మంచి మనసు

మంచి మనసు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)  

రచన: శ్రీదేవి విన్నకోట

ఏంటో ఈ రంగమ్మ నాలుగు రోజుల నుంచి పనిలోకి రావట్లేదు, ఎప్పుడైనా పనికి నాగా పెట్టినా రానని కారణమేంటో చెప్పే పని మానుతుంది, నేను పని చేసుకోలేక పోతున్నా అనే బాధ కాదు, అసలు ఏమైంది రంగమ్మకి, తనకి ఏమైనా ఒంట్లో బాగోలేదా ఏంటి అని ఆలోచిస్తున్నా నిన్నటి నుంచి, మా వారు నా గురించి కూడా ఎప్పుడూ ఇంత ఆలోచించలేదు, పని మనిషి గురించి ఇంత ఆలోచిస్తున్నావ్ ఏంటోయ్ అంటూ వేళాకోళం చేశారు కూడా, ఆయనకి చెప్పిన అర్థం కాదు నేను నవ్వేసి ఊరుకున్నాను.
నా పేరు స్నిగ్ధ, నేను మా వారు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తాము,మాకు 7,5 సంవత్సరాల పిల్లలు ఇద్దరూ ఉన్నారు, వాళ్ళు స్కూల్ కి వెళ్తారు. మేం ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో చాలా బిజీగా ఉంటాము, అసలు మా హడావిడి అంత పొద్దున్నే చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే మా అపార్ట్మెంట్స్ లోనే కొందరి ఇళ్ళల్లో పనిచేసే రంగమ్మ ను మా ఇంట్లో కూడా పనిలో పెట్టుకున్నాను, తాను పని చేస్తే నేను తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇల్లు అద్దంలా ఉంచుతుంది, చాలా మంచి మనిషి. నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంలా ఉంటుంది, డబ్బులు బంగారం అలాంటివి ఎదురుగా ఉన్నా ఏ మాత్రం చలించదు ఆశ పడదు, తనకి నెల నెలా ఇచ్చే జీతం సక్రమంగా ఇస్తే చాలు అనుకునే మనిషి, పైగా నన్నే తిడుతుంది వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ అందరి కళ్ళు మీరు అనుకున్నంత మంచివి కావు అంటూ, ఐదు సంవత్సరాల నుంచి మా ఇంట్లో పని చేస్తుంది, తాను అంటే మా అపార్ట్మెంట్ లో అందరికీ ఇష్టమే, నాకైతే చాలా అలవాటైపోయింది, అదే ఆలోచిస్తున్న తను నాలుగు రోజుల నుంచి పనిలోకి రావట్లేదు ఏంటి అని, తనకి ఫోన్ లేదు ఎప్పుడైనా అవసరమైతే ఎవరినైనా  అడిగి తనే ఫోన్ చేస్తుంది, ఏదో బస్తీలో ఉంటున్నాను అని చెప్పింది కానీ ఆ ఏరియా మా ఇంటికి దూరమే, నాకు కరెక్టుగా తెలియదు ఎక్కడో.
ఎవరికైనా తను పని లోకి రావట్లేదు అని చెప్పిందేమో అని మా అపార్ట్మెంట్లో మిగిలిన వాళ్లని అడిగాను తన గురించి, అందరూ ఏమో మాకు తెలియదు అంటే తెలియదు అన్నారు, ఇలా చెప్పా పెట్టకుండా మానేస్తే ఎలా, వేరే పని మనిషిని చూసుకోవాలి అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను.
మా వారు కూడా రంగమ్మ గురించి అందర్నీ ఆరా తీస్తుంటే రంగమ్మ  మీద బెంగ ఏమిటోయ్ నీకు అంటూ ఆట పట్టించారు. అలా మరో  రెండు రోజులు గడిచిన రంగమ్మ రాలేదు, ఇక లాభం లేదని నేనే సాయంత్రం ఆఫీస్ అవ్వగానే అటునుంచి అటే తను చెప్పిన ఏరియాకి వెళ్లాను, అక్కడ ఆగి రంగమ్మ అడ్రస్ అడిగాను, కనిపించిన ఒకరిద్దరిని, వాళ్ళ ఏరియా చాలా లోపలికి వెళ్లాలి అని దారి చెప్పారు వాళ్ళు.
అక్కడి నుంచి చాలా లోపలికి  దారి సరిగ్గా లేకపోవడంతో స్కూటీ పక్కన పెట్టేసి నడిచి వెళ్లాల్సి వచ్చింది, అప్పుడప్పుడే చీకటి పడుతోంది చలికాలం కావడంతో, మెల్లిగా ఆ ప్రదేశానికి చేరుకున్న, అక్కడి వాళ్లను రంగమ్మ కావాలి అని అడిగాను, కానీ ఆ వాతావరణం అంతా ఎందుకో నాకు నచ్చలేదు, అందరి ముఖాల్లో ఏదో విషాదం తొంగి చూస్తోంది, ఒక్కరూ సరిగ్గా లేరు, సరైన తిండి లేక అందరి  ముఖాలు బాధగా వాడిపోయినట్లు, తైల సంస్కారం నేను జట్లు, ఒక్కరి ఒంటి మీద సరిగ్గా మంచి బట్టలు లేవు, ఇంతలో అక్కడే ఉన్న ఎవరో నీ కోసం ఎవరో ఒకామె వచ్చారు అంటూ  రంగమ్మని పిలుచుకు వచ్చారు, తను గబగబా వచ్చింది నా దగ్గరికి, తన కళ్ళలో కూడా అలసట బాధ కనిపిస్తుంది.
అయ్యో మీరా అమ్మ, నన్ను క్షమించండి చెప్పా పెట్టకుండా పని మానేసాను అందిఅసలు ఏం జరిగింది అందరూ ఇలా ఎందుకు డల్ గా ఉన్నారు అని అడిగాను ఆత్రుతగా. వారం రోజుల క్రితం మేమంతా పనుల్లోకి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట మా పిల్లల్లోనే కొంతమంది పిల్లలు ఒకరి ఇంట్లోనే చలిమంట వేసుకున్నారు అంట, చిన్నపిల్లలు కావడం, వాళ్లకి ఏమీ తెలియక పోవడం, ఏమరుపాటుగా ఉండడం వల్ల ఆ మంట ఇంటికి అంటుకుంది, ఇళ్ళల్లో మగవాళ్ళంతా ఇక్కడ పని లేక వేరే ఊరికి కూలి కోసం వలస పోయారు, ఇళ్ల దగ్గర పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడం, ముసలోళ్ళు పిల్లలు ఉన్నా  ఏమీ చేయలేక పోవడంవల్ల  మొత్తం గుడిసెల అన్నిటికీ నిప్పు అంటుకుని మా సమస్తం బూడిద అయిపోయాయమ్మ. ఇంకా మా అదృష్టం ఎవరికీ ప్రాణానికి ఏమీ హానీ జరగలేదు అమ్మ, మావి మొత్తం 42 గుడిసెలు వరుసగా కాలిపోయాయి, అప్పటికప్పుడు ఒకటి రెండు రోజులకు సరిపడా సాయం చేశారు ఎవరెవరో పెద్దవాళ్లు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం అని నాలుగు మంచిమాటలు చెప్పి, ఆ తర్వాత మరి ఎవరూ కనిపించలేదు అమ్మ, అందరం ఎవరినైనా సాయం అడిగి గుడిసెలు వేసుకునేపనిలో ఉన్నాం, ఇక్కడఎవరూ చదువుకోలేదు, ఏమి తెలీదు నేనేకొంచెం ఎనిమిదివరకు చదివిన, ఎవరితో ఎలా మాట్లాడాలో కొంచెంనాకే తెలుసు, అందుకే ఆ పనుల మీద మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న గవర్నమెంట్ కూడా మాకేమైనా సాయం చేస్తుందేమో అని అంది, చూడండమ్మా  మాబతుకు ఎలా అయిపోయిందో, ఎంత కష్టపడి బతికినా తినడానికి తిండి కూడా లేని నిస్సహాయులం అయిపోయాము, దేవుడికి కూడా మామీద జాలిలేదు అమ్మ అంది కన్నీళ్లతో రంగమ్మ.
అక్కడివాళ్లంతా తమకుఏమీ తెలియదని రంగమ్మే తమని ఈ వారం నుంచి జాగ్రత్తగా చూసుకుంటుందని, ఆమె కూడా లేకపోతే ఇల్లే కాదు, తిండి కూడా లేక చచ్చిపోయే వాళ్ళం అని, అందరం టార్పాలిన్ కవర్లతో డేరాల్లా వేసుకుని ఉంటున్నాము అని, వాళ్ల బాధను కన్నీళ్లతో చెప్తుంటే నామనసు అయ్యో పాపం వీళ్ళకి ఎంత కష్టం వచ్చింది అనుకుంటూ వికలం అయిపోయింది,
ఇలా గుడిసెలు కాలిపోయినట్టు ఏదోవార్తల్లో  చూసిన గుర్తే, కానీ ఎక్కడో వేరే ఊర్లో అనుకున్న, నిజాయితీగా ఉండే నాకెంతో ఇష్టమైన రంగమ్మకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాకు తెలీదు, సరే జరిగిందేదో జరిగింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, పొద్దున్నే రంగమ్మని ఒకసారి ఇంటికిరమ్మని చెప్పాను, హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఎనిమిదివేలు తీసి రంగమ్మ చేతిలో పెట్టి అక్కడున్న వాళ్లందరికీ మంచి భోజనం పెట్టించమని చెప్పాను. వాళ్లంతా చేతులెత్తి దండం పెట్టారు నాకు, అయ్యో నేను చిన్నదాన్ని మీరు ఇలా చేయకూడదు నాకు ఆయుక్షీణం అన్నాను వాళ్లని వారిస్తూ, సరే నేనువెళ్తాను, పొద్దున్నే ఇంటికిరా రంగమ్మ మాకు చేతనైన సాయం చేస్తాం అని మరీమరీ చెప్పాను.
సరే అమ్మ  తప్పకుండా వస్తాను అంది రంగమ్మ.
ఇంటికి వచ్చేసా, మావారు పిల్లలు అప్పటికే వచ్చేసి ఉన్నారు, ఇంత లేట్ అయింది ఏంటి, అలా డల్ గా ఉన్నావ్ ఏ ఒంట్లో బాలేదని అడిగారు మావారు.
రంగమ్మ వాళ్ళ ఇల్లుకాలి పోవడం, తిండి లేకపోవడం వాళ్ళ పరిస్థితి గురించి మొత్తం వివరంగా చెప్పాను మావారికి, ఆయన కూడా అయ్యోఅంటూ బాధ పడ్డారు, ఆయన పనిచేసేది మున్సిపల్ ఆఫీస్ లోనే కావడంతో, నువ్వు బాధపడకు నేను వాళ్ళకి సాయం చేస్తా, ఇలా అనుకోని అగ్నిప్రమాదం జరగడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ పక్కా ఇళ్లు కూడా ఏమైనా కట్టిస్తారు ఏమో అడిగి అన్ని త్వరగా అంది వచ్చేలా చూస్తాను, మా ఆఫీస్ లో కూడా అందరికీ చెప్తాను, తమవంతుగా ఏవైనా సహాయం చేయమని అడుగుతాను అన్నారు, నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని మన అపార్ట్మెంట్లో వాళ్ళని అందరినీ వాళ్లకి చేతనైనంత రంగమ్మ వాళ్ళపరిస్థితి చెప్పి అందర్నీ సహాయం చేయమని అడుగుతాను అన్నాను.
ఉదయం రంగమ్మ రాగానే అపార్ట్ మెంట్ లోనే చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి  అందరి సహాయం అడిగాను, అందరూ రంగమ్మ ఏరియా వాళ్లపరిస్థితి తెలుసుకుని జాలి పడ్డారు, అనుకున్న దానికంటే ఎక్కువే సాయం చేసి తమ మంచిమనసును నిరూపించుకున్నారు. అందరూ ఇంట్లోవాడని వస్తువులు పాతబట్టలు, పప్పులు బియ్యం కాయగూరలు డబ్బులు అన్ని ఎవరికి తోచినంత వాళ్ళు  ఇచ్చారు. రంగమ్మమొహం ఆనందంతో వెలిగిపోయింది, తనవాళ్ళు కొన్నిరోజులైనా పస్తు లేకుండా ఉంటారనే సంతోషం కనిపించింది ఆమె మొహంలో, అందరికీ కృతజ్ఞతగా దండం పెట్టింది,
మేంచేసిన చిన్నసాయంతో వాళ్ల జీవితాలు జీవితకాలం బాగుపడిపోతాయి అనికాదు, కానీ మేం చేసే  చిన్న సాయం కూడా వాళ్ళ మొహాల్లో  కొంత వెలుగైనా నింపుతుంది కదా, అందుకు నాకు సంతృప్తిగా అనిపించింది, ఎంతసేపు తమకి తాము పోగేసుకుని, తమ ఇళ్ళు నింపుకుంటూ, దాచుకునే కొంతమంది రాజకీయ నాయకులు డబ్బున్న వాళ్లే  లీడర్స్ కాదు ఎప్పటికీ, ఇతరులకి సాయం చేయాలనుకునే మంచి మనసున్న ప్రతి ఒక్కరూ లీడరే నా దృష్టిలో, నాకు రంగమ్మ లో కూడా ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకునీ వాళ్లకి సాయపడే ఒకలీడర్ కనిపించింది. పెద్దగా చదువుకోకపోయినా, డబ్బు లేకపోయినా ఇప్పుడు  నాదృష్టిలో రంగమ్మే నిజమైన లీడర్, ఆమె మంచిమనసు నాకు చాలా నచ్చింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!