నర్సన్న.. ఆనందం

నర్సన్న.. ఆనందం

రచన: లోడె రాములు

ఉదయమే బాగవన్నామ స్మరణ చేసుకోవడం ఈ లాక్ డౌన్ టైం లో నా దినచర్యగా మారింది.. కాలక్షేపానికి నాకున్న అలవాటు పుస్తకాలు చదవడం..మా గురువు గారు కృష్ణన్న అలవరచిన ఓ మంచి వ్యాపకం..నాకున్న సమస్యలు, ఒత్తిడి నుండి కాసింత ప్రశాంతత దొరికేది పుస్తకాలతోనే..ఈ రోజు రామాయణ కల్పవృక్షం చదువుదామని తీశాను. ఎన్నో సార్లు ఆ గ్రంధాన్ని చదవాలని అనుకుంటూనే ఎప్పటికప్పుడు వాయిదా వేశాను, అని అనడం కన్నా విశ్వనాధ గారి రచనలను అర్ధం చేసుకోవడం నా లాంటి పామరులకు చాలా కష్టం.. ఇప్పటికీ అది నాకు కష్ట తరమే.. అయినా తినగ తినగ వేము తియ్యనుండు అంటారు కదా.. ముందుగా ఒక సారి మనసు రాముడి మీదకు మళ్లింది.. నిజంగా రాముడి లాంటి సకల గుణాభివంతుడు,ఏకపత్నీ వ్రతుడు ఏ కాలంలో నైనా ఉన్నాడా.. ఇక ఈ కలియుగంలో అయితే ,ఎందెందు వేదికినా కానరాడు అన్నది జగమెరిగిన సత్యం..అలా నా ఆలోచనలు రాముడి చుట్టు తిరుగుతుండగానే,ఫోన్ మ్రోగింది
“హలో…
“హలో..రామన్నా..అంతా బాగున్నారా!” అని మిత్రుడు నర్సన్న నుండి ఆత్మీయంగా పలకరింపు…
“అంతా క్షేమమే..అన్నా.!! మీరు కూడా బాగున్నారుగా.,
ఆ.. చెప్పండన్నా.. విశేషాలు,
ఏంచేస్తున్నారు..ఎలా టైంపాస్ అవుతుంది..??.” అని ప్రశ్నల వర్షం కురిపించాను..
“అంతా..ఓ.కె..అన్నా.. నీకు ఓ శుభవార్త చెబుదామని..” అంటుండగానే..
“చెప్పన్నా.,సంతోషిస్తాను.” అన్నాను
“నాకు మనవరాలు వచ్చింది..”అని మహదానందంతో చెప్పాడు..
“”ఓ…కంగ్రాట్స్ అన్నా..!తల్లీ, పిల్లా! ఆరోగ్యంగా ఉన్నారు కదా.!.నీ చిరకాల వాంఛ తీరింది..సంతోషం అన్నా..లాక్ డౌన్ తర్వాత కలుస్తాను..”అన్నాను అంతే ఉత్సాహంగా..
“ఓకే.. మనోళ్లందరికి మంచి దావత్ ఇస్తాను..కలుద్దాం అన్నా..”అని ఫోన్ పెట్టేశాడు.. నాకు మనసు చాలా ఉల్లాసంగా ఉంది.
కుర్చీలోంచి లేచి అలా వరండాలో తిరుగుతూ..ఈ ఆనంద క్షణాన్ని ఆస్వాదిస్తూ..నా ఆలోచనలు మిత్రుడు నర్సన్న మీదికి మళ్లాయి.. నాకు అతి కొద్ది కాలంలోనే అత్యంత ఆత్మీయుడిగా మారాడు..
డిపార్ట్మెంట్ పరంగానే పరిచయం అయినా , అతనిలోని కలివిడి తనం, ఎవ్వరికైనా ఏ ఆపద వచ్చినా అన్ని విధాలా ముందుండే ధైర్యం. యూనియన్ లో ఆక్టివ్ గా ,ఏ పదవి ఆశించ కుండా క్రియాశీలక కార్యకర్త గా, స్వచ్చందంగా పని చేసేవాడు..
నర్సన్న వ్యక్తి గత జీవితం కూడా ఆదర్శవంతమైనదే..తనకు ఒక కొడుకు,బిడ్డ..వాళ్లకు 10, 8.. ఏళ్లు ఉండగానే..ఓ ప్రమాదంలో తన భార్య మృత్యువుతో పోరాడి మరణించింది..ఆమే తనకు ప్రాణం ,తన భావాలకు అనుగుణంగా నడుచుకునే అర్ధాంగి అర్ధాంతరంగా పోయేసరికి,నర్సన్న మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాడు..ఒక టైంలో తను మాత్రం..బతకడం ఎందుకని భావించాడు..కానీ బతకాలి ,అన్నెం పున్నెం ఎరుగని పిల్లలు..వారి భవిష్యత్తు గుర్తుకొచ్చి గుండెను నిబ్బరం చేసుకొని..కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని ,బాధనంతా ఒంటరిగానే భరిస్తూ,పిల్లలపట్ల బాధ్యతగా..వారికి అమ్మ..నాన్న తానే అయ్యి అటు ఉద్యోగాన్ని చేసుకుంటూ,పిల్లలను చదివించాడు…తన కుటుంబ సభ్యులు, స్నేహితులు,బంధువులు “మళ్ళీ పెళ్లి చేసుకోమని , చెయ్యేందుకు కాల్చుకుంటావని, నీకేం వయసు అయిపోయిందని” రకరకాలుగా సలహాలు..ఒత్తిడి.. అందరికి ఒకటే సమాధానం..
“మీరు ఆ ఒక్క విషయం వదిలేయండి..అలా అయితే నాతో మాట్లాడకండి.ఇంటికి రాకండి” అని మొఖం మీదే చెప్పేవాడు..నేడు పిల్లలు ప్రయోజకులయ్యారు..
మధ్య తరగతి నుండి లంకంత ఇల్లు గృహప్రవేశం చాలా గొప్పగా ఫంక్షన్ చేశాడు.. ఇల్లు తన అభిరుచికి,పిల్లల అభీష్టానికి తగ్గట్టుగా ఉంది. నిజానికి ఆ ఇల్లు తనకిప్పుడు దేవాలయం కన్నా ఎక్కువే..
ఆ లంకంత ఇంట్లో తన భార్య లేదన్న చింత మనసు నిండా ఉంది. అందుకే దేవుని గది స్థానం లో తన సర్వస్వం అయిన తన దేవత చిత్ర పటాన్ని అన్ని హంగులతో ప్రతిష్టించుకొని , గుండెగదిలో పూజించు కొంటున్నాడు.. తన భార్య ఉన్నప్పుడు ఆమె ఇంటికి వచ్చిన అతిధులను, బంధువులను,కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించడం, మర్యాద,సేవాగుణం అందరికీ తెలిసిందే.. ఆమె అంటే అందరికీ గౌరవం.. ఉండేది..గత రెండేళ్ల క్రితమే కొడుకు పెళ్లి చేశాడు..ఇప్పుడు అతనికి అమ్మాయి పుట్టింది..ఇక ఆ పాపతో కాలక్షేపం,ఆయన మనసుకు గొప్ప ఊరట ఈ విశ్రాంతి జీవితంలో అట విడుపు..
“”నర్సన్నా.. నీవు గ్రేట్ “”అని మిత్రులం అంటే “”నాదేముందన్నా..అంతా మా ఆవిడే గ్రేట్,ఆమె ఈ గుండెలో ఉంది కనుకనే మీ మధ్య ఉండ గలుగుతున్నాను..”అని నిజాయితీగా చెబుతాడు.
భగవంతుడు ఒక్కొక్కరి జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతుంటాడో.. కష్టం వచ్చినప్పుడు తిట్టుకుంటూ ఉంటాం..ప్రతి కష్టం వెనక ఏ పరమార్ధం దాగివుందో ఎవరికి ఎరుక. అంతా మన మంచికే అని మనం ముందుకు సాగిపోవడమే .. దైవం మానుష రూపేణా…ప్రతి మనిషిలో దైవం..ఏదో ఒక మంచి గుణం ఉంటుంది.. అది గమనించాలంటే..కాస్త నిశితంగా గమనించాలి.. నరునిలోనే దైవం ఉంటుంది..రాక్షసత్వం ఉంటుంది
ఏ గుణాన్ని ఆశ్రయిస్తామో అదే మన గుర్తింపు ..చివరకు మిగిలేది.. అదే..చపల చిత్తం నుండి చిన్మయానందం వైపు పయనిద్దాం..

***

You May Also Like

One thought on “నర్సన్న.. ఆనందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!