తలుపులు జాగ్రత్త!

తలుపులు జాగ్రత్త!

రచన: వాడపర్తి వెంకటరమణ

తిరుమలేషుకు తింగరితనమెక్కువ.దానికి తోడు మతిమరుపు జాస్తి.అతను చెప్పిందేగానీ ఎదుటివారు చెప్పేది పూర్తిగా విని చావడు.ఒక్కోసారి సవ్యంగా జరగాల్సిన పనులు అతని అతితెలివి వలన అడ్డం తిరుగుతుంటాయి.అందుకే ఆ ఇంట్లో వాళ్ళందరూ అతన్ని ‘తింగరోడని’, ‘తింగరి తిరుమలేషని’ పిలుస్తూ ఎద్దేవా చేస్తుంటారు.ఏనాటికైనా వాళ్ళందరిచేత శభాష్ అనిపించుకోవాలని అతని చిరకాల కోరిక.

తిరుమలేష్ డిగ్రీ చదువుతున్నాడు.స్వతహాగా మెరిట్ స్టూడెంట్ కాకపోయినా, ఓ మోస్తరుగా చదవి పాస్ మార్కులకు ఢోకా లేకుండా నెట్టుకొస్తున్నాడు.

మరో నాలుగు రోజుల్లో మెయిన్ ఎగ్జామ్ ఉండటంవలన తన రూంలో క్లాస్ పుస్తకాలతో కుస్తీపడుతూ, ఒక్కో సబ్జెక్టుని గ్రైండ్ చేసి పట్టువదలని విక్రమార్కుడిలా బట్టీ పడుతున్నాడు తిరుమలేష్.

అప్పుడే ఆ రూంలోకి వచ్చిన శంకర్రావు కొడుకునుద్దేశించి, “రేపు మీ మావయ్య కూతురు కళ్యాణి పెళ్ళికి ఇంటందరం వెలుతున్నాం.నువ్వుకూడా వస్తున్నావు కదా?” కన్ఫర్మేషన్ కోసం అడిగాడు.

“లేదు నాన్నా… నాలుగు రోజుల్లో మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి.నాకు రావడం కుదరదు!” సమాధానం చెప్పాడు తిరుమలేష్.

అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి,”నువ్వు కూడా వస్తే బావుంటుందిరా.మావయ్యవాళ్ళ పెళ్ళికి అందరంవెళ్ళి నువ్వు రాకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు…!” కొడుకుని కాస్త కన్విన్స్ చేసే ధోరణిలో మాట్లాడింది.

“నేనేం చేసేది…నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా.అయినా నేనిప్పుడు చదువుకోవాలి.నాకిప్పుడు విసిగించకండి!” కోపగించుకున్నాడు తిరుమలేష్.

‘తిక్కల మేళం వీడొచ్చినా అక్కడ వీడేదో పెంట పెడతాడు.శుభ్రంగా ఇంటి దగ్గర ఉంటే కనీసం ఇల్లు కాపలా అయినా ఉంటాడు.అసలే ఈ ఏరియాలో ఈమధ్య దొంగతనాలెక్కువయ్యాయి’ అని స్వగతంగా అనుకుని –

“పోనీలేవే! వాడు రానంటుంటే బలవంతం పెట్టడం దేనికి.వాడు ఇంటి దగ్గరే ఉండనీ.ఎలాగూ రేపు రాత్రి పెళ్ళి అయిపోయాక ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తాం కదా!” అని భార్యకు చెప్పి, “సరే లేరా…మన ఏరియాలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.కాబట్టి ఇంటిపట్టునే ఉండు.ముఖ్యంగా తలుపులు జాగ్రత్త!అసలే నువ్వొక తిం…” ఇంకేదో అనాలని మద్యలోనే ఆపేశాడు శంకర్రావు.

తండ్రి చెప్పిన మాటలు విని, అలాగేనని తలూపాడు తిరుమలేష్.

మరుసటి రోజు శంకర్రావు ఫ్యామిలీ మొత్తం పెళ్ళికి బయలుదేరి వెళ్ళిపోయారు.ఒక్క తిరుమలేష్ తప్ప.

ఓసారి తండ్రి చెప్పిన మాటల్ని మననం చేసుకున్నాడు తిరుమలేష్.అయితే ఆ రోజంతా అతని చెవుల్లో ‘తలుపులు జాగ్రత్త… తలుపులు జాగ్రత్త…” తండ్రి చెప్పిన మాటలే మారుమ్రోగుతూనేవున్నాయి.

ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడతను.అతని మెదడులో ఓ మహత్తరమైన పథకం రూపుదిద్దుకుంది.ఇక తనపై పడ్డ తింగరితనం, మతిమరుపు మచ్చ ఈ దెబ్బతో చెరిగిపోతుందనుకున్నాడు.

స్టోర్ రూంలోంచి రెంచ్,పటకారులాంటి సామాగ్రి తీసుకువచ్చి జాగ్రత్తగా ముఖ ద్వారాన్నుంచి తలుపుల్ని వేరుచేసి, వాటిని ఇంట్లోకి తీసుకుపోయి, వాటినెవరూ దొంగిలించకుండా ఆ రాత్రంతా కాపలాగా పడుకున్నాడు తిరుమలేష్.

పెళ్ళికెళ్ళి మరుసటి రోజు ఉదయానికి వచ్చిన శంకర్రావు ఫ్యామిలీకి ఇల్లంతా ఖాళీగా కనిపించింది.లోపలికెళ్లి చూస్తే తలుపులపై గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు తిరుమలేష్.

కొడుకుని తట్టిలేపాడు శంకర్రావు.కళ్ళు నులుముకుంటూ వాళ్ళని చూస్తూ తండ్రివైపు తిరిగి, “నాన్నగారూ… మీరు చెప్పినట్లే తలుపుల్ని జాగ్రత్తగా చూసుకున్నాను” అమాయకంగా అన్నాడు తిరుమలేష్.

ఆ మాటలకు ఉన్నపళంగా దబ్బున పడిపోయారు శంకర్రావు ఫ్యామిలీ.

** సమాప్తం **

You May Also Like

One thought on “తలుపులు జాగ్రత్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!