ముక్కు మీద కోపం

ముక్కు మీద కోపం

రచన: పరిమళ కళ్యాణ్

“ఒసేవ్ అలా చెప్పా పెట్టకుండా పెళ్ళైన రెండునెలలకే పుట్టింటికి వచ్చేస్తే ఏమనుకోవాలి? ఏమైంది చెప్పు? అల్లుడుగారు ఏరి? ఒక్కదానివే ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు?” ,అంటూ ప్రశ్నలతో వేధిస్తున్న తల్లి సౌభాగ్య ని చేత్తోనే వారిస్తూ,

“అబ్బా ఆపమ్మా, ఏంటమ్మా ఇది, నా ఇల్లు కాదా? నా ఇంటికి నా ఇష్టం వచ్చినప్పుడు రాకూడదా? అల్లుడు గారు లేలపోతే నేను ఒక్కదాన్ని రాకూడదని ఉందా? రాగానే ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు?” అంటూ విసుక్కుంది కూతురు ప్రశాంతి.

“సర్లే భాగ్య, ఆగు. ఇప్పుడే కదా అమ్మాయి వచ్చింది. నెమ్మదిగా చెప్తుంది లే విషయం ఏమిటో! ముందు కాస్త మంచినీళ్లు ఇచ్చి, తినటానికి కూడా ఏమైనా చెయ్యి. వెళ్ళు!” అన్నాడు భర్త విజయశంకర్.

“సరే మీ తండ్రీ కూతుర్లు ఎప్పుడూ ఒక్కటేగా మీరే కనుక్కోండి అయితే!” అంటూ మూతి తిప్పుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది సౌభాగ్య.

“ఏమన్నా ఇబ్బందా అమ్మా? మాకు చెప్పకూడనిదా?” ఓదార్పుగా అడిగాడు తండ్రి.

“అదేం లేదు నాన్నా, ఊరికే చూద్దామని వచ్చాను అంతే. మీరేం కంగారు పడకండి” అని సర్ది చెప్పి పంపేసింది తండ్రిని.

సౌభాగ్య ప్రశాంతికి ఇష్టమైన వంటలు చేసి, భోజనానికి పిలవటానికి గదిలోకి వచ్చింది. ఇంకా మంచం మీద ముడుచుకుని కూర్చున్న కూతురిని చూసి,

“ఏమైంది తల్లీ? నాతో చెప్పచ్చు కదా! నాకు తోచిన సహాయం నేను చేస్తాను” అనడిగింది అనునయంగా.

“అమ్మా, ఒక విషయం చెప్పు, నా ముక్కు నిజంగా బాగోలేదా? వంకర ముక్కులాగా ఉందా? నిజం చెప్పమ్మా?” అనడిగింది.

“అదేంటే అలా అడుగుతావు?” అంది భాగ్య, కూతురు అడిగిన ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలీక.

“చెప్పమ్మా” రెట్టించింది ఈసారి.

“అలా అని ఎవరన్నారే?” అడిగింది తల్లి.

“ఇంకెవరూ, మీ అల్లుడు గారు, ఆయన ముక్కు కొటేరు ముక్కులాగా పొడుగ్గా, అందంగా ఉంటుందట, నా ముక్కేమో ఎవరో కొట్టినట్టు ఒక పక్కకి ఉంటుందట. పెళ్లికి ముందు సరిగా చూడలేదు కానీ, ఇప్పుడు బాగా కనిపిస్తోందట ఆ తేడా” అని ఏడుస్తూ చెప్పింది ముక్కెగరేస్తూ…

“అయ్యో, అలా అన్నారా? ఏమైనా గోడవయ్యిందా మీ మధ్య?”అంది సౌభాగ్య.

“అదేం లేదమ్మా, సరదాగా అన్నారట, ఎంత సరదా అయితే మాత్రం నా ముక్కునే అంటారా? అందుకే సారీ చెప్పినా ఒప్పుకోలేదు నేను”

“ఏమిటి సరదాకి అన్నారా? మరి ఇంతోటి దానికే చెప్పా చెయ్యకుండా వచ్చేశావా?” అంది సౌభాగ్య.

“అంటే నన్ను అన్నన్ని మాటలు అంటుంటే ఊరుకోవాల్సిందేనా? నాకు కోపం రాదా, రాకూడదా?” అంది ఉక్రోషంగా.

కూతురు చెప్పిన మాటలకి సౌభాగ్యకి నవ్వాలో ఏడవాలో అర్దం కాలేదు. ఎలాగైనా కూతురికి నచ్చ చెప్పాలని చూస్తూ,

“ఎదో సరదాకి అన్నారు కదా, తర్వాత సారీ కూడా చెప్పారన్నావు. అంత చిన్న దానికే ఇలా అలిగి పుట్టింటికి వచ్చేస్తే ఎలా చెప్పు. అయినా ఆయన అన్నదానిలో తప్పేముంది, నిజంగా నీ ముక్కు కాస్త పక్కకి ఉంటుందనే కదా మీ అత్త వాళ్ళందరూ అంటారు. అందుకే కదా ఇంతకుముందు రెండు సంబంధాలు కూడా కాదనుకున్నారు” అంటూ అసలు సంగతి బయట పెట్టింది సౌభాగ్య.

దాంతో మరింత ఆక్రోశంగా, ” అమ్మా! నువ్వు కూడా అలా అంటావేంటి? నా ముక్కుకేం తక్కువ, అయినా ఆయన మాత్రం కొంగలాగా అంత పొడుగు, పిల్లి కళ్ళు. నేను ఏమన్నా వంక పెట్టానా చెప్పమ్మా? అయిన పెళ్ళైన ఇన్నాళ్లకు కనిపించిందా నా ముక్కు వంకర అనీ!” అంది ముక్కు చీదుతూ.

“అయ్యో రామా! అలా కాదే, అయినా ఇలాంటివి పట్టించుకుంటే ఎలా చెప్పు. చిన్న చిన్న విషయాలు సర్దుకుపోవాలి కానీ. అయినా ఏదో సరదాకి అంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నావెందుకే? నా మాట విని ఆయనతో ఒక మాట చెప్పు, ఇలా ఇంటికి వచ్చాను వచ్చి తీసుకుని వెళ్ళమని.” అంటూ నచ్చచెప్పినా వినకుండా…

“పోమ్మా, నేనేం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడను, రమ్మని పిలవను. ఆయన వచ్చి రమ్మంటే అప్పుడు చూస్తా, అప్పుడు ఆలోచిస్తా!” అంది మొండిగా.

“ఖర్మ ఖర్మ, ఈ కాలం పిల్లలు అసలు పెద్దల మాట వింటారా? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు అంతే!” అనుకుంటూ బయటకి వస్తూనే గుమ్మం పక్కనే నిలుచున్న అల్లుడిని చూసి,

“రండి రండి అల్లుడు గారు, ఇదేనా రావటం? అంతా కులాసాయేనా?” అంది, లోపల గదిలో ఉన్న కూతురికి వినపడేలా.

“అంతా బాగున్నారు అత్తయ్య గారు, మీరెలా ఉన్నారు? అన్నట్టు శాంతి ఏదీ?” అనడిగాడు అల్లుడు పవన్ కుమార్.

శాంతి ఏదీ అన్న మాట వినగానే, పరుగున వచ్చి “వచ్చారా? రండి” లోపలకు అంటూ గదిలోకి తీసుకుని పోయింది ప్రశాంతి.

ఇప్పటివరకూ ఉన్న ముక్కుమీద కోపం అంతా ఏమైపోయిందో? ఎప్పుడు పోయిందో?..

***

You May Also Like

One thought on “ముక్కు మీద కోపం

  1. 😂😂😂అంతే క్షణికమైన కోపతాపాలు. 👌👌👌😊🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!