ఘరానా మోసం

ఘరానా మోసం

రచన: సావిత్రి కోవూరు

హైదరాబాదులో ఒక చివరన గల పెద్ద మ్యారేజ్ హాల్ విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ,  మూడు రోజుల నుండి ఇంద్రసభనే మరిపిస్తున్నది. దానిలో డాక్టర్ రంగారావు గారి ఏకైక కుమార్తె ఉజ్వల పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. మామూలు వాళ్ళు ఒక్కరోజు ఆ హాల్ ఖర్చులు భరించడమే చాలా కష్టం. అలాంటిది రంగారావుగారు మూడు రోజులుగా హాల్ బుక్ చేసుకుని అట్టహాసంగా తన కుమార్తె వివాహం జరిపిస్తున్నారు.

ఉజ్వల కూడా డాక్టర్. మెరిట్ స్టూడెంట్, చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, అందమైనది కూడా. ఆ అమ్మాయికి తగ్గ అబ్బాయిని వెతకడానికి రంగారావు గారికి చాలా కష్టమే అయ్యింది. తెలిసిన వాళ్ళందరికీ తన కూతురుకు తగ్గ మంచి అబ్బాయిని చూడమని చెప్పాడు.

చివరికి గోపాల్ రావు అనే ఫ్రెండ్ ద్వారా ఢిల్లీలో మంచి పేరున్న హాస్పిటల్ లో పనిచేస్తున్న, ‘రాకేష్’ అనే అబ్బాయి తన కూతురికి సరిజోడు అని తెలుసుకున్నాడు.

ఆ ఫ్రెండ్ “రాకేష్ మా హాస్పిటల్ లోనే పని చేస్తున్నాడు. మన తెలుగు వాడే. చాల ఇంటలిజెంట్. ఆ అబ్బాయికి చెప్తాను. మిమ్మల్ని కలవమని” అన్నాడు

“థాంక్యూ గోపాల్ రావు” అని కృతజ్ఞతలు తెలిపారు రంగారావు.

“ఏమను కోకండి.  మీ అమ్మాయి పెళ్ళికి నేను అటెండ్ కాక పోవచ్చు రేపే మా అబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్తున్నాము మేము” అన్నారు గోపాల్ రావు.

రంగారావు ఫోన్ చేద్దాము అనుకునేంతలో ఆ అబ్బాయే ఫోన్ చేసి,”అంకుల్  నాపేరు రాకేష్. నేను మా బంధువులింటికి హైదరాబాదు వచ్చాను. ఒక సారి మిమ్మల్ని కలవమని గోపాల్ రావు అంకుల్ అన్నారు. ఎలాగు వచ్చాను కదా! మిమ్మల్ని కలుద్దామని కాల్ చేశానంకుల్” అన్నాడు.

“నేనే ఫోన్ చేద్దామనుకున్నాను బాబు. మీ పనైన తర్వాత ఒక సారి ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూసి వెళ్ళండి. మీకు మా అమ్మాయి, మా అమ్మాయికి మీరు నచ్చితే, తర్వాత మీ వాళ్ళతో మాట్లాడతాను.” అన్నారు రంగారావు గారు.

ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి ఉజ్వలను చూసింతర్వాత  ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో సంబంధం కుదుర్చుకున్నారు. ఆ అబ్బాయికి తల్లి తప్ప ఎవరు లేరు. కనుక ఈజీ గానే హైదరాబాద్ కు షిఫ్ట్ అవడానికి తేలికగానే ఒప్పుకున్నాడు. అందుకే కూతురు హైదరాబాద్ సంబంధం చేసుకుంటే, కళ్ళ ముందర ఉంటది అని సంతోషించాడు.

హైదరాబాద్ వచ్చి చుట్టాల ఇంట్లో ఉన్న రాకేష్ తో అన్ని మాట్లాడి తొందర్లోనే మంచి ముహూర్తం చూసి అట్టహాసంగా పెళ్లి చేశాడు. పెళ్ళయిన కొన్ని రోజులకే కేరళ హనీమూన్ కి వెళ్లి వచ్చిన తర్వాత తండ్రి కొనిచ్చిన విల్లాలో వేరు కాపురం పెట్టారు ఉజ్వల దంపతులు.

పెళ్లైన రెండు నెలలకు ఇక్కడే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో రాకేష్ కు కూడా ఉద్యోగం దొరికింది. ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళి వస్తున్నారు. రంగారావు సంతోషానికి హద్దే లేకుండా పోయింది. తను అనుకున్నట్టుగానే అల్లుడు, కూతురు అన్యోన్యంగా  కాపురం చేసుకుంటు ఉండడం చూసి ఎంతో పొంగిపోయారు.

రాకేష్ రోజు ఉజ్వల కంటే ముందే, తల్లి ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని డ్యూటీకి వెళ్లి పోయి, ఉజ్వల రాకముందే వచ్చేవాడు. చాలా వరకూ అతనికి డ్యూటీ టైమింగ్స్ మారుతుండేవి. ఉజ్వల ముందు నుండి అపోలో హాస్పిటల్ లోనే చేసేది అదే కంటిన్యూ చేస్తుంది.

 పెళ్లయిన తర్వాత ఉజ్వల భర్తకు హాస్పిటల్కి వెళ్లి రావడానికి మంచి కారు కొని, గిఫ్ట్ గా ఇచ్చింది. ఆదివారాలు ఇద్దరు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి వచ్చేవారు. మధ్య మధ్యలో ఉజ్వల తల్లిదండ్రుల దగ్గరకు కూడ వెళ్ళి వచ్చేవారు. మొదటి జీతం  తీసుకున్నప్పుడు రాకేష్ ఉజ్వల చేతికి ఇవ్వడానికి వచ్చాడు.

ఉజ్వల “మీ జీతం మీరే బ్యాంకు లో వేయండి. నా జీతంతోనే ఇంట్లో ఖర్చులు, మన ఖర్చులు పెట్టుకుందాం. రెండు జీతాలు నా దగ్గరే ఉంటే ఖర్చై పోతాయి. అవసరం ఉన్నప్పుడు తీయొచ్చు. ఈ విధంగా ఒక జీతమైన పొదుపు చేయొచ్చు” అన్నది

ఆ తర్వాత ఎప్పుడు రాకేష్ తన జీతం గురించి మాట్లాడలేదు. ఇంటి ఖర్చులు అన్ని ఉజ్వల చూసుకోవడమే కాక అత్తగారికి, భర్తకు, తనకు కావలసిన బట్టలు లాంటివి కూడా తనే తెస్తుంది.

మధ్య మధ్య అందరు కలిసి సరదాగ ఎక్కడికైనా వెళ్ళి వచ్చేవారు. ఈ విధంగా సాఫీగా సాగుతూ ఉండగా ఒకరోజు, ఉజ్వల ఫ్రెండ్ కోమలి గృహప్రవేశానికి వెళ్ళింది. అక్కడ మాటల మధ్యలో భర్త పని చేసే హాస్పటల్ ప్రస్తావన వచ్చినప్పుడు,

కోమలి “నేను కూడా అక్కడే చేస్తున్నాను మీ వారు ఎన్ని రోజులు అయింది అక్కడ చేరి” అన్నది.

“రెండు నెలలు అయింది” అని చెప్పింది ఉజ్వల.

“రెండు నెలలా మరి నేనెప్పుడూ ఆ పేరు గల డాక్టర్ ఉన్నట్టుగా వినలేదే అక్కడ. నేను సంవత్సరం నుండి చేస్తున్నాను” అన్నది

ఉజ్వల ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తని “మీరు ఆ బ్రాంచిలోనేగ చేసేది? అక్కడ మా ఫ్రెండ్ ఒకావిడ పనిచేస్తున్నది” అన్నది.

వెంటనే రాకేష్ గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. మొహంలో మారె రంగులు ఉజ్వలకు కనబడకుండ,

“అయ్యో నీకు చెప్పలేదు కదా! చెప్పడం మర్చిపోయాను. నన్ను మాదాపూర్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అందుకే ఆమెకు తెలియలేదేమో” అన్నాడు

“మరి మీరు నాకు చెప్పనేలేదు” అన్నది ఉజ్వల.

“అవునా చెప్పాననుకున్నాను” అన్నాడు రాకేష్

మూడు నెలలు సాఫీగా సాగిపోయింది.  ఒకరోజు అమెరికా నుండి వచ్చిన రంగారావుగారి ఫ్రెండ్ గోపాల్ రావు ఫోన్ చేసి,

“ఏంటి రావు గారు అమెరికాకి వెళ్లేముందు మీకు రాకేష్ గురించి చెప్పాను కదా! ఈ అబ్బాయి చాలా మంచివాడు, మెరిట్ స్టూడెంట్, మీ అమ్మాయికి చక్కగా జత కుదురుతుందని. మీరు ఎందుకు ఆ అబ్బాయితో మాట్లాడలేదు. ఆ అబ్బాయికి ఇప్పుడు వేరే సంబంధం కుదిరిందట” అన్నాడు బాధగా.

“అదేంటి మీరు చెప్పిన రాకేష్ తో మీరు వెళ్ళిన రెండు నెలలకే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసాను. వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. అలా మాట్లాడుతారేంటి? గోపాల్ రావుగారు” అన్నాడు రంగారావు.

“లేదు లేదు రావు గారు. నేను చెప్పినా అబ్బాయి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మీరు ఎవరితో చేశారు మీ అమ్మాయి పెళ్ళి” అన్నారు కంగారుగా గోపాల్ రావు.

“నేను మీరు చెప్పిన రాకేష్ నే అల్లుడుగా చేసుకున్నాను. మా అల్లుడి ఫోటో వాట్సాప్ లో పంపుతున్నాను చూడండి. మీరు చెప్పిన అబ్బాయి ఇతనే కదా!”అని  రాకేష్ ఫోటోను వాట్సాప్ లో గోపాల్ రావుకి పంపించారు.

 ఆ అబ్బాయి ఫోటో చూసి “రావు గారు మీరు మోసపోయారు ఈ అబ్బాయి హైదరాబాద్ లోనే మా ఇంటి పక్కనే ఉండే రాజు. వాడు ఇంటర్ కూడా పాస్ కాలేదు. ఈ మధ్యనే మా పక్కింట్లో అద్దెకి దిగారు. వాడు డాక్టర్ ఏంటి? నేను ఉదయమే ఫ్లైట్ లో వస్తున్నాను ఆ సంగతి ఏంటో చూద్దాం”
అని మరుసటి రోజే గోపాల్ రావు హైదరాబాద్ వచ్చి తమ ఇంటి పక్క అబ్బాయే మోసం చేసి రంగారావుకి అల్లుడయ్యాడని రూఢి చేసుకున్నాడు.

“మీరు ఉజ్వలకి పెళ్ళి సంబంధాలు వెతుకుతున్నట్టు వాడికెలా తెలిసిందో. ఇంటికెళ్ళి, మా ఆవిడ తో మాట్లాడుతే ఏమయిన తెలుస్తుందేమొ చూస్తాను. ఎక్కడో పొరపాటు జరిగింది” అన్నారు.

ఇద్దరు కలిసి గోపాల్ రావు ఇంటికెళ్ళి ఆయన భార్యతో “నీవు ఉజ్వల పెళ్లి సంబంధం గురించి ఎవరితోనైనా మాట్లాడావా?” అని అడిగారు గోపాల్ రావు.

“అవును పక్కింటి రాజు వాళ్ళ అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెతోమాటల మధ్యలో చెప్పాను.” అన్నది అతని భార్య.

అప్పుడు అర్థమైంది గోపాల్ రావుకి. రాజు, వాళ్ళమ్మ పక్కింటికి ఈ మధ్యనే వచ్చారు.వచ్చిన వెంటనే గోపాల్ రావు వాళ్ళింటికి వచ్చి వాళ్ళావిడతో కలుపుగోలుగ మాట్లాడుతూ పనిలో సాయం చేస్తూ ఉండేది. వాళ్ళకే మాటల మధ్యలో గోపాల్ రావు గారి భార్య ఉజ్వల గురించి చెప్పింది. అప్పుడే  ప్లాన్ వేసుకొని  రాజు, వాళ్ళ అమ్మ కలిసి రంగారావును ఉజ్వలను  మోసం చేశారని అర్థమైంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి హాస్పిటల్ డ్యూటీలో ఉన్న ఉజ్వలకు  జరిగిన మోసం అంతా  చెప్పారు.

అంతా విన్న ఉజ్వల షాక్ తో ఎంతో సేపటి వరకు ఏమి మాట్లడలేక పోయింది. తర్వాత తనకు తనే ధైర్యం చెప్పుకని తేరుకొంది.

“అది కాదు అంకుల్ మీ ఇంటి పక్కన ఉన్న అబ్బాయి అయితే, ఎప్పటికైనా మీకు తెలుస్తుంది కదా ఈ మోసం. మరి వాళ్ళు ఎలా తెగించారు ఈ మోసానికి,” అన్నది మెల్లగ బాధతో కూడిన అవమానంతో ఉజ్వల.

“పెళ్లయిన తర్వాత ఏం చేస్తారులే అన్న ధీమాతో వాళ్ళు అలా చేసుంటారు. ఈ కాలంలో పెళ్లి అయినా, మోసాన్ని ఎవ్వరు భరించక్కర్లేదు” అన్నారు గోపాల్ రావు.

“నాకు ఎంతో తెలుసు అనుకుంటాను కానీ ఇంత చిన్న విషయాన్ని ఎందుకు తెలుసుకోలేక పోయానా అని బాధ కలుగుతుంది. నేను డాక్టర్ని అయ్యి ఉండి అతను డాక్టర్ అవునా కాదా అని ఎలా తెలుసుకో లేకపోయాను” అన్నది ఉజ్వల.

“అమ్మా , వాడు  ఆర్ఎంపీ ట్రైనింగ్ చేశాడు. అందుకే మెడిసిన్సు, మెడికల్ టర్మ్స్  కొంచెం తెలుసు. అందువల్ల నిన్ను ఈజీగా బోల్తా కొట్టించగలిగాడు.” అన్నాడు గోపాల్ రావు.

“ఇలాంటి మోసాలు కూడా ఉంటాయని తెలియ లేదు నాకు. తెలిసుంటే క్షుణ్ణంగా ఎంక్వయిరీ చేసేవాణ్ని” బాధపడుతూ అన్నాడు రంగారావు.

“జరిగిపోయిన మోసమేదో జరిగి పోయింది. ఇప్పుడు దాన్ని మార్చలేము. ఇప్పుడు ఏం చేద్దాము. నువ్వు చెప్పమ్మా.” అన్నారు గోపాల్ రావు

“ఏముంది అంకుల్ ఈ మోసగాళ్లకు తగిన శిక్ష పడాల్సిందే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. అంతా తెలిసి కూడా అతన్ని భర్తగా భరించే శక్తి నాకు లేదు. మా ఫ్రెండ్, తన చేసే హాస్పిటల్ లో అతని పేరు గల వాళ్ళెవ్వరు పని చేస్త లేరు అన్నప్పుడే, నాకు అనుమానం వచ్చి, ఎంక్వైరి చేయాల్సి ఉండే. మరి నేను ఎందుకో అలా ఆలోచించలేదు.  వాళ్ళ ప్రేమ, నటన చూసి నా కసలు అనుమానమే రాలేదు. నేను అతని మాటలు పూర్తిగా నమ్మాను అంకుల్”అన్నది
రుద్దమైన కంఠంతో.

తర్వత పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తల్లి కొడుకులకు దేహశుద్ధి చేయించి 420 కేసు పట్టి ఊచలు లెక్క పెట్టించారు రంగారావు. తోటి మనుష్యుల ఆశలతో, ఆశయాలతో, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీచులకు ‘చీటింగ్’ కేసు కింద అరెస్టు అనేది చాల చిన్నది. వాళ్ళు శిక్ష అనుభవించి బైటకొచ్చి మళ్ళీ మహరాజుల్లా చలామణి అవుతూ కొత్త బలి పశువులను వెతికే ప్రయత్నాలు కొనసాగిస్తారు.
కనుక ఒక అమ్మాయి జీవితాన్ని అతలాకతలం చేసిన దుర్మార్గులకు మళ్ళీ ఆ తలపు వస్తేనే వణికిపోయేలా కఠినాతి కఠినంగా శిక్షలు ఉండాలి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!