పట్టిన దెయ్యం వదిలింది

పట్టిన దెయ్యం వదిలింది

రచన: కమల ముక్కు (కమల ‘శ్రీ’)

గోపాలరావు ఆ ఊర్లోనే మోతుబరి రైతు. తాతలు సంపాదించిన ఆస్తి ని రెట్టింపు చేశాడు తన చెమట చిందించి. అతనికి ఇద్దరు కొడుకులు రవి, రాజేష్… ఒక్కగానొక్క కూతురు రాధ.

ఒక్కగానొక్క కూతురని రాధని అల్లారుముద్దుగా చూసుకున్నాడు. ఆమె ని ఊర్లోని స్కూల్ లో పదవ తరగతి వరకూ చదివించి పై చదువుల కోసం పక్కనే ఉన్న పట్నానికి పంపించాడు.

గోపాలరావు కి కులం అంటే వల్లమాలిన పిచ్చి. తన కులపు వాళ్లతోనే మాట్లాడుతాడు. తన కులపు వాళ్లనే తనింట్లోకి రానిస్తాడు. పొరపాటున కులం తక్కువ వారు ఎదురైతే చాలు చీదరించుకుని పక్కకు తప్పుకుంటాడు. తన కొడుకులు రవీ, రాజేష్ లకు కూడా తన కులపు పిల్లలనే చూసి పెళ్లి చేశాడు. పెద్ద కోడలు కళ, చిన్న కోడలు గంగ.

ఇంక మిగిలింది రాధ పెళ్లి. తమ కులంలో బాగా డబ్బున్న రంగయ్య కొడుకు విశాల్ తో పెళ్లి చేయాలని నిశ్చయించి వాళ్లింటికి వెళ్లి వారితో కూడా మాటలు పూర్తి చేశాడు. రాధ రావడం తరువాయి ఆమెకీ, విశాల్ కీ పెళ్లే.

ఆ రోజు రాధమ్మ చదువు పూర్తై ఇంటికి వచ్చే రోజు. ఆమె వస్తున్నా అని ఫోన్ చేసి చెప్పగానే గోపాలరావు ఇంట్లో రకరకాల వంటలు వండించాడు. తినుబండారాలు చేయించాడు.గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టించాడు. ఇంటి ముందు పెద్ద పందిరి వేయించాడు.

                                                                                  ***

“ఏంటో కూతురు వస్తుందంటేనే ఇంత ఖర్చు చేసి ఆర్భాటం చేస్తున్నారు. రేపు ఆమె పెళ్లైతే ఊరంత పందిరి వేస్తారేమో మీ నాన్న గారు.” అక్కసు వెళ్లగక్కింది చిన్న కోడలు గంగ.

“మరే నాన్నగారి కి చెల్లలంటే ఎంతో ప్రేమ. చిన్నప్పుడు ఎంత ముద్దు చేసేవారో. అదేం చేసినా ఆయనకి సంతోషమే. కొండమీద కోతిని తెచ్చి  ఇమన్నా ఇచ్చేవారు. ఇప్పుడేం చూశావు. దాని పెళ్లికి చూడు ఈ చుట్టుపక్కల ఉన్న పది ఊర్లలోని వారంతా నోరేళ్లబెట్టేలా చేస్తారు.” అన్నాడు రాజేష్.

“వీటికే సగం ఆస్తి తరిగిపోద్దేమో. ఇంక మనకేం మిగులుద్ది?!.”  కాస్త గట్టిగానే అంది గంగ.

“నోరు మూసుకో. నాన్నగారు విన్నారంటే ఇంట్లో నుంచి తరిమేస్తారు. ఆయన సంపాదించిన ఆస్తి ఇది. మనం అప్పనంగా తింటున్నాం. ఆయన గానీ బయటకు పొమ్మంటే ఏ పనీ చేయలేం. నేను చదివిన అత్తెసరు మార్కుల చదువుకి ఏ ఉద్యోగం రాదు. కాబట్టి నోరు మెదపకుండా ఉండు.” అంటూ మందలించాడు రాజేష్.

                                                                                                      ****

“ఛా! అది వస్తుందంటేనే ఇంత ఖర్చు చేస్తున్నారు. రేపు దాని పెళ్లికి ఆస్తి ని హారతి కర్పూరం చేసినా చేస్తాడు. ఇలా కూర్చుంటే కాదు. ఏదో ఒకటి చేయాలి. ఆస్తి చేజారిపోకుండా చూడాలి.” అన్నాడు రవి కోపంగా.

“ఏం మాటలండీ అవీ. ఒక్కగానొక్క కూతురు పట్నంలో చదువు పూర్తి చేసి వస్తోందని ఏదో కాస్త ఆర్భాటం చేస్తే అది తప్పా.” కాస్త నెమ్మదిగా చెప్పినా మందలింపు ధ్వనించింది  కళ గొంతులో.

“నువ్వో పిచ్చి మాలోకానివి.ఆయన ఏం చేసినా మంచే అంటావు.నీ దగ్గర చెప్పాను చూడు నాదీ బుద్ధితక్కువ.ఏం చేయాలో నేనే ఆలోచించుకుంటాను. నువ్వు నోరు మెదపకుండా ఉంటే చాలు.” అని బయటకు వెళ్లిపోయాడు.

“భగవంతుడా!ఈ ఇంట్లో ఏ గొడవా జరగకుండా చూడు.”అనుకుంటుండగా ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు వినిపించడంతో  బయటకు వచ్చింది.

కారు దిగుతున్న రాధని చూస్తూనే నోరెళ్లబెట్టారు అంతా.ఎందుకంటే ఆమె ఒక్కర్తే రాలేదు, తోడుగా ఓ అబ్బాయిని తెచ్చింది. అతను ఎవరో కాదు తమ ఊరికే చెందిన కృష్ణ. కానీ వారి కులం కాదు. అలా ఇద్దర్నీ పక్కపక్కనే చూడగానే గోపాలరావు కి మనసులో ఏదో అపశకునం గా అనిపించింది. కానీ అది బయటపడనీయకుండా

“రాధమ్మా! బాగున్నావా. ప్రయాణం ఎలా సాగింది?!.” అంటూ కుశల ప్రశ్నలు వేశాడే గానీ కృష్ణని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు.

“హా! బాగున్నాను నాన్నా. మీరెలా ఉన్నారు?.” అని ఆయన కాళ్లకి నమస్కరించింది.

“బాగున్నావా రాధా!.” అంటూ అన్నా వదినలు పలకరించారు. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక “ఇంట్లోకి వెళ్దాం రామ్మా.”అని కూతురి భుజంపై చేయి వేసి ఇంట్లోకి తీసుకుని వెళ్లబోతుండగా,

“ఒక్క నిముషం నాన్నా.” అని “కృష్ణా” అని పిలిచింది. కృష్ణ అక్కడికి రాగానే, “నాన్నా! తను కృష్ణ మన రంగయ్య అంకుల్ ఉన్నాడుగా వాళ్ల కొడుకు. నా క్లాస్మేట్. నాకు తనంటే చాలా ఇష్టం. తనకీ నేనంటే ఇష్టం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం.” అంది సూటిగా.

ఆ మాట వినగానే కూతురి పెళ్లి మీద తాను కట్టుకున్న ఆశలసౌధం మొత్తం కూలిపోయినట్టుగా అనిపించింది గోపాలరావుకి.

“ఏంటీ! పెళ్లా ఈ కులం తక్కువ వాడితోనా!. మతుండే మాట్లాడుతున్నావా రాధమ్మా?!.” అన్నాడు కోపంగా.

“నాన్నా! తనే కులమో, తనది ఏ మతమో నాకు అనవసరం. అతను నాకు నచ్చారు. మా ఇద్దరి మనసులు కలిసాయి. తనని తప్పించి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను.” అని తెగేసి చెప్పింది రాధమ్మ.

“ఒక్కగానొక్క ఆడపిల్లవని నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాం చూడూ మాకు మంచి బుద్ధి వచ్చేలా చేశావు. ఇలాంటి కులం లేని వాడెలా నీకు నచ్చాడే.”  రవి ఈసడింపు.

“ఏవండీ ఏదైనా ఉంటే ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం. అందరూ చూస్తున్నారు.” అంది కళ ఏడుస్తూ.

“చూడనీ అక్కా. ఆడపిల్లకి స్వేచ్ఛ ఇస్తే ఏం చేస్తారో తెలుస్తుంది వాళ్లకీ. హవ్వా హవ్వా మా ఇల్లల్లో లేవమ్మా ఇలాంటి ప్రేమలూ, పెళ్లిల్లూ.” నోటిపై చేయి వేసి అంది గంగ.

“ఒసేయ్ ఆగవే. సందు దొరికితే చాలు దూరిపోతావు. నాన్నా ఇంట్లోకి పదండి.” అన్నాడు రాజేష్.

“ఏంటీ వీడిని ఇంట్లోకి రానివ్వాలా. నా బొందిలో ప్రాణం ఉండగా అది జరగదు. కులం తక్కువ వాడిని ప్రేమించి దాని మనసు, పక్కపక్కనే కూర్చుని  రావడంతో దాని ఒళ్లు కూడా అపవిత్రం అయిపోయింది. అలాంటి మనిషికి నా ఇంట్లోనే కాదు నా మనసులో కూడా స్థానం లేదు.

రవీ! దానిని ఇక్కడి నుంచి పొమ్మని చెప్పు.” అంటూ వడివడిగా నుయ్యి దగ్గరికి వెళ్లి తలారా స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిపోయాడు.

“ఛీ…ఛీ… ఎంత ప్రేమించాము నిన్ను. ఓ గొప్పింటి వాడితో నీ పెళ్లి కూడా నిశ్చయించారు నాన్న. నువ్వేమో ఇలాంటి పరువు తక్కువ పనిచేశావు. పోవే ఇక్కడి నుంచి.” అని రాధ ని వెనక్కి నెట్టాడు రవి.

కృష్ణ ఒడుపుగా పట్టుకుని కోపంగా రవి వైపు చూసి “తన ఒంటిపై చేయి పడితే.” అంటూ చేయి చూపించాడు.

“హా పడితే‌. ఏం చేస్తావురా. నీ బ్రతుక్కి నా చెల్లెలు కావాల్సి వచ్చిందారా?!.”

“అన్నయ్యా! అతని బ్రతుక్కేం తక్కువ. కష్టపడి చదువుకున్నాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. నన్ను కాలు క్రింద పెట్టకుండా చూసుకోగలడనే నమ్మకం నాకుంది.అయినా నాన్న పై ఆధారపడిన మీకంటే తను చాలా బెటర్.”

“చూశారా బావగారూ ఎన్నేసి మాటలంటుంది. ఆడపిల్ల కి ఇంత పొగరు తగదు.” అంది గంగ నోరింత చేసుకుని.

“నిజమే కదా వదినా. ఇన్నేళ్లొచ్చినా పైసా సంపాదన లేదు. రూపాయికీ అర్థకీ నాన్న దగ్గర చేయి చాపుతారు
అలాంటిది వీళ్లా కృష్ణ గురించి అంటారు.”

“రాధా! మాటలు మార్యాదగా రానీ. అయినా నాన్నగారే పొమ్మన్నాక నీతో మాటలే మిటి?. వెళ్లిక్కడి నుంచి.” అంటూ ఆమె జుట్టు అందుకోబోయాడు రవి. కృష్ణ అతని చేయి పట్టుకొని సొంత చెల్లని చూడకుండా జుట్టు పట్టుకోవాలనుకుంటావా. మీరసలు మనిషినా. ఏ కాలంలో ఉన్నారింకా. కులం మతం అంటూ ప్రాకులాడుతున్నారు. మీకు తను అవసరం లేకపోవచ్చు. కానీ తను నా కాబోయే భార్య. మా ఇంటి మహాలక్ష్మి. తనపై చేయి వేయాలని చూస్తే తెగనరుకుతా. రా రాధా. వీళ్లతో మాట్లాడి వేస్ట్.” అంటూ రాధని పట్టుకుని తనింటి వైపుగా తీసుకుని వెళ్లాడు.

వెళుతున్న రాధనే చూస్తూ కళా, రాజేష్ కన్నీరు కారుస్తుంటే పీడా విరగడైంది అని రవీ, గంగా అనుకున్నారు.

అప్పటికే విషయం తెలియడంతో గుమ్మం దగ్గరే నిలబడి చూస్తోంది కృష్ణ తల్లి లక్ష్మి.

ఇంటికి వెళ్లి వరండాలో కూర్చున్న తండ్రిని చూసి “నాన్నా అదీ?!.” అంటూ కృష్ణ ఏదో చెప్పబోతుంటే “ఏమీ చెప్పకు కృష్ణా. ఈ పిల్ల నిన్ను నమ్మి తన కుటుంబాన్ని వదిలి వచ్చింది. తనకి ఏ కష్టం రాకుండా చూసుకునే పూచీ నీదే.” అన్నాడు.

“చూసుకుంటాడు లేవయ్యా. అమ్మాయి బయటే ఉండిపోయింది.దిష్టి తీస్తే ఇంట్లో కి వస్తుంది. అందరూ గుడ్ల గూబల్లా ఎలా చూస్తున్నారో చూడు. తొందరగా చెప్పు. తీయనా వద్దా!.” అంది లక్ష్మి.

“నేను వద్దంటే ఈపాటికే కలిపేసి ఉన్న దిష్టి నీళ్లు నా మీద పోస్తావా ఏంటి. తెచ్చి తీయి.” నవ్వుతూ అన్నాడు రంగయ్య.

“చూసేశావా?!. నీ మనసు నాకు తెలుసు కదయ్యా. అందుకే ముందే కలిపి ఉంచాను. ఇప్పుడే వెళ్లి తెస్తా.” అంటూ పరుగులాంటి నడకతో వెళ్లి దిష్టి నీళ్లు తెచ్చి ఇద్దరికీ దిష్టి తీ‌సి “కుడికాలు పెట్టి లోపలకు రామ్మా.” అంటూ రాధ ని ఆహ్వానించింది.

ఇద్దరూ లోపలికి వెళ్లారు.

“వీలైనంత తొందరలో ముహూర్తం చూసి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. అంతవరకూ అమ్మాయి పక్క మీ అమ్మ దగ్గరే. వేషాలు వేయాలని చూస్తే కాళ్లిరగ్గొడతా.” అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు రంగయ్య.

ఓ మంచి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి గోపాలరావు కి చెప్పకపోతే బాగోదని కార్డు పట్టుకుని వెళ్లారు రంగయ్య, లక్ష్మి. వాళ్లని కనీసం గుమ్మం కూడా ఎక్కనివ్వకుండా పంపించేశారు రవి, గంగలు.

ఊర్లోనే పెళ్లి జరుగుతున్నా చూడలేకపోతున్నామని చాలా బాధపడ్డారు రాజేష్, కళ.

పెళ్లి జరిగిన కొన్ని రోజులకు కాపురాన్ని పట్నానికి మార్చారు రాధాకృష్ణలు.

                                                                                                      *****

“ఇన్నాళ్లూ కులం కులం అని గొప్పలు పోయాడు. ఇప్పుడు కూతురు కులం తక్కువ వాణ్ణి పెళ్లి చేసుకుని పరువంతా గంగ పాలు చేసింది.” అని అందరూ అంటుంటే వినలేక ఇంట్లోనుంచి బయటకు వెళ్లడమే మానేశాడు గోపాలరావు.

పెద్దాడు రవే పొలం కి వెళ్లడం, కూలీలకు డబ్బులివ్వడం చూసుకుంటున్నాడు. రాజేష్ ఎరువులు తేవడం, జమా ఖర్చులు చూడడం చూస్తున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు జమా ఖర్చులు చూస్తున్న రాజేష్ కి లెక్క తేడా రావడం తో అప్పుడే వచ్చిన రవి ని పిలిచి “అన్నయ్యా లెక్కల్లో ఏదో తేడా వస్తుంది. బ్యాంకులో తీసిన దానికీ కూలీలకు ఇచ్చిన సొమ్ముకీ, ఎరువుల సొమ్ము కీ లెక్క కుదరడం లేదు. ఏం జరిగింది?!.” అన్నాడు.

“ఏంటీ లెక్క సరిపోలేదా. నువ్వు సరిగ్గా చూసండవు. మరోసారి చూడు.” అని గదిలోకి వెళ్లిపోయాడు.

రాజేష్ మరోసారి చూశాడు. అయినా అలానే వస్తోంది. అలా లెక్కల్లో తేడా రావడం , అడిగితే రవీ మాటదాటేయడం జరుగుతూనే ఉంది. ఇంక లాభం లేదని ఓ రోజు రాజేష్ గోపాలరావు కి మొత్తం చెప్పి పుస్తకం చూపించాడు. అంతా చూసిన గోపాలరావు కి గుండె ఆగిన పని అయ్యింది పది లక్షల వరకూ తేడా వచ్చింది.

అప్పుడే బయటి నుంచి వచ్చిన రవి ని ఆపి “ఏరా! లెక్కల్లో బాగా తేడా వస్తుంది. చిన్నాడు అడిగితే సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నావు. ఏం చేశావురా  అంత సొమ్ము?!.” అంటూ నిలదీశారు.

“అదీ నాన్నా… మరీ” అంటూ అతను నీళ్లు నములుతుండేసరికి “అడిగితే సమాధానం ఇవ్వకుండా అలా నిల్చున్నావేరా. ఏం చేశావు అంత సొమ్ము?!.” అన్నాడు కోపంగా.

“అదీ నాన్నా ఓ ఫ్రెండ్ కి అవసరం అంటే ఇచ్చాను. తొందరలోనే ఇస్తానని చెప్పాడు.” అన్నాడు రవి.

“ఎవరా ఫ్రెండ్?!.. ఫోన్ చేయి మాట్లాడుతాను.” అని గదమాయించే సరికి నేల చూపులు చూడటం మొదలుపెట్టాడు.

“ఏరా ఫోన్ చేయమంటే చేయవేం. చేయలేవు. ఎందుకంటే నువ్వు ఆ సొమ్ము ఎవరికీ ఇవ్వలేదు. మరేం చేశావో చెప్పు.” కోపంగా అడిగేసరికి,

“బె… బెట్టింగ్ లో కట్టాను. త్వరలో ఇచ్చేస్తాను. ఆ మాత్రం దానికే ఇలా గొడవ చేయాలా.” అంటూ లోపలికి వెళ్లబోయాడు.

“ఏంటీ బెట్టింగుల్లో పెట్టావా. మన ఇంటా వంటా ఉన్నాయట్రా ఇలాంటి పనులు. నా పరువు తీసింది చాలక ఇంక మాటలు ఆడుతావా?!.” అంటూ కొడుకు కాలర్ పట్టుకున్నాడు.

“నీ కూతురు చేసిన దాంతోనే నీ పరువు బజారు న పడింది. అయినా డబ్బు ఇచ్చేస్తా అన్నాగా. ఎందుకు గోల చేస్తావు.” అంటూ కాలర్ ని విడిపించుకుని గోపాలరావు ని వెనక్కి తోయబోయాడు.

తండ్రి ని పట్టుకుని “అన్నయ్యా మధ్యలో చెల్లెలి గురించి ఎందుకురా.”  అని కోపంగా అన్నాడు రాజేష్.

“అనొద్దా! దానిని ఎంత ముద్దు చేశాడు?. దానికింద ఎంత ఖర్చు పెట్టాడు. అలాంటిది అది ఇతని గుండెల మీద తన్ని వెళ్లిపోయింది. అది తప్పుకాదు. ఏదో కాస్తంత సొమ్ము వాడుకుంటే తప్పా. అయినా ఇవన్నీ ఎందుకు? నా వాటా నాకు ఇచ్చేయండి నాన్నా.” అన్నాడు రవి.

“ఏంటీ వాటా నా. నీకు అణా పైసా కూడా ఇవ్వను. నీకి‌స్తే హారతి కర్పూరం చేస్తావు. నా ప్రాణం పోయే దాకా ఈ ఆస్తి పంచను.” అన్నాడు గోపాలరావు ఆవేశంగా.

“ఏం ఎందుకు పంచవు. తండ్రి ఆస్తిలో కొడుక్కి వాటా ఉంటుంది. నా ఆస్తి నాకు ఇచ్చావా సరేసరి. లేదంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు.” అని బయటకు వెళ్లిన రవి రెండు రోజుల్లో లాయర్ నోటీస్ పంపించాడు ఆస్తిలో వాటా కోసం. దాన్ని చూడగానే కుప్పకూలిపోయాడు గోపాలరావు.వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాడు రాజేష్. పరిస్థితి క్రిటికల్ గా ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్ లు.

రావాలని ఉన్నా రవి రానివ్వక పోవడంతో కళ ఏడుస్తూ ఇంట్లోనే ఉండిపోయింది. హాస్పిటల్ వాతావరణం తనకి పడదని రాలేదు గంగ. మందులు కొనడానికి బయటకు వెళితే గోపాలరావు ని చూసేవారు ఎవరూ లేరు. ఏం చేయాలో తోచక రాధ కి ఫోన్ చేశాడు రాజేష్.

హుటాహుటిన వచ్చారు రాధాకృష్ణ లు. రాధ అన్నతో పాటే తండ్రి దగ్గరే ఉంటే,  కృష్ణ వెళ్లి మందులు తెచ్చాడు. ఈలోగా జరిగింది మొత్తం చెప్పాడు రాజేష్.

“అన్నయ్యా! నాన్న కి ఆపరేషన్ కానీ. అప్పుడు మాట్లాడుదాం. ఆయనకి ఏమీ కాదు. చిన్న సర్జరీనే. రెండు స్టంట్ లు పడతాయని చెప్పారటా డాక్టర్. వారంలో కోలుకుంటారు. అప్పుడు చెప్తాను పెద్దన్నయ్య సంగతి. నాన్నకే నోటీసులు పంపిస్తాడా?.” అంది కోపంగా.

రెండు రోజుల్లో గోపాలరావుకి ఆపరేషన్ అయ్యింది. ఈలోపు రంగయ్యా, లక్ష్మీ కూడా వచ్చారు ఊరి నుంచి రాధకి సాయం గా ఉండేందుకు. రోజూ హాస్పిటల్ కి భోజనం వండి పట్టుకుని వెళ్లేది రాధ. కృష్ణ ఆఫీస్ కి లీవ్ పెట్టి హాస్పిటల్ లోనే ఉన్నాడు రాజేష్ తో పాటే.

వాళ్లిద్దర్నీ చూసిన గోపాలరావు కి మొదట కోపం వచ్చినా కులం తక్కువ వాడని అసహ్యించుకున్నవాడే ఈ రోజు తనతో ఉన్నాడు. కులం కులం అంటూ నీలిగాను. కానీ తనకిలా జరిగిందనీ అందరూ నవ్వుకున్నారు తప్పించి ఎవరూ రాలేదు. నేనెంత మూర్ఖంగా ఆలోచించాను.” అని అపరాధ భావంతో కృష్ణ వచ్చినా పలకరించలేక పోయేవాడు.

“నాన్నా! మీ బాధ నాకు అర్థం అవుతోంది. బావా మీ గురించి ఏమీ అనుకోడు. మీరంటే చాలా గౌరవం తనకి. ఓసారి ప్రేమగా పలకరించి ఆయన్ని దగ్గరకు తీసుకోండి. మీ బాధంతా తొలగిపోతుంది.” అన్నాడు రాజేష్.

అప్పుడే లోపలకు వస్తున్న కృష్ణని చూసి “బాబూ నన్ను క్షమించగలవా?!.”  అన్నాడు గోపాలరావు చేతులు జోడించబోతూ.

“అయ్యో! మామాయ్యా మీరు పెద్దవారు. అలా మాట్లాడకండి.” అన్నాడు కృష్ణ ఆయన చేతులు పట్టుకుని.

“ఏంటీ మిమ్మల్ని మా నాన్నగారు పలకరిస్తే గానీ పలకరించవా. ఇదేనా నువ్విచ్చే మర్యాద?.” అంది అప్పుడే  క్యారియర్ పట్టుకు వచ్చిన రాధ.

“అంటే మీ నాన్నగారికి నేను పలకరిస్తే ఏమనుకుంటారో అని పలకరించలేదు రాధా.”

“ఏమీ అనుకోరు. ఆయనకి పట్టిన దెయ్యం వదిలేసింది ఎప్పుడో. కదా నాన్నా.” అంది ఓ ముద్ద నోట్లో పెట్టి.

“అవునమ్మా. నాకు పట్టిన కులపు రక్కసి వదిలేసింది. నిన్ను చాలా బాధపెట్టాను. నన్ను మన్నించురా తల్లీ. నా కులం గొప్ప అని ఓ గిరి గీసుకుని ఉన్నాను. ఈ రోజు నాకిలా అయితే ఎవరూ రాలేదు. కానీ నేను అసహ్యించుకున్నవాళ్లు నన్ను అక్కున చేర్చుకున్నారు. ” అన్నారాయన బాధగా… తన ఆశలసౌధం కూలిపోలేదని నిర్థారించుకుని.

“నీకు వదిలింది. ఇంక పెద్దన్నయ్య కు వదలాలి. కృష్ణా మన ఫ్రెండ్ నరేష్ లాయర్ గా ప్రాక్టీస్ పెడుతున్నాడు కదా. వాడిని కలుద్దాం ఈ రోజే. మా అన్న చిన్న జర్క్ ఇద్దాం. ఆస్తిలో వాటా కావాలా. ఇంకొకరి సొమ్ము సొంతానికి వాడితే ఏం జరుగుతుందో, బెట్టింగ్ కడితే ఏం జరుగుతుందో తెలియాలి వాడికి ఓ ఆరునెలల జైలు, పదివేలు జరిమానా కడితే. పనిలో పనిగా మా చిన్నొదినకు చిన్న బుద్ది చెప్పాలి.” అంది రాధ కోపంగా.

“హా… అలాగే.” అన్నాడు కృష్ణా.

“ఈ జరిమానా లు, జైలు శిక్ష కోసం నీకెలా తెలుసురా తల్లీ.” అన్నాడు గోపాలరావు కూతురి తలపై చేయి వేసి.

“ఇప్పుడు రాధ లా చదువుతోంది మామయ్యా ఇంట్లో ఖాళీ గా ఉండటం  ఇష్టం లేక. పాపం రవి బావ కోరి కొరివితో తల గోక్కున్నట్టే.” అన్నాడు కృష్ణ నవ్వుతూ.

“అన్నయ్య కి గోకితే గోకావు కానీ మీ వదినకు గోకకు. జుట్టు లేకుండా దాని ముఖం చూడలేం.”  నవ్వుతూ అన్నాడు రాజేష్.

అతనితో అందరూ జత కలిపారు.

కొద్దిరోజులకు కోర్టు నుంచి నోటీసు వచ్చింది రవికి. దాన్ని చూడగానే నక్షత్రాలన్నీ కల్లముందే కదలాడినట్టుగా అనిపించి తండ్రి కాళ్ల మీద పడ్డాడు బుద్దొచ్చిందని.

ఆ రోజు నుంచీ కులపిచ్చి వదిలి అందరినీ తన వారిలా చూడటం ఆరంభించాడు గోపాలరావు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!