ఒక్క.. ఐడియా
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: జీ వీ నాయుడు
రాగిని, రంజని అక్కాచెల్లెల్లు. ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. స్వస్థలం హైదరాబాద్. రెండు మూడు నెలలుగా ఈ అక్కాచెల్లెల్లు ఎన్నో ఇంటర్యూలకు వెళ్లారు. కానీ ఒక్కరికి కూడా ఉద్యోగం దొరకలేదు. దీంతో చాలా అసహనంతో ఉన్నారు. ఒక రోజు ఇద్దరు పిండారాబోసిన వెన్నెల్లో కూర్చొని ఆలోచన చేస్తున్నారు. కలిసి రాని కాలం. మనకెన్నో పరీక్షలు పెడుతుంది అంటూ ఇద్దరు దీనంగా చర్చించుకుంటున్నారు. ఇంతలో ఓ పిడుగు పడే వార్తను మోసుకొచ్చారు వారి తండ్రి.
“అమ్మా.. మీ ఇద్దరికీ పెండ్లి సంబంధాలు వస్తున్నాయి. మనం ఇలా కాల యాపన చేస్తే ఇబ్బంది పడవలసి వస్తుంది. మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు తల్లీ. మీరు ఆలోచించుకోండి. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసు లో జరగాలి. ఈ ఉద్యోగాలు దొరికేది ఎప్పుడో. ఈ లోపు మీరు ముసలోళ్ళు అయ్యేలా ఉన్నారు.. ” అంటూ తండ్రిగా తనలో దాగి ఉన్న బాధను వారి ముందు ఉంచాడు రాము.
“మీరు చెప్పింది అంతా వాస్తవం నాన్న. కానీ ఈ సమాజంలో ఎవరు మంచో, ఎవరు చెడో బేరీజు వేయడం గగనం. ఆడపిల్ల తన కాళ్ల మీద తాను నిలబడితే తప్ప సమాజంలో, ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో జీవనం సాగించడం గగనం. దేవుడు మంచి వాళ్ళ కు కూడా పరీక్షలు పెడతారు. ఇంకా కొద్ధి రోజులు చూద్దాం. మా గురించి ఏమి దిగులు చెందవద్దు.” అంటూ రాగిని, రంజని తండ్రికి నచ్చచెప్పారు.
యాదావిధిగా వారి భగీరద పోరాటం కొనసాగిస్తున్నారు ఉద్యోగ వేటలో. మళ్ళీ ఆరు మాసాలు గడిచాయి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం లేదు. మళ్ళీ తండ్రి అదే వరవడి కొనసాగించారు.
“నాన్న.. చివరి గా మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆరు నెలలు గడువు కావాలి. ఉద్యోగం పొందలేక పొతే మీ మాట ప్రకారం నడుచుకుంటాం.” అంటూ తండ్రికి వినమ్రంగా చెప్పి ఒప్పించారు ఇద్దరు కుమార్తెలు. ఆరు నెలలు గడువు ముగిసే లోపు ఉద్యోగం సాధించి తీరాలి అని వ్రతం బూనారు రాగిని, రంజిని.
అయిదు మాసాలు గడిచాయి. కేవలం ఒకే ఒక నెల మిగిలి ఉంది. ఓ సాయం సమయంలో రాగిని, రంజని కూర్చొని తీక్షణంగా ఆలోచిస్తున్నారు. ఇక మనకు ఉద్యోగాలు రావు. ఉద్యోగం సద్యోగం లేకుండా పెండ్లి చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహకు సైతం అందడం లేదు. ఇంతలో వారి ఇరువురికి ఒకేసారి ఓ ఆలోచన స్పురించింది. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వద్దాం అంటూ ఓ ప్రణాళిక ను రూపొందిచుకున్నారు..
“సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కావలెను ” అంటూ ప్రముఖ పత్రకల్లో ఓ అడ్వర్టిజ్మెంట్ వేశారు.
కుప్పలు తెప్పలుగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇంటర్వ్యూ లు నిర్వహించారు. నూతనంగా సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభిస్తున్నాం. ఉద్యోగం కావాలి అనుకున్న వారు ఒక్కొక్కరు 50 వేలు కాషన్ డిపాసిట్ చెయ్యాలి. ఆరు నెలలు తరువాత మీ కాషన్ డిపాజిట్ వాపాస్ ఇస్తాము అని అగ్రిమెంట్ చేసుకున్నారు. జాబ్ లో జాయిన్ అయ్యేందుకు ఒక నెల గడువు ఇచ్చారు.
మొత్తం పోగైన సొమ్మును పెట్టుబడులు పెట్టి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించారు. అందరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగం చేసే బదులు. కంపెనీ ఎండీ లు గా ఎదిగి ఎందరికో ఉద్యోగాలు ఇచ్చి ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వు నింపారు.
ఆరు నెలల్లోనే లాభాలు వైపు కంపెనీ ని పరుగులు పెట్టించారు. అనంతరం సాఫ్ట్ వేర్ కంపెనీలు స్తాపించి ఉన్న ఎండీలే ఎతూకుంటూ వచ్చి రాగిని, రంజనిని వివాహం చేసుకున్నారు. ఒక్క ఐడియా అందరు జీవితాలను మార్చి వేస్తుందనడానికి ఈ అక్కాచెల్లెలు మనకు స్ఫూర్తి దాయకం.
