వామ్మో! వంట మనిషి

వామ్మో! వంట మనిషి

రచన:ఉండవిల్లి సుజాతా మూర్తి 

అది ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం.సాఫీగానే సాగిపోతున్న సంసారం.కొడుకు అమెరికాలో ఉద్యోగం.స్వంత ఊరిలో స్వంత ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి పోతూ ఉంటాడతను.వయసురీత్యా శరీరానికి ఏదో ఒకటి రావడం ఆ బ్రహ్మ సృష్టేమో.ఒకరోజు ఆ ఇల్లాలికి కాస్త నలతగా కళ్ళు తిరిగి నట్లు ఉంటేనూ హాస్పిటల్ కి చెకప్ కోసం తీసుకెళ్ళేరు.అన్ని పరీక్షలు (సూపర్ స్పెషాలిటీ కదా) చేస్తే తేలిందేంటంటే హార్ట్ వాల్వులో ఒక హోలని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు.వెంటనే సుపుత్రుడిని సంప్రదించి సర్జరీకి ముందకు సాగేరు.అక్కడే వచ్చింది అసలు చిక్కు.మొదలైంది అసలు కధ.”వామ్మో!ఒకటో తారీఖు”లా తయారయింది.అదేంటంటే ఆ ఇంటి యజమాని భార్య హాస్పిటల్ లో చికిత్సకై ఉండటంతో వంటా వార్పూ కాస్త చేసిపెడుతుందని తెలిసిన వాళ్లు పురమాయిస్తే వంట పనిలోకి చేర్చుకున్నారు.ఇక్కడ ఓ మలుపు తిరిగింది కధ.ఏమిటని అడగరేం… నాకు ఈ వస్తువులు కావాలయ్యా అని చాంతాడంత లిస్టు అందించింది ఆ కొత్తగా చేరిన వంటమనిషి.ఇది నీ గది..నీ పెట్టె పెట్టుకోవచ్చు.ఏమైనా అవసరముంటే అడుగు అన్న పాపానికి.

తెల్లవారింది.వంటగదిలోకి యజమాని తొంగి చూస్తే మనిషి జాడలేదు.ఏమైంది చెప్మా! అని చూస్తే ఇంకా ఆమెకిచ్చిన గదిలోనే పడుకునుంది నిశ్చింతగా.తలుపుదగ్గర నుండి “ఇంకా లేవలేదా…పాలుకాచి డికాషన్ వెయ్యలేదా అని అడిగితే”… “నాకు పెందరాడే లేవడం లేదయ్యా”అని అంది.ఆయన చేస్తాడింక… చేసేదిలేక కాఫీ చేసుకొని తాగేడు.హాస్పటల్ కి వెళుతూ ఇల్లు జాగ్రత్తగా చూసుకోమంటే ఆమె చేసిన నిర్వాకం వింటే ముక్కున వేలేసుకుంటారు.పేషెంట్ ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు…ఏదో ఒక కూర గట్రా చిన్న వంట… అదీ ఇంట్లో వంట.అంత సుఖంగా ఉన్నా … జీతానికి జీతం… తక్కువ పని.అయినప్పటికీ రోజులు గడవకపోతే ఎలా అన్నట్లుంది.యజమాని హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఎక్కడివక్కడే ఉన్నాయి పనులు…టీవీ టీవీ టీవీ చూసుకుంటూ సోఫాలో ప్రత్యక్షం.అంత మరీనా.ఆమె కోసం గదిచ్చినా సరే… పోనీలే అని ఊరుకుంటే పబ్బం గడుపుకోడానికి.

ఇలా పది రోజులైంది.సర్జరీ జరిగిన ఆ ఇంటి ఇల్లాలిని డిశ్చార్జ్ చేసే రోజు వచ్చింది.ఆ దంపతులు ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చుని అమ్మో.. అయ్యో అంటూ కుడి దవడ పట్టుకుని పంటి నొప్పని ఒకటే సూకరాలు పోయింది.కదిల్తేనా.డబ్బూపోయే, శనీ పట్టే అని దవడ పట్టుకోవడం.. అమ్మా…అబ్బా..అనడం.ఇదీ సీన్.ఏం చేస్తారు…ఆ దంపతులు.చేతనైన పనులు చక్కపెట్టుకున్నారు.ఇంక అమ్మగారు ఇంటికొచ్చేసేరు.. ఎంతైనా పేషెంట్ కదా, అదనంగా పనుంటుందని,తనకు స్వేచ్చా తగ్గుతుందని పంటి నొప్పని ఒక సాకుగా తీసుకుంది.

ఇంతకీ స్వేచ్ఛలో భాగంగా ఒకసారి హాస్పిటల్ కి ఫోన్ చేసి ఏం నొక్కేసిందో ఏమో మరి ఆమెకే తెలియాలి.టీవీ రిమోట్ పని చేయటం లేదని ఏదో ఎమర్జెన్సీ కేసులా యజమానికి వెళ్ళిన ఫోన్ ఒక ఉదాహరణ.చూస్తుంటే కాస్త విచిత్రంగా అనిపిస్తోంది కదూ.సరే…ఏదో అలాగ గడుపుతుంటే ఇంతలో వెసులుబాటు కుదరంగానే ఆ ఇంటికి అమెరికా నుండి కొడుకు కుటుంబం రాగా ఏదో అలా పని కానిస్తున్న ఆ వంటమనిషిని అవసరార్థం కుటుంబ సభ్యులు ఊరుకుంటున్నప్పటికీ సరేసరి…ఉదయం ముందు లేకపోవడం చూసి ఇల్లాలు కాస్త ఏమిటిది అని అన్నదానికే… ఊరుకో ఏదో తంటాలు పడదాం అని భర్త సర్ది చెప్పగా ఏదో అలా గడిపుతూ ఉంటే… పైగా ఒక రోజు వాళ్ళ మనవడు బంగాళదుంప వేపుడు అడగ్గా…అలా అన్ని చేయడం అవదు,చేసిన వంట అందరికీ ఒకటే అంది.ఒకవేళ కావాలంటే తరిగిస్తే చేస్తానంది.అది మరీ విడ్డూరంగా లేదూ..ఏదో రోజులు గడిపి, ఉద్యోగాల రీత్యా పిల్లలు వెళిపోవడం… ఇల్లాలికి కాస్త ఓపిక రావడం చాల్లే బాబూ అనుకుని ఇంక ఆ వంట మనిషిని…ఇంక ఆమెని పంపిన బంధువులతో …చాలండీ ఈ వంట మనిషి సేవలు ఇంక చాలు అని సున్నితంగా చెప్పి పంపించేసేరు.

అసలు మలుపేంటంటే ఇంతవరకూ మీరు చదివినదంతా యధార్థ గాధ.తెలిసిన వాళ్లు
మమ్మల్ని విందుకు పిల్చిన ఒక రోజు వారి స్వీయ అనుభవాన్ని సరదాగా కబుర్లలో చెప్పగా దాన్ని కధ రూపంలో పెట్టాలని,పని చేయించుకోడానికి అలవాటైనా ఈ రోజుల్లో పనికి చేరుతున్న వాళ్ళ జమానా ఎలా ఉందో కళ్ళకు కట్టినట్టు మలచడం జరిగింది.పరస్పరమూ అర్థం చేసుకునే యజమానులు,పనివారూ ఉండొచ్చు….ఉండరని కాదు.లోకంలో ఈ యదార్థ గాధ లాంటి ఉదంతాలు ఇంకా లేకపోలేదు కదా… ఏమంటారు..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!