సూక్తులు

సూక్తులు

రచన: సావిత్రి కోవూరు 

చిటపటలాడుతూ చిందులేయకే పిల్ల – బొక్క బోర్లా పడి మూతి పండ్లు రాలు,

ముట ముటలాడుతూ మూతి తిప్పకే పిల్ల – మూతి ముక్కంతయు ఏకమై పోవు,

పకపకమని నీవు పళ్ళు ఇకిలించకె పిల్ల – పదిమందిలో నీవు పలుచనౌతావు,

గొంతు పెద్దగ చేసి మాటాడకే పిల్ల – గయ్యాళి అని నీకు ముద్దరేత్తారు,

సందె యేలల్లోన నెత్తి దువ్వకే పిల్ల – లచ్చిందేవి నీ గడప తొక్కదూ మల్ల,

పట పట మని పళ్ళు నూరకే పిల్ల –  కోపిష్టి అని నిన్ను లెక్క కడతారు,

కడప మీద కాలు పెట్ట బోకే పిల్ల – అదృష్ట దేవత కడప తొక్కదు మల్ల,

పసుపు కుంకుమలతో కడప పూజించు పిల్ల –  ఆరోగ్యదేవత నిన్ను వదులదు మల్ల

పర్వదినాన ఏడు పొద్దే పిల్ల – ఎల్లకాలము ఇంట చింతలే మిగులు,

చీకటి ఏలపుడు ఇల్లు దాటకే పిల్ల – చిక్కులొస్తే నిన్ను రచ్చించ లేరు,

చదువు సందేలన్ని నేర్చుకోవే పిల్ల – చదువుల తల్లని మెచ్చుకుంటారు,

కోటి కష్టాలైనా కొలువు చేయవే పిల్ల – ఒంగి ఒంగి సలాములు సేత్త ఉంటారు,

అమ్మ నాన్నల మాట జవదాటకే పిల్ల –  బుద్ధిమంతురాలని పొగడి పోతారు,

అమ్మ నాన్నల నెపుడు తూలనాడకే పిల్ల – ఈశ్వరుండయినా నిన్ను క్షమించబోడు,

ఆలుమగలన్నాక అలకలుంటయి పిల్ల – పట్టువిడుపులతోడా గడుపుకోవాలి,

మంచి మగడైతేను మాట వినవే పిల్ల – కాపురం సల్లగా సాగిపోతాది,

ఆత్మగౌరవమెప్పుడు విడనాడకే పిల్ల – పూచికపుల్ల కు కొరగావు నీవు,

అన్నదమ్ముల తోటి సక్కగుండే పిల్ల – ఆపదొస్తే నీకు అండగుంటారు,

అక్క చెల్లెళ్ళతో కలిసి ఉండే పిల్ల – కష్టసుఖాలపుడు కాచుకుంటారు,

ఊరి వాళ్ళ తోటి కొట్లాడకే పిల్ల – పలకరించే వారు నీకు కరువవ్వుతారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!