చెఱువు

చెఱువు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: రాళ్ళపల్లి నాగమణి

ఎయిర్ పోర్ట్ లో నుండి  బయటికి వచ్చి  తనకోసం స్నేహితుడు విశ్వం పంపిన కారెక్కాడు మనోహర్.
ఉద్యోగరీత్యా విదేశాల్లో  ఉంటున్న మనోహర్, మాతృదేశానికి వచ్చినప్పుడల్లా, మిత్రుడు విశ్వాన్ని కలిసి, తనకున్న సమయం బట్టి, అతనితో
కాలంగడిపి రిలాక్స్ అవుతుంటాడు. అలా రిలాక్స్ అవటంలో, అతనికి సంతోషం కలిగించేది విశ్వం ఇల్లు ఉన్న లొకేషన్. సిటీకి చుట్టూ, ఎన్నో పల్లెలు, ఎన్నో చెఱువులు. అలాంటి ఒక పల్లెలో, ఓ విశాలమైన స్థలంలో, ఓ భవంతి నిర్మించుకున్నాడు విశ్వం. భవనం వెనుకవైపు పెద్దచెఱువు. ఆ చెఱువు పక్కనుండి సిటీకి రహదారి.
సిటీలో వ్యాపార కార్యకలాపాలు చూసుకుని, సాయంత్రానికి, ప్రశాంతంగా ఉండే ఇంటికి చేరుకోవడానికే, విశ్వం, విశ్వంకుటుంబం ఇష్ట పడతారు. కాబట్టి విశ్వం సిటీకి దూరంగా, కొద్దిలో కొద్దిగా, కాలుష్య రహితంగా బతుకుతున్నాడు.
భవవనం పైనుంచి చూస్తుంటే, ఇంటి వెనుకచెఱువు, దాని కవతలివైపు పచ్చని పొలాలు, ఒకవైపు ఎత్తైన వృక్షాలు, వాటిపైన రకరకాల పక్షులు, వీనులవిందైన వాటి ధ్వనులు, నిండారంగురంగుల కలువలతో చెఱువు..భావకులకు కావలసినంత ఆహారం.
విదేశాల్లో ఉన్నత పదవిలో ఉండి, నిత్యం ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారాలు ఆలోచిస్తూ, ప్రత్యర్ధుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, పోటీ ప్రపంచంలో మొదటి స్థానలలో ఉండటానికి చేసే,
మేధోయుద్ధం నుంచి, విరామం తీసుకుని, ఇలా స్నేహితుడితో గడిపేటప్పుడు, మనోహర్ పసివాడై పోయి, చిన్నపిల్లాడిలా ఆ ప్రకృతిమాత ఒడిలో సేద తీరుతుంటాడు.  కారు,  అభివృద్ధికి సూచికైన,అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం చేస్తుండటం వలన, సిటీరొదకు, ట్రాఫిక్ కు దూరంగా ఉంది.దూరంగా సిటిలో వెలిగే లైట్లు, అందమైన తోరణాలుగా అలరిస్తున్నాయి.
దూరంగా ఉండబట్టి,అందమనిపిస్తున్నది కానీ,అదే సిటీలో, వాటిమధ్య నుంచి ప్రయాణమైతే నరకమే!!
‘ధాంక్ గాడ్ మనుషుల మస్తిష్కంలో ఈ రకమైన ఆలోచనలకు చోటిచ్చి,నరకంలాటి సిటీ నుంచి, జనప్రవాహంలో ఈదులాడకుండా వెసులుబాటు కల్పించావు’ అనుకున్నాడు. చుట్టూ చీకటి, చిక్కగా అలుముకోవడంతో, కంటికి ఏమీ కనిపించడం లేదు.
స్వదేశానికి వస్తున్నాడన్న  పేరే కానీ, ఆ ఉన్న కొద్ది సమయంలో, ఆత్రంగా ఎదురు చూసే కుటుంబసభ్యులతో పాటు,కలుసుకోవలసిన దగ్గర బంధువులు,ముఖ్యమైన మిత్రులు, ఇంకా ఇక్కడ నుండి అక్కడి స్నేహితులకు ఈబహుమతులిచ్చెందుకు చేయవలసిన, షాపింగ్లు, ఇంకా ఎన్నెన్నో పనులు…అబ్బబ్బా…ఎన్ని ఉండేవో… దేనికి, కాలం సరిపోక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, వెళ్ళాల్సిన సమయం ఆసన్నమయ్యేది. అలా కాలం గబగబా కదిలిపోతే, మళ్ళీ త్వరగా, మాతృ దేశానికి వచ్చే అవకాశం కల్పించమని, దేవుడ్ని కోరుకుంటూ, తిరుగు ప్రయాణం అయ్యేవాడు. అలా వెళ్ళిన ఆరు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్లీ మాతృ దేశానికి వచ్చే అవకాశం దొరికింది.
అలసటగా కళ్ళు మూసుకున్నాడు మనోహర్. చిన్న కునుకు పట్టేసింది. కళ్ళు తెరిచేసరికి, కారు భవనంముందు ఆగి ఉంది.చుట్టూ చిన్న చిన్న, మార్పులుకనిపించాయి. మార్పు నిత్యం సంభవిస్తూనే ఉంటుంది. కానీ రోజూ చూసే కళ్ళకు అది కనిపించదు.  విశ్వం,పరుగునవచ్చి, కారు డోర్ తీశాడు. మనోహర్ కిందకు దిగగానే, గాఢంగా కౌగిలించుకున్నాడు. చూసేవాళ్ళకు, అదృశ్యం చాలు, వాళ్ళ స్నేహం ఎంత చిక్కనిదో చెప్పటానికి.
“రండి అన్నయ్యా…”ఆప్యాయంగా లోపలికి  దారి తీసింది విశ్వం భార్య.”హాయ్.. అంకుల్”అంటూ పిల్లలు పలకరించారు.స్నానం, భోజనం కానిచ్చి, మేడమీద బెడ్ రూంలోకి స్నేహితులిద్దరూ వెళ్ళారు. వెళ్ళింది బెడ్ రూం లోకి గానీ, నిద్రకు చోటెక్కడా  ఒకదాని తర్వాత ఒకటి, పాతర లోంచి వెలికి వస్తున్న, అమూల్యమైన వస్తువుల్లా, చెలమలోంచి
ఊరుతున్న చల్లని నీళ్ళలా, కబుర్లు ఆగటమే లేదు. ఏ తెల్లవారుఝాముకో కళ్ళు బరువెక్కి వాలిపోవడంతో, వీళ్ళ నోళ్లు విశ్రాంతి తీసుకున్నాయి. చిక్కని చీకటి తెర తొలగించుకుంటూ, అరుణ కాంతులు, పరచుకుంటున్నాయి. కళ్ళువిప్పిన పిట్టలు, రెక్కలలరార్చుకుంటూ, గగన విహారానికి బయలు దేరాయి.”తూర్పు దిక్కున, ఉదయించే సూర్యుడిని,ఆ కిరణాలు, చెఱువులో, ప్రతిఫలిస్తుండగా, చిరునవ్వు తో కనులు విప్పే, కమలాలను కనులారా చూడాలని, ఎంతో దూరంనుంచి, ఆత్రంగా వచ్చిన మనోహర్ మస్తిష్కంలో, అలారం ముందే సెట్ అయిఉండటం వలన, ఆలస్యంగా నిద్ర పోయినా, ఆ సమయానికి మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచేసరికి, విశ్వం పేపర్ చదువుతూ కనిపించాడు.”గుడ్ మార్నింగ్”అంటూ స్నేహితుని పలకరించి, వాష్ రూం లోకి వెళ్ళాడు.
బయట కొచ్చేసరికి, వేడి వేడి కాఫీ రెడీగా ఉంది. కప్పు అందుకుని, బాల్కనీలోకి నడిచాడు మనోహర్. “మై గాడ్…ఏమిటిలా ఉంది!!?.” అసహనం, నిరాశ, నిస్పృహల కలబోత ఆ ప్రశ్న లో లో మిళితమై ఉన్నాయి.
“అంత విశాలమైన చెఱువు, ఇంత కుంచించుకు పోయింది….ఆ వెనుకనుండే పచ్చని పొలాలు, అలిగి దూరంగా వెళ్ళి, ఎక్కడో కనిపిస్తున్నాయి., కనిపించినంత మేర, చదును చేసిన ఇళ్ళ స్థలాలు. ఈ పక్క ఉండాల్సిన చెట్లు చాలా వరకు లేవు. అక్కడక్కడా అపార్ట్మెంట్లు. కొన్ని పూర్తయి ఉంటే, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అవన్నీ, అలా ఉంటే. చెఱువు, తన స్వచ్ఛతను కోల్పోయి, అక్కడక్కడా, మట్టి దిబ్బలతో ఉంది. చుట్టూ చెత్తాచెదారం కలువపూల జాడే లేదు. మనోహర్ మొహం వివర్ణమయింది. వెనకనే వచ్చిన విశ్వం, అనునయంగా మనోహర్ భుజం మీద చేయి వేశాడు.
“మార్పు మిత్రమా!! మార్పు.. మనం మార్పు రావాలి, బాగుండాలి అని కోరుకుంటున్నాము. కానీ మనం పొందుతున్న మార్పు ఇది”.అన్నాడు విచారంగా.
“అవును విశ్వం,అందరికీ ఇళ్ళుండాలి.. కాదనను, కానీ ఇలా…పోనీ, పంటచేలు, ఇళ్ళ స్థలాలయ్యాయంటే, కొంత అర్థం ఉంది. కానీ… నీళ్ళతో కలకల లాడే చెఱువు నిలా….” మాట్లాడలేక పోయాడు.
“ఆరేడు సంవత్సరాల క్రితం, వానలు ముఖం చాటేశాయి. ఆ టైంలో, చెఱువు ఎండిపోయింది. అలా ఎండిపోయిన చెఱువు క్రమంగా డంప్ యార్డయింది. వేగంగా విస్తరిస్తున్న పట్టణంలోని, చెత్త నెత్తుకొచ్చి ఇలా సమీపంలో ఖాళీగా ఉన్న చోట పోయడం, ఇవి పూడంతో, ఇళ్ళు కట్టే వ్యాపారులకు మంచి ఊపొచ్చింది. క్రమంగా చెఱువులను ఆక్రమించి, చదునుచేసి, వెంచర్స్ వేయటం మొదలు పెట్టారు.”
“మరి, అధికారులు ఏం చెయ్యలేదా!!?”.. తన ప్రశ్న తనకే సిల్లీగా అనిపించింది మనోహర్ కి.
“అవును లే… ప్రతి ఒక్కడికి, ఎదగాలనే ఆలోచనే…
ఎదగాలనుకోవడం మంచిదే కానీ, దాని కోసం అవసరమైన నీటి వనరులను పణంగా పెట్టడం…”తల అడ్డంగా ఊపాడు బాధగా.
నేను, రెండు మూడు సార్లు, గవర్నమెంట్ కు కంప్లయింట్ ఇచ్చాను.కానీ పట్టించుకునే వాడెవ్వడు!!?” అన్నాడు విశ్వం.
“తిలా పాపం తలా పిడికెడు.. అన్నట్లు, అందరూ , ఇందులో భాగస్వాములే, ఒకళ్ళిద్దరు ఏం చేయగలరూ!!” నిర్వేదంతో అన్నాడు మనోహర్.
“నిన్న ఓ ఆర్ ఆర్ చూసి ఎంతగా సంతోష పడ్డాను.
నా మాతృదేశం, అభివృద్ధి చెందుతున్నదని. మరి ఇదేమిటి… రేపటితరం భవిష్యత్తుకు, విఘాతం కలిగిస్తూ, వానలకు, వరదలకు తట్టుకోలేని విధంగా, నిర్మాణాలు చేస్తున్న వీళ్ళది అభివృద్ధా!!!?
‘జలమే జీవం’ అంటారు… అలాంటి జీవాన్ని చంపుతుంటే ఏమనాలి!!?.
‘అయ్యో చెఱువా’ అనుకుంటే గుండె చెరువు వయ్యింది మనోహర్ కి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!