ఎందుకిలా?

ఎందుకిలా?

రచయిత :: మంగు కృష్ణకుమారి

రణరంగాన్ని తలపిస్తూ నా వంటిల్లూ కూరల కటర్ ఒకపక్కా, తరగాల్సిన కూరలు ఒకపక్కా, కాఫీపొడి పక్కన పంచదారా ఏనాడు దొరకవు!

ఆవాల డబ్బా అనుకొని తీస్తే శనగపప్పు, ఇడ్లీకి నానపెడదాం అని డబ్బా తీస్తే అటుకులు, అటుకుల కోసం చూస్తే
శనగలు! పల్లీల కోసం వెతికి వెతికి కొత్తిమీర చెట్నీ చేసేసి పోపు గింజల
డబ్బా తీస్తే అందులో పల్లీలు!

‘స్టౌ వెలుగుతూ ఉంటే వెనకాతల అల్మారా తీయకు, ముందే తీసుకో’
కమ్మటి కాఫీ లొట్టలేసుకుంటూ
తాగుతూ శ్రీవారి ఉచిత సలహా!

ఒళ్ళు స్టౌ కన్నా భగ్గుమంటూ ఉంటే
‘ఒక్క రోజు చేయండి సర్! మీ సత్తా చూపండి’ అందాం అనుకొని వెర్రి
మొహం వేస్తూ చూసేను.

ఉద్యోగం చేస్తూ పిల్లలకి అత్తమలకి, వచ్చేపోయే చుట్టాలకి అలవోకగా
చేసేసిన మనిషినేగా, నైట్ డ్యూటీలు చేసే మరిదికి రాత్రి రెండుకి కూర వేడిచేసి, చపాతీలు అప్పటికప్పుడు చేసిన దాన్నేగా! సదా జంతికలూ, చేగోడీలు
డబ్బాల్లో ఉంచేదాన్నేగా!

ఇప్పుడేమిటి? ఇద్దరికి
చేయడానికి ఇంత యాతన? నాలుగు సామాన్లు‌ పొట్లాలు విప్పలేక అలాగే అల్మారాలో తోసీడం!
ఏ పండక్కో ఇంత పులిహార కలిపితే అదే పెద్ద విశేషం అనుకోడం!

ఎందుకిలా అయేను? ఏం వచ్చింది నాకు! అవును, తెలుస్తోంది నాకు
ముసిలితనం వచ్చేసింది! చెప్పుకోలేని దిగులు కమ్మేస్తున్నాది! కోవిడ్ విషవలయంలో చిక్కుకుంటే
ప్రాణవాయువు అందకపోతే
ప్రాణానికి ప్రాణమయిన మనవలని కొడుకునీ కోడలనీ ఆఖరి చూపులు
లేకుండానే కన్ను మూస్తాననే దిగులు
కన్నా, అక్కడ రాలేక మానలేక వాళ్ళెంత కుమిలిపోతారో అన్నబెంగ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!