నాట్య మయూరం

(అంశం:”అల్లరి దెయ్యం”)

నాట్య మయూరం

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

*హంస నడకల హొయలు*

*కోకిల గొంతులోని మధురిమలు*

*రూపుచూడ ఆ శ్వేత వర్ణపు విహంగమే*

*గెంతులేస్తూ ఆడుతున్న ఆ రంగు*
*రంగుల తిమిరమే తలపుకు రాదా*

*నాట్యమాడ అందమైన* *మయూరమే*

అంటూ డైరీలో నా గురించి రాసుకున్న కవిత్వాల చిట్టాను మళ్లీ ఒకసారి తిరిగి చదువుకున్నాడు ప్రేమ్.

డైరీ చదవటం పూర్తి చేసి, ఒక పక్కగా ఉంచాడు దాన్ని. అయినా తలపైకి ఎత్తలేదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

నన్ను ఎదురుగా పెట్టుకుని, నన్ను చూడకుండా నా గురించి డైరీలో చదువుతున్నాడు ఏమిటి మొద్దు మొహం కాకపోతే అనుకుంటూ నాలో నేను మురిసి పోతున్నాను.

తల పైకెత్తి ప్రేమ్ వైపు చాలా ప్రేమగా చూశాను.

ఎందుకురా, నేనంటే అంత ప్రేమ నీకు? నా నుంచీ ఏమి ఆశించను కూడా లేదు.

*నీ చెలిమి అనే కొలనులో* **తడుస్తున్న కలువ పువ్వును నేను.*

సూర్యుడి వైపు ఆశగా చూసే ఓ పువ్వులాగా, ఎల్లప్పుడూ నీ సన్నిధి నే కోరుకుంటాను.

ప్రేమ్ నువ్వు నా స్నేహితుడిగా దొరకటం నాకు ఒక వరం అనుకుంటూ ప్రేమ్ ముఖంలోకి చూశాను.

అతని కళ్లు వర్షిస్తున్నాయి. ఆ డైరీనే చూస్తూ, దానిపైన పిడి గుద్దులు గుద్దుతూ, కట్టలు తెంచుకొని వస్తున్న కన్నీళ్ళు అతని చెంపల పై రాలుతున్నాయి.

నేను అతని భుజం పై ఓదార్పుగా చెయ్యి వేశాను. గాలిలో తేలుతోంది నా చెయ్యి. అంటే నేను తనకి కనిపించడం లేదా!!!! అంటే నేను… అంటే నేను……..

 

చచ్చిపోయానా…… నేను…..

నాకు జరిగింది అంతా గుర్తుకు రా సాగింది.

నిన్న ఉదయం ఇదే సమయానికి, ప్రేమ్ ని కలవడానికి బయలు దేరాను. నిన్న సాయంత్రం నేను ఒక డాన్స్ కాంపిటేషన్ లో పాల్గొనాల్సి ఉంది. ఆ వివరాలు తనకి చెప్పి, అతనిని ఇన్వైట్ చేద్దామని చాలా ఉత్సాహంగా ఎదురుచూడ సాగాను.

లెమన్ ఎల్లో షర్ట్, బ్లాక్ జీన్స్ వేసుకుని, నా వైపే నడచి వస్తున్న నా స్నేహితుడిని చూసి నా మనసు మురిసిపోయింది.

ఏనాటిదో ఈ అనుభందం, ఏ జన్మలోనిదో ఈ పరిచయం, ఈ జన్మలో స్నేహంగా వికసించింది. ఆపై ఇంకేమి కోరికలు మా మనసున కలగలేదు. అదీ ఒక విచిత్రమేనేమో!!! ఒక బాల్య మిత్రుడు నాకు ఆసరా అయ్యాడు.

నువ్వు ఈ ఒక్క ప్రోగ్రామ్ ని ఒదిలేయ్. దానిలో వేల మంది, కొన్ని వందల ప్రాంతాల నుండి వస్తున్నారు పోటీలో పాల్గొనటానికి అంటూ హితభోద మొదలు పెట్టాడు.

నేను నిన్ను సలహా అడగలేదు. ఇన్వైట్ చేద్దామని వచ్చాను. వస్తే రా, లేకపోతే లేదు అంటూ పైకి లేచాను.

ఉండవే…. దెయ్యం… మొండి దెయ్యం నువ్వు అంటూ బుజ్జగించబోయాడు.

హా .. మరి . .. . ఇలాంటి పెద్ద పోటీల్లో ఉంటేనే కదా, మన ప్రతిభ ఏంటో మనకు, ఎదుటివారికి తెలిసేది అంటూ అల్లరి మొదలుపెట్టాను.

సరే తల్లీ, కానీ ఈసారి వేదిక మీదనే కాదు, పోటి ముగిసే వరకూ ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. కాంపిటేషన్ కూడా బాగా ఉందట. అంటూ వారించాడు.

సర్లే అన్నాను… చాలా ఈజీగా ఆ మాటలను తీసుకుంటూ…

*సమయం కలసి రాక పోతే*

*మన ధైర్య సాహసాలు కూడా*

*మనకు ముళ్ళులా మారునేమో*

*మృత్యువు కబలించునేమో*

అదే జరిగింది నా విషయంలో. అన్ని అవరోధాలను ఎదుర్కొన్న నేను, పోటీలో బహుమతి సాదించగలను అన్న నమ్మకంతో, అత్యుత్సాహంతో ప్రేమ్ వారిస్తున్నా వినకుండా, నేను చేసిన నృత్య ప్రదర్శనను గురించి వివరిస్తూ, నా అల్లరితో అలరిస్తూ, మితి మీరిన వేగంతో కారుని డివైడర్ కు
తాకించాను. ప్రాణాలు పోగొట్టుకున్నాను.

అల్లరి దెయ్యంగా మారిపోయాను.

నాలాంటి అల్లరి పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా, వారి వెహికల్స్ నా చేతిలో, నా అదుపులో ఉంచుకోవడమే నేను యువతకు అందించనున్న సాయం.

ఏనాటికైనా ప్రేమ్ వెహికల్ నా చేతికి దక్కనుందో, ఆనాడే… నేను వాడికి అర్దం అవుతాను. అప్పుడే నా తనువు చాలిస్తాను.

అని మనసులో అనుకుంటూనే, నా రూపుని హైవే వైపు గాలిలో తేలుతున్నా.

నేనుండగా… ఈ హైవేలో… ఒక్క యాక్సిడెంట్   కూడా జరుగబోదు..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!