ్ల ఇల్లు చిన్న కిష్కింద లాగా అయిపోయేది ఒక పది పదిహేను రోజులపాటు.

అల్లరి ఆటలు..ఆకతాయి చేష్టలు..అమ్మమ్మ చేతి రకరకాల తాయిలాలు. భలే ఉండేవి ఆ రోజులు. ఎప్పటికీ మరచి పోలేనంతగా. అలా, ఆ రోజుల మరపురాని ఙ్ఞాపకాలలో ఇంకొకటి, ఆ వీధి చివర ఉండిన చిల్లర కొట్టు. అందులో మాకెప్పటికీ గుర్తుండిపోయే ‘బడ్డీ కొట్టు మామయ్య. అవును మేము అలాగే పిలిచేవాళ్ళం  అందులో ఉండే ఆయనను.

మేము వెళ్ళినప్పుడల్లా, ఆయన కూడా “ఏమి కావాలి అల్లుళ్ళూ” అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. డబ్బులు లేవని చెప్పినా కూడా , ” పర్వాలేదులే , నేను మీ అమ్మమ్మ దగ్గర వసూలూ చేసుకుంటాలే” అంటూ ఏది కావాలంటే అది మా చేతిలో పెట్టేవాడు. అలాగే వచ్చి అమ్మమ్మకు చెబితే , తను కూడా మమ్మల్ని ఏమి అనేది కాదు. ఎదురు “డబ్బులు నేను  ఇచ్చేస్తాలే అంటూ, నవ్వి ఊరుకునేది.

అదే అదుపు , అవకాశం మాకు. మాట్లాడితే అందరం కలిసి పొలో అనుకుంటూ ఆ కొట్టు దగ్గరకు పోయేవాళ్ళం. ఐదు పైసల గొట్టాలు, పప్పుండలు, పిప్పిరమెంటు బిళ్ళలు, కొబ్బరి ఉండలు , బిళ్ళలు, పాపిన్సు ఇలా రకరకాలు.. కలర్ ఇంకా నిమ్మకాయ సోడాలు, డ్రింకులు, అబ్బో చాలా పెద్ద చిట్టానే ఉండేది. ఎవరికి నచ్చింది వాళ్లు పట్టుకుని పరుగు తీసేవాళ్ళం. అలా మేమే సెలవులు నుండి తిరిగి వచ్చేసరికి , అమ్మమ్మకి ఎంత మోపు అయ్యేది కూడా తెలిసేది కాదు.

ఇది కాక , పెద్ద మనవడినని ముద్దు చేస్తూ , అప్పుడప్పుడూ తాతయ్య ఎవరికీ తెలియకుండా నన్నొక్కడినే ప్రత్యేకంగా తీసుకపోయి,ఆయనకు వెలుగు చుట్టలు కొనుక్కొని, నాకు ఏమి కావాలంటే అవి ఇప్పించేవారు. మళ్లీ ఇంటికి తీసుకెళితే అందరికీ వాటా ఇవ్వవలసి వస్తుందని అనుకోని, ఇంటికి చేరుకునేలోపే మొత్తం స్వాహా చేసేసేవాడిని.

అదీ కాకుండా మధ్యమధ్య లో మామయ్య కూడా. కొట్టు దగ్గరకు తీసుకపోయి , ఆయన ఒక సిగరెట్ దమ్ము లాగుతూ ఉండేవారు. నేను నా పనిలో ఉండేవాడిని. అలా  వేసవి సెలవులు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రోజులు తలచుకుంటూంటే, భలే నవ్వొస్తూ ఉంటుంది. మళ్లీ ఆ రోజులు తిరిగి వస్తే బాగుండునని కూడా అపిపిస్తూ ఉంటుంది.

అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, అభివృద్ధి, ఆధునీకరణ మంత్రం వల్లిస్త, రకరకాల పోకడలతో,  కాలం ఎంతో వేగంగా కరిగిపోతుంది. ఆపాత ఙ్ఞాపకాలను మనకు మిగులనియ్యక త్వరలో కలిపేసుకుంటూ. కానీ ఇన్ని సంవత్సరాలు, అంటే  ముందు చెప్పినట్టుగా  రమారమి ముప్పై ఏళ్లు తరువాత  కూడా ఆ బడ్డి అక్కడ అలాగే ఏమాత్రం మార్పు లేకుండా, చెక్కు చెదరకుండా అలాగే ఉండటం. అలనాటి, నా చిన్ననాటి ఙ్ఞాపకాల చెరగని ఆనవాలుగా. నమ్మడానికి  విడ్డూరంగా ఉన్నా ఇది నూటికి నూరుపాళ్ళ నిజం.

అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే వ్యత్యాసం. ఆ రోజుల్లో, ‘బడ్డీ కొట్టు మామయ్య’గా.మేము పిలుచుకున్న ఆ ముప్పై ముప్పై రెండేళ్ల  వ్యక్తి , ఇప్పడు వయసు మీదపడి అప్పుడు ఉన్నంత చురుకుగా, చలాకీగా లేకపోవడం. మరొక్కటి, ఆ రోజుల్లో , నేనే చంటి పిల్లిడిలా, మా తాతయ్య లేదా మామయ్య వెనుక వెళ్ళేవాడిని. ఆత్రంగా, ఆశగా ఎగబడుతూ.  ఇప్పడేమో, నేను నా ఇద్దరి పిల్లలను వెంట తీసుకువెళుతున్నాను, వాళ్ళు నా వెంటబడి ఎగబడుతుండగా.

అప్పటి ఆ కొట్టు, నా గతం తాలూకు ఓ తియ్యని ఙ్ఞాపకం. ఇప్పటి అదే కొట్టు, నా పిల్లలకు నా గతం తాలూకు ఒక చక్కని కథ. ఇంకా వారి రేపటి భవిష్యత్తులో వారికి గుర్తుండి పోయే , ‘బడ్డీ కొట్టు తాతయ్య’గా గుర్తుండిపోయే, ఈ నాన్నతో ముడిపడిన నేటి గతం తాలూకు ఙ్ఞాపకం.

***

You May Also Like

One thought on “తరాల తరబడు ఙ్ఞాపకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!