దారిచూపిన ఆశ

దారిచూపిన ఆశ

రచన: వడలి లక్ష్మీనాథ్

“గంగ తిరిగి రాలేదు. పొద్దుపోయింది. పొద్దున్న వెళ్లేప్పుడు  కలిసే వెళ్ళినా,  తిరిగి వచ్చేప్పుడు రాలేదు. గంగ దారితప్పినట్టుంది.  వచ్చేటప్పుడు పెద్దవాడు  రాముడు చూసుకోవాలిగా. గంగని తప్ప మందనేసుకొని ఇంటికి వచ్చాడు. నాకా ఓపిక అయిపోయింది. ఇప్పుడు వెతకడానికి వెళ్ళే సత్తువ కూడా లేదు. చీకటి పడింది. గంగ ఎక్కడ ఇబ్బంది పడుతోందో ఏమిటో?” వాపోయాడు నాగరాజు.

“దిగులు పడకయ్యా …..గంగ తెలివైనది. ఎక్కడ ఉన్నా తిరిగి ఇంటికి వత్తాది” ధైర్యం చెప్పింది లక్ష్మి.

“అందరికంటే చిన్నది. దానిదగ్గరకు వచ్చే సరికి నాకు ఓపిక తగ్గిపోయింది. దానికి ఏ ఆలనా పాలనా లేకుండా పోయింది” అంటూ వీధిలోకి ఇంటిలోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు నాగరాజు.

“అదిగోనయ్యా! గజ్జల శబ్దము గంగ కాళ్ళ సవ్వడి” అంటూ వీధివైపు పరిగెత్తింది లక్ష్మి. ఆ శబ్దం విన్న దొడ్లోని ఆవులు ఆనందంతో “అంబా” అంటూ అరవసాగాయి.

తిరిగి తిరిగి అలిసిపోయినట్లుగా ఇంటివైపుకు వస్తున్న గంగను చూసి ఊపిరి పీల్చుకున్నారు నాగరాజు, లక్ష్మి. ఎదురెళ్లి గంగ ఒళ్లంతా తడిమి తెచ్చి కొట్టంలో కట్టి మేత పెట్టి, దగ్గరుండి తినిపించాడు నాగరాజు. గంగ మేత అయిపోయాకా, నాగరాజుని ఆనుకొని ఒళ్ళు రాయించుకొంటోంది.

“చూసింది చాలు.  పొద్దుపోయింది. వచ్చి ఎంగిలిపడు” పిలిచింది లక్ష్మి.
“గంగ చీకట్లో కూడా దారిపట్టి ఇంటికి వచ్చింది.   రాదేమోనని దిగులు పడ్డాను” అన్నాడు అన్నం తింటూ.
“కన్న కొడుకు ఐదేళ్ల తర్వాత ఇంటికొచ్చాడు. వాడితో మనసు విప్పి కూడా మాట్లాడలేదు. అన్నింటి కంటే  నీకు ఆ గంగ అంటే ఎందుకయ్యా అంత అభిమానం. ఎంత పెంచినా అది దొడ్లోనే ఉంటాది. మనం ఇంట్లోనే.  వీటినే ఇంతలా చూసుకుంటున్నావు. మన రక్తం పంచుకున్న మనవరాలయ్యా! ఒక్కసారి పోయి చూసొద్దాం” అడిగింది లక్ష్మి.

అప్పటిదాకా ఉత్సాహంగా మాట్లాడుతున్న నాగరాజు మిగిలిన భోజనం ఏదో తిన్నట్టు చేసి, బయట కొట్టం పక్కన ఉన్న నులకమంచం మీద నడుం వాల్చాడు. మెడకున్న గజ్జల శబ్దంతో నడుచుకుంటూ వచ్చిన  గంగ నాగరాజు పక్కకు చేరి గారాలు పోతోంది.

ఆకాశం వైపు చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు నాగరాజు.

తండ్రి మిగిల్చిన కొంత పొలము, పశువులను పెంచుకొంటూ బ్రతికే నాగరాజుకి ఒక్కడే కొడుకు శరత్. మారు సంతానం కావాలని లక్ష్మి ఎంత కోరినా,
“ఉన్న ఒక్కడినీ ప్రయోజకుడిని చేస్తే చాలు” అంటూ వారించేవాడు. కొడుకుని చాలా ఉన్నత స్థానంలో చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఉన్నత చదువుల కోసం ఉన్న పొలమంతా కరగదీసాడు.

పట్నం చదువులకు అప్పు చేసి, సగం ఆవులని అమ్మి పంపించాడు. .

నా భవిష్యత్తు, నా జీవితం అంటూ నచ్చిన పిల్ల అని పట్నం పిల్లని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళికి ముక్తసరిగా వెళ్ళినా, నాగరాజు కొడుకు పట్ల ఏదో అసంతృప్తి పెంచుకొన్నాడు.

లక్ష్మి రాకతో ఉలిక్కిపడిన నాగరాజుతో
“ఏమయ్యా. కోపం వచ్చిందా? పెద్ద వాళ్ళము మనమే సర్దుకోవాలయ్యా….కొడుకు రమ్మంటున్నాడుగా!  ఒక్కసారి ఆ చంటిదాన్ని చూస్తే నువ్వే మారుతావయ్యా. ఈ తాతను వదిలిపోను అంటూ మారాం చెయ్యక పోతే నన్నడుగు” అంటూ గడ్డం పట్టుకొని బ్రతిమాలుతోంది లక్ష్మి.

“ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్దం కావట్లేదు లక్ష్మి. ఇవి మూగ జీవాలు. మేత కోసం తీసుకెళ్లే ఓపిక లేక పోయినా, వాటంతట అవే వెళ్ళి మేత అయ్యాకా, ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాయి.  మనకు ప్రేమను పంచడమే కాదు, రెండు పూటలా తిండి పెడుతున్నాయి. ఒక్కసారి వీటిని దగ్గర చేస్తే మనల్ని వదిలి పోవు. కానీ, స్వార్దంతో నిండిన మనుషులను దగ్గరకు తీసినా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.

ఈ పిచ్చి గంగని చూడు, దారి తప్పినా తిరిగి వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది. దారి చూపించిన కొడుకు, దారట్టుకు పోయాడు. తిరిగి రాలేదు. వాడికి పుట్టిన కూతురును పెంచడానికి మనుషులు లేక నిన్ను రమ్మంటున్నాడు. అవసరం తీరితే మళ్ళీ మన  బతుకులే మనకు మిగులుతాయి. నాలుగు రోజుల ముచ్చటకు  వీటిని వదిలి వెళితే ఇవి మళ్లీ జీవించి ఉండవు. తప్పిపోయినా తిరిగి తిరిగి ఇంటికే వచ్చిన ఈ గంగ మనం లేకపోతే జీవించి ఉండగలదా?”

అప్పుడే అక్కడకు వచ్చిన శరత్” నాన్నా! నా పెళ్ళి తర్వాత మీరు నా వల్ల అసంతృప్తిగా ఉన్నారని అర్దం అయ్యింది. అప్పుడే నాకు విదేశాల్లో మంచి అవకాశం   వచ్చింది. అప్పుడు నా భవిష్యత్తు నాకు ముఖ్యమనిపించింది.  కానీ, నా కూతురు పుట్టాకా, పిల్లల పెంపకంలో ఉండే ఆశలను అర్దం చేసుకొన్నాను. ప్రతి నిముషం మీరు గుర్తుకు వచ్చేవారు.

నేను తెలియక మీ మనసు కష్ట పెట్టాను, మీరు పడ్డ బాధ మీ మాటల వల్ల అర్దం అయింది.  నేను కోరుకుంటున్నది, మీ  ప్రేమ నా కూతురుకి పంచాలని. నా కూతురు మీ చేతుల్లో పెరగాలని, మీ కోడలికి చెప్పాను. పాపను తీసుకొని రమ్మని. మీ ప్రేమతో దాన్ని పెంచండి” అంటూ ఆలింగనం చేసుకొన్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!