మనస్సు పడే ఆవేదన

మనస్సు పడే ఆవేదన

రచన:-జయకుమారి

ఏమి చెప్పను. ఏ ప్రశ్నలు ఎవరిని అడగను. ఓ మౌనమా నిన్ను ఎలా దాటను. ఏభైఏళ్ల  నుంచి మనస్సు పడుతున్న ఆవేదనను ఈ కన్నీటితో  కడిగేయలా,ఇన్నేళ్లు పడిన ఆవేదన అంతా ఈ ఒక్క రోజులో నన్ను వీడి పోతుందా. ఏమో నా మనస్సు కు ఎందుకో భయం గా ఉంది. గాలికి రెపరెపలాడే దీపం లా,నా ప్రాణం కూడా రేపో మాపో అంటూ ఉంది. నా బాధ ఎవరికి అర్ధం కావడం లేదు. కనీసం నీకైనా చెప్పుకుందాం అని. ఈశ్వరా నీవైన చెప్పయ్యా ఈ చివరి రోజుల్లో అయినా నేను ప్రశాంతం గా వుండలేకపోతున్నా ఎందుకు? ఆయన ప్రేమ గా చూసుకుంటున్నా నేను సంతోషం గా ఉండలేకపోతున్నా.
రామలక్ష్మణులాంటి ఇద్దరు బిడ్డలు. కూతుళ్ళ లా చూసుకునే ఇద్దరు కోడళ్లు. పెద్దోడి కి ముత్యమంటి నవ్వులు చిందే  మహాలక్ష్మి లాంటి ఇద్దరు అమ్మాయి లు.వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వారితో సమయం గడిపెదాన్ని. చిన్నోడికి ఒక పాప , ఒక బాబు. ఇద్దరు అల్లరి పిల్లలు. మనవడు పుట్టాలి అని మొక్కని మొక్కు లేదు. తిరగని గుడి లేదు. వాడు పుట్టాక వాడి ఆలన, పాలన చూస్తూ సమయం గడిపెదాన్ని,కొడళ్లకు చిన్నదో,పెద్దదో సాయం చేస్తూ అందరం చాలా సంతోషంగా ఉంటాము. సంసారం లో కూడా ఏ లోటు లేదు. కానీ నా మనస్సుకు మాత్రం ఏదో లోటు.
నాకు తెలిసిపోతుంది నేను ఎక్కువ రోజులు బ్రతకను అని, ఈ బంధాలు బంధికాన నుంచి విముక్తి పొందే సమయం దగ్గర లోనే ఉంది అని. నా మనస్సును గాయం చేసిన మాటలు మర్చిపోయి,ఆయనతో సంతోషం గా ఉండాలని ఉంది. కానీ పగిలిన అద్దం,విరిగిన మనస్సు అతుక్కోవు అంటారు. బహుశా అదే నిజమేమో అందుకేనేమో మనస్ఫూర్తిగా ఆయన ప్రేమను అంగికరించలేకపోతున్న. పైకి అన్ని బాధ్యతలు సక్రమంగా,ప్రేమ గా నిర్వహించిన,ఆయన మాటలు మటికి మనస్సులో ముద్రపడిపోయినాయి.
నీకు తెలుసుగా ఈశ్వరా.! ఆయన చెడ్డవారు కాకపోవచ్చు ,కానీ నా మనస్సును ఎప్పుడూ అర్ధం చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి పెదరికంలోనే బ్రతికాను. ఇద్దరు చెల్లెల్లు, ఇద్దరు తముళ్ళు. నేనే పెద్దదాన్ని ఇంటికి .అక్కడ సర్దుకు పోయి బ్రతకడమే, పెళ్ళి సంబంధం కూడా మా మేనత్త వాళ్ళు తెచ్చారు.
మా మావయ్య గారు అప్పటిలో జిల్లా ఆఫీసర్ గా చేసేవారు, ఆయన మా వారికి ఉద్యోగం ఇప్పిస్తా అని మా పెళ్ళి కుదిర్చి చేశారు కానీ
అనుకున్న టైం కి ఇప్పించలేకపోయారు దానితో మా అత్తగారు ఒక పక్క ఇయన ఒక పక్క మాటలతోనే ఇబ్బంది పెట్టేవారు. అయినా అవన్నీ భరించి ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు మరిది గార్లు, ఇద్దరు ఆడపడుచులు మా అత్తగారి అక్క,అందరికి సేవలు చేసాను అవి చూసి అయిన ఆయన మనస్సు కరిగి నాతో ప్రేమ గా వుంటారు ఏమో అని. అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
మా పెద్దబ్బాయి పుట్టినప్పుడు కనీసం చూడడానికి కూడా రాలేదు ఎవ్వరు, ఉద్యోగం ఇప్పించే వరకు నన్ను పిల్లడిని తీసుకువెళ్లను అని భీష్మించు కొని కూర్చున్నారు.
అప్పుడు నా బాధ చుడలేక మా మావయ్య గారు గుమస్తా ఉద్యోగం ఇప్పించారు. అప్పుడు తీసుకువెళ్లారు నన్ను పిల్లడిని.
అప్పటిలో కట్టెల పొయ్యిమీదా అంతమందికి వండి వడ్డించేదాన్ని, అయినా చివరిలో నాకు మిగిలేది గుప్పెడు మెతుకులే,కనీసం బాబు కి పాలు పట్టడానికి పాలు కూడా ఉండేవి కావు.
అలా అపనిందలు, అవమానాల పాలే అయ్యింది జీవితం,.
ఒకసారి అయితే జీవితం మీదా విరక్తి కలిగి ఇద్దరూపిల్లల్తో తనువు చాలిద్దాం అని రైలు పట్టాలు ఎక్కాను చివరి నిముషములో చిన్నోడి ఆకలి మా ప్రాణాలు నిలిపింది.
చేసేది ఏమి లేక విరిగిన మనస్సు తో తిరిగి ఆయన దగ్గరకే చేరాను కానీ మళ్ళీ మాములే ఆయన తీరు. అలా అని ఆయనకు ఏ చెడు అలవాటు లేదు,ఉన్నది అల్లా ఒకటే మనస్సుని అర్ధం చేసుకోరు, ప్రేమ ను ఇవ్వరు అంత వాటు ఆయన ధోరణి ఆయనేదే కానీ ఎదుటివారి మాట వినిపించుకోరు,డబ్బు కి తప్ప ప్రేమ కి విలువ ఇవ్వరు అది ఆయన పెరిగిన పరిస్థితులు కారణమో ఆయన తీరు అంతే నో ఇప్పటికి నాకు నేను వేసుకొనే జావాబు లేని ప్రశ్న అది.
ఆడది కోరుకొనేది డబ్బో,నగలో కాదు భర్త ప్రేమ,అతను ప్రేమ తో ఇచ్చే చిరుకానుకలు, అతను చేసే చిలిపి అల్లరి, నా భర్త నాకోసం,నా వెనుక ఉన్నాడు అనే ధైర్యం,నా చిన్న చిన్న ఆశలు అన్ని ఆయన తో సమయం గడపాలని.
అప్పుడప్పుడు ప్రేమ తో కలిపిపెట్టే గోరుముద్దలు చాలు.బాధ కలిగినప్పుడు ఇచ్చే చిరు కౌగిలి చాలు కదా. భర్త కళ్ళల్లో కనిపించే ఆకాశమంత ప్రేమ చాలు.అంత కన్నా గొప్ప కానుకలు ఏమైనా ఉంటాయా భార్యకి.ఇవ్వన్నీ కలలు గా మిగిలిపోయాయి, నా జీవితంలో. ప్రేమ ఉంటే కాలి నడకతో ప్రయాణం అయినా పుష్పక విమానంలో ప్రయాణం లా ఉంటుంది.
ఇప్పటికి కూడా ఆయన మాట ఆయనదే కానీ నన్ను అర్థం చేసుకోకుండా నన్ను ప్రేముస్తున్న అనిచెబుతున్నారు. ఇప్పుడైనా చివరిదశలో నా అవసరం ఉంటుంది కాబట్టి అలా అంటున్నారు నాకు అర్ధం అవుతుంది. అవసరాలకు తప్ప బంధాలకు విలువ లేదు అనిపిస్తుంది. ఇప్పటికి నా జీవితం వెలితిగానే ఉంది. ఎంత మంది ఉన్న భర్త ప్రేమ లేని జీవితం వెలితిగానే మిగిలిపోతుంది. కదా ఈశ్వరా ఇలానే నన్ను నీ లో ఐక్యం చేసుకో. నాకు జీవితం మీదా ఆశ లేదు.
నా మనస్సు వేదన తీరేది కాదు. ఉంటాను ఈశ్వరా,పరమేశ్వరా కరుణించి కడతేర్చు నీ ఈ జీవితాన్ని.

***

You May Also Like

One thought on “మనస్సు పడే ఆవేదన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!