పసి హృదయం

పసి హృదయం

రచన: తిరుపతి కృష్ణవేణి

నాకు పరిచయం లేని క్రొత్త ముఖాలు నా రాక కొరకు ఎదురు చూస్తున్నారు. నేను వారికి కొత్త అతిథిని,ఎన్నో ఆశలు చెప్ప లేని ఆనందంతో నా మనసంతా నూతనోత్సాహంతో పులకరిస్తుంది నూతన లోకం లోకి అడుగు పెడుతున్నాను అనే ఆరాటం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూంది చేస్తుంది. నేను ఎదురు చూస్తున్న ప్రయాణం కొద్దీ క్షణాల్లో మొదలవుతుందని నాకు అర్ధం అవుతుంది నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నెలలు వారాలు రోజులు చూస్తుండగానే గడచి పోయాయి. ఇక క్షణాలు మాత్రమే మిగిలాయి. నాకు చాలా ఆతృత గాను ఆశ్చర్యంగాను వుంది. ఇంత కాలం ఎంత హాయిగా ఏ కష్టం లేకుండాఅమ్మగర్భంలో
హాయిగా ఉన్నాను. కాలం ఎంత త్వరగా గడిచింది. నా ప్రయాణానికి సమయం దగ్గర పడుతుంది.ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలాయి. నా రాకకోసం ఎదురు చూస్తున్న అతిథులు ఆహ్వానం పలికే సన్నివేశం ఊహించు కుంటుంటే నా మనసంతా ఆనందంతో పరుగులు తీస్తుంది. ఇంతలో ఎదో అలజడి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి. బయట జరిగే హడావిడి అంతా నాకు అర్ధమవుతూనే ఉంది. డాక్టర్ గారు వస్తున్నారు, అంతా ప్రక్కకు జరగండి అంటున్నారు ఎవరో? అందరూ అటు ఇటు హడావుడిగా తిరుగు తున్నట్లు అలజడిగా ఉంది.. ఆమె చాల ఇబ్బంది పడుతుంది, ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్. ఏదో హడావిడి జరుగుతోంది. నన్ను అటు ఇటూ కదుపు తున్నారు. ఏవో హస్తాలు నన్ను తాకుతున్నట్లు అనిపిస్తువుంది. అమ్మ శరీరం బాధతో అటు ఇటూ కదులు తూంది, మధ్య మధ్య లో అరుపులు వినిపిస్తున్నాయి.అమ్మ బాధ తో అరుస్తుంది అనుకుంటా!! అంతా నిశ్శబ్దం ఆపరేషన్ పూర్తి అయినట్లు ఉంది నన్ను ఎవరో చేతుల్లోకి తీసుకుని బయటకు తీసి అటూ ఇటూ ఊపుతున్నారు.గాలి శరీరాన్నితాకుతుంటే ఎంతో హాయిగా ఉంది అనుకున్న సమయానికి నేను క్రొత్త
లోకంలోకి ప్రవేశించాను. ఎవరో బిగ్గరగా అరుస్తున్నారు. ఆడా, మగా?. ఆడపిల్లే అన్నారు. అయ్యో! మరలా ఆడపిల్లేనా? ఎవరివో నిట్టూర్పులు వినిపించాయి. రంగయ్య మగపిల్లోడి గురించి ఎదురు చూస్తున్నాడే? ఇప్పుడు ఈమంటాడో రకరాల మాటలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల అయితే ఎందుకు వద్దనుకుంటున్నారో,?ఏంటో నాకు అర్ధం కాలేదు. ముగ్గురు ఆడపిల్లల్ని ఏం జేసుకుంటారు. చిన్న అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేస్తే బాగుంటుందేమో . నా రాక ఇక్కడ ఎవరికీ సంతోషం కలిగించటం లేదనిపిస్తోంది.ఆడ పిల్ల అంటే ఎందుకు అలా ఆందోళన పడుతున్నారు మగ పిల్ల వాడు అయితే బాగుండును అంటున్నారు ఏంటి? ఆడ మగ కి తేడా?ఆడపిల్ల అంటే అంతా చులకన భావమా? అమ్మ అలా ఏడవక పోతే నాన్న ని ఎదిరించి, నచ్చజెప్పవచ్చు కదా!! నానమ్మ కూడా ఆడదే కదా!! మరి అమ్మ మీద ఎందుకు కోపం? ఆడపిల్లను కనటం అమ్మ తప్పు కాదే?మరి పుట్టడం నా తప్పా? ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి అమ్మలే కదా!! ఆడపిల్ల మీదా అంతా చులకన భావన చూపే నాన కి పుట్టుక ఉండేదా?అది ఎందుకు అర్ధం కావటం లేదు వీళ్ళకి. ఎలాగోలా, వారం రోజులు గాడిచాయి హాస్పటల్ నుండి మా ఇల్లు ఆట, అక్కడకు నన్ను తీసుకవెళ్లారు. అక్కడ అక్కలు వున్నారు నన్ను చూడగానే ఎంతో ఆనంద పడి చెల్లి చెల్లి అంటూ చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు.నా రాక కొరకు ఎదురు చూసిన వారిలో నా అక్కలు తప్ప ఎవరూ సంతోషంగా లేరు. ఇంటి వాతావరణమంతా గందరగోళంగా ఉంది. నేను ఊహించిన విధంగా లేదు. ఎన్నో ఊహలతో ఈ లోకంలోకి వచ్చాను. నా రాక ఇంత ఇబ్బంది కరంగా ఉంటుందనిఊహించలేదు.
రోజు రోజుకూ నా గురించి ఇంట్లో గొడవలు ఔతున్నాయి. నన్ను చూడటానికి వస్తున్నవారంతా అయ్యో! మళ్ళీ ఆడపిల్లే పుట్టిందా! అని బాధను వ్యక్తం చేసి వెళుతున్నారు. నానమ్మ విసుక్కుంటుంది. అసలే మన పరిస్థితి అంతంత మాత్రం! ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారు. ఈ ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి పెళ్లిళ్లు, పేరంటలు చేయాలంటే వాడికి ఎంత కష్టం. ఏదో లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు, వాడి సంపాదనలో సగం వాడి తాగుడికే తగలెస్తున్నాడు. ఇంకా ఈ ఆడపిల్లల్ని ఎలా పెంచుతాడు? ఈ సారి ఐనా వారసుడు పుడతాడేమో! అని అనుకున్నాము? నిరాశే మిగిలింది అని తిడుతూంది.అమ్మలక్కల సూటిపోటీ మాటల మూలంగా నాన్న అమ్మపై గొడవ పెడుతున్నాడు. అమ్మ ఏం తప్పు చేసిందని అందరూ అమ్మను తిడుతున్నారు. ఆడపిల్లల్ని కనటం అమ్మతప్పా? ఈ లోకంలో ఆడపిల్లలకు స్థానం లేదా? మా అక్కలు బిక్కు బిక్కుమంటూ ఒక మూల కూర్చొని ఉంటున్నారు. అలా నెల రోజులు గడిచాయి. ఏం జరిగిందో ఏంటో? కడుపులో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్త గా చూచుకున్న అమ్మ ఈ లోకానికి నన్ను పరిచయం చేసి ఎక్కడకు వెళ్లిందో ఏమో? అమ్మ పాలు, అమ్మవడి, అమ్మ స్పర్శ నాకు దూర మయ్యాయి. అక్కలు నన్ను ఆడిస్తున్నారు.ప్రతి రోజూ నా కళ్లు అమ్మ కోసం వెతుకు తున్నాయి? అందరూ కనపడుతున్నారు కాని అమ్మ మాత్రం కనపడటం లేదు.నా బాగోగులన్నీ నానమ్మ చూచు కుంటుంది. రోజు అమె ప్రక్కలోనే పడుకుంటున్నాను.
నాన్న నన్ను అసలు పట్టించు కోవటం లేదు. చూడనైనా చూడటం లేదు.ఇంటికిఎవరెవరో వస్తున్నారు. మమ్ముల్ని చూచి వెళ్తున్నారు. విషయం నాకు నిమ్మదిగా అర్ధం అవుతువుంది. నానమ్మకు ముగ్గురిని పెంచటం చాలా కష్టంఅట! కాబట్ట చిన్నదాన్ని అయిన నన్ను ఎవరికైనాపెంచు కోవటాని ఇచ్చేద్దామని నానమ్మ ఆలోచన. అక్కవాళ్లు పెద్ద వాళ్ళు అయినందున వారిద్దరినీ పెంచు కుంటారట. నేను ఒక్కదాన్నే వారికి భారమట! ఎంత వివక్ష! నాన్న కూడా ఎందుకు ఒప్పుకున్నాడు.
అక్కలు మాత్రం చెల్లిని ఎవరికీ ఇవ్వటానికి వీళ్లేదని ఏడుస్తున్నారు. వారి మాట ఎవరు పట్టించు కుంటారు. నాకు అంతా అయోమయంగా ఉంది.!!
అమ్మా! నన్ను వదలి పెట్టి ఎక్కడకు వెళ్ళవమ్మా! వీళ్లంతా నన్ను పంపించేద్దాం అనుకుంటున్నారు. నువ్వు ఉంటే నన్ను ఇచ్చేవాళ్ళు కాదుకదా!! నన్ను నీతో ఎందుకు తీసుకెళ్లలేదు అమ్మ!! నాకు ఏడుపొస్తుంది రోజు ఎవరో ఒకరు వస్తూనే వున్నారు నన్ను ఎత్తు కోవాలని చూస్తున్నారు కాని ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనిపించటం లేదు అక్కలు ఉంటే చాలు అనిపిస్తుంది నానమ్మ, నాన దగ్గర కూడా వుండాలని లేదు. అక్క వాళ్ళే నాతో ప్రేమగా ఉంటున్నారు.నానమ్మ ఉన్నఊర్లో ఉన్న దగ్గర బంధువులకు నన్ను ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ వచ్చేస్థానో అని భయం. మంచి వాళ్లను చూచి ఎక్కడికైనా దూరంగా ఇవ్వాలి అని తన ఆలోచన.దూరంలో ఉంటే అందరినీ తొందరగా మరచి పోతుందని నానమ్మ ఆలోచన.అలా రోజులు గడుస్తున్నాయి. అమ్మా! నువ్వు కనపడతావేమో నని ఎదురు చూస్తూనే వున్నాను. నన్ను వదలి వేసి ఎక్కడకు వెళ్ళావు అమ్మ! నువ్వంటే నన్ను ఎవరికీ ఇచ్చేదానివి కాదు నన్ను ప్రేమగా చూచుకునే దానివి. నేను ఎవరికీ చెప్పుకోలేని బాధ. నువ్వు తప్ప ఎవరూనన్ను అర్ధం చేసుకోలేరు అమ్మా! నా గురించి ఎవరూ రాకుండా ఉంటే బాగుండేది. కానీ నా తల రాత ఎలా ఉందో!!
ఒక రోజు అనుకోకుండా ఎక్కడో దూరం నుండి ఒక జంట వచ్చారు. మన పక్కింట్లో దిగి నన్ను చూడటానికి తీసుకురమ్మని చెప్పారు. నానమ్మ అక్క గౌను తొడిగి నన్ను రెడీ చేసి వాళ్లకు చూపించింది.అమెను చూసిన వెంటనే ఆమె ముఖంలో తల్లి ప్రేమ కనిపించింది.మొఖంలో చిరునవ్వు, ఆప్యాయత, ఆదరణ కనిపించాయి. చేతులు చాచి అమె నన్ను ఎత్తుకొని తన గుండెలకి హత్తుకొని ముద్దాడింది. వచ్చిన వారందరిలో కన్నా నాకు ఆమెని చూస్తే నీ దగ్గర కనిపించిన స్పర్శ గుర్తొచ్చింది అమ్మా!అమెకు నేను బాగా నచ్చినట్లు ఉన్నాను. నన్నుతీసుకెళ్ల టానికి నిర్ణయించుకొని నానమ్మ వాళ్ళతో మాట్లాడారు. వళ్ళో కూర్చుండ బెట్టుకొని కడుపు నిండా నాకు గోరు ముద్దలు తినిపించింది. నాకు చాలా ఆనందం కలిగింది. అమె చంకనుండి,దిగాలనిపించ
లేదు.ఆమెతో వెళితే బాగుండు ననిపించింది.నాకు బాగా ఏడ్పు వచ్చింది. అక్కలను వదలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది. ఈ ఇంట్లో నన్ను ప్రేమగా చూచేదే వాళ్ళు. ప్రతి క్షణం,చెల్లి! చెల్లీ,అని నన్ను ఎత్తు కోవటానికి ప్రయత్నించే వారు. ఎంతో ప్రేమతో ముద్దులతో ముంచెత్తే వారు. నేను వెళ్ళిపోతానని అక్కలు కూడా బాగా ఏడ్చారు. నానమ్మ ఏడ్చుకుంటూ, నీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఈ పని చేస్తున్నాను తల్లీ నీవు మా దగ్గర ఉంటే నీ జీవితం బాగుపడదు.మీ ముగ్గురికి సరిఅయిన తిండి కూడా పెట్టలేము.బట్ట ఉండదు చదువు సంధ్య, లుండవు, నాన సంపాదనతో మిమ్మల్ని పెంచలేడు. అందుకే కష్టం అయినా,బాధ అనిపించినా, నిన్ను ఈ అమ్మకు ఇస్తున్నాను నిన్ను ఏ లోటు లేకుండా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. నాకు ఆ నమ్మకం ఈ అమ్మమీద కలిగింది. ఇలా నిన్ను ఇస్తున్నందుకు
నన్ను క్షమించు తల్లీ! అని బోరున ఏడ్చింది నానమ్మ.నానమ్మతో పాటు నాన్న, అక్కలు, మాతో పాటు వీధిచివరివరకు సాగానంపారు. ఇంటి చుట్టు ప్రక్కల ఆడవారంతా కన్నీటితో చిట్టి తల్లిని చల్లగా ఉండమనిఆశీస్సులు అందించారు .నానమ్మ తగు జాగ్రత్తలు చెప్పి కొత్త అమ్మ చేతిలో పెట్టింది నన్ను. అక్క లు నన్ను వదల లేక చేతు లూపుతూ కన్నీటి పర్యంత మాయ్యారు. మా వీధి మొత్తంఅందరూ కొంతదూరం మాతో నడచి భారమైన హృదయాలతో వీడ్కోలు పలికారు.అలా వెళ్లిన నాకు ఒక వారం రోజులు నా వాళ్లంతా గుర్తుకొచ్చారు. ముఖ్యంగా అమ్మ,!ఎందుకు అమ్మ నాకు మరలా కనిపించలేదో, ఏమైందో అర్ధం కాని విషయం.? బహుశా అమ్మ నాకు కనిపించనంత సుదూర ప్రాంతం వెళ్లిందేమో! అందుకే మరలా నన్ను చూడటానికి రాలేక పోయిందేమో?
తరువాత కొత్త అమ్మ నాన్నల ఆత్మీయత, ప్రేమానురాగాల ముందు నా వాళ్ళని మర్చిపోగలిగాను. అమ్మ కడుపులోఉన్నప్పుడు ఎన్ని కలలు కన్నానో, ఎన్ని ఆశలతో ఈ క్రొత్త లోకంలోకి వచ్చానో అవన్నీ ఈ అమ్మ దగ్గర నాకు దొరుకుతున్నాయి.మరలా ఆడపిల్లే పుట్టిందని నా గురించి అమ్మ,నాన, రోజు గొడవ పడే వారు. కాని ఆడపిల్లలు కూడా పట్టుదలతో దేన్నయినా సాధించ గల సామర్థ్యం కలవారము అవుతామని ఆలోచించ లేక పోయారు. అది వారి మూర్ఖత్వానికి నిదర్శనం.
ఈ అమ్మ నాన ఆడ మగ తేడా లేకుండా ఆడపిల్లని అయినా నన్ను ప్రేమగా చూచు కుంటున్నారు.
బాగా చదుకొని మంచి ప్రయోజకురాలిని అవుతాను. పెంచిన మీ ఋణం తీర్చు కుంటాను అమ్మా! ఆడ పిల్లయినా, మగవాడికి ఏమి తక్కువ కాదని, ప్రతి పనిలో ఇద్దరూసమానమే నని ఈ లోకానికి తెలియ జేస్తాను.మాటలు రాని నా పసి హృదయంలో మెదిలే మూగ వేదన.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!