అమ్మ జ్ఞాపకం

అమ్మ జ్ఞాపకం

రచన::పాండు రంగా చారి వడ్ల

నీట్ గా డ్రెస్ వేసి, తలకి నూనె పెట్టి దువ్వి, నుదుటన బొట్టు పెట్టి, అందంగా తయారు చేసి నన్ను పట్టుకుని బయటికి వచ్చింది అమ్మ. ఆటో ఎక్కి బస్ స్టాండ్ లో బస్ ఎక్కి కూర్చున్నాము. కిటికీలోనుండి కనిపిస్తున్న గుట్టలు కొండలు చెట్ట్టూ ఆకాశంలో పక్షులూ అన్నీ చూస్తూ ఉన్నాను. ఎప్పుడు నిద్ర పోయానో తెలీదు. పెద్ద శబ్దం విని ఉలిక్కి పడ్డాను. నేను భయంతో అమ్మను గట్టిగా పట్టుకున్నాను. అమ్మతో సహా గాల్లో తేలి పోతూ గింగిరాలు తిరుగుతూ ఉన్నాను. అమ్మ నన్ను విడిపించుకోవాలని నా చేతులను వెనక్కి తీసివేస్తూ ఉంది, నేను ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాను. అమ్మ నా చెంప మీద ఒక్కటిచ్చి, నన్ను ఎత్తుకుని పైనకి విసిరేసింది. నేను గాల్లో వుండగానే ఎవరో నన్ను పట్టుకున్నారు, “అమ్మా.. అమ్మా.. ” అని ఏడుస్తూ వాళ్ళ దగ్గర నుండి అమ్మ వైపుకు వెళ్ళడానికి, అంతలోనే అమ్మ రూపం కనుమరుగైపోయింది.
“అమ్మా అమ్మా..” అని కాళ్లూ చేతులూ కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాను.

నిద్రలో కలవరిస్తూ నన్ను “కన్నా.. లేరా.. లే.. ” అని నాన్న నిద్ర లేపాడు.
“నాన్నా.. అమ్మా.. ” అన్నాను నేను నాన్నని పట్టుకుని ఏడుస్తూ..
“అమ్మ లేదురా..”
“అమ్మ ఒడి వెచ్చదనం గుర్తుందీ.. అమ్మ కొట్టిన చెంప దెబ్బ గుర్తుందీ.. కానీ నాకెందుకు నాన్నా అమ్మ ముఖం గుర్తు లేదూ.. ఎందుకు ఇరవై ఏళ్లుగా ప్రతీ ఏడూ ఇదే రోజు ఎందుకు అమ్మ గుర్తొస్తుంది నాన్నా.. ఎప్పుడు అడిగినా చెప్పవూ.. ??!!”

“లేరా.. లేచి, మొహం కడుక్కుని స్నానం చేసి రా.. నీ జ్ఞాపకాల నీడల్లోకే వెళ్దాం ఈ రోజు..” అని, నేను వెళ్ళే వరకూ అక్కడే ఉండి, నేను లోపలికి వెళ్ళాక తను తలుపు దగ్గర వేసి వెళ్ళాడు.
అమ్మ దగ్గరకు అనేసరికి పావు గంటలో నేను తయారయి హాల్లోకి వచ్చాను. నాన్న కారు బయటకు తీసి రెడీగా ఉన్నాడు, నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడికి అని నాకు అర్థం కాలేదు.
గంటన్నర ప్రయాణం తరువాత ఒక ఘాట్ రోడ్డులో ఒక మలుపు దగ్గర కట్టిన చిన్న రాతి కట్టడం లాంటి దాని దగ్గరకు తీసుకుని వెళ్లి కారు ఆపాడు.

తను దిగి నన్నూ దిగమని చెప్పి, ఇద్దరం దిగాక మలుపు లోని లోయలోకి చూపిస్తూ “మీ అమ్మ రా.. ” అన్నాడు.
నాకేం అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా నాన్న వైపు చూసాను.

“నీకు కల వస్తూ ఉందే.. ఆ కలలో మీ అమ్మ నీకు దూరమైంది ఇక్కడే..”

మోకాళ్ళ మీద నిస్సత్తువగా అలా కూర్చుండి పోయాను, నిశ్శబ్దంగా కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్లు, నా బాధను కాస్తైనా తగ్గించాలని.

“ఆ రోజు అందరి లాగే ఎవరి పనుల మీద వాళ్ళం బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాము, రాత్రి కావడంతో చాలా వరకు అందరూ నిద్రపోయారు. తెల్లారితే నేను ప్రేమించిన అమ్మాయి పెళ్ళి వేరే అబ్బాయితో, ఆ బాధతో నాకు నిద్ర రాలేదు. ఏమయ్యిందో తెలీదు, బస్సు బోల్తా పడి పల్టీలు కొట్టడం మాత్రం అర్థం అవుతోంది.  ఆ వేగానికి తలుపు పక్కన సీటులో కూర్చున్న నేను బయటకు ఎగిరి రోడ్డు పక్కన తుప్పల్లో పడ్డాను, కాస్త దెబ్బలే తగలడంతో లేచి వెంటనే సర్దుకుని నిలబడ్డాను. షాక్ లో బస్సు వైపు చూస్తున్నాను, నాకు ఏమీ అర్థం కావడం లేదు, నువ్వు గాల్లో నా వైపు వస్తూ ఉన్నావు, వెంటనే నిన్ను పట్టుకుని ఎత్తుకున్నాను. నువ్వు మీ అమ్మ వైపు చూస్తూ ఏడుస్తూ ఉన్నావు, ఎంత ఓదార్చినా నీ ఏడుపు ఆగలేదు, లోయలోకి పడ్డ బస్సులో ఎవరినీ ఎవరూ కాపాడలేకపోయారు.
ఆ బస్సు ప్రమాదంలో మిగిలింది మనం ఇద్దరమే.
నా ప్రేమను కోల్పోయిన నేను ఆ ప్రేమంతా నీకే పంచాను, బతుకు మీద ఆశే లేని నాకు నువ్వు ఒక  తోడువు అయ్యావు. నా బాధని మరిపించే సంతోషానివి అయ్యావు, నా పగిలిన గుండెని అతికించే ఆనందానివీ అయ్యావు.. నీ కోసమే ఇంకా బతికి ఉన్నాను. అయినా.. నేను నీ కన్న తండ్రిని కాదు రా.. పెంచిన తండ్రిని…” అంటూ నాన్న కూడా ఏడుస్తున్నాడు.

నేను లేచి వెళ్ళి నాన్నని పట్టుకుని “నువ్వు పెంచిన తండ్రివి కాదు నాన్నా.. ప్రేమని పంచిన అమ్మవే నాకు.. ” అని నాన్నని పట్టుకుని ఏడ్చాను.

“మీ అమ్మ నీకు దూరమై, నీవు నాకు దొరికిన ఈ రోజునే నీ పుట్టిన రోజుగా నేను పండగ చేస్తున్నాను రా..” అన్నాడు నాన్న నన్ను కౌగిలించుకుని.

“ఆ అమ్మ లేకపోయినా, అమ్మలా చూసుకుంటున్న ఈ నాన్న ఉన్నాడు కదా నాన్నా.. ఇంకెప్పుడూ నేను నా పుట్టిన రోజు నాడు ఏడవను.. ” అని కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాను.

ఇద్దరం కలిసి మళ్లీ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాము. మా అమ్మ జ్ఞాపకాలను మాత్రమే నాతో తీసుకువస్తున్నాను, అమ్మ లేదు అనే నిజాన్ని భరిస్తూ, నాన్నలో అమ్మని చూసుకుంటూ..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!