నా ప్రాణ విభుడు

నా ప్రాణ విభుడు

రచయిత :: సావిత్రి కోవూరు 

వగరు చిగురులు మేసే ఓ కోకిలమ్మ – పరుగున నీ స్వరము సవరించ కమ్మా,
నా విభుడు వచ్చాక సరిగమలు పాడు.

చిరు జల్లు  కురిసేటి ఓ నీలి మేఘమా  – పన్నీటి జల్లులు కురిపించ కమ్మా,
నా చెలికాడు వచ్చాక చిలకరింతువు గాని.

తావులను విరజిమ్ము ఓ విరుల రెమ్మా – పరిమళములు ఇప్పుడే  ఒలికించ కమ్మా,
నా నాథుడొచ్చాక ముదమొందునో ఏమో.

మబ్బులో దాగిన ఓ చందమామ – మబ్బు తెరలు జరిపి  ఇప్పుడే కాన రాకమ్మా,
నా మదినేలే వాడొచ్చి మురిసి పోయెను.

జల జల రాలేటి ఓ జాజి కొమ్మా –  జాగు చేసి నీవు కొంత తాళమ్మా,
నా రేడు నిను చూసి సంతసించేను.

ప్రశాంతముగా వీచు పవన వీచికలార – పరుగున పరుగున మీరు భువికి రాకండి,
నా ప్రభువు వచ్చాక పరవశించేను.

ఫలము లెన్నో తిని పలికేటి చిలుక –  పలుకులు ఇప్పుడే పలుక బోకమ్మా,
నా ప్రాణ విభుడొచ్చాక పలకరించేను.

పరవళ్ళు తీసేటి సెలయేరులారా –  తొందరేమి లేదు మీరు పరుగులాపండి,
నా రేడు వచ్చాక పదము కదిపేను.

తళతళలాడేటి ఓ తార లారా –  తళుకు బెళుకు లన్ని ఆపి పెట్టండి,
నా పతి దేవుడొచ్చాక తన్మయం చెందు.

జగమంతా మురిపించు ఓ వెన్నెలమ్మా –  వేగంగా
నీవు ఇలకు రాకమ్మా – ఒంటిగా నేనుండ ఓపకున్నాను,
నా రాజు వచ్చి నన్ను చేరాక, వెన్నెల్ల జల్లుల్ల తాన మాడేము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!